“కొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు”.
అన్నారు ప్రముఖ కవి శ్రీశ్రీ
ఇక్కడ స్త్రీ, పురుషుడు అన్న విషయాన్ని పక్కన పెడితే , సోమరితనంతో గాని , బాధ్యతరాహిత్యం వల్ల గాని , మరే కారణం వల్ల గాని కర్తవ్యాన్ని విస్మరించి, సమయాన్ని వృధా చేస్తూ , నిష్ప్రయోజనంగా జీవితాలను వెళ్లబుచ్చే ఎంతో మందిని ఉలిక్కి పడేలా చేశారు. కొందరిలో మార్పును తీసుకువచ్చి దిశానిర్దేశం కూడా చేశారు.
94 ఏళ్ల వయసులో ప్రతి రోజు 130 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద వయసున్న ప్రొఫెసర్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతున్న వీరి ప్రస్థానం తెలుసుకుందాం.
1929 వ సంవత్సరం మార్చి 8 వ తేదీన , వనజాక్షమ్మ సీతారామయ్య దంపతులకు కృష్ణాజిల్లా లోని మచిలీపట్నంలో జన్మించారు . తండ్రి న్యాయ శాఖలో ఉద్యోగి . శాంతమ్మ గారు ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడు వీరి తండ్రి కాలం చేశారు . తల్లి మాత్రం 104 సంవత్సరంల వయసు వచ్చేంతవరకు జీవించారు.
వీరి విద్యాభ్యాసం మదనపల్లి , రాజమండ్రిలో జరిగింది . విశాఖపట్నం మద్రాసులో భాగంగా ఉన్నప్పుడు ఏ. వీ. ఎం . కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు . తర్వాత బి. ఎస్సి . ఆనర్స్ చేశారు . మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుండి భౌతిక శాస్త్రంలో బంగారు పతకం అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేశారు.
1956వ సంవత్సరంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ సైన్స్ లో భౌతిక శాస్త్ర ఉపన్యాసకురాలిగా పనిచేశారు . ఆ తర్వాత ఉపన్యాసకురాలు స్థాయి నుండి ప్రొఫెసర్ గా , ఇన్వెస్టిగేటర్ గా , రీడర్ గా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో పదవీ విరమణ చేశారు . అయినప్పటికీ బోధన వృత్తి మీద వీరికి ఉన్న తృష్ణ తీరలేదు. అందువల్ల అదే విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యులుగా తిరిగి బాధ్యతలు స్వీకరించి, 6 సంవత్సరములు విధులు నిర్వర్తించారు.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్చార్జిగా కూడా పనిచేశారు.
వృత్తిలో భాగంగా చాలా దేశాలు తిరిగివచ్చారు . యూ. ఎస్ . ,బ్రిటన్, కెనడా ,స్పెయిన్ వంటి పలు దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు.
అటామిక్ స్పెక్ట్రోస్కోపీ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ లకు సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని అందించింది .12 మంది విద్యార్థులు వీరి పర్యవేక్షణలో పీహెచ్.డి.పూర్తి చేశారు.
ఫిజిక్స్ లో జామెంట్రీ ఆప్టిక్స్ , ఫిజికల్ ఆప్టిక్స్ బోధిస్తాననీ, పిల్లలకు పాఠాలు బోధించడం లోనే తన ఆనందమనీ, వయసుతో వచ్చే సమస్యలు తన బోధనాతృష్ణను ఏమాత్రం వెనుకడుగు వేయనీయలేదనీ, తాను ప్రతిరోజు 6 క్లాసులు తీసుకుంటాననీ, తన శిష్యుడే ఇప్పుడు తాను పనిచేసే విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ కావడం చాలా ఆనందాన్ని కలిగించిందని చెబుతారు . తాను తీసుకునే క్లాసులకు విద్యార్థులు ఎవరూ రాకుండా ఉండదనీ, ఆలస్యంగా వెళ్లడం తన నిఘంటువులో లేదనీ, సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులు తీసుకుంటాననీ, జీవితాంతం చదువు చెబుతూనే ఉండాలనేదే తన సంకల్పం అని అంటారు.
వారి భర్త అయిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు ప్రొఫెసర్ కావడంతో ఉపనిషత్తుల గురించి తనకు బోధించేవారనీ, అందువల్ల వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులపై తనకు ఆసక్తి ఏర్పడిందనీ,భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువదించానని చెప్పారు.
‘భగవద్గీత ది డివైన్ డైరెక్ట్ ‘ అనే పుస్తకాన్ని తాను రచించానని చెబుతారు.
తమది ఆర్.ఎస్. ఎస్ నేపథ్యం ఉన్న కుటుంబం అవడం వల్ల ఆస్తిపాస్తులపై తమకు ఎలాంటి మమకారం లేదనీ, ఉన్న ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చేద్దామని తన భర్త అంటే తాను సరేనన్నానని చెబుతారు.
తన భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు సహాయంగా ఒక అబ్బాయి ఉండేవాడని , అతనిని చదివించి , పెళ్లి చేశాననీ,అతనికి ముగ్గురు పిల్లలనీ,ఇప్పుడు వారంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామని చెబుతారు.
కాలం ఎంతో విలువైనదని , దానిని ఎవరూ, ఎప్పుడూ వృధా చేయకూడదనీ,పంచే కొద్ది విజ్ఞానం పెరుగుతుందని , రెండు మోకాళ్ళకు సర్జరీ జరిగి 20 సంవత్సరముల అయినప్పటికీ ,రెండు ఊత కర్రల సాయంతో రోజు 130 కిలోమీటర్లు ప్రయాణించి విధులు నిర్వర్తిస్తున్నానని , ప్రపంచంలో పెద్ద వయసులో ఉన్న ప్రొఫెసర్ తానేననీ,95 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతున్నాననీ చాలా ఆనందంగా చెబుతారు.
జీవితాంతం పిల్లలకు ఇలా పాఠాలు నేర్పుతూ ఉండడం లోనే తనకు ఆనందమని అంటారు . వారి ఉన్నతమైన ఆశయానికి వందనం సమర్పించుకుంటూ , వారి బాటలో నడవడానికి ప్రయత్నిద్దాం.