మన మహిళాస్ఫూర్తి ప్రదాతలు:

సంగెం లక్ష్మీబాయమ్మ

ముద్దబంతిని తలపించే రూపం, నుదుట సింధూరం, తెల్ల ఖద్దరు చీర ,వ్యక్తిత్వమే పెట్టని ఆభరణంగా విరాజిల్లిన పదహారణాల తెలంగాణ ముద్దుబిడ్డ సంగెం లక్ష్మీబాయి గారు. సామ్రాజ్యవాద కబంధ హస్తాల నుండి భరతమాతను విముక్తి చేసే ప్రయత్నంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించారు. ఆ ప్రయత్నంలో మహిళలను ఉత్తేజితులను చేయడంలో సఫలీకృతులయ్యారు. స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలైన వీరు జూలై 27/1911న ఘట్కేసర్ సమీపంలోని ఓ కుగ్రామంలో జన్మించారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి లోక్ సభకు ఎన్నికైన తొలి మహిళ శ్రీమతి సంగెం లక్ష్మీబాయి గారు .వీరి తల్లిదండ్రులు సీతమ్మ రామయ్య గార్లు. జీవిత భాగస్వామి శ్రీ దుర్గాప్రసాద్ గారు. బాల్య వివాహం జరిగిన కొంత కాలానికి తల్లిదండ్రులు, భర్త మరణించడంతో ఈమె అనాథ అయ్యారు.


తెలివైన బాలిక కావడంతో మాడపాటి హనుమంతరావు గారి దృష్టినాకర్షించి వారి ప్రోత్సాహంతో గుంటూరు శారదానికేతన్ లో 1926లో జాయినై హిందీ విద్వాన్ పాసైన తర్వాత ఎనిమిది సంవత్సరాలు అక్కడే ఉండి హిందీలో చాలా డిగ్రీలు సంపాదించారు. 1933లో మద్రాసు వెళ్ళి ఆంధ్ర మహిళా సభలో చదివే అవకాశం దక్కింది. అప్పుడే చిత్రకళలో డిప్లమా చేశారు .ప్రసిద్ధ
‘ కార్వే ‘విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం కూడా వీరిని వరించింది.
విద్యార్థి దశలో ఉన్నప్పుడే 1931లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1932లో శాసనోల్లంఘనలో భాగంగా శాంతియుత సత్యాగ్రహంలో పాల్గొని రాయవెల్లూరు జైల్లో శిక్ష అనుభవించారు. అప్పుడే జైల్లో మహిళా ఖైదీలకు ప్రత్యేక గదులు ఉండాలని ఎలుగెత్తి చాటారు.
1938లో హైదరాబాద్ తిరిగి వచ్చాక నారాయణగూడ లోని రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లో గౌరవ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించి, మరోవైపు స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీల భూమిక పోషిస్తూ మహిళలను అనునిత్యం చైతన్య పరుస్తూ ఉండేవారు. 1947- 48లో విమోచనోద్యమంలో పాల్గొన్నారు. సాయుధపోరాటంలో
రామానంద తీర్థ ఆధ్వర్యంలో సాగుతున్న నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. షోయబుల్లాఖాన్ ను రజాకార్లు చంపినపుడు ఎవరూ చూడడానికి సైతం భయపడగా ఈమె వెళ్ళి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉన్నారు. దేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత ఆమె తన సేవా కార్యక్రమాలను విస్తరించి రాజకీయాల వైపు దృష్టి మరల్చారు.
1950లో ఆచార్య వినోబాభావే భూదాన ఉద్యమం యాత్రలో భాగంగా ప్రభావితమైన వీరు తెలంగాణకు సారథ్యం వహించి, వారి ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి ,ఆ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి స్వయంగా 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాల భూమిని సేకరించారు.
1952 లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ,రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ ఉప మంత్రిగా పదవిని నిర్వర్తించారు. ఆ సమయంలోనే తెలంగాణలో బాలికల కోసం గవర్నమెంట్ స్కూల్లు, కాలేజీలు ఏర్పాటు చేయడంలో కృషి చేశారు. లక్ష్మీబాయమ్మ గారు స్త్రీలు, పిల్లల సంక్షేమానికి అహరహం శ్రమించారు. తన సహచరులైన ఎ. శ్యామలాదేవి, పి. లలితాదేవి, కె.వి.రంగారావు, పాశం పాపయ్య, భోజిరెడ్డి గార్లతో కలిసి స్త్రీ శిశు సంక్షేమానికై ఇందిరా సేవా సదన్ పేరిట సొసైటీని 1952లో స్థాపించారు. సంతోష్ నగర్ చౌరస్తాలోని తన సొంత ఇంటిని సొసైటీకి ఇచ్చారు. మంత్రిగా తన సంపాదన అంతా అనాథలకే వినియోగించేవారు .సేవాసదనానికి వ్యవస్థాపక సభ్యురాలు, కార్యదర్శి మరియు రాధిక మెటర్నటీ హోమ్, వసు శిశువిహార్ ,మాశెట్టి హనుమంతు గుప్తా బాలికోన్నత పాఠశాల స్థాపనల్లో ముఖ్య పాత్రధారి. ఆంధ్రయువతీమండలి అధ్యక్షురాలిగా పని చేశారు. ఆంధ్ర మహిళా సభకు 18 సంవత్సరాలు సభ్యురాలుగా ఉన్నారు. వివిధ సంస్థలకు గౌరవ సభ్యురాలిగా పలు హోదాల్లో కొనసాగారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు.
1957 లో మెదక్ నియోజకవర్గం నుండి రెండవ లోక్సభకు ఎన్నికయ్యారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి లోక్ సభకు ఎన్నికైన తొలి మహిళగా రికార్డు సాధించారు. 14 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యురాలిగా విశేష సేవలు అందించారు .1972లో ఓరియంటల్ ఈవినింగ్ కాలేజీ నడిపి నిరుద్యోగ యువతకు చక్కటి బాటలు చూపారు. స్త్రీ శిశు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సాగిన వీరి విశేష సేవలను తెలుసుకొని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రశంసించి ప్రోత్సహించారట. వీరి ఘనమైన సేవలను గుర్తించి సంతృప్తి చెందిన భారత ప్రభుత్వం’ తామ్ర పత్రం’తో సత్కరించింది.
బాలలు, మహిళాభ్యుదయం అనే సమస్యలపై రేడియోలో, వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలను’ నా అనుభవం’ పేరిట పుస్తకంగా వెలువరించారు .పిల్లలు, స్త్రీలకు ఉచిత భోజనవసతి కల్పించి, చేతివృత్తులలో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించి ,తమ సేవా కార్యక్రమాలతో చెరగని ముద్ర వేశారు .
రాజ్యపాలన సురక్షితమైనప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని, స్వాతంత్ర్యానంతరం నాయకులు, ప్రజల్లో స్వార్థ చింతన చేరి సొంత లాభాలే ధ్యేయంగా ఉన్నారని, హక్కుల కోసం పోరాడటమే తప్ప బాధ్యతలు పట్టడం లేదని అందుకే స్వాతంత్రం వచ్చినా తనకు ఆనందంగా లేదని ఆమె ఒక సందర్భంలో వాపోయారు. ప్రతిక్షణం స్త్రీ ,శిశు సంక్షేమమే ఆశయంగా పని చేసిన స్వాతంత్ర్య సమరయోధురాలైన వీరు జూన్ 2,1979 న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

2002 లో ఇందిరా సేవాసదన్ ను ‘సంగెం లక్ష్మీబాయమ్మ విద్యపీఠం’గా మార్చారు. ఇందులో మహిళల కోసం పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ,ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసి కాలేజీలు ఏర్పాటు చేసారు.
ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తమ సేవా కార్యక్రమాలతో జీవితాన్ని స్త్రీ శిశు సంక్షేమం కోసం అంకితం చేసి చెరగని ముద్ర వేసిన ఈ అవిశ్రాంత యోధురాలు ‘హైదరాబాదీల ఆత్మబంధువు’గా చరిత్ర పుటలో శాశ్వత స్థానం పొందారు. వీరిని ఎంత శ్లాఘించినా తక్కువే. ఇంత మహోన్నత వ్యక్తిత్వం గల ఈ స్త్రీ మూర్తికి ఇవ్వగల సరైన నివాళి అక్షర నీరాజనం మాత్రమే.

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

అలుపెరుగని బాటసారి – చిలుకూరి శాంతమ్మ