“నేనంటే…?
గుట్టు విప్పలేని, గోడు చెప్పలేని రహస్యపు మూటలు ఎన్నో దాగున్నా, నన్ను నమ్మిన మీకై ఎటువంటి బరువని భావించకుండా నలిగినా, మలగినా మీ భారాన్ని భరిస్తున్నా…
ఎందుకంటే భూమిని నేను. మీ బాధ్యతను స్వీకరించిన మాతృమూర్తిని నేను.
అనేకానేక విస్ఫోటనాల నడుమ, నిరంతరం జరిగిన మార్పుల పిదప ఈ విశ్వంలో ఊపిరి పోసుకున్న మహాలక్ష్మీని నేను.
యుగాలు మారాయి. తరాలు మారాయి. వెనువెంటే వచ్చే మార్పులను తరుముతూ భరించమనే ఓటములు ఓవైపు. నన్ను గుర్తించకుండా మీ విలాసపు వేటలో పడి గీసుకున్న గీతలు మరో వైపు. వీటి వల్ల నా దేహం భరించిన బాధలేన్నో.
తల్లినంటారు, తారతమ్యం లేకుండా దొరికినవి దోచుకుంటారు.
చెల్లినంటారు, చెప్పే మాటలు పెడచేవిన పెట్టి అనర్థాలే చేస్తారు.
ఆడదాన్ని అయినందుకా విచ్చలవిడిగా వూరేగుతున్నారు.
మీ అగచాట్లకు కుత్తుక భరించని మౌన గీతాలెన్నో మెదులుతున్నా నా వాళ్లే అని నిశ్శబ్దంగా కాచుకున్నా.
అయినా ఎవడిదీ భూమీ? చచ్చాక శాసించి శోషించేదేం ఉంది ఇక్కడ. నా స్థలం అంటూ గేట్లు పాతడానికి నా మీద అధికారం ఎవరిచ్చారు. సిరి సంపదలంటూ, బంగారు నిధులంటూ సృజించిన వాటిని స్మృతుల్లో లేకుండా కొల్లగొట్టారు. నా సహనానికి పరీక్ష పెట్టారు.
ప్రేమనిచ్చే ప్రకృతిని అపవిత్రం చేసారు. గాజు మేడల్లో ఊరేగారు. పెనుగులాడుతున్న వన్య జీవాన్ని గుండెలకు అదుముకుని ఘోల్లుమన్నా ఆడంబరాల మీ అల్లరి దూకుడు ఆపలేరు. ఇలా ఎన్నో .. ఎన్నెన్నో..
ఇక నా త్యాగాలకు ముగింపు పలికి మానవాళిని మోయలేనని విశ్రమించుకుంటాను. తరలిరాని దూర ప్రాంతాలకు మరలిపోతాను. అవును భూమిని. ఓర్పుకి మరో పేరుని.”
అంటూ సాగిన గాయత్రి ప్రసంగానికి ఒక్కసారిగా హాలు మొత్తం గట్టిగా చప్పట్లు కొట్టారు. వేదిక మీద ఉన్న ఓ పెద్దాయన గాయత్రికి అభినందనలు చెప్తూ, విజేతగా ప్రకటించి మెడల్ తో సత్కరించారు. ఇక తన ఆనందానికి హద్దులెక్కడివి. మెడల్ బహుకరించిన తర్వాత పరుగు పరుగున నా దగ్గరకు వచ్చి స్టేజ్ పైకి లాక్కేల్లింది. ఆ మెడల్ ని నా చేతిలో పెట్టి
“తన వల్లే ఇంత బాగా భయం లేకుండా చెప్పాను. నేను ప్రసంగించిన విషయాన్ని రాసింది కూడా తనే ” అంటూ నన్ను సభలో వారికి పరిచయం చేసేసరికి అక్కడి వారంతా భ్రాంతిపోయారు. ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందని. ఇంతకీ నేనొవరో చెప్పలేదు కదా!
నేను గాయత్రి చిన్ననాటి స్నేహితులం. కొన్ని సంవత్సరాల క్రితం రెండు ఊర్ల మధ్య జరిగిన భూవివాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో ఒకదాన్ని. నిజానికి నేనో ఆత్మని. అవును భూమిని నేను.