ఎర్రరంగు బురుద

ధారావాహిక నవల – 11వ భాగం

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పండుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు. ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు. ఏదులుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పై కుట్ర చేసి ఏదులు భార్య నాంచారికి కరెంటు షాక్ తగిలిస్తారు. రత్నం సేటు చికిత్స చేయిస్తాడు. నష్టపరిహారం కొంత డబ్బు ఇవ్వాలనుకుంటడు సేటు. ఆడబ్బు కోసం ఏదులు తండ్రి సంగడి ఆలోచన తెలిసి సేటు. ఏదులు భార్య పిల్లల పేరు మీద చెక్కులిస్తడు. వాటితో ఇల్లు బాగుచేసుకుని. మామ ఊర్ల భూమి కొనాలనుకుంటడు ఏదులు. కొడుకు తన డబ్బులు దక్కనియ్యలేదని పగబట్టిండు ఏదులు తండ్రి.  ఒకరోజు పగటిపూట ఇంటికొస్తూ దారిల మందను సరిచూసుకుంటన్న ఏదులు మీద పడ్డరు ఆయుధాలతో.. ఏదులును చంపి కూడా తప్పించుకున్నరు తండ్రికొడుకులు. నాంచారి ఒంటరిదైంది. ఏదులు కొడుకులతో ఎట్టి చేయించుకోవాలని అనుకున్నడు సంగడు. పెద్దకొడుకు నాగులును సంగనితో పంపింది. చిన్నకొడుకును హాస్టల్ల ఏసింది. సంగడింట్ల జీవిత పాఠాలు చదువుతుండు నాగులు.  వాన కురుస్తున్న రాత్రి ఒంటరిగున్న నాంచారి ఇంటికి చేరిండు ఎంకులు

————ఇక చదవండి——–

“సూత్తనే ఉన్న.. సప్పుడు సెయ్యకుండ – కుండల కారం అందుకో నాకొక పిరికిడియ్యి.. నీ సేతుల సుత పట్టుకో..” అన్నది..

ఇంటి ముందల పన్న కుక్క సప్పుడు సేత్తలేదుందుకో అనుకున్నది నాంచారి.. గొల్ల ముసలవ్వ సెప్పినట్టు కుండలనించి కారం తీసి అవ్వకొక పిరికెడిచ్చింది.. తానొక పిడికెడు అందుకుంది..

“బుగులయితందే అవ్వ..” అన్నది..

“సప్పుడుసెయ్యకు.. నేను సెప్పేదిను. గుడిసెలకు రాకుండ పాయెనా పనే లేదు. తడిక తీసుకొని లోపలికి వచ్చెనా పానాలతో పోవద్దు వాడు. పక్కల కొచ్చేదాక రానియ్యి.. మీదసెయ్యేసినా కదలకు… వానికి అదునైతాన్నట్టే ఉండు…. ముక్కు.. మూలుగు.. ఏమన్న సెయ్యి… అదును సూసి కళ్ళల్ల కారం కొట్టు.. తొంట చెయ్యని బుగులు సెయ్యకు.. నేనున్న..” అన్నది.

వాన సప్పుడికి వీళ్ళ మాటలు బయిటికి ఇనపడట్లేదు… రెండుసార్లు గుడిసె సుట్టు తిరిగి… తడక తోసిండు  ఎంకులు గుడ్డిదీపం ఎలుతురుకు ముందు కంటికేమి ఆనలేదు.. అట్లనే నిలబడి కూసేవు సూసిండు .. నాంచారి పండుకున్నది. పక్కపొంటి దూరంగ ఎవరో పన్నట్టున్నరు. మడిసి ముడుసుకొని పన్నట్టుగా.. ఇంకెవరుంటరు గుడ్డల మూటేమోలే అనుకున్నడు. నిమ్మలంగ పొయ్యి దీపం ఆర్పేసిండు… గుడ్డెలుతురు కూడా పొయ్యింది. చిమ్మన చీకటనిపిచ్చింది నాంచారికి గుండెలదురుతున్నయి… చీకట్ల తడుముకుంటొచ్చి నాంచారి పక్కన కూసున్నడు …

వల్లు తడిమిండు..

తడిసిన సెయ్యి తగిలి జల్లు మన్నది నాంచారి పానం.. అంటెంక తల మీద సెయ్యేసిండు.. అటెంక కాల్ల మీద పడ్డది సెయ్యి..

రెండు కాల్లు దగ్గరికి ముడుసుకున్నది.

నిమ్మల్లంగ ఆమె పక్కన ఒరిగిండు అటు గెలికిండు – ఇటు తిప్పిండు, రెండు దెబ్బలేసిండు..

కట్టుకున్న లుంగి పికేసి నాంచారి మీద పడ్డడు..

సిన్నవ్వా అంట కీకేస్త కారం వాడి మొకాన రుద్దింది. అనుకోని ఎదురు దాడికి కండ్లు ముక్కు నోరు అంత కారం కమ్మింది..

“సంపితివే ముండా..” అంట రెండు సేతులు అటుఇటు ఇసిరుతండు. ముసలిది పాక్కుంట ఎప్పుడొచ్చిందో… కాళ్ళ మీద కూసుంది ఒక సెయ్యి మెలిపెట్టి ఎనిక్కి డొల్లింది రెండో సేయి ఎనిక్కిరిసి ఈపు మీదికి తిప్పింది రెండు గూడలు మెలపడ్డయి పందుల వలతాడుతో కట్టింది.. కండ్లు మొగం మంటెత్తంగ ఏం జరుగుతోందో తెలవట్లే ఎంకులికి.

 “ఎదురొమ్ము మీద కూసో పొల్లా..” అన్నది.

తను వాడి మోకాళ్ళ మీద కూసున్నది.. ఇద్దరు ఆడోళ్ళు మీదకు ఎక్కి కూసున్నరు… కళ్ళల్ల కారం ముక్కుల కారం – నోరంత మంట.. ఒర్రుతాండు భయంతో… ముసల్ది ముందుకొంగి ఆయిువు పట్టుకొని మెలి పెట్టింది.. గావు కేక పెట్టిండు ఎంకులు.

వాడి అరుపుకు భయపడి దిగ్గున లేచింది నాంచారి.. సుతం సేపు గిలగిల కొట్టుకొని… కదలకుండ తలవాల్చిండు…

ముసల్ది మొస పెట్టుకుంట లేసి నిలబడి.. “దీపం ముట్టియి పొల్ల..” అన్నది….. మంత్రమేసినట్టు కదిలి దీపం ముట్టిచింది..

 ముసల్ది తడిక తీసి తల బయటికి పెట్టి అటిటు సూసింది, మల్ల తడక పెట్టింది..

వాన పడతనే ఉన్నది.

ఎంకులు గుండె మీద చెవ్వానిచ్చి ఇన్నది..”ఆగిపోయింది కొట్టుకుంట లేదు” అన్నది.. అప్పుడు దీపాన్ని మొగం కాడికి తెచ్చి చూసిన్రు … ఎంకులు గాడ్ని గుర్తుపట్టిన్రు ఇద్దరూ…

“పాపాత్ముడు.. భూతల్లి భారం జరంత తగ్గింది ఈ నాటి నుంచి… గిన్ని మంచి నీళ్ళయ్యి పోరి..” అన్నది.

 కుండలకెల్ల నీళ్లు ముంచిచ్చింది గొల్లముసలమ్మకి.. తానిన్ని ముంచుకొని తాగింది..

“సిన్నమ్మ వీడు సచ్చిండు ఇప్పుడెట్లనే..” అని ఏడుసుడు మొదలుపెట్టింది…

“ఏటాడొచ్చి.. వాడే ఏటయిండు.. ఏడుత్తన్నవేందే పోరి.. నువ్వే అందరికి పిలిసి సెప్పేటట్టున్నవు. ఆ సేతులకున్న తాడిప్పు..” అనుకుంట.. పక్కన పడున్న లుంగి వాడి నడుముకు సుట్టింది.. బస్తా సింపులు వంటినిండ సుట్టి తాళ్ళతో కట్టిన్రు ఇద్దరు కలిసి. “నువ్వు బయటికి రాకు..” అని చెప్పి.. గొర్ర గొర్ర బయిటికి గుంజక పొయ్యింది.. వాన కురుస్తనే ఉన్నది. తడి నేల సర్ర సర్ర జారుతాంది… రెండు మూడిళ్ళు దాటినంక కాళీ జాగున్నది. అండ్లనే బుంగ బాయున్నది. అక్కడికి పోయినంక బస్త సింపులూ, తాల్లూడ బీకింది.. ఆ సింపులను పకనున్న గనేటు రాయికి కట్టింది, దాన్ని బాయిలేసింది.. ఎంకులు శవాన్ని కూడా బాయిలకు నెట్టింది.

ఏం జరగనట్టు ఎనిక్కి తిరిగొచ్చింది.. నాంచారి గుడిసె తడిక తోసుకొని లోపలకొచ్చింది… అప్పటికి ముసల్దాని బట్టలన్ని తడిసినయి. అరవై ఏళ్ళ ముసల్ది అప్పుడు దమ్ము తీసింది.

“బట్టపేగుంటియ్యి పొల్ల సీరంత తడిసింది…” అన్నది. బీరుపోయి వనుక్కుంట కూసున్న నాంచారి లేసి. తల తుడుసు కోను కండువిచ్చింది.

“మా అవ్వ పాతచీరున్నదియ్యినా…”

“ఏదో ఒకటియ్యిహె… “అన్నది.

 తడిసిన గుడ్డలిప్పి పొడిగుడ్డ కట్టు కున్నది. రైకి ఇడిసి నీళ్ళు పిండి మల్ల తొడుక్కుంది… రొంట్లదోపుకున్న సంచి తీసి చూసింది. సగం పొడి సగం తడిగున్నది. అండ్లకెల్లి సుట్టముక్క తీసి ఎలిగిచ్చింది..

“ఇంకట్లనే కూసున్నవెందుకు పండుకో… ఇంక సుక్క కూడ పొడవలే.. తెల్లారెటందుకు ఇంక శాన సేపున్నది. ముందుగాల ఆ కారపుసేతులు కడుక్కొని … ఇల్లంత ఒకసారి ఊడుసుకో… తెల్లారంగనే వాన తగ్గినా తగ్గకున్నా ఇల్లంత పిడసెయ్యి.. ఇంటి ముందల బురదల అచ్చులు లేకుండా.. ఊడువు… మరిసిన వాని సెప్పులెయ్యి…” అన్నది.

“అయ్యి కూడ బస్త సింపుల్లేసి సుట్టిన..” అన్నది నాంచారి.

“ఆహాం.. తెలివికల్ల దానివే.. అయితైంది గని.. ఒక్కదానివి ఈడుండకు.. మీ నాయిన కాడికి పో..

ఇయ్యాల ఎంకులు. రేపు ఇంకొగడు వస్తడు.. నీ కొడుకులు పెద్దయ్యే దాక నిన్ను నువ్వు కాసుకో.. పిల్లల్ని కాసుకో.. పొమ్మన్న కదాని ఊరొదిలి రేపే పోకు..

ఒక నెల గడవని.. బుగులు సెయ్యకు. ఎవ్వలు ఏమడగరు. నువ్వు తొంట దానివి.. నేను ముసలిదాన్ని..” అన్నది.

 నాంచారికి సంతోషంగా ఉన్నది.. ఒక పక్క భయంగున్నది.  కూసున్న కాన్నించి కదలలేదు…

“దయ్యం పట్టినట్టు కూసున్నవేందే.. ఇల్లు నూకి పండుకో.. నేను సుత పండాలె..” అని చుట్టను నేలకేసి రాసి చల్లార్చింది.

“వీని సావు కబురు తెలిస్తే మీ అయ్యే వస్తడు.. ఒకసారి నన్ను కలవమను..” అన్నది మల్లా, నాంచారి ఊడూస్తాంటె లేసిన కారం గాటుకు దగ్గుకుంట. ఊకుడయినంక బస్త సింపు పరుసుకొని ముడుసు కున్నది.

“సిన్నవ్వ నాక్కూడ చుట్టముక్కియ్యి ఒనుకొత్తంది..” అన్నది నాంచారి.

“సరే ఇగబట్టు..” అని రొంట్లె సంచి తీసిచ్చింది.

సంచిలకెల్లి సుట్టపీక తీసి దీపం కాడికి పోయి ఎలిగిచ్చింది. మొదటి సారి పీల్వంగనే గొంతు ముక్కు పొగ నిండి దగ్గొచ్చింది…

“ఆం.. తొలి సారట్లనే, ఉంటది.. ఇగ పండు..” అన్నది ముసల్ది..

నాంచారి సప్పుడు సెయ్యిలే. సుట్టంత కాలేదాక పీలుస్తనే ఉన్నది.. అటెంక బస్తసింపుల మీద ఒరిగింది. కాని కనురెప్ప ముయ్యలే.. ముసల్ది సన్నగ గుర్రు పెడ్తాంది. …

కోడికూసె ఏల్ల.. ముసల్ది లేసి.. “ఇగో పొల్ల నేను పోతన్న వాన సినుకులు సుత తగ్గినయి బుగులు పడకు అన్నిటికి నేనే ఉన్నా.. లే..లే..” అనుకుంట పొయ్యింది.

తెల్లారెపాటికి నాంచారికి జరం పట్టింది అయినా లేసి పనికి పోయింది.

అంబటేల్లకు కొడుకురికొచ్చిండు. “అవ్వా.. ఎంకులు బాయిల పడి సచ్చిండట… ” అని ఎగ పోసుకుంట సెప్పిండు…

“అవ్వో.. ఎక్కడ కొడకా… పోదాం పా..” అని.. ఇద్దరు కలిసి బాయికాడికొచ్చిన్రు. అప్పటికే బాయిలకెల్లి శవాన్ని తీసి  బయటేసిన్రు.. జనం మూగి ఉన్నరు. సంగడు వాని పెల్లాం శోకాలు పెట్టి ఏడుస్తాన్రు. ఊకుంచెటోల్లు ఊకుంస్తున్నరు. బాగయిందని మనుసుల అనుకునెటోల్లు సుత ఆడనే నిలబడ్డరు.

ఏదులు దోస్తు రంగడు కూడొచ్చిండు … సర్పంచు పోలీసులతో కలిసి వచ్చిండు.

“పంచనామా సెయ్యడానికి దావాఖానకు తీస్క పోవాలె..” అన్నడు సర్పంచ్.

సంగడు సర్పంచు కాళ్ళ మీద పడి “నా కొడుకు పీనిగెను కోయొద్దు బాంచెన్.. ఏదన్న సెయ్యి..” అని ఏడ్సిండు. పోలీసులకు దండం పెట్టిండు.. అంత మందిల ఎవరు కానకుండ.. రెండు నోట్ల కట్టలు జేబులు మారినయి..

“దావకానకయితె తీస్కపోవాలె కదా.. చూద్దాములే..” అన్నడు సర్పంచ్. దావఖానకు ఏసక పోయిన్రు.. పోలీసు జీబెక్కి సంగడు, సర్పంచ్ కూడా పట్నం సర్కార్ దావకానకు పోయిన్రు.

సర్కారు డాక్టరు తోటి మాట్లాడిండు సర్పంచ్. పోస్టుమార్టం కాకుండ పీనిగెను ఊల్లెకు పట్టు కొచ్చి దానం చేసిన్రు..

అప్పటి నించి నాంచారి పెద్ద కొడుకు తాతింటికి పోలేదు. సావు కబురిని నాంచారి తండ్రొచ్చిండు..

నాంచారికి జరమొచ్చింది సూసి, డాక్టరు దగ్గరికి తీస్కపోయి సూదేయించిండు … సేటుకు చెప్పి తల్లీ కొడుకులను ఇంటికి తోలకపోయుండు.

***సశేషం***

 

Written by Jwalitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జ్ఞాన నిధి

‘తిమిరపు వెలుగు’