అసమ సమాజం

సంపాదకీయం

అధికారం అనే మాటనే చాలా సంతోషాన్ని, ఉత్తేజాన్ని, గర్వాన్ని కలిగించే భావన. నిజమే రాజు బంటు ఇద్దరిలో రాజు కు నిర్వర్తించాల్సన బాధ్యతలు బంటు చేయలేడు. బంటు పనులు రాజు చేయలేడు. కాని, ఈ కాని ఉందే ఇదే చాలా ఆలోచనల్లో పడేస్తుంది. చాలా మంది చేయలేని పనులు, సేవకుడు చేయలేని పనులు రాజు చేస్తాడు. రాజ్యపాలన అనే అనన్య సామాన్యమైన పనిని రాజు నిర్వహిస్తాడు. ఒక నాయకునికీ కార్యకర్తల కూ మధ్య కూడా ఇదే తేడా. ఎన్నెన్నో సమస్యావలయాలను ఛేదించి పాలన చేయడం సులభం కాదు. ప్రత్యక్ష సమస్యలు పరోక్ష సమస్యలూ తలెత్తుతాయి. కొన్ని బాహాటంగా దండెత్తుతాయి కొన్ని గుంభనంగా ! ఇవన్నీ పసిగట్టి ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. ఆనాడు రాజ్యం అన్నారు. ఇప్పుడు దేశం అంటున్నాం. రాష్ట్రం విషయం కూడా ఇంచుమించు ఇదే .
పరిపాలకులకు తన మాతృభాష పైన పట్టు ఉండాలి. అలాగే ఇతర భాషలు మరికొన్ని వచ్చి ఉండాలి. సామాజిక దృక్పథం వంటి ఎన్నో విశేషాలతో ఆలోచించే గుణం ఉండాలి. ఇదో పెద్ద టాపిక్,ప్రస్తుతం ఇంతవరకు చెప్పుకుందాం.ప్రపంచాన్ని గుప్పిట బిగించిన భావ వారధి ఇంగ్లీష్ భాష వచ్చి ఉండాలి. అలా అంటే జపానీ వంటి కొన్ని దేశాలు ఇంగ్లీష్ పెత్తనం చెలాయించనివీ ఉన్నాయి. అఫీషయల్ భాష , అంటే అధికారిక భాష ఇంగ్లీష్ కాకున్నా ప్రస్తుతం ఇంగ్లీష్ లేకుండా మనలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి ఉదాహరణ గా చెప్పాలంటే, మన దేశంలో వివిధ రాష్ట్రాలకు వివిధ భాషలున్నాయి. ఒక తమిళ వ్యక్తి తోనో ఒక అస్సామీ వ్యక్తి తోనో తెలుగు వచ్చిన వ్యక్తి మాట్లాడాలంటే ఆయా భాషలు రాకున్నా ఇంగ్లీష్ వస్తే మాట్లాడుకోగలరు. అందుకే, భాష భావ వారధి. ఇలాంటివెన్నో విషయాలలో నాయకునికి అనుభవం, శక్తి సామర్థ్యాలు ఉండాలి.
కరెక్ట్ గా ఇదే విషయాన్ని కుటుంబ పాలనలోనూ చూస్తాం. యజమాని లక్షణాలు ఇలాంటివే . ఇంటింటికి ఇద్దరేసి యజమానులు ఉంటారు.భార్య భర్త లు.ఒక కుటుంబం అంటే భార్యాభర్త, అమ్మానాన్న, పిల్లలు ఇలా అందరూ కలిసి ఉంటే కుటుంబమని అంటాం. ఇక్కడ కుటుంబం అనే రాజ్యానికి ఏలిక పురుషుడు అని ఒక నిర్ణయాన్ని తీసుకొని చెప్పిన రోజుల నుండి ,అది కాదు ,ఇద్దరు యజమానులే అనే కాలానికి వచ్చాం. ఈ సంసారం అనే శకటం నడవాలి అంటే జోడెద్దులలా భార్యాభర్తలిద్దరూ ఉంటేనే జీవితం సజావుగా నడుస్తుంది అనే గుర్తింపుకు వచ్చిన తర్వాత ఇద్దరినీ యజమానురాలు యజమాని అని అనడం మొదలుపెట్టారు . అయితే , పూర్వకాలంలో పితృస్వామ్య పరిపాలన లేకుండేది మాతృస్వామ్య పరిపాలనలోనే కుటుంబ వ్యవస్థ నడుస్తూ ఉండేది . మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకు మారిన తర్వాత కొంతకాలం స్త్రీలను అణగదొక్కి కేవలం ఇంటి యజమాని అంటే,,పురుషుడు అంటే ,ఆమె భర్త అనేవాడు మాత్రమే యజమాని అనే పద్ధతి కి తీసుకొచ్చారు. కానీ , ఎన్నో సంఘసంస్కరణలు జరిగిన తర్వాత స్త్రీలను సమానంగానే చూడడం అలవర్చుకున్నారు ఈ జనం . ఇక అప్పటినుంచి ఇప్పటికి వెనుతిరగలేదీ విషయం . అందుకే యజమానురాలు యజమాని తల్లి తండ్రి భార్యభర్త వంటి జంట పదాలు సరిసమానంగా వస్తున్నాయి , ప్రయోగంలో ఉన్నాయి.
అంతా బాగానే ఉంటే ఇప్పుడు ఈ అసమ సమాజం అనే మాట ఎందుకు వచ్చింది ?ఎందుకు వస్తున్నది ?ఒకసారి చూద్దాం. ప్రకృతి సహజంగా ప్రతి జీవి కి పుట్టుక చావు రెండు ఉంటాయి పుడితేనే జీవి అంటాం. జీవికి జీవనం గడిపిన తర్వాత తర్వాత సంభవించేది మరణం .మనిషి 100 సంవత్సరాల కాల జీవన కాల పరిమితి.కానీ, 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళ నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది . సాధారణంగా 60లో 70లో 80 లలో ఇలా ఏదో ఒక వయసులో మనిషికి చావు అనేది సహజం గా సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తు వస్తుంది. పుడతారు , పెరుగుతారు , జంటను కోరుతారు. పెళ్లి చేసుకున్న ఈ జంటలో ఎవరో ఒకరు ముందు మరణానికి గురి అవుతూ ఉంటారు. స్త్రీ చనిపోతే పురుషుడు ఒంటరి వాడవుతాడు, పురుషుడు చనిపోతే స్త్రీ ఒంటరి అవుతుంది. భార్య చనిపోయిన తర్వాత ఆ పురుషుడు ఒంటరిగా ఉంటాడు కానీ అతని ఆహార్యంలో ఏ మార్పు రాదు. ముందు నుండి ఎలా ఉంటాడో తర్వాత కూడా అలాగే ఉంటాడు. ఇదే నిజం . కానీ , పురుషుడు అంటే భర్త చనిపోతే ఆ స్త్రీ , ఆ భార్య ఆహార్యంలో మార్పు కనిపిస్తుంది. భారతదేశంలోని ప్రత్యేకమైనటువంటి ఈ విధానాన్ని మనము బాగా చూస్తూ ఉంటాం . అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఏదోవిధంగా పాటిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా భర్త చనిపోయిన స్త్రీ బాధగాను నిరాడంబరంగాను నిస్తేజంగాను జీవితంలో అన్నీ కోల్పోయినట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు . కొంతమంది జీవన పథాన్ని, ఈ జీవన శైలిని మార్చుకుంటారు . కాని ఆశ్చర్యానికి గురిచేసే తేడాలు పెద్దగా ఉండవు. అయితే భారతీయ స్త్రీలలో ఇది మరికొంత వైరుధ్యంగా కనిపిస్తుంది.
ఇవి సంప్రదాయాలలో ఆచారాలలో కనిపించే విషయాలు . భర్త చనిపోయిన స్త్రీకి ముత్తైదుతనం పోయింది అని వితంతువు అయింది అని అంటూ కొన్ని నియమాలను పెడతారు . ఆ నియమాలను అతిక్రమించడానికి వీలులేని పరిస్థితులు ఆమెను అల్లుకుపోయి ఉంటాయి . నలుగురు నడిచిన దారిలో నడవాలి అని ఒక విధింపుతో స్త్రీలు ఉండడం వలన బొట్టు గాజులు తీసేయడము తల పైన పువ్వులు పెట్టుకోకుండా ఉండడము, పుస్తె మెట్టెలు తీసేయడము వంటి భౌతిక అలంకరణ విషయాలతో ఒక విధమైన తేడా కనిపిస్తుంది . ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు వైధవ్యం వచ్చిందని ఈ స్త్రీని కొన్ని శుభకార్యాలకు పనికిరాదని అనడం కూడా చేస్తుంటారు . ఇది , ఈ భేదం స్త్రీ వైదవ్య విషయంలో కనిపిస్తుంది . ఆడ మగ ఇద్దిరికీ విధవ , వెధవ ఈ రెండు మాటలు ప్రాచుర్యంలోనే ఉన్నాయి . కానీ, కట్టుబాట్ల విషయంలో నియమాల విషయంలో పురుషుడికి ఇటువంటి కష్టాలేవి ఉండవు . వితంతు స్త్రీ లాగానే వెధవ పురుషుడు అని సపరేటుగా విడిగా ఏ ఆంక్షలు ఉండవు . దీనికి కారణం స్త్రీలు అలంకరించుకుంటారు ,పురుషులు అలంకరించుకోరు .ఇదే ప్రస్ఫుటంగా కనిపించే విషయం . అయితే ఆడపిల్ల పుట్టినప్పటినుంచి బొట్టు గాజులు పూలు అనేవి పెట్టడము తల్లిదండ్రులే అలవాటు చేస్తారు . అది క్రమంగా తను పెరిగి పెద్దయిన తర్వాత ఇవన్నీ అలంకరించుకుంటుంది . ఇవి మన దేశంలోని పరిస్థితులు . ఆచారాలు , సంప్రదాయాలు ఇష్టాలు కూడా ఇవన్నీ లెక్కలోకి వస్తాయి . తప్పేం లేదు , కానీ భర్త చనిపోయిన తర్వాత ఈ బొట్టు గాజులు ఎందుకు తీసేయాలి అవి పెళ్లి కాకముందు నుంచే అలవాటుగా ధరించేవి కదా అని ఒక ప్రశ్న ఎవ్వరూ అడగరు . అడగనివ్వరు . పెళ్లి తర్వాత ఎక్స్ట్రా వచ్చినవి కేవలం పుస్తెలు, మెట్టెలు, బొట్టు గాజులు కాదు కదా అవి పుట్టుకతో వచ్చినవి భర్త ఇచ్చిన వి కావు. భర్త చనిపోయిన తర్వాత అవి తీసేయాల్సిన అవసరం ఏముంది ? ఏ ఒక్కరు కూడా దీనిపైన దృష్టి పెట్టరు. ఇది కదా ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయం !!

నిరభ్యంతరంగా పుస్తే, మెట్టెలు తీసేయవచ్చు . వేడుకల్లో పాల్గొనడం ఇష్టం లేకుంటే అది సొంత విషయం ,ఆ స్త్రీకి తాను తన భర్త లేడు కాబట్టి ఆ వేడుకల్లో ఆ ఉత్సవాలు అంత ఆనందంగా నేను పాలుపంచుకోను అని అనుకుంటే కాస్త బాధ తగ్గుతుంది ఉంటే ఉండనీయండి, కావచ్చు , కానీ ఆచారం అనే ముసుగులో ఆమెని అవమానపరుస్తున్నామనే ధ్యాస లేకుండా పెట్టడం , చూడడం అనేది చాలా దారుణం అయినటువంటి విషయం .

ఇది పైన రాజు బంటు నాయకుడు కార్యకర్త వంటి మాటలను చెప్పి ఇక్కడ వాటికి భార్యాభర్తలు స్త్రీ పురుషుల సంబంధానికి పోలిక ఏమిటి అనే ప్రశ్న రావచ్చు . కానీ ఆ ప్రశ్నకు సమానంగా కుటుంబ పాలనలో యజమానురాలి పాత్ర అనేది ఉన్నప్పుడు ఇద్దరూ సరి సమానంగానే పనులు చేసి కుటుంబాన్ని కాపాడుతున్నప్పుడు ఈ యజమాని పోయిన తర్వాత యజమానురాలికి కొన్ని ముఖ్యమైన శుభ కార్యాలలో పాలుపంచుకొని పసుపు కుంకుమ లు ఇయ్యకుండా ఉండడం అనేది ఎందుకు జరుగుతున్నది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి . గతం గతః గడిచిపోయింది పెద్దలు ,పూర్వీకులు ఏదో నియమం పెట్టారు ఆనాటి కాల పరిస్థితులు కావచ్చు స్త్రీలకు చదువు లేకపోవడం స్వాతంత్ర్యం లేకపోవడం వలన పర పురుషులు వాళ్ళని ఎక్కడ మాయ చేస్తారో అనే భయానికి ఆ నియమాలను పెట్టుంటారు . ఆ కాలం అయిపోయింది . ఇప్పుడు నవ నాగరిక కాలంలో అడుగుపెట్టిన తర్వాత అందరూ చదువుకుంటూ అందరూ స్వేచ్ఛ కావాలి అనే భావనతో జీవిస్తున్నప్పుడు ఈ కాలంలో కూడా ఈ విధమైనటువంటి ఆచారాలు పాటించే అవసరం ఉన్నదా? అణచివేత కార్యక్రమం అసలే మంచిది కాదు. అసమానత చూపిస్తే అసలే జాతికి మంచిది కాదు ,దేశానికి మంచిది కాదు !మార్పు రావాలి ,మార్పును స్వాగతించాలి .అప్పుడే రేపటి తరాలకు మార్గదర్శకులు అవుతారు . ప్రతి తరంలో సంస్కర్తలు ముందుకు వస్తూ ఉంటారు ,ఏదో ఒక విషయంలో సంస్కరణలు చేయడానికి ! కృషి చేస్తూ ఉంటారు . కానీ ఈ స్త్రీల విషయంలో వైధవ్యం విషయంలో ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రావడం లేదు. ఆడవాళ్ళే ఒప్పుకోవడం లేదా మగవాళ్లే ఒప్పుకోవడం లేదా అనే ఒక పెద్ద సంశయం కలుగుతూ ఉంటుంది . పసుపు కుంకుమలు శుభకార్యాలలో ముట్టుకోవద్దని వాళ్లకు ఆంక్షలుపెట్టారు . భర్త చనిపోతే భార్య తను పెంచిన పిల్లలను కూడా ఉదాహరణకి ఒక ఇంట్లో భార్యాభర్త ఓ కూతురు ఒక కుమార్తె ఉన్నారనుకోండి భర్త చనిపోయిన తర్వాత ఈ భార్య తన కుమార్తె పెళ్లి విషయంలోనూ కొడుకు పెళ్లి విషయంలోనూ ముందుండి చేయొద్దు అని అనడం ఏమైనా బాగుందా ? కష్టపడి కని , పెంచి ఇంత వాళ్లను చేసి ఆ కొడుకుకు పెళ్లి చేయాలను ఆ కూతురికి పెళ్లి చేయాలని ఆ స్త్రీ ఎంతో తపన పడుతుంది. ఎన్నో కుదుర్చుకుని మానసిక సంఘర్షణల నుంచి దాటుకుని అయ్యో నా భర్త లేడే నేనొక్కదాన్నే ఉన్నాను నా పిల్లల్ని బాగుపరచాలి అని కష్టపడి పెంచినటువంటి ఆ స్త్రీ ఈ వైదవ్యం అని ఒక పేరుతో తన కొడుకు తన సొంత కొడుకు పెళ్లిలో తన సొంత కూతురు పెళ్లిలో కూడా ఆ పసుపు కుంకుమలను పట్టుకోదని ఆ నూతన వస్త్రాలను వధూవరులకు ఇవ్వద్దని ఇటువంటి ఆంక్షలు పెట్టడం అనేది ఏ లోకం సమర్ధిస్తుందండి ? అంతవరకు పెంచినటువంటి తల్లికి ఈ సంతోష కార్యాలయంలో పాల్గొనే హక్కు లేదా ? సంపాదించి, వంటలు చేసి ఆకలి ఆకలి తీర్చి అన్నం పెట్టినటువంటి కన్నతల్లి కదా ! కన్నతల్లి విషయంలో కూడా ఇంత వైరుధ్యాన్ని ఎట్లా ఈ సమాజం ఒప్పుకుంటుందో ఎంతకు ఆలోచిస్తే అంతుపట్టనే అంతుపట్టదు . ఇవి మారాలి ఈ పరిస్థితులు మారాలి .తన పిల్లలకి ఏ జబ్బు చేస్తేనో హాస్పటల్ చుట్టూ తిరిగి నిద్రాహారాలు మాని వాళ్ళ మంచి చెడులన్నీ చూసినటువంటి కన్నతల్లి తన సొంత కొడుకు పెళ్లిలో పనికిరానిది ఎలా అవుతుంది? తన సొంత కూతురు పెళ్లిలో పనికిరానిదిగా ఎలా అవుతుంది? ఇదే విషయం ఒకవేళ ఆ కుటుంబంలో భార్య చనిపోతే భర్త తండ్రిగా తాను కష్టపడి వాళ్ళ బాగోగులను చూసి మంచి చెడులను చూసి పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తాడు . ఆ పెళ్లి విషయంలో అతడు పనులు చేయొద్దు ముట్టుకోవద్దు అనే ఆంక్షలు ఉండవు . కానీ స్త్రీ విషయంలో అలా లేదు ఇవి ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది . దేశ నిర్మాణం కుటుంబ నిర్మాణం రెండూ ఒకటే !దేశ పాలన రాష్ట్ర పాలన ఎలాగో కుటుంబ పాలన కూడా అటువంటిదే !మంత్రివర్గంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ లో ఏదైనా ఇబ్బంది వస్తే ఎలాగైతే ముఖ్యమంత్రిగా అని ప్రధానమంత్రి గాని బాధ్యత వహిస్తాడు అదేవిధంగా కుటుంబంలో కూడా బాధ్యత స్త్రీది కూడా ఉంటుంది .అందుకోసం ఇది ఒక ఉద్యమంగా భావించి , ముఖ్యంగా ఇళ్లలో ఆడవాళ్లు తన కొడుకును గాని తన కూతుర్ని గాని పెంచుతున్నప్పుడే చిన్నప్పటి నుంచే ఇటువంటి ఆదర్శ భావజాలాన్ని గనుక నేర్పించినట్టయితే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత ఎక్కడైనా చూసినా అడ్డుకుంటారు . తన ఇంట్లో తనను అడ్డుకుంటారు.ఇది తప్పని తప్పకుండా నేర్పాల్సినదే ! సమాజం తనకున్న ఈ అధికారాన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి , అప్పుడే ఇలా మార్పు తెచ్చినప్పుడే ఆ సమస్య రూపుమాపుతుంది . అసమ సమాజం పోతుంది సమ సమాజం వస్తుంది “మార్పు ముందు నీ ఇంటి నుంచి మొదలుపెట్టు”ఇది ఒక నినాదంగా తీసుకొని ముందుకెళ్దాం.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్లాస్టిక్ ప్లేట్ పైన కుందెన్స్ తో చేసిన గిఫ్ట్ లు

మన మహిళామణులు