‘తిమిరపు వెలుగు’

కథ

సుంక ధరణి

‘నేను త్వరగా వచ్చేస్తా అమ్మ! ఒట్టు..’
‘ఇలాగే చెప్పి మొన్న ఆ ప్రీతి వాళ్లింటి కాడికి పోయావ్. నేను మళ్లీ నీ కోసం బెత్తం పట్టుకుని వచ్చేలా చేశావ్. గుర్తులేదా’
‘మొన్నంటే అరిసెలకు ఆశ పడి అక్కడే ఇచ్చేవరకు ఉండాల్సి వచ్చింది. అందుకే లేటైంది లేవే, అయినా ఎందుకు నేనేదో చిన్నపిల్ల అన్నట్లు కర్ర పట్టుకొని….’ అని చెప్తుండగానే
‘చూడు జహీ! బయట పరిస్థితులు అస్సలు బాలేవు. మీ నాన్న వచ్చే వేళకి నువ్వు ఇంట్లో లేవనుకో ఈ సారి బెత్తం కాదు, కొరడా పట్టుకొస్తా’ కొంచెం గట్టిగానే అనింది అమ్మ.
‘నీకా ఛాన్స్ ఇవ్వను లే!’ అంటూ నాలో నేనే నవ్వుకుని మన్విత వాళ్లింటికి బయల్దేరా. ఈ రోజు తనకి పెళ్లిచూపులు.

నా కోసం ఎదురుచూస్తుంటుందేమో అనుకుంటు ఉండేసరికి ఆటో మన్విత వాళ్ల ఇల్లు దాటేసింది. ఆటో అతన్ని ‘హ్హ.. ఇక్కడే ఆపండి.’ అని డబ్బులిచ్చేసి మన్వి వాళ్లింటికి అడుగులేసా. ఎందుకో ఈ రోజు మన్వి వాళ్ల వీధంతా హడావుడిగా ఉంది. ఆటో చప్పుడు వినిపించి మన్వి బయటకొచ్చింది.
‘ఎప్పుడు రమ్మంటే ఎప్పుడొస్తున్నావమ్మా!?’
‘అబ్బా అమ్మ గురించి తెలిసిందేగా. త్వరగా వస్తానని నాతో చెప్పించుకోవాలని ఇంత లేట్ చేసింది.’
‘సర్లే పదా!’ అంటూ మన్వి తన రూంకి తీసుకెళ్లింది.
ఇంతలో మన్వి వాళ్ల అమ్మ వచ్చి ‘పెళ్లికొడుకు వాళ్లు ఇంకో అరగంటలో వచ్చేస్తారట ఏవైనా ఉంటే తొందరగా తయారై రండి’ అని చెప్పి వెళ్లింది. నెమ్మదిగా మన్వి మొహం వాడిపోతూ, కళ్లలో నీటి ఛాయలు అలుముకున్నాయి.

నిజానికి మన్వి నేను ఒకే స్కూల్. మాది చాలా బలమైన ఫ్రెండ్ షిప్. తనకి ఈ పెళ్లంటే ఇష్టం లేదు. ఎందుకంటే తనకింకా పదహారెళ్లే. వీళ్ల కుటుంబం బలవంతం మీదుగా ఈ పెళ్లి జరగబోతుంది.
‘నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మళ్లీ చెప్పొచ్చుగా మన్వి’
‘చెప్పి చూసా! చిన్నపిల్లవి నీకేం తెలీదు. మేం చెప్పినట్లు విను అన్నారు’
‘నీకు పెళ్ళైపోతే నాకు దూరంగా వెళ్లిపోతావు కదా!’
‘ఔను జహీరా! నాకు మీ అందర్నీ వదిలి వెళ్లాలని లేదు’ అంటూ ఇద్దరం ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటున్నాం.

పెళ్లికొడుకు వాళ్లు వచ్చారని మన్వి వాళ్ల చుట్టాలు,ఇంట్లో వాళ్లు ఇంటి గేట్ వరకు వెళ్ళారు. నేనేమో మన్వి రూం నుండి బయటకు వచ్చి కిటికీలోంచి అబ్బాయి వాళ్లని చూస్తున్నా. ఇంతలో టెలిఫోన్ మోగుతుంది. పట్టించుకోకుండా కిటికీ మీదే ధ్యాస పెట్టా. మళ్లీ ఇంకో సారి మోగింది. ఈసారి మన్వి రూం నుండి బయటకొచ్చి టెలిఫోన్ ఎత్తి మాట్లాడింది.
‘హాలో! ఎవరు?’
‘హా.. మన్వి నేను జహీరా వాళ్ల అమ్మని’
‘ఆంటీ చెప్పండి’
‘జహీరా లేదా?’
‘ఉంది ఇస్తున్నా ఆంటీ’ జహీ మీ అమ్మ ఫోన్ చేసింది.
అని చెప్పగానే అమ్మెందుకు ఫోన్ చేసింది అనుకుంటూ, ఫోన్ తీసుకున్నా

‘హలో జహీ..’
‘నేనే అమ్మ ఏవైంది ఫోన్ చేశావ్’
‘జహీ నువ్వక్కడి నుండి వెంటనే దగ్గర్లో ఉన్న మావయ్య వాళ్లింటికి వెళ్లు. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం’ అనగానే నా వెన్ను అదిరింది
‘ఏవైంది అమ్మ ఎందుకిలా మాట్లాడుతున్నావు’
‘అవన్నీ ఇప్పుడు చెప్పలేను. నేను నాన్న దర్బార్ మందిరంలో ఉన్నాం’
‘నువ్వు అక్కడ్నుండి ఖాదీర్ మావయ్య వాళ్లింటికి వెళ్లు. మావయ్య నిన్ను మా దగ్గరకి తీసుకొస్తాడు.
జహీ.. నిన్నెవరైనా నువ్ సిక్కు పిల్లవా అని అడిగితే కాదు అని చెప్పు’ అంటూ అమ్మ ఏడుస్తూ చెప్తుండగానే ఫోన్ సిగ్నల్ పోయింది.

ఇంతలో బయటున్న పెళ్లి కొడుకు వాళ్లు లోపలికి వచ్చారు. అమ్మ నాకు దేని గురించి చెప్పలేదు అసలేమైంది అనుకుని మన్వి నేను రూంలోకి వెళ్లి గడియ పెట్టాం. మన్వికి అమ్మ చెప్పిందంతా చెప్పా.
‘కానీ అసలేం జరుగుతుందో అర్థం కాట్లేదు మన్వి’ ఎండిపోయిన గొంతుతో నిస్సహాయంగా చెప్పా.
మన్వి ఆలోచిస్తూ ‘మీ అమ్మ చివర్లో నిన్ను సిక్కు అమ్మాయివని ఎందుకు చెప్పకంది?’
‘నన్ను ఇంకా భయపెట్టకు మన్వి’
ఇంతలో గడియ తీయమని మన్వి వాళ్ల నాన్న పిలుపు, నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి.
సంశయిస్తూనే మన్వి తలుపు తీసింది.

వాళ్ల నాన్న నేరుగా నా దగ్గరకొచ్చి
‘జహీరా బయట దారుణంగా అల్లర్లు జరుగుతున్నాయి. నువ్వెందుకమ్మా ఇక్కడికొచ్చావు’
ఇంతలో మన్వి ‘నేనే రమ్మని బలవంత పెట్టా నాన్న’ అంది చిన్న గొంతుతో
అందరూ ఆలోచనలో పడ్డారు
ప్రతి ఒక్కరి మొహంలో కంగారు, భయం.
అప్పుడు అర్థమైంది నేను వీళ్లకేదో అపాయం తలపెట్టా అని.
‘నాన్న ఇందాక జహీ వాళ్ల అమ్మ కూడా ఫోన్ చేసింది’ అంటూ మా అమ్మ చెప్పిన మాటలు మన్వి వాళ్ల నాన్నకి చెప్పింది.

ఆయన ఆలోచించి అమ్మ చెప్పినట్లుగానే నన్ను ఖాదీర్ మామయ్య వాళ్లింట్లో దింపేస్తా అన్నాడు. అప్పుడు మన్వి వాళ్ల నానమ్మ కలుగజేసుకుని
‘నీకెందుకు వచ్చిన సంతరా! ఈ పిల్ల వెళ్లగలదులే’ అంది విసుగ్గానే
‘నీకేం తేలీదమ్మా నువ్వూరుకో, జహీరా మన్వి హే కాదు వాళ్ల నాన్న నేను కూడా చిన్నప్పటి స్నేహితులం. ఇలాంటి ఆపద సమయంలో వీళ్లని చేరదీసుకోవాల్సిన బాధ్యత మనకుండదా’
‘బాధ్యత సరే లేరా! ఈ పిల్ల మన్వి కోసం మనింటికి వస్తుందని అందరికీ తెలుసు, ఇప్పుడు ఈమె ఇక్కడుందని తెలిస్తే మన ఇంటి మీదకి వచ్చేయరు’
‘నువ్వు కాసేపు ఆగమ్మా!’ అని మన్వి వాళ్ల అమ్మకి, వాళ్ల నాన్న సైగ చేస్తాడు.
దానికి వాళ్లమ్మ తలూపి..

నన్ను మన్విని వేరే గదిలోకి తీసుకెళ్లి మన్వి బట్టలు ఇచ్చి మార్చుకోమంది. నన్ను మన్వి లానే తయారుచేస్తోంది. ఇదంతా చూస్తున్న మన్వి వాళ్లమ్మని అడిగింది
‘ఎందుకమ్మా జహీకి ఇప్పుడేం ప్రమాదముంది’
‘జహీకి కాదు! మన ఊర్లోని సిక్కు వాళ్లందరికీ ప్రమాదం.’
‘సిక్కువాళ్లేంటీ ఎందుకలా’ అంటూ జహీ మన్వి వాళ్ల అమ్మ మొహం చూసింది దీనంగా..
వాళ్ల అమ్మ కళ్లలో నీళ్లు తుడుచుకుని
‘మొన్న రేడియోలో చెప్పారుగా తల్లీ నువ్వు విన్లేదా ఇవన్నీ పెద్ద కుళ్లు కుతంత్రాల యవ్వరాలు నీకెలా చెప్పేది’
‘హ్హ.. మొన్న మన ప్రధానమంత్రి చనిపోయారని దీని గురించి గొడవలు జరుగుతున్నాయని అమ్మ చెప్పింది’
ఇంతలో మన్వి వాళ్ల నాన్న పిలుపు.

‘పెరడు వెనకాల నుండి వెళ్లండి ఎవరికంటా పడరు’ అంది మన్వి వాళ్ల అమ్మ.
నాలో చెప్పలేని భయం ఉబికోస్తుంది. వెంటనే మన్వి నన్ను గట్టిగా కౌగలించుకొని జాగ్రత్త జహీ అంటూ ఏడుస్తుండగానే మన్వి వాళ్ల నాన్న నా చేయి పట్టుకుని నా తలపై వోని కప్పి బయటకు తీసుకెళ్లారు కంగారు పడుతూనే. మామయ్య వాళ్ల ఇళ్లు కాస్త దూరంలోనే ఉంది.
మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఢిల్లీ అంత ఎరుపు పులుముకున్నట్టు ఎక్కడ చూడు రక్తం, మంటలు..
‘అసలేవైంది అంకుల్.. సిక్కుల్ని మాత్రమే ఎందుకు చంపుతున్నారు, ఎవరు చంపుతున్నారు నాకు చాలా భయంగా ఉంది’
‘ఎవరో చేసిన పనికి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి కల్లోలాలు సృష్టించి ఏ పాపం తెలీని అమాయక జనాల్ని కూడా పొట్టన పెట్టుకుంటున్నారు తల్లీ’ అంటూ కన్నీళ్లు తెచ్చుకున్నారు.

మేం నడిచే వీధుల్లో ఉన్న సిక్కు ఇళ్లన్నీ అగ్నితో దగ్ధమవుతున్నాయి. కొన్ని శరీరాలు రోడ్ల గుండా పడున్నాయి. ఆ దృశ్యాలు చూస్తున్నంతసేపు నరకంలో నడుస్తున్న ఆలోచన. ఆ వాసన ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. తీరా రోడ్ నం. 23 కి రాగానే  అటువైపుగా ఆయుధాలు పట్టుకుని వెళ్తున్న ఓ ముఠా
మన్వి వాళ్ల నాన్నను చూసి..
‘మధుశాస్త్రి అటువైపు ఎక్కడికి ఈ టైంలో.. అక్కడ మంటలు అంటించాం’
మన్వి వాళ్ల నాన్నకి, నాకు గుండె ఆగినంత పనైంది.
వాళ్ల మాటలకు తడబడుతూనే
‘మ..మన్వితకి ఆరోగ్యం పాడైంది. ఇటువైపుగా హస్పిటల్ కి వెళ్దామని’ అంటూ వాళ్ల దృష్టి పడకముందే అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయాం.
ఖదీర్ మామయ్య వాళ్ల ఇళ్లంతా తగలబడిపోయింది. మేం మామయ్య కోసం చుట్టుతా వెతికాం. అలా రోడ్ నం. 24 వరకు వెళ్లగానే మమ్మల్ని గమనించి ఖదీర్ మామయ్య మమ్మల్ని ఓ పరదాలోకి లాగారు. నన్ను దగ్గరకు తీసుకొని ఏడుస్తూ ‘జహీరాను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు మీకేలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీట్లేదు’ అంటూ మన్వి వాళ్ల నాన్నకి రెండు చేతులతో దండం పెట్టాడు.
‘మీరు ఇంకా ఇక్కడుండడం మంచిది కాదు. త్వరగా మందిరానికి వెళ్ళండి’ అని మధుశాస్త్రి గారు చెప్పి మమ్మల్ని జాగ్రత్తగా పంపారు.
మామయ్యతో కలిసి ఎలాగోలా దర్బార్ మందిరానికి చేరుకున్నాం. కానీ అక్కడి పరిస్థితి చూసి నా మనసు, మెదడు మొద్దుబారిపోయింది.
మందిరమంతా కూడా నిప్పుల వరదలు. అందులో అమ్మనాన్న కూడా ఉన్నారు. గట్టిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేదు. మామయ్య కూడా అక్కడే కుప్పకూలాడు మమ్మల్ని ఓదార్చే వారే లేని పరిస్థితి. ఏడ్చి ఏడ్చి శరీరం అదుపు తప్పింది. అలా ఆ రోజు అక్కడే ప్రాణాలతో ఉండగలిగాం. ఆ రోజు ఖదీర్ మామయ్య తన పగ్రి తీసేసి పొడవైన జుత్తును కత్తిరించాడు, తన కుడి చేయి కడియాన్ని కూడా తీసేసాడు. మరుసటిరోజు ఢిల్లీ నుండి ఎక్కడికైనా పారిపోవాలని ఓ రైలెక్కాం. అలా మా ఇంటిని కుటుంబాన్ని కోల్పోయి బిక్కుబిక్కుమంటూ బయలుదేరి చివరికి హైదరాబాద్ వచ్చేసాం. ఆరోజు రైల్లో మా పక్కన కూర్చున్న ఓ హిందూ కుటుంబం అచ్చు మన్వి వాళ్లలాగానే! వాళ్లు సరదాగా మమ్మల్ని చూస్తూ ఎక్కడి వరకండి ప్రయాణం అని మామయ్యని అడిగారు. దానికి మామయ్య అనుమానంగానే ‘హైదరాబాద్ వరకు’ అని చెప్పాడు.
అందులో ఒకావిడ ‘నీ పేరెంటమ్మా’ అని అడిగేసరికి
‘జహీరా సింగ్…’ అని చెప్పబోతుంటే
మామయ్య నా నోటిని అదిమిన
‘జాహ్నవి…’ అని చెప్పాడు
‘హో.. మంచి పేరు’
అప్పుడర్థం కాలేదు నా చుట్టూ జరిగిన మారణహోమం గురించి. జహీరా సింగ్ నుండి జాహ్నవి గుప్తాగా మారిన నా కథ గురించి. ఇప్పుడు నాకు ఇరవై మూడేళ్లు.

Written by Sunka Dharani

పేరు: సుంక ధరణి
తండ్రి పేరు: సుంక నర్సయ్య
తల్లి పేరు: సుంక లత
వృత్తి: విద్యార్థి (ఎమ్మెస్సీ.బోటనీ-ప్రథమ సంవత్సరం)
కళాశాల: కాకతీయ విశ్వవిద్యాలయం
రాసిన పుస్తకాలు: అరుణిమలు (కవిత్వం)

చిరునామా: ఇం.నెం: 9-7-96/9,
గణేష్ నగర్,
రాజన్న సిరిసిల్ల జిల్లా
505 301
ఫోన్: 8978821932
మెయిల్‌: dharanisunka19@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎర్రరంగు బురుద

మైలురాళ్లు