నేను పడిలేచే కెరటాన్ని
ఎవరెంత అడ్డుపడినా నాగమనం ఆగదు –
అబలల ఆక్రందనకు అక్షర బాణాలను సంధిస్తూ
దశదిశల చాటుతూ – చైతన్య పోరాటం చేస్తుంది నా కలం –
కాలం కనురెప్పల క్రింద మానని గాయాలు, నెత్తుటి మరకల్ని
ప్రపంచానికి తెలియచేస్తూ నిత్యం నిశ్శబ్ద యుద్ధం చేయడం నాకలం కలవాటు. –
నా కలం చైతన్యానికి ప్రతీక – ఆడబిడ్డల జీవితాలకు అద్దం పట్టే విషయ సూచిక నాకలం-
మార్పును కోరే చైతన్య దీపిక – జ్ఞానమనే అక్షర శరాలను సంధించే బ్రహ్మాస్త్రం నా కలం –
ఆడదాన్ని అణువణువునా పితృస్వామ్య భావాలతో వివక్ష చూపినా –
నా సాహితీ వెలుగుల ప్రకాశ కలంతో చెరిపేసే పాశుపతాస్త్రం నా కలం
అబలకాదు సబల అని పడతుల కన్నీళ్ళు తుడిచే వరుణాస్త్రం నా కలం-
మగమృగాల ఆకృత్యాలను అణచివేసే ఆగ్నేయాస్త్రం నా కలం –
అక్షరమే ఆయుధంగా అభ్యుదయ భావాలకు ఆలవాలంగా
అక్షర కేతనం ఎగురవేస్తున్న అభయాస్త్రం నాకలం –
పురుష పుంగవుల మస్తిష్కాలు మార్చే ఆలోచనాస్త్రం నాకలం
శాంతి సౌభ్రాతృత్వమే నా కలం బలం
ఏది ఏమైనా. ….. నా కలం వ్రాసేది విప్లవగీతమో, శాంతి గీతమో –
కాని పంజరంలో పావురం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరి తీరాలి