లలిత గీతా బాల శశిబాల

సన్మానపత్రాల రచయిత తెలుగు టీవీ రచయితల సంఘం సభ్యులు శశిబాల గారితో తరుణి ముఖాముఖి – ఇంటర్వ్యూ సత్య యశోద దేవి 

           శశిబాల
సాహిత్యంలో పలు ప్రక్రియల్లో ఆమె రచనలు పాఠకులను ఆదరించాయి. అంతే కాదు చిత్రకారిణిగా, గాయనిగా గజల్ రచయితగా బహుముఖ రంగాల్లో ఆమె ప్రతిభ అనేక పురస్కారాలు సాధించింది. అన్నింటికీ మించి సన్మాన పత్రాలు మనసుకు హత్తుకునే తేలికైన పదాలతో ఆమె అల్లిన కవిత్వం సన్మాన గ్రహీతలను మంత్రముగ్దులను చేస్తుంది. పుట్టింట మెట్టినింట సాహిత్య, శాస్త్రీయ సౌరభాలు ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చాయి. ఆమే ప్రముఖ రచయిత,  తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ (TTWA)లో కార్యవర్గ సభ్యులు సిహెచ్. శశిబాల గారు. ఈ వారం తరుణి ముఖాముఖీ  శశిబాల గారితో….
తరుణి :  సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేసిన మీరు చిత్రకారిణిగా, గాయనిగా పేరు గాంచారు. ఇన్ని కళలు నేర్చుకోవడం ఎలా సాధ్యమైంది?
శశిబాల :  ఇన్ని కళలు నేర్చుకోవడం అనేది దైవ కృప మాత్రమే. సాహిత్యకారుల కుటుంబంలో జన్మించడంతో బహుళ నా జీన్స్ లోనే కళలు ఉన్నాయేమో. చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం.దానికి నాకు స్ఫూర్తి మా నాన్నగారు.  కీ.శే. మారేమళ్ల నాగేశ్వరరావు గారు. ఆయన గుంటూరు ఏ.సి. కాలేజీలో తెలుగు భాష శాఖ అధ్యక్షులుగా  పని చేసి రిటైర్ అయ్యారు.  ఆయన మహాకవి. యామినీ బిల్హణీయం, ఉత్తర రామ చరితం వంటి ఎన్నో పద్య కావ్యాలు వారు రాశారు. మా అమ్మగారు లక్ష్మి హిందీ పండిట్ మరియు  వయోలిన్  విద్వాంసురాలు.  ఊహ తెలిసిన నాటి నుంచి ఇంట సాహిత్యం, సంగీతం వింటూ పెరిగాను.  సాహితీ స్రష్ట అయిన నాన్నగారితో పాటు పనిచేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, భుజంగరాయశర్మ వంటి మహానుభావులు ఇంటికి వచ్చేవారు.  నాన్నగారి వల్ల చిన్నప్పటి నుండి సాహిత్యం పై మక్కువ పెంచుకున్నాను. వారి స్ఫూర్తితో తెలుగు భాష మీద మక్కువ పెంచుకొని నేను నా రచనా వ్యాసంగాన్ని  ప్రారంభించాను.
తరుణి మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. 
 శశిబాల నేను హిస్టరీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత  బి యిడి చేసి ఐదు  సంవత్సరాలు చెన్నై లో టీచర్ గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత ఫాబ్రిక్ పెయింటింగ్ మీద ఆసక్తితో శిక్షణ తీసుకుని, పెయింటింగ్ టీచర్ గా విద్యార్థులకు చిత్రకళలో శిక్షణ ఇచ్చాను. చిన్నప్పటి నుంచే కవితలు రాయడం, పాటలు పాడటం అలవడింది.
తరుణి  సాహిత్యంలో ఏఏ ప్రక్రియల్లో మీరు రచనలు చేశారు?
శశిబాల    నేను రెండు వేలకు పైగా కవితలు, 600కు పైగా పాటలు, 200 గజల్స్,శశిమోహన కాంతి కిరణం పేరుతో 150 మినీ ఆర్టికల్స్ ,500 కి పైన సన్మాన పత్రాలు కవితా రూపంలో రాశాను .భక్తి చానల్ కి, SVBC  ఛానల్ కి పాటలు రాశాను. రెండు చిత్రాలకు పాటలు రాశాను. కవితా రూపంలో రాసిన నా సన్మాన పత్రాలకు అద్భుతమైన ప్రజాదరణ లభించింది. సన్మాన పత్రాలను కవితా రూపంలో రాసిన తొలి  కవయిత్రిగా నాకు ప్రత్యేక గుర్తింపును, ఘనతను కల్పించింది.
ఇటీవల మాతృభాష దినోత్సవం సందర్భంగా  రాసిన పాట …
అమ్మంటే అమ్మే మురిపాల బొమ్మే ….
అమ్మ మనసు అమృతమే ..నిను మోసిన  కొమ్మే
నువు పూసిన  రెమ్మే
లాలీ జోజో … లాలీ జోజో …
లాలీ జోజో …లాలీ జోజో ….తన ఎర్రని రక్తాన్ని ..తెల్లని పాలుగ మార్చీ
తన వడినే మమతసిరుల  ఊయలగా చేసీ
గుండెల నిండా ప్రేమతొ .. గుండెలపై నిను మోసీ
తన ఆశలనే నీకు తొలి అడుగులుగా చేసీ
మురిసేదీ అమ్మేరా .. నిన్ను కన్న బొమ్మరా

” అమ్మంటే అమ్మే ”
నవమాసాలను నీకు నవరంధ్రాలుగ చేసీ
తన వూపిరినే  నీకు తొలి ఊపిరిగా చేసీ
తన బ్రతుకును వత్తి చేసి  .. నీ బ్రతుకును వెలిగించీ
తన పాపవైన నిన్ను కనుపాపలా పెంచే
అపరంజి మనసురా .. తనకు సాటి ఎవరురా” అమ్మంటే అమ్మే ”

తరుణి  : ప్రచురించిన పుస్తకాలు, ఆల్బమ్స్ గురించి చెప్పండి.
శశిబాల :   రాగామృత వర్షిణి 1,రాగామృత వర్షిణి 2,రెండు కవితా సంకలనాలు విడుదల చేశాను.
భజే సాయినాథం పేరున సాయిబాబా పాటల సిడి,లలిత సంగీతం పాటల సిడి,శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి పై పాటల సిడి,భక్తి పాటల సిడి లను విడుదల చేశాను.
తరుణి చాలా బాగుంది. మీరు పొందిన అవార్డుల గురించి ….
శశిబాల నేను స్వీకరించిన అవార్డులలో ముఖ్యమైనవి…
భారత్ కల్చరల్ అకాడమీ వారు ఇచ్చిన మహిళా శిరోమణి అవార్డు, అక్కినేని సంస్థ వారు ఇచ్చిన మహిళా శిరోమణి అవార్డు, TUTORS PRIDE వారు ఇచ్చిన  LADY LEGEND OF THE YEAR 2019 అవార్డు ,అక్షరయాన్ తరపున సి.హెచ్ .విద్యాసాగర్ గారు ఇచ్చిన మాతృభాషా దినోత్సవ పురస్కారం ముఖ్యమైనవి.  ఇవే కాకుండా
   ”తానా విశ్వ మహాసభల వేదిక” మీద గౌరవ అతిథి స్థానాన్ని, అనేక పురస్కారాలను, సత్కారాలను పొందాను.ఎన్నో అద్భుత సాహిత్య, సార్వత్రిక వేదికలపై అతిధిగా మన్నలను పొందాను. అమెరికా హ్యూస్టన్ లో కూడా “నెల నెలా తెలుగు వెన్నెల “వంటి కార్యక్రమాల్లో అతిథిగా గౌరవింప బడ్డాను. తానా అంతర్జాల వేదికపై ఎన్నో కవి సమ్మేళనాలలో కవిగా, అతిథిగా పాల్గొన్నాను.
తరుణి  :  మీరు కొన్ని సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ఆ వివరాలు..
శశిబాల నేను ఘంటసాల సంగీత కళాశాల కు authorized lyric writer  గా,(TTWA)తెలుగు బుల్లితెర రచయితల సంఘంలో EC మెంబర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కీర్తన ఆర్ట్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, శ్రీ కీర్తన ఫౌండేషన్ వంటి సాంస్కృతిక సంస్థలను స్థాపించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి కళామతల్లిని సేవించుకుంటున్నాను.
తరుణి  :  మీ కుటుంబం గురించి చెప్పండి 
శశిబాల :   మా వారు డాక్టర్ C.R.M Rao గారు జి.ఎస్.ఐ లో సీనియర్ డైరెక్టర్ గా పనిచేసి, రిటైర్ అయ్యారు. ఆయన భారత జాతీయ అవార్డు గ్రహీత . బెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ది డికేడ్  అవార్డు పొందారు. మా అమ్మాయి డాక్టర్ లక్ష్మీ హిమబిందు  హూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగానికి, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగానికి  అధికారిణిగా ఉంది. మా అల్లుడు డాక్టర్ అలోక్  కూడా కార్డియో వాస్కులర్ ఎనస్థీషియా లజిస్ట్. మా అబ్బాయి విష్ణు డెట్రాయిట్ ITW కార్ కంపెనీ లో ఇంజనీర్. కోడలు MMR కంపెనీ అసిస్టెంట్ డైరెక్టర్. నాకు ముగ్గురు మనవళ్లు. మాస్టర్ నీల్ ఆరవ్, మాస్టర్ మిహిర్ జై రాం, మాస్టర్ నకుల్ రియాన్.
తరుణి  :  మీ సాహిత్య ప్రయాణంలో మరిచిపోలేని కొన్ని మధురక్షణాలు…
శశిబాల :  నా సాహిత్య జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని:
  డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వున్న ఒక కార్యక్రమంలో గాయకులు,”లోకనాయకివె భువనేశ్వరి”అనే  నా పాట పాడటం జరిగింది. దానికి ముదిగొండ శివప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. నారాయణరెడ్డి గారు పాటలో చారు బాలేందు బింబాధరీ అని రాశావు. బింబధరీ కదా అంటే ఏది రాసినా తప్పు కాదు కదా అన్నాను. దానికి వారు అదేలాగా అని అడిగారు. అప్పుడు నేను బింబధరి అంటే నెలవంకను తలపై ధరించినది అమ్మవారు. బింబాధరీ అంటే నెలవంక వంటి పెదవి కలిగినది అమ్మవారు అని చెప్పాను. అప్పుడు వారు శెభాష్ అని మెచ్చుకున్నారు.అప్పుడు ముదిగొండ వారు మహాకవి కూతురు మరి అని అన్నారు. అవునా ఎవరు అంటే మహా కవి,సాహితీవేత్త, గుంటూరు ఏసీ కాలేజీలో ప్రాచ్య భాషా శాఖాధ్యక్షులు గా పనిచేసిన మారేమళ్ల నాగేశ్వరరావు గారి పుత్రిక అని చెప్పారు. అప్పుడు నారాయణరెడ్డి గారు భేష్ . తండ్రికి తగ్గ తనయ అని మెచ్చుకున్నారు. ఆ సంఘటన ఎప్పటికీ   మర్చిపోలేను.అలాగే కోడి రామకృష్ణ గారు మా ఇంటికి వచ్చినపుడు భక్తి గీతాలు, లలిత గీతాలు రాస్తారు తప్ప కెవ్వు కేక లాంటి పాటలు రాయగలరా అని  చమత్కరించారు. వెంటనే
 ” సై నా సక్కనోడ” అంటూ ఐటమ్ సాంగ్ కాగితం ఆయన చేతికి ఇచ్చాను. అది చదివి  మీ కలానికి రెండు వైపులా పదునే అంటూ మెచ్చుకున్నారు.
అలాగే శ్రీ K. విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు నా పాటలు మెచ్చుకొని ‘లలిత గీతా బాల ‘శశిబాల అని మెచ్చుకున్నారు. ఇవి నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు.
ఇంటర్వ్యూ గ్రహీత ఎస్. యశోదా

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్వప్నం

ఆరుగాలం – హాలిని