శ్రీమతి డేంకిణీపుర జయలక్ష్మి గారు* శ్రీ బాల ప్రహ్లాద పరిపాలన కథనము* అనే పద్య ఖండికను “జయ శ్రీ రమా లోల జయ బాల పరిపాల” అంటూకీర్తన తో మొదలు పెట్టారు.
ఐదవ పద్యమైన* కమల సంభవుడి రాణి* అంటూ తాను ప్రహ్లాద కథచెప్పాలనుకుంటున్నాననీ
తానొక సామాన్యురాలుననీ, రాసే శక్తి ఇవ్వమనడం వారి వినయ మనకు గొప్ప నిదర్శనం!
* వాసుదేవుడు తాను* అనే పద్యంలో జయవిజయులకు తమ ఏకాంతం భంగం కలిగించవద్దని చెప్పిన వైనం బాగుంది.
* దేవ మీ పాదాబ్జ సేవ కోరెదమని* మునులు రావడం, వారిని అడ్డగించడం అనే ఘట్టం కథకు బలాన్నిచ్చింది…
* దితియొక్క దినమున* అనే సీసమాలిక లో దితి వేళకాని వేళ పతి పొందు కోరడం, కశ్యపుడు వద్దనడం, ఆమె వినకపోవడం, పొందు వల్ల దుర్మార్గుడైన పుత్రుడు కలగడం అనే ఒక నీతిని సందేశం వలె మలిచి, చదువరులకు తెలుపడం
” సాహిత్యం సత్ప్రవర్తన నేర్పుతుంది” అనేది ఋజువయింది.
* నారద ముని తో ఇట్లనే* అనే సీసపద్యంలో ఇంద్రుడంతటివాడు ఆమెని ఎత్తుకు రావడం, ఆమె బిడ్డ ని చంపడానికి అనడం ఎంత వారైనా ఎప్పుడో ఒకప్పుడు ప్రాణాల కోసం బలహీనులనే అర్థం చక్కగా తెలియజెప్పారు.
* నారాయణనే నామము* అష్టాక్షరీ మంత్రం విశిష్టతను, నారాయణుని మించిన దైవం లేదు అనడం…. ఆణిముత్యాలకే ఆణిముత్యమైన పద్యం… ప్రహ్లాద జనన విశేష వచనం కూడా చాలా బాగుంది.
* పాషాణములకాని-బంధించి కాని* మంజరీ ద్విపదలో హిరణ్యకశ్యపుడు పొందిన వరం చక్కటి కూర్పు.
* వరుణిని పిలిచి తలవాకిట నీళ్లేసి* సీస పద్యం లో చిత్రంగా వరుణితో కళ్ళాపి చల్లించడం, వాయు దేవుని తో ఇల్లు ఊడిపించడం, అగ్నిదేవునితో వంట చేయించడం, ఇలా అష్టదిక్పాలకులతో సేవలు గమ్మత్తుగా ఊహా కల్పన చేస్తూ హాస్య రసాన్ని పోషించారు కవయిత్రి.
* గగనము నేనే అంతా నేనే* అని రాక్షసరాజు విర్రవీగడం అతని రూపు కళ్ళకు కట్టే రచన!
* చదువవలెను తండ్రి* అనే పద్యం భాగవతాన్ని మరిపించింది.
* అని భూసురులు దెల్ప నా దానవేశు* మంజరీ ద్విపద లో తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పిన రచయిత్రికి సామాజిక స్పృహ మరియు సమాజంలోని వ్యక్తిగా తన కర్తవ్యాన్ని చక్కగా తెలియజేశారు.
మరో ద్విపదలో* మనుజుని జీవిత మధ్యంబు నందు*అని భక్తి ప్రచోదనం చేస్తూ… బాల్యంలోనే భక్తి ఏర్పరచుకోవాలానే విషయం ఎంతో చక్కగా తెలిపారు.
* కట్టడి గుణమున దానవు* అనే కందపద్యం శబ్దాడంబరంతో చదువుతుంటే ఆనందంగా ఉంది.
అనుచు మనమున ధ్యానింప- అమిత భక్తి
వరకూ ప్రతీ పద్యం, ద్విపదలు కల్పనా చాతుర్యంతో అలరారాయి.
* ఎందున్నాడు అని తెలుపుదు ఇందిర నాయకుడు* పోతనగారి” ఇందుగలడందులేడని సందేహము వలదు” అనే పద్యాన్ని స్పురణకు తెచ్చింది.
* ఓరీ! నీ హరి యిందునచేరుండగ* అనే పద్యం ఉత్కంఠభరితంగా ఉంది.
నరసింహావతారము అద్భుత చిత్రణ!
* భాగ్య మెట్టిదనుచు పలుకగ తరమౌనె* భక్తి భావం చిప్పిల్లేపద్యం!
లక్ష్మీదేవి నరసింహుని చూసి వెనుకకు అడుగులు వేసింది అని చెప్పిన * హరి మోమును చూసిన సిరి* పద్యంలో రచయిత్రి స్త్రీల సహజ స్వభావమైన సౌకుమార్యాన్ని ప్రదర్శించారు.
ఇలా శ్రీ బాల ప్రహ్లాద పరిపాలనము రచనా పరంగా ఆద్యంతం ఎంతో ఉదాత్తంగా సాగింది. తరువాత కీర్తనలు కూడా భక్తిభావంతో బాగున్నాయి. మంగళం తో సంప్రదాయానుసారంగా ముగించారు కవయిత్రి జయలక్ష్మి గారు..
వారి రచనలను స్పృశించే పాండిత్యం లేకున్నా… వారి మీద భక్తి, గౌరవంతో ఈ నాలుగు మాటలు సమర్పిస్తూ…
వారికి నమస్సులతో