కాలచక్రం

కథ

రాపోలు శ్రీదేవి

పొద్దున్నే కాలం తో పరిగెడుతూ… ఓ వైపు వంట పని
ఓవైపు ఇంటి పని చేస్తూనే మరోవైపు పిల్లలను తయారు చేసి స్కూల్ కి పంపింది తరుణి

ఉదయం హుషారుగా వెళ్లిన చిట్టితల్లి సాయంత్రం బిక్కముఖం వేసుకొని ఏదో అవమానం జరిగినట్టు బాధపడుతూ ఇంటికి వచ్చింది.

ఏమిటా? అని తరుణి తన కూతుర్ని దగ్గరగా తీసుకొని…
” ఏమైంది చిట్టి తల్లి?” అని అంటే …
ఏడుస్తూ ఆ స్కూల్ కి నేను వెళ్ళను అని కరాకండిగా చెప్పింది. సరేలే అంటూ ఓదార్చి దగ్గరగా తీసుకుంది .

తరుణి స్కూల్లో లైబ్రేరియన్ గా పని చేస్తుంది .
పిల్లలు లైబ్రరీకి రానప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటుంది.
తనకు పుస్తక పఠనం అంటే ఎంతో ఇష్టం.
ఆ రోజే లైబ్రరీలో
“రైలుబడి” అనే పుస్తకం చదివింది.
అందులో టోటోచాన్ అనే అమ్మాయి ని అల్లరి చేస్తోందని టిసి ఇచ్చి పంపిస్తారు.

ఆ పాప తల్లి
ఎంతో బాధ పడుతుంది.
చివరికీ
రైలుబడి అనే స్కూల్ లో చేర్పిస్తుంది.
ఆ బడి లో తరగతి గదులు పాత రైలుడబ్బా లతో ఉంటాయి.
అది చూస్తేనే పిల్లలకు కొత్తగా వింతగా అనిపిస్తుంది.
అలాంటిది ఆ బడి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా పిల్లలకు పూర్తి స్వేచ్ఛ
ఉంటుంది.
నచ్చింది చదువుకోవచ్చు
చదువుతుంటేనే ఎంత విచిత్రంగా అనిపించింది.
అలాంటి బడి గురించి చదివాక తరుణి మనసులో వాళ్ళ పాప పడే ఇబ్బంది గమనించి స్కూల్ మారుద్దామని
నిర్ణయించుకుంది.

మరుసటి రోజు వాళ్ళ పాప శ్రీజను తీసుకొని స్కూల్ కి వెళ్లి
ప్రిన్సిపల్ గారినీ…
ఏమైంది మేడం? అని అడిగింది.
మీ పాప స్కూల్ కి అబ్బాయిల యూనిఫామ్ వేసుకుని వస్తే వద్దని గౌను వేసి పంపించాను అని అంది .
కానీ…
ప్రిన్సిపాల్ గారు ! మా పాప చిన్ననాటి నుంచే అమ్మాయిల డ్రెస్సు వేసుకోదండి. అబ్బాయిల డ్రెస్ అంటేనే ఇష్టపడుతుంది. దయచేసి అదే వేసుకోవడానికి అనుమతి ఇవ్వగలరు అని ప్రాధేయపడింది.
ప్రిన్సిపాల్ గారు …
మీ ఒక్కరికి పర్మిషన్ ఇస్తే అందరూ అడుగుతారు .. కుదరదని కరాకండిగా చెప్పింది.
చిన్నగా కొన్ని రోజులకు ఫ్రాక్ వేసుకోవడం అలవాటు చేపిస్తాను.
అప్పటివరకు ఏమీ అనకండి .
చిన్నప్పుడు నేను కూడా అబ్బాయిల డ్రెస్సే వేసుకునేదాన్ని తర్వాత మారాను అని చెప్పగానే అది విషయం జీన్స్ లోనే ఉందన్నమాట.. అని అన్నది .
వీలైతే టీసి తీసుకొని వెళ్ళండి అని చెప్పింది.
కానీ…
మేడం! మేము 5000 కట్టాముకదా..
తిరిగి ఇస్తారా ? అని అడిగితే..
కుదరదు అంటే కుదరదు అని చెప్పింది.
దాని తో చేసేదేమీ లేక శ్రీజకు టీసి తీసుకొని వచ్చింది.
పాప కు నచ్చిన స్కూల్ కోసం వెతుకులాట మొదలు పెడితే చివరికి ఒక స్కూల్లో అబ్బాయిల డ్రెస్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
ఆ రోజు పని అంతా అయ్యాక మంచం పై ఒరిగి గతంలోకి జారిపోయింది….

చిన్నప్పుడు నేను కూడా అబ్బాయిల డ్రెస్ వేసుకోలేదు తమ్ముడికి కొన్న డ్రెస్సులే వేసుకునేదాన్ని
ఎంత నచ్చజెప్పినా అమ్మాయి డ్రెస్ వేసుకోవడానికి ఎంత ఏడ్చేదాన్నో …
చివరికి నా ఐదో యేటా అనుకుంటా మేనత్త కుట్టిన మెజెండా రంగు గౌను అయిష్టంగానే వేసుకున్నాను.
ఆ రోజు నానమ్మ మా అందరితో కలిసి ఫోటో దిగుదామని చూస్తుంటే నాకు గౌను బలవంతంగా వేసినందుకు ఒకటే జుట్టు పీక్కొని ఏడవడం …
తమ్ముడు కొబ్బరి చిప్ప కావాలని ఏడుపు మొత్తానికి వాడికి కొబ్బరి ఇయ్యగానే నవ్వుతూ…
ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు.
నేనైతే చింపిరి జుట్టు తోటి అలానే పడ్డాను.
ఆ ఫోటో చూసినప్పుడల్లా నవ్వొస్తుంది.
అంతేనా…
చిన్నప్పుడు అమ్మ నన్ను స్కూల్ కి పంపడానికి పడ్డ తంటాలు అన్నీ ఇన్ని కాదు….
నేనేమో మా లెక్కల టీచర్ వేసే శిక్షలకు భయపడి స్కూల్ కి వెళ్ళనని.. తమ్ముడేమో స్కూల్ కి వెళ్తానని ..ఏడుపూ నన్ను బడిలోకి పంపిస్తే నేను బయటికి…
తమ్ముడు లోపలికి పరిగెత్తడం అమ్మ ఇద్దరితో తంటాలు పడడం ఇప్పటికీ గుర్తొస్తుంది.
అమ్మ స్కూల్లో దించి రాగానే అమ్మ వెంటే వెనకాల పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేదాన్ని.. అమ్మ పంపడం నేను తిరిగి రావడం ఇదే జరుగుతూ ఉండేది.

ఇప్పుడు చిట్టితల్లి కూడ స్కూల్ కి వెళ్ళను అని మారాం చేస్తుంటే ఏం చేయాలో తోచక చివరికి డబ్బులు పోయినా పర్లేదని పాపకు నచ్చిన స్కూల్లోనే చేర్పించాను .

కాలచక్రం ఎంత విచిత్రమైనదో …
ఆనాడు నేను అమ్మని ఎంత ఇబ్బంది పెట్టానో ఇప్పుడు నా కూతురు నన్ను ఇబ్బంది పెడుతుంటే అర్థం అవుతుంది .
అవును ఏదైనా అనుభవిస్తే కానీ తెలియదు .
జీవితంలో మళ్లీ అదే ఘట్టం జరగడం వీధి లిఖితమో లేదా అమ్మని అర్థం చేసుకుంటానికి దేవుడు పెట్టిన పరీక్షనో తెలియడం లేదు..

కాలచక్రంలో ..
కాలం తిరిగి తిరిగి మళ్లీ అక్కడికే వచ్చినట్టు ఉంది.
పాత్రలు మారాయి అంతే అప్పుడు కూతురుగా అమ్మ ను బాధపెట్టాను.
ఇప్పుడు తల్లిగా బాధపడు తున్నాను. అందుకే అమ్మను అర్థం చేసుకోవాలి..
పిల్లలు పెద్దవారు అయ్యాక అందరి అమ్మ ల్లా నన్ను పెంచింది అంతే కదా
అనుకుంటారు..
కానీ …
అలా పెరిగే క్రమం లో తల్లిదండ్రుల ను మనం పెట్టిన ఇబ్బందులు
మనకు ఎదురైతే గానీ..మనకు అర్ధం కావు..
అమ్మ నాన్నలు మనల్ని ఉన్నంత లో ఉన్నంతంగా పెంచినందుకు వారిని
అర్దం చేసుకొని ఆదరిద్దాం …
వృద్దాశ్రమాల లో చేర్పించకుండా..మన చెంతనే చింత లేకుండా
నిశ్చింతగా ఉండేలా..
ప్రేమ ను పంచుదాం

Written by Rapolu Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సీమంతం

చిత్రం లో విచిత్రం