పాలక్ పన్నీర్ రోటీ

ఆహారం

కావలసిన పదార్థాలు :
పాలకూర 100 గ్రా
తురిమిన పన్నీర్ 80 గ్రా
చిన్న ఉల్లిపాయ 1
వెల్లుల్లి రెబ్బలు 2
గోధుమపిండి 80 గ్రా
పసుపు చిటికెడు
కారప్పొడి 1 టేబుల్ స్పూన్
ఉప్పు తగినంత మోతాదు
గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్
నెయ్యి లేదా నూనె 10గ్రా
–————————————
తయారు చేసుకునే విధానం :-
మొదటగా స్టవ్ వెలిగించుకొని బాణలిని వేడెక్కనివ్వాలి. తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేయాలి. అవి కొంచెం వేగిన వెంటనే వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. రంగు మారిన వెంటనే అప్పటికే తరిగి నీళ్ళల్లో ఉంచిన పాలకూరను నీళ్లల్లోంచి అలాగే తీసి బాణలిలో వేయాలి. అది ఉడికి కొంచెం నీరు తగ్గగానే పసుపు, కారప్పొడి, గరం మసాలా వేసి కలపాలి. పూర్తిగా నీరు తగ్గిన తర్వాత పన్నీరు వేసి తడి పూర్తిగా తగ్గేవరకు కలుపుతూ ఉండాలి. దగ్గరగా అయిన తర్వాత దాన్ని మరో గిన్నెలోకి తీసుకొని మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచాలి.
ఇప్పుడు చల్లారిన పాలకూర మిశ్రమంలో గోధుమపిండి, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ( ఉప్పు తొందరపడి ఏమాత్రం ముందు వేయకూడదు. దానివల్ల నీరు అధికంగా ఊరి, గోధుమపిండి ఎక్కువగా వేయాల్సి రావడం వలన రుచి అనుకున్న విధంగా రాదు). తయారు చేసుకున్న చపాతీ ముద్దను ఉండలుగా చేసుకొని నెమ్మది నెమ్మదిగా చపాతీ కర్రతో గుండ్రంగా పుల్కా మాదిరిగా కర్రకు అంటుకోకుండా పొడి పిండి చల్లుకుంటూ వత్తుకోవాలి. ఈ రొట్టెను కాలిన పెనం మీద వేసి, రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత మీకు నచ్చినట్లు నెయ్యి గాని నూనె గాని వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువగా తినాలనుకునే వారు కారం మోతాదును పెంచుకోవచ్చు. కావాలనుకున్నవారు దీనిని ఇంట్లో మనం తయారు చేసుకున్న ఊరగాయతో కానీ పెరుగుతో కానీ తినొచ్చు.
( వేడిగా వున్నప్పుడు తింటేనే వీటి రుచిని ఆస్వాదించగలం)

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మనం పోషక పదార్థాలు మన రోజువారీ ఆహారంలో తీసుకోలేక పోతున్నాము. పైన చెప్పిన వంటకంలో ఆ కొలతలకు
19 నుండి 20 గ్రాముల ప్రోటీన్ మనకు అందుతుంది. ఇది వెయిట్ లాస్ కి, వెయిట్ మేనేజ్మెంట్ కి మరియు
ఇతరములైన విటమిన్ లోపాలను తగ్గించుకోవడానికి
ఉపయోగపడుతుంది…
కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు పాలకూరకు బదులుగా అదే కొలతలో మెంతికూర, కొత్తిమీర, కాలి ఫ్లవర్ లతో కూడా చేసుకోవచ్చు.. పన్నీర్ అంటే అస్సలు ఇష్టపడని వాళ్లు కూడా దీన్ని ఇష్టంగా తినగలుగుతారు..దీనిని క్యాలరీలుగా చూసుకుంటే 500 క్యాలరీలుగా ఉంటుంది. కాబట్టి లంచ్ లాగా, లేదా డిన్నర్ లాగా తీసుకోవచ్చు.

శ్రీ భవ్య ధూళిపాళ

Written by Bhavya dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూ’me’ ని నేను!

జీవితాన్ని అర్ధవంతం చేసేదే నిజమైన చదువు