ప్రతి మానవుడికి జీవితం ఎంతో ఉదారంగా, ఔన్నత్యంతో జీవించాలని ఉంటుంది. కానీ వారు పెరిగినఇంటి వాతావరణం, స్నేహితులు,సంఘం యొక్క ముద్రలు వారి మీద పడి వారి జీవితాలను నిర్దేశిస్తాయి. పెద్దలు కర్మ సిద్ధాంతాన్ని కూడా మనిషి స్వభావానికి అంటగట్టారు. ఏమైనా క్రమశిక్షణతో కూడిన జీవితమే మనిషికి అండ, దండా కూడా.
కానీ కొన్ని నిర్దేశ్యమైన పద్ధతులకు కట్టుబడి జీవించగలిగితే,జీవితం అంత బాధాకరంగా ఉండదు. మనం నడిపించే ముఖ్య యంత్రం మనసే. యంత్రాన్ని అప్పుడప్పుడు లూబ్రికేషన్ వేసి రిపేర్ చేసినట్టే మనసును కూడా సరిదిద్దుకోవడం చాలా అవసరం. దానికి కొన్ని ముఖ్యమైన, నిర్దేశితమైన మార్గాలు ఉన్నాయి. ఇది ఎదిగే చిన్నపిల్లలతో పాటు యువతి యువకులకు, పెద్దలకు కూడా అవసరమే. మనలో గుణాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. సత్వగుణం దైవ గుణమని పెద్దలంటారు.
ఆ మార్గాలలో మొదటిది ” పరిశీలన “. మనం చేసే ప్రతి పనిని చేసే ముందే దాని మంచి చెడ్డలను బెరీజు చేసుకోవాలి. అప్పుడు తొందరపాటుతనం తగ్గుతుంది. ముందు చూపు పెరుగుతుంది. ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే వెంటనే పరిశీలన చేసుకోవాలి. కోపం కూడా గ్యాస్ పొయ్యి మంట లాగా అవసరం అయితే రావాలి ఆర్పితే ఆరిపోవాలి. మన గుణాలను రెగ్యులేట్ చేసే జ్ఞానం మన దగ్గర ఉండాలి . దాని కార్యా కారణాలు విచారించాలి. అప్పుడు మన మనసుకి సత్యం భోధపడుతుంది. మనలోని మంచి చెడులను గుర్తించే లక్షణం అలవడుతుంది. అందుకే పరిశీలన చాలా అవసరం
రెండవది ” ప్రక్షాళన “. చేసిన తప్పొప్పులను అంతర్ మదనం చేసుకోవాలి. క్షమాగుణం అలవర్చుకోవాలి. మనల్ని మనం కూడా క్షమించుకోవాలి. అది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. మనిషి పరిణామం చెందడానికిసిరిసంపదలు అడ్డుకావు.పరిణామం మనసుకు మాత్రమే.
మూడవది ” పరివర్తన “. పై రెండు ఎంత బాగా ఆచరించిన పరివర్తన లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే. ప్రక్షాళన చేసుకున్నాము కనుక చేసిన తప్పులు మరల చేయకూడదు అనే పరివర్తన రావాలి. దేనికి పొంగడం, కృంగడం లేకుండా తటస్థంగా ఉండటం అలవర్చుకోవాలి. ఇది పరివర్తనకు మంచి మందు. దీనివల్ల సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడయ్యాడు. బోయవాడు వాల్మీకి అయ్యాడు. కానీ విశ్వామిత్రుల వారికి పరివర్తన రావడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అనుభవాలు పొందుతే గాని పరివర్తన రాదు. ఇలా ఎందరో పరివర్తన వల్ల మహానుభావులయ్యారు.
ఇక నాలుగోది ” పరిణామం.” మనలో పరివర్తన రావటం వలన చక్కని పరిణామాలను పొందుతాం. చక్కని మార్పులు కూడా మన జీవితాల్లో జరుగుతాయి. అసురీ గుణాలు పోయి దైవీ గుణాలు అబ్బుతాయి. పరివర్తన రాగానే వర్తమానం లో జీవించటం అనే పరిణామం పొందుతాం. భూత భవిష్యత్తులతో సంబంధం ఉండదు. ఎలాంటి సంఘటనలైనా తేలికగా తెలుసుకోగలుగుతాం. దీనివలన నిత్యం ఆనందంగా ఉండడానికి, ఆహ్లాదంగా ఉండడానికి దోహదమౌతుంది .శరీరానికి మనసుకి కావలసినంత విశ్రాంతి లభించి మంచి ఆరోగ్యానికి పునాది వేసిన వాళ్ళం అవుతాం. మంచి చెడులను ఒకేలాగా స్వీకరిస్తాం.
నీలో ఉండే భావోద్వేగాలను ఒక పేపర్ మీద రాసుకుని పదేపదే చదువుకోవాలి. అలా రాయటం వల్ల మనలో ఉన్న” నీడ్ ” పూర్తయిసంతృప్తి లభిస్తుంది. మంచి ప్రకృతిని దర్శించడం ద్వారా, బంధుమిత్రులతో కలవడం ద్వారా, ఏదైనా కళ ను అభ్యసించడం ద్వారా, గురువులు బోధించినమార్గాలలో నడవడం వలన మనసుకు పరివర్తన తీర్చుకు రావచ్చు. మనలోని స్పందన ఎప్పటికప్పుడు గమనిస్తూ, సరిదిద్దుకుంటూ పరిణామం పొందవచ్చు. జరిగిన వాటికి తలచుకోవద్దు, జరగబోయే వాటిని ఊహించవద్దు. ఇలా మన జీవితాన్ని సరైన మార్గంలో నడవటం వలన మానసికంగా సుఖ జీవనం లభిస్తుంది.
* సర్వేజనా సుఖినోభవంతు *
వాడ్రేవు కామేశ్వరి