ఓ చెట్టు కింద బస్ ఆపాడు డ్రైవర్. అందరితో పాటు అక్షిత కూడా దిగి చుట్టూ చూసింది. అది ఒక పల్లెటూరిలా ఉంది. ఎదురుగా పాకలాంటి హోటల్ ఉంది. దిగిన వాళ్ళంతా అక్కడికి వెళుతున్నారు. తన పక్కన ఏవరో మాట్లాడినట్లుగా ఉంటే పక్కకు చూసింది. ఒక పెద్దావిడ బస్ ప్రతి కిటికీ దగ్గరా ఆగి లోపలకు తొంగి చూస్తోంది. బస్ చుట్టూ తిరిగి చూసి ఏదో గొణుగుతుంటే, ఏమి కావాలండీ? అని అడిగింది అక్షిత. ఆవిడ అక్షితకు జవాబివ్వకుండా ఏదో గొణుగుతూ ఇంకా వెతుకుతోంది.
“మీ ఆయన ఈ రోజు కూడా రాలేదా?” నవ్వుతూ ఓ పిల్లవాడు అడిగాడు.
ఆమె ఏమీ జవాబివ్వకుండా చిన్నగా వెళ్ళిపోతోంది. ఆమెను చూస్తూ ఎవరీమె అని అడిగింది ఆ పిల్లవాడిని.
“ఓ పిచ్చిది. రోజూ వచ్చి వాళ్ళాయన కోసం బస్ లో వెతికి వెళ్ళిపోతుంది” అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఆ పిల్లవాడిని అదిలిస్తూ “అమ్మణ్ణీ మీ ఆయన వస్తే నేను చెపుతానన్నాను కదా ఎందుకొచ్చావు? ఇంటికి వెళ్ళు అన్నాడు ప్రయాణికులకు కాఫీ ఇస్తూ, పాక హోటల్ ముందున్న కాఫీ బండి అతను ఆమెతో.
“ఎవరీమె?” అతనిని అడిగింది అక్షిత కాఫీ తాగుతూ. అతను కాఫీ కలుపుతూ అక్షిత ప్రశ్న వినిపించుకోలేదు. పక్కన పిల్లల అరుపులు వినిపిస్తే అటు చూసింది అక్షిత. కొంతమంది పిల్లలు రాళ్ళతో ఆమెను బెదిరిస్తూ నవ్వుతూ, గోలగోలగా అరుస్తున్నారు. వాళ్ళనుంచి తప్పించుకుంటూ ఆమె కాలు మెలికపడి కింద పడిపోయింది. అక్షిత చప్పున వెళ్ళి ఆమెను లేవదీసింది.
అక్షితకు ఆమెను చూస్తే పిచ్చిదానిలా అనిపించలేదు. ఏదో పోగొట్టుకున్నదానిలా ఉంది. ఆమెను లేవదీసి, పట్టుకుంటూ “అమ్మా మీ పేరేమిటి?” అని మెత్తగా అడిగింది. ఆమె జవాబు ఇవ్వకుండా అక్షితను పట్టించుకోకుండా ముందుకు నడిచి తూలిపడిపోబోయింది. అక్షిత ఆమెను పట్టుకొని నడిపిస్తూ “మీ ఇల్లెక్కడ?” అని అడిగింది కానీ ఆమె దానికీ జవాబివ్వలేదు. అక్షిత ఆమెను చిన్నగా నడిపిస్తూ ఆమెనుఅనుసరించింది. ఆమె ఒక ఇంటి ముందుకు రాగానే ఒక పెద్దాయన వచ్చి ఆమె చెయిపట్టుకొని లోపలికి తీసుకెళుతూ “అమ్మణ్ణీ నేను వస్తానన్నాను కదా! అట్లా వెళ్ళిపోయావేమిటి?” బుజ్జగింపుగా అంటూ, అమ్మణ్ణి చేయి పట్టుకొని లోపలికి నడిపిస్తూ, అక్షిత వైపు ఎవరు అన్నట్లు చూసాడు.
అక్షిత కు ఏమి చెప్పాలో తెలియలేదు. చిన్నగా మాటలు కూడగట్టుకుంటూ, “నేను ఈ బస్ లో దిగాను. అక్కడ ఈవిడ ఎవరికోసమో వెతుకుంతుంటే, పిల్లలు ఏడిపించబోయారు. తను పడిపోతే, లేపి తీసుకొచ్చాను. ఈవిడ భర్త కోసం వెతుకుతున్నారు. ఎందుకో, ఏమి జరిగిందో తెలుసుకోవచ్చా?” అడిగింది.
“నువ్వు జర్నలిస్ట్ వా?” అడిగాడు.
“కాదు టూరిస్ట్ను” జవాబిచ్చింది.
ఓ క్షణం అక్షితను నిశితంగా చూసి లోపలికి రా అని పిలిచాడు. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటూ చుట్టూ చూసింది.గోడకు ఒక మిలిట్రీ అతని ఫొటో ఉంది. ఆ ఫొటో వైపు చూస్తుంటే ఆ పెద్దాయనఅక్షిత ఎదురుగా కూర్చుంటూ “చెప్పమ్మా? ఎవరు నువ్వు?” అని అడిగాడు.
“నా పేరు అక్షిత. నేను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. అప్పుడప్పుడు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళటము నా హాబీ. అక్కడచూడదగిన ప్రదేశాలతో పాటు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా వెళుతుంటాను. అలా అక్కడి బస్ లల్లో, రైళ్ళల్లో పర్యటిస్తే, అక్కడివారి జీవన విధానము తెలుస్తుందని అక్కడంతా బస్ లల్లోనే తిరుగుతుంటాను.అట్లాగే రెండురోజుల క్రితం కేరళలోని పర్యాటక ప్రదేశాలు చూద్దామని వచ్చాను. కొచ్చిన్ లో విమానము దిగి, అక్కడ చూడవలసినవి చూసి, చుట్టుపక్కల గ్రామాలను చూద్దామని బస్ లో వచ్చాను. ఇక్కడ బస్ స్టాప్ లో వీరు బస్ లో భర్త కోసం వెతుకుతుంటేఆసక్తిగా అనిపించి, విషయమేమిటో తెలుసుకుందామని అడుగుతున్నాను. మీకు అభ్యంతరమైతే వెళ్ళిపోతాను” అంది.
ఆయన చిన్నగా నిట్టూర్చి “నా పేరు రాజన్. తను మా అక్క అమ్మణ్ణి. మా బావగారు మిలిట్రీ లో పని చేసేవారు. ఒక సారి సెలవలో ఊరు వచ్చినప్పుడు పెద్దల నిర్ణయం ప్రకారం అక్కను పెళ్ళి చేసుకున్నారు. సెలవలు అయిపోయాక, అక్కడ క్వాటర్ అలాట్ అయ్యాక అక్కను తీసుకెళుతానని చెప్పి, డ్యూటీలో చేరేందుకు వెళ్ళారు. బావగారు వెళ్ళిన కొద్దిరోజులకే తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ ల యుద్దములో, తూర్పు పాకిస్తానుకు సహాయము చేసేందుకు మన ప్రభుత్వం నిర్ణయించుకోవటముతో బావగారు యుద్దానికి వెళ్ళాల్సి వచ్చింది. యుద్దములో విజయము సాధించి, తూర్పు పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ గా ప్రకటించాక, చూసుకుంటే కొంతమంది మన వాళ్ళు పశ్చిమ పాకిస్తాన్ చేతిలో యుద్ద ఖైదీలుగా చిక్కినట్లుగా తెలిసింది. ఇటువైపు మనవారి కి యుద్దఖైదీలుగా చిక్కినవారిని, వారు బంధించిన మన సైనికులను మార్పిడిపద్దతిలో కొంతమందిని మార్చుకున్నారు. కొంత మందిని వాళ్ళు విడుదల చేయక అక్కడే కారాగారంలో బంధీలుగా ఉంచారు. వాళ్ళల్లో మా బావగారు కూడా ఉన్నారు. ఎప్పటికైనా వాళ్ళు విడుదల చేస్తారని మేము ఎదురు చూస్తున్నాము. అక్క రోజూ అలా బస్ స్టాప్ కు వెళ్ళి చూస్తూ ఉంటుంది.ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ బావగారు మాత్రం రాలేదు.కానీ అప్పుడప్పుడు జర్నలిస్ట్ లు అక్కను ఇంటర్వ్యూ చేస్తామని వస్తారు. దానివలన మాకు ఒరిగేదేమీలేదని ఈ మధ్య ఒప్పుకోవటము లేదు. పైగా వాళ్ళ ప్రశ్నలతో అక్క బాగా డిస్ట్రబ్ అవుతోంది.అందుకే నువ్వు జర్నలిస్ట్ వా అని అడిగాను” అన్నాడు.
అక్షిత తన వెనుక తలుపుకు ఆనుకొని నిలుచున్న ఆమెను చూస్తుంటే ఈ మధ్య తను చదివినThe mystery of India’s ‘missing 54’ soldiers గుర్తొచ్చింది. సీనియర్ జర్నలిస్ట్మిస్. డోరియా ఈ సైనికుల గురించి తెలుసుకోవాలని, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ లను, సైనికుల బంధువులను ఎంతమందినో ఇంటర్వ్యూ చేసి, పరిశోధించింది కానీ వారి గురించి ఏమీ తెలియలేదు. 1965 యుద్దములో పట్టుబడినవారు బహుషా మరణించి ఉండవచ్చు. 1971 లో పట్టుబడిన వారిలో కొంతమందిని విడుదల చేసారు. ఇరుపక్షాల ప్రభుత్వాలు సంధి చేసుకొని మార్పిడి పద్దతిలో విడుదల చేసారు. దగ్గరదగ్గర 600 మందిని విడుదల చేసినట్లుగా పేర్కొన్నారు. అయినా ఇంకా కొంత మంది ఉన్నారనే భావిస్తున్నారు. ఆ సైనికుల భార్యలు, బంధువులు కొంతమంది రెండు గ్రూప్ లుగా వారివారి ఫొటోలు పట్టుకొని వెళ్ళి పాకిస్తాన్ జైల్ లో వెతికారు. కానీ ఎవరూ కనిపించలేదు. అయినా తమవారు అక్కడ జైల్ లోనే ఉన్నారని తమ నమ్మకం అని గట్టిగా చెపుతున్నారు. మరైతే ఆ 54 మంది సైనికులు ఏమైనట్లు? అంతేనా ఇంకా లెక్క తెలియని వారున్నారా? అంటే సమాధానం లేదు. వారు జైల్ లో ఉన్నారా? అసలు వారు బ్రతికి ఉన్నారా? లేదా? అన్నది తెలియలేదు. ఆలోచనల నుంచి బయటకు వస్తూ “ఈ మధ్య కొంతమంది ఈ సైనికుల భార్యలు, బంధువులు పాకిస్తాన్ వెళ్ళి వారి పర్మిషన్ తో జైల్ లో వెతికారుకదా! మరి మీరు వెళ్ళి చూడలేదా?” రాజన్ ను అడిగింది.
“దాని వలన ఏమైనా లాభం జరిగిందా? వారికి వాళ్ళవారు కనిపించారా?” తిరిగి ప్రశ్నించాడు రాజన్.
నిజమే అలా వెళ్ళి వాళ్ళకు అక్కడ మనవాళ్ళెవరూ కనిపించలేదు. నిట్టూరుస్తూ “మీ కుటుంబమూ” అంటూ అర్దోక్తిలో ఆపేసింది.
“నా భార్య చనిపోయింది. మా అబ్బాయి, కోడలు పొలంకువెళ్ళారు. వాళ్ళ పిల్లలిద్దరూ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నారు. మా అక్కకు పిల్లలు లేరు” చెప్పాడు.
తన వెనుక తలుపును ఆనుకొని నిలబడి, తమ సంభాషణను వింటున్న అమ్మణ్ణి వైపు చూసింది. ఎప్పటికైనా తన భర్త శత్రువుల చెర నుంచి విడుదలై తనకోసం తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న ఆమెను చూడగానే గుండె పిండేసినట్లయ్యింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే లేచి వెళ్ళి ఆమెను హగ్ చేసుకుంది.రాజన్ దగ్గర సెలవు తీసుకొని బయటకు వస్తూ,డోరియా అన్నట్లుగా ఈమె భర్త బతికి ఉన్నాడా? ఈమె నీరిక్షణ ఫలిస్తుందా?ఏమోకాలమే జవాబు చెప్పాలి భారమైన మనసుతో వారి వద్ద సెలవు తీసుకుంది.