చెట్టు కొమ్మల సందుల నుండి
గాలిని తోడేసుకొని దూరుతూ
తనను పూర్తిగా ఆక్రమిస్తున్న
సూర్యుని ఆతపానికి కందిపోయి
వేడెక్కిన తనువుతో
ఎర్రటి సింధూరంలా భూమి…
తపనను చల్లార్చుకునేందుకు
ఎదురు చూస్తోంది మృగశిర కోసం
ఋతురాగాలను అందుకొని
నీటి గాఢతను నింపుకున్న
కాటుక మబ్బులు నింగిని పరచుకొని
పులకరింతలతో పుప్పొడిలా
చినుకు తడిని జల్లుతున్నాయి..
తడిసిన తన దేహపు తమకంలో
అగ్నిని చల్లార్చుకొని,
ఆకుపచ్చ రంగును పులుముకుంటూ
తోడవుతోంది ప్రకృతి ప్రణయానికి నేలమ్మ..
గమ్యం చేరలేని కాగితప్పడవలు
పరుగులందుకున్నాయి కేరింతలతో..
మనసులన్నీ తన్మయ భావాల
సందళ్ళలో మునిగాయి.
ఆకాశానికి కళ్ళిచ్చి
ఎండిపోయిన రైతు గుండె
తొలకరి తడిమిన సంతోష శ్వాసలతో
కదిలింది చేతన శిల్పంలా
విత్తనాలు విరబూయు ఉద్యానంలా…..