అక్షరాలు పదాలై, పదాలు గీతాలై, ఆ గీతాలకు సంగీతం తోడై, అది అద్భుతమైన పాటగా గొంతు నుండి జాలువారితే ఆ మాధుర్యంలో రసజ్ఞులు ఓలలాడుతారు. అలాంటి ఒక సినిమా పాటే ఇది. కళాతపస్వి కె. విశ్వనాథ్ చిత్రించిన అపురూపమైన ఎన్నో చిత్రాల్లో ‘సప్తపది’ మనందరికీ మరపురాని ఒక మధుర జ్ఞాపకం. అందులో గోదారి వెల్లువలా సాగే వేటూరి సుందరరామమూర్తి కలం నుండి కురిసి, మంజీర నాద ప్రవాహమై పరుగులు తీసే స్వరకర్త కె.వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకొని, గాన గంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, వసంత కోయిల సుశీల జంటగా ఆలపించి తేనెలూరిన ప్రేమ రాగం… ” రేపల్లియ ఎద ఝల్లున పొంగిన మురళి ” అనే
అలనాటి గీతం.
పాట అందరికీ సుపరిచితమే. కానీ ఎంతోమంది దీంట్లో ఉన్న సాహిత్యాన్ని, తెలుగు భాషా పాటవాన్ని
పట్టించుకొనక పోవచ్చు. ఒకసారి అదేంటో చూద్దాం.
మొదటి చరణాన్ని పరిశీలిస్తే…
…”.కాళింది మడుగునా కాళీయుని పడగలా
ఆ బాల గోపాల మాబాల గోపాలుని”….
ఇక్కడ ‘ఆబాల గోపాలం’ రెండుసార్లు ప్రయోగించబడింది. ఇది ధ్వనిపరంగా మాత్రమే కాదు. అర్థాన్ని చూస్తే “ఆబాల గోపాలం” ..అంటే పిల్లలనుండి
మొదలుకొని పెద్దవారి వరకు.. “ఆ బాల గోపాలుని” …ఆ పిల్లవాడైన గోపాలుని …ఇందులో వ్యాకరణ పరంగా అర్థభేదం కలిగిన అక్షరాల సముదాయం మరల మరల ప్రయోగించి యమకాలంకారాన్ని ఉపయోగించడం జరిగింది.
ఆ వెనువెంట పాదంలో “అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ”…ఇక్కడ యమకాలంకారంతో పాటు త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబగు అన్న సూత్రంతో త్రికసంధి కూడా కనిపిస్తుంది. ఆ + చెరువు..అచ్చెరువు… అంటే ఆ చెరువులో.. అచ్చెరువున అంటే ఆశ్చర్యంతో ..ఆశ్చర్యానికి వికృతి అచ్చెరువు కదా!
నిజంగా ఎంత గొప్ప భాష మనది. ఇపుడు మొత్తం ఈ పాదాలను పరిశీలిస్తే..
కాళింది మడుగులో కాళీయుని పడగల పైన నాట్యరూపుడైన ఆ పిల్లవాడైన కృష్ణుని పిల్లలు, పెద్దలు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయారు అని.
తరువాత మరో చరణంలో
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి”
ఈ పాదాల్లో కూడా యమకాలంకార చమత్కృతి చూడ వచ్చు. ఆ రాధ…అనగా కృష్ణుని మనోమందిర సామ్రాజ్ఞి
అయిన ఆ రాధ, ఆరాధనాగీతి పలికించి.. అనగా గోపాలుని పైన ఆరాధనతో ఆ గీతాన్ని పాడిందని వారి రాసలీలను వర్ణించిన తీరు అసామాన్యం. వీటితో పాటుగా మురళి, రవళిల అంత్యప్రాసలతో పాటను చిరస్థాయిగ నిలిపిన ఘనత వేటూరి వారిది. పాటకు ప్రాణం పోసి, సాహిత్యపు నిగారింపులతో గుబాళింపులను అద్ది, తెలుగు సాహితీ పూదోటలో
తెలుగు భాషామతల్లిని సింహాసనంపై నిలిపి, ఆ చరణాలకు అక్షరనీరాజనాలు సమర్పించి లబ్ధ ప్రతిష్ఠులైన కవులెందరో ఉన్నారు. వారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు.
ప్రస్తుతకాలంలో కూడా సాహిత్యానికి ప్రాణం ఇచ్చే సినీ గేయ కవులు వున్నారు. కానీ మారుతున్న సమాజంలో భాషకంటే, భావానికంటే కూడా విదేశీ సంస్కృతి ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు సహజమే. అయితే అది మనలను, మన భాష విలువను తగ్గించకుండా మనం దాన్ని కాపాడుకుంటే చాలు. లేదంటే పరిస్థితులు మరీ దిగజారి ముందు తరాల వారికి మనభాష అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఇకనైనా జాగ్రత్త పడదామా మరి.