మైలురాళ్లు

కవిత

ఏ పాఠ్య గ్రంథం చూసిన

ఏమున్నది గర్వకారణం

మతి తప్పిన ఆలోచనలు

గతి తప్పిన పాఠ్యాంశాలు

విలువలకే తిలోదకాలు

 

ఇతివృత్తం, ఎంపికలోను

కథ, గేయం వ్యాసంలోను

సంభాషణ, నాటికలోన

ఆటపాటల తీరుల్లోన

అయోమయ బాటల్లోన

 

చిన్నారుల వయసుకు మించిన

పసిపాపల మనసుకు అందని

ఆలోచనల పరిధులు పెంచని

ఆనందపు టంచులు తాకని

భావాలకు పదును పట్టని

 

విషయాంశ ప్రదర్శనలోన

అంశ క్రమపద్ధతిలోన

అభ్యాస ప్రక్రియలోన

ప్రశ్నల రూపంలోన

పొంతన లేని జంతర్ మంతర్

 

‘అ’ అక్షరంతో పాఠం వద్దట

పలక బలపములె ప్రధానమంట

చిలుక పలుకులే పలుకు ‘బడులట’

కూరగాయలకు పాణిగ్రహమట

సొరకాయకు టమాట తాళిగట్టెనట

 

చదువు సంధ్యలకు గీటురాళ్లట

లక్ష్గసాధనకు మైలురాళ్లట

గుదిబండలుగా మెడకు చుట్టుకొని

భాషను బందీ చేసి నిలిపెనట

పసికన్నల పాలిట పరమశాపమట

 

రాతల్లోన గీతలు వెట్టి

వాతలతో వీపులు వాయించి

చేతలతో మోతలు మోయించి

తలరాతలు మార్చని గీతలెందుకు?

విలువలు నేర్పని చదువులెందుకు?

 

భావి భారత భాగ్యసదనములు

పసిడి నిగ్గుల మిసిమి మొగ్గలు

విప్పారి విరిసె నందనవనమ్ములు

గుడిగా తలచే బడి ప్రాంగణములు

మడిలో పెరిగే మహోన్నత విలువలు

 

Written by Banda Sarojana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘తిమిరపు వెలుగు’

శ్రీ బాల కృష్ణ లీలలు