మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన పూర్వీకులు ఆచరించిన విధి విధానాలనే మనం ఇప్పటికీ వారసత్వంగా స్వీకరిస్తూ వస్తున్నాం. వస్త్రధారణ నుంచి తినే తిండి, చేసే పని ప్రతి ఒక్కటి మన సంస్కృతిలో భాగమే. జీవితంలో జరుపుకునే ముఖ్యమైన ఘట్టాలలో పెళ్లి ఒకటి. “పెళ్లి” ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం మాత్రమే కాదు, ఇరు కుటుంబాల కలయిక కూడా. వేదాలలో, పురాణాలలో ఈ పెళ్లి తంతు గురించి గొప్పగా వివరించారు మన ఋషులు, మునులు.
అయితే పంచభూతాలను సాక్షులుగా పరిగణించి, పత్రికలను పంచి, అతిథులను ఆహ్వానించి, మేళతాళాల, మంగళ వాయిద్యాల వేదమంత్రాల నడుమ, పెళ్లి అనే కార్యాన్ని ఘనంగా జరుపుకుంటాం. అక్షింతల ఆశీర్వాదాలను అందుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం.
ఎంత అందంగా వుంటుందో కదా ఈ అనుభవం ? మునుపటి రోజుల్లో ఎదిగిన ఆడపిల్లలకు పెళ్లి కాకపోతే ఎంతో ఆవేదనకు గురయ్యే వాళ్లు తల్లిదండ్రులు. అయితే రోజులు మారాయి విద్యకు ప్రాముఖ్యత పెరిగాక జ్ఞానంతో పాటు, ఒకరిపై ఆధారపడకుండా ఎవరికివారు జీవించేలా ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. కొద్దో గొప్పో చదువుతో, ఉద్యోగం చేస్తూ తోడు లేకపోయినా ఒంటరిగా జీవించగలమన్న నమ్మకం వచ్చేసింది. పెద్దరికాన్ని పక్కనపెట్టి పిల్లల ఇష్టాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులు కూడా వచ్చేశాయి.
అయితే అన్నీ సవ్యంగా ఉన్నాయి కదా సమస్య ఎక్కడనుకుంటున్నారా? ఆలోచనలలో, అభిప్రాయాలలో….
నిజమండీ!!! ముఖ్యంగా చెప్పాలంటే నేటి తరం యువతులలో. సమాజంలో ఆడపిల్లలపై జరిగే అనేక రకాలైన సంఘటనలు కావచ్చు, వరకట్నల వేధింపులు కావచ్చు కారణం ఏదైనా నేటి తరాలకు ఈ పెళ్లి పైన ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడింది. నేటి యువతరం ముఖ్యంగా ఆడపిల్లలు “ఇండిపెండెంట్ లైఫ్” ( independent life) ను అనుసరించడానికే ఇష్టపడుతున్నారు. “సోలో లైఫ్ సో బెటర్” అంటూ పెళ్లికి టాటా, బై బై లు చెప్పేస్తున్నారు.
ఒక గోష్ఠిని వివరిస్తూ, వాస్తవాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. మీరూ ఆలోచించండి???
మొన్న నేను, నా స్నేహితురాండ్రలతో కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మాటల్లో పెళ్లి అనే ప్రస్తావన వచ్చింది. ఇక ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఒక అమ్మాయి రేపటి రోజును ఎవరు చూస్తాం ఎలా రాసుంటే అలా జరుగుతుంది అంటూ లేచి వెళ్లిపోతే, మరొక యువతి భారీగా ఖర్చుపెట్టి, కోట్లు కోట్లు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకున్న వారి పరిస్థితిని రోజూ పేపర్లో, వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా అని ముగించముందే, పెళ్లి తర్వాత తల్లిదండ్రులను చూడాలన్న పర్మిషన్ తీసుకోవాలి, మన కోరికలను, కలలను చంపుకుని జీవచ్ఛవాలలా బతకాల్సిందే అంది మరో యువతి, వెంటనే ఇంకో అమ్మాయి ఒకవేళ వచ్చిన అబ్బాయి మంచివాడే అయినా వాళ్ళ అమ్మని, చుట్టాలను కాదని మన మాటేమీ వినడుగా అనగానే,
పెళ్లి చేసుకుంటే పూర్తిగా స్వేచ్ఛను కోల్పోవడం మాత్రం ఖాయమంటూ మరొక అమ్మాయి దాన్ని సమర్ధించింది. ఇంకో అమ్మాయి అందరికీ ఇలాగే జరగాలని వుందా? ఎక్కడో ఏదో జరిగిందని మనకు కూడా ఇలానే జరుగుతుందని అనుకోవడం తప్పు అంటూ చెప్పగానే, కట్నాల కోసం గొంతు నులిమి చంపిన సంఘటనలు వాస్తవాలు కావా అంటూ ప్రశ్నించింది కోపంగా మరో యువతి.
కూల్ కూల్ అంటూ సర్ధి చెప్పినా ఆడపిల్ల పుట్టిందని వేధించే అత్తమామలు, అనుమానంతో నిత్యం నరకాన్ని చూపించి చిత్రహింసలకు గురి చేసే భర్తలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఇలా ఆడుగడుగునా ఆడపిల్లలకు జరుగుతున్న విషయాలన్ని చాలా సేపు చర్చించుకున్న తర్వాత
నిరాశ నిస్పృహలతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
నిజానికి వీరు మాట్లాడిన దానిలో వాస్తవాలు లేవని కొట్టి పడేయలేము. ఎందుకంటే పరిస్థితులను బట్టి, పరిసరాలను బట్టి అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. నేటి తరం ఆలోచనలు ఆందోళనకరంగానే ఉన్నా… వారి అభిప్రాయాలను
బలపరిచేలా రోజూ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చట్టాలను బలపరచి, తక్షణ కర్తవ్యంగా తగిన చర్యలు తీసుకోకపోతే ఈ అభిప్రాయాలు మరింత బలపడి కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావచ్చు. కనుక
పెద్దలు కూడా పిల్లల మనస్తత్వాలను గమనిస్తూ వారికి పెళ్లి విశిష్టతను గురించి వంశాభివృద్ధి గురించి అర్థమయ్యేలా చెప్పాలి. కలివిడిగా ఉండడంతో పాటు కుటుంబ వ్యవస్థలో ఉన్న ఆప్యాయతలను, అనురాగాలను వివరించి వారిలో మార్పు తెచ్చేలా ప్రయత్నించాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థను కాపాడగలిగిన వారమవు తాము. చూద్దాం దీని పరిణామం ఎంతవరకు దారితీస్తుందో?