కన్నతల్లి అతని కల్పతరువు

కవిత

ఏ యోగ బలమో
ఏనాటి పుణ్యమో
ఏ జన్మ బంధమో
మాకు దొరికెనే ఇంత అనుభవం!!
‘కాలడి‘దర్శనం !!

చల్లని గాలి ఆ దారి
ఉరుములు మెరుపుల వర్షం
చెట్టు చేమల పచ్చదనం
ప్రకృతి సౌందర్య ధనం!!

వైదిక పద్ధతి
వేదమంత్రాల హోరు
వాతావరణం మహా ఆహ్లాదం

కేరళ ఎర్నాకులం
ఆదిశంకరులు జన్మించిన స్థలం
శ్రీ పుణ్య క్షేత్రం కాలడి
యోగమంటే యోగమే దర్శన యోగం!

తల్లి కాళ్ళ అడుగుల దరికి
పూర్ణ నదిని తీసుకొచ్చినట
‘కాలడి‘పేరు ప్రసిద్ధి గాంచెనట!

దేశమంతా తిరిగి అద్వైతం బోధించి ఆచార్యుడై
ఆదిశంకరులు అందరి శంకరుడయ్యె

చిన్న వయసులోనే జ్ఞానమార్జించినా
పెద్ద బోధనలే చేసి
గురువు స్థానం పొందె
ముప్పది రెండవ ఏళ్ల జీవితమేపొందె
ఈశ్వరుడు నివసించే
చల్లని ప్రదేశం కేదార క్షేత్రంలో
తనువు చాలించిన యోగిపుంగవుడు మన ఆదిశంకరులు!!
కాలడి గుడి దర్శన ప్రయాణం ఓ దివ్యానుభవం
ఆ దృశ్యం ఇంకా తాజాగా
మనసు తెరపై మెరిసిపోతున్నది

చుట్టాలు బంధువులు
ఆత్మీయ స్నేహితులు
కలిసిన చక్కనైన రోజు
ఎంత ఆనందమో
ఎంత సంతోషమో
శుభాకాంక్షలు తెలిపేలా
దొరికింది ఓ శుభసమయం!!

ఆది శంకరులు పుట్టినట్టి గడ్డ
తల్లి ఆర్యాంబ మసిలినట్టి గడ్డ
ఈ మట్టి పరిమళం ఎంత పవిత్రం
ఆచార్యుని వరం దొరికింది
అనుభూతుల్నిచ్చింది

తల్లిదండ్రులు దేవదేవుని ప్రార్థిస్తే
కోరిక కోరక కోరిన కోరిక
శంకర దేవుడే ఆర్యాంబ గర్భాన
కొడుకుగా పుట్టెనన్నది ఒట్టి మాటకాదు
అద్వైత మత ప్రచారానికి
ఇలలోన వెలసినాడా నడిచే దైవం!!

ఐదో ఏట ఉపనయనమయ్యి
జ్ఞాన జ్యోతి కనిపించే
స్మృతి శ్రుతులు పురాణాలు
పుక్కిట బట్టె
కాశీ పట్టణం సందర్శించి
మండన మిశ్రుని వాదనలో ఓడించిన ఆదిశంకరులు                                                                                             ఎదురు వచ్చిన చండాలుని చూసి నవ్వె
చండాల రూపాన వచ్చింది శివుడే
భగవంతునికి భక్తునికి మధ్య చెరగని బంధమది
మొక్కి అందరొకటేనని చాటి చెప్పాడు ఆదిశంకరులు

దైవభూమి వేదభూమి
కాశ్మీరు నగర సందర్శనం
నలుగురు శిష్యులకు హితబోధ చేసి
నాలుగు మఠాలు తాను స్థాపించి
నలుగురి శిష్యులను నియమించె ఘనుడై!!

ధనం లేదని బాధపడుతున్న
దంపతుల ఉసిరిక దానమందుకొని
కనకధారా స్త్రోత్రం చెప్పి
కనకవర్షాన్నే కురిపించి
ధనవంతులను చేసి మహిమనే జూపాడు!!

వేదాల అర్థాన్ని వివరించి
భాష్యమే రచించె
ప్రజలకందరికి సులువయితె బాగని
సౌందర్యలహరి రచించిన
యోగిపుంగవుడు
ఎన్నో రచనలు చేసి
ప్రజలకందించాడు ధన్యుల జేసాడు!!

అమ్మ అనుమతి తీసుకుని సన్యాసి అయ్యాడు

అమ్మ ఎప్పుడు పిలిచినా పలుకుతానని చెప్పి                                                                                                లోక కళ్యాణం కోసం నడుం కట్టాడు
వయసొచ్చి నడవలేని అమ్మ పాదాల చెంతకు
పూర్ణా నదిని తాను రప్పించాడు
కన్నతల్లి కి శ్రాద్ద కర్మలన్ని
స్వయం గా నెరవేర్చి
పుత్ర ఋణాన్ని తీర్చుకొన్నాడుర

ఏనాటి పుణ్యమో
ఏనాటి వరమో
ఏ జన్మ సంబంధమో
శంకరులు పుట్టిన
మట్టిలోన వచ్చితిరిగి
ఆ మట్టి పరిమళాన్ని
ఆ పూర్ణఉదకాన్ని
తాకినట్టి భాగ్యమేమని చెప్పను?
ఎంతని పొగడను??
ఆ మహనీయుని ఖ్యాతి!

ఆది శంకరుని వైభవాన్ని సందర్శించిన                                                                                                              అదృష్టమే సిద్ధించింది నాకు!!

ఓం నమో శంకరా!!
ఓం నమో శంకరా!!
ఆది శంకరాచార్య వందనం
ఆర్యాంబా అభివందనం!!
కన్నతల్లి అతని కల్పతరువన్నందకు
అందుకోవమ్మా

డా చీదెళ్ళ సీతాలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమి- మనమూ

మైలురాళ్ళు