చిన్నారి స్వగతం

లక్ష్మిమదన్

ఒక పెద్ద మేడలో తల్లి దండ్రుల తో పాటు నివసించే ఒక చిన్నారి కథ. తాను మేడ పైన గదిలో కిటికీ పక్కన కూర్చుని బయట తోటలో కి చూస్తుంది…మరో వైపు వీధి రోడ్డు కనపడుతుంది. ఇంతలో రోడ్డుకి కి కాస్తా దూరంగా కొన్ని ఎద్దుల బండ్లు ఆగాయి. అందులో నుండి బిల బిల మంటూ జనం దిగి కర్రల తో గుడిసెలు వేశారు క్షణాల్లో….ఉన్న నాలుగు గిన్నెలు చాపలు వేసుకునే బట్టలు గుడిసెల్లో పెట్టుకున్నారు . ఆడ వాళ్ళు పిల్లలు అక్కడే రాళ్ళు పెట్టీ పొయ్యి వంట సామాను పెట్టుకున్నారు. పిల్లలు అక్కడే మట్టిలో కూర్చుని సంబరంగా ఆడుకుంటున్నారు. ఆడవాళ్ళు లేచి గిన్నెలు తీసుకుని పసుపు పచ్చని పిండి( మొక్క జొన్న) కలిపి ..పొయ్యిలో కట్టెల మంట పెట్టీ రొట్టెలు చేత్తో గబ గబ కాల్చి…చిన్న రాతెండి కంచాల్లో పెట్టీ…ఉల్లి గడ్డ కారం వేసి ఇస్తున్నారు…వాళ్ళు ఇష్టంగా తినేస్తున్నారు..చిన్న ముక్క కూడా వదల కుండా తినేసి కుండలో నీళ్ళు తాగి అక్కడే పరచిన పాత జంపు కాన పై పడుకున్నారు. ఆ తర్వాత పెద్ద వాళ్ళు పొయ్యి చుట్టూ కూర్చొని రొట్టెలు తినేసి… సామనంత కడిగి అక్కడే వాళ్ళు పడుకున్నారు. ఇదంతా చూస్తున్న చిన్నారి సమయం చూసింది…8 దాటింది..ఇంకా తల్లి దండ్రులు రాలేదు…పని వాళ్ళు వచ్చి భోజనం చేయమని అడిగారు…కానీ చిన్నారికి తిన బుద్ధి కాలేదు…మాటి మాటికి గుడిసెలో వాళ్ళే గుర్తొస్తున్నారు…ఎంత హాయిగా పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న తో ఉన్నారు..స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు….ఆకలేస్తే తింటున్నారు…అందరూ కలిసి పడుకున్నారు. కానీ ఇంత పెద్ద ఇల్లు నౌకర్లు ఉన్నా ఒంటరితనమే అనిపిస్తుంది. రెండు రోజుల్లో పుట్టిన రోజు వస్తుంది…బట్టలు కొందామని ఒక ఖరీదైన షోరూం కి తీసుకెళతారు తల్లి దండ్రులు. ఒక ఖరీదైన డ్రెస్ కొంటారు ..కానీ నా మనసుకి ఏమి నచ్చుతుందో అడగరు… ఆ ఖరీదైన బట్టలు వేసుకున్నప్పటి నుండి అమ్మ ” డ్రెస్ జాగ్రత్త…మరకలు పడతాయి ” అని హెచ్చరిస్తూ ఉంటుంది….అందుకే నాకు మామూలు నూలు గౌను వేసుకుని స్వేచ్ఛగా ఆ డుకోవాలి అని ఉంటుంది.. ఇసకలో గూళ్ళు కట్టాలని…పిల్లలతో కలిసి ఆ డుకోవాలని..మామిడి పళ్ళు రసంవి తినాలని..అవి బట్టల పైన పడ్డ ఏం కాదు కదా…అన్నం చేత్తో కలుపుకుని తినాలని ఇలా ఎన్నెన్నో ఉన్నాయి చిన్న కోరికలు..కానీ అమ్మ అన్ని చెంచా తో తినాలి అంటుంది…పండ్లు కోసి ఇస్తే ఫోర్క్ తో తినాలి…బట్టలు నలగ కుండా కూర్చోవాలి..మట్టి ముట్టుకో కూడదు..ఇలా చిన్నారి ఆలోచిస్తూ ఉండగా తల్లి దండ్రులు వచ్చారు” ఎన్టీ పాపా డిన్నర్ చేయ లేదట..ఒంట్లో బాగా లేదా..డాక్టర్ కి ఫోన్ చేయనా ” అని అడిగారు ముక్త కంఠంతో. వద్దు అన్నట్లు గా తలూపింది..రాత్రి పిల్లల బెడ్ రూం లో పడుకోవాలి అట…గుడిసెలో పిల్లలు వాళ్ళ అమ్మ పై చెయ్యి వేసి నిశ్చింతగా పడుకున్నారు…ఇక తప్పదు అని రెండు ముద్దలు వెండి కంచం లో తిని పడుకోవడానికి వెళ్ళ బోతు ” మమ్మీ! ఒక మాట అడగనా!” అన్నది…”” అడుగు ” పాపా అన్నది తల్లి. నిన్ను నేను అమ్మ అని డాడీ నీ నాన్న అని పిలుస్తాను అన్నది. అదేంటి కొత్తగా అన్నది వాళ్ళ అమ్మ. వెంటనే సరే అన్నది…మరొకటి అడుగుతా…నేను మీ ఇద్దరి దగ్గర పడుకుంటా అన్నది.అయోమయంగా చూసింది తల్లి…ఇలా చేస్తుంది ఎందుకు పాప అని ఆలోచించి సరే ! రా అని గదిలో మంచం పై పడుకోపెట్టింది. అప్పుడు పాప నా పుట్టిన రోజుకి నాకు ఒక బహుమతి కావాలి అని అడిగింది…ఏం కావాలి తల్లి..బట్టలా…చాక్లెట్స్ కావాలా కొత్త కార్ కొందామా! అని అడిగారు …ఏమి వద్దమ్మ! అని తనకు ఎలా ఉండాలని కోర్కె గా ఉందో ఏడుస్తూ చెప్పింది…అప్పుడు తల్లి దండ్రులు ఇద్దరు ఆశ్చర్య పోయారు….కాసేపటి తర్వాత తేరుకుని వాళ్ళు ఏమి తప్పు చేస్తున్నారో తెలుసుకుని… ఈ సారి నీకు నచ్చిందే చేస్తాం చిట్టి తల్లి అని చెప్పారు…చిన్నారి కి చెప్పలేని సంతోషం వేసింది..ఎప్పుడు తెల్ల వారితుందా! ఎప్పుడు గుడిసెలో పిల్లల తో ఆడుదామా! అని ఎదురు చూస్తూ కమ్మగా నిదుర పోయింది.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రేమలు—- పెళ్లిళ్లు

సోలో లైఫ్ సో బెటర్ ???