ప్రేమలు—- పెళ్లిళ్లు

కామేశ్వరి

వివాహం అనేది జీవితంలో ఆచితూచి, అవగాహనతో వేసే బాధ్యతాయుతమైన, ఒక ముఖ్యమైన, ముందడుగు. వివాహం యొక్క విజయం అది ప్రేమ వివాహ…లేక పెద్దలు కుదిర్చిన వివాహమా… అనేదానికంటే అమ్మాయి అబ్బాయిల దృక్పథం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. నేటి యువత విద్యావంతులై, సంపాదనపరులై బయట ప్రపంచంలోకి వచ్చి స్వేచ్ఛను పొందుతున్నారు. అలాగే వయస్సు రీత్యా శరీరంలో వచ్చే మార్పులతో, ఆపోజిట్ జెండర్ తో స్నేహ సంబంధాలు పెంచుకుని పెళ్లి వరకు లాక్కొస్తున్నారు. పైగా ఎక్క డో తెలియని వారితో ఎలా వివాహం చేసుకుంటాము, వాళ్లతో కొన్నాళ్లు డేటింగ్ చేసి, వాళ్ల గురించి బాగా తెలుసుకొని, వివాహం చేసుకుంటే మంచిది అనే నేటి యువత ఆలోచిస్తున్నారు
కానీ ఒకప్పుడు వివాహాలు తమ కుల, జాతి, మతాల ప్రాధాన్యత మీద పెద్దలు కుదిరిచేవారు. మొదట్లో ప్రేమ వివాహాలు ఆమోదయోగ్యమైన వర్గాల మధ్య మాత్రమే జరిగేవి. ఇప్పుడు జాతి, మత,కుల, సమాజ పరమైన అడ్డంకులను అధిగమించింది.
మన పురాణ కాలాల్లో కూడా చాలా ప్రేమ వివాహాలు జరిగాయి. రుక్మిణి శ్రీకృష్ణుల వివాహం, నలదమయంతుల వివాహం, శకుంతలా దుష్యంతుల వివాహం, భీముడు హిడింబి ల వివాహం, శంతనుడు సత్యవంతుల వివాహం ఇలా చాలానే జరిగాయి. కానీ వాటికి పెద్దల సమ్మతం కూడా లభించింది.
కానీ నేటి సమాజంలో కుల, మత, భేదం లేకుండా ప్రేమ వివాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయని నానుడి ఉంది. కానీ అది పూర్తిగా సరికాదు. పెద్దల చేసిన పెళ్లిళ్లలో కూడా మాట పట్టింపులు, వరకట్న వేధింపులు జరిగి దాని పర్యవసానంగా విడాకుల వరకు వెళుతున్నాయి. కానీ చాలా కుటుంబాలలో అమ్మాయిని సర్దుకు పొమ్మని, నీ కడుపున ఒక కాయ కాస్తే అన్ని అవే సర్దుకుంటాయని చెబుతారు. ఇదే సమస్య ఒక ప్రేమ వివాహంలో వస్తే ఇలాంటి బాధ్యత చొరవ ఎవరు తీసుకోరు. కారణం ఇది పెద్దలు ఎంచినది కాదు కనక. ఇరువురి తల్లితండ్రులను ఒప్పించకుండా చేసుకోవటం మంచిది కాదు. ఎందుకంటే స్వార్థం లేకుండా ప్రేమించేది వాళ్లు మాత్రమే. ప్రేమలో ఉన్నప్పుడు ప్రేయసి గాని ప్రియుడు గానీ వారు ఏది అడిగినా కాదటకుండా చేయడం, ఏదో విధంగా అవతలి వారిని మెప్పించి దక్కించుకోవాలనే ఆరాటం కనిపిస్తుంది. కానీ పెళ్లయిన తర్వాత ఇవన్నీ అనుకున్నట్టుగా ఉండవు. ప్రేమలో ఉన్నప్పుడు డీసెంట్ గా ఉన్నవారు పెళ్లయిన తర్వాత వాళ్ల అసలు బిహేవియర్ బయట పెడతారు. అప్పుడు అవన్నీ తట్టుకోవాల్సిన బాధ్యత వారి ఇరువురు దే కానీ తల్లిదండ్రులది కాదు
అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ల ఇళ్లల్లో ఉండే వ్యక్తుల ఇష్టా ఇష్టాలు, గుణదోషాలతో వారిని స్వీకరించి ప్రేమిస్తారో అలాగే పెళ్లయిన తర్వాత అత్తింటి వారిని, వారి బంధువులను స్వీకరించే దృక్పథం అలవర్చుకోవాలి.”.స్వీకరణ ” అనే మనస్తత్వం లేకపోవటం వలన ప్రేమ వివాహాలు విఫలమవుతున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళు ” ఒక అడల్ట్ గా ఒక రిలేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం “అని తెలుసుకోవాలి. పెళ్లికి ముందు అబద్దాలు చెప్పి మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త.
ఈ ప్రేమలు 30, 40 ఏళ్ల క్రితం ప్రేమలేఖలు ద్వారా వెల్లడించబడేది. ఫోన్లు అంతగా లేని కాలమది. ఉంటే ఇంట్లో ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది. దాని ద్వారా ప్రేయసి ప్రియసులు అంతగా మాట్లాడుకోవడం కుదిరేది కాదు. ఎక్కడో పార్కుల్లో కలవడమో, జనసంచారం ఎక్కువగా లేని చోట కలవడం జరిగేది. తర్వాత చిన్న సెల్ ఫోన్లు వచ్చాయి. వాటి ద్వారా చాటింగ్ చేసుకునేవారు. ఇప్పుడు” షైనీ టాయ్ “లాంటి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, వీడియోకాల్స్ చేసుకోవడం ద్వారా వారిలో సాహిత్యం పెరగడానికి దోహదమైంది. తెర వెనక స్నేహం ఒక్కొక్కసారి ద్రోహాలకు కూడా తలపెడుతుంది. ప్రేమికుల ఇద్దరూ కలుసుకున్న రహస్య కలయికులను ఇతరుల ద్వారా వీడియో తీయించి బ్లాక్మెయిల్ బాగా చేస్తున్నారు. డబ్బు కోసమో, లేకపోతే ఆ వీడియోలను బయట పెడతామనో భయపెడుతున్నారు. ఇలా మోసపోయిన వారు, చాలామంది తల్లితండ్రులకు, సమాజానికి….మొహం చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ధైర్యంతో లేచిపోతున్నారు. కొన్నిసార్లు మోసగించిన ప్రియుడిచే వేశ్య గృహాలకు అమ్మబడుతున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు ఫోన్లోనే ఇమిడిపోవడంతో మోసం చేసేవారి పని సులువుతోంది. ఇలాంటివన్నీ మాధ్యమాల ద్వారా మనం వింటూనే ఉన్నాం. అందుకే “” స్వీయ రక్షణే “” శ్రీరామరక్ష నేటి యువతీ యువకులకు. పెద్దలు కూడా యవ్వనంలో పిల్లలలో వచ్చే బైలాజిక మార్పులను గురించి విశుదీకరించడం కూడా మంచిది .
మన బంధువుల్లో కూడా ఈ పెళ్లిళ్లు సహజమైపోయాయి. మనం అటెండ్ అవుతున్నాం కూడా. వాళ్లలో చాలామంది చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు. దాన్ని కూడా కాదనలేము. కొన్ని కొన్ని”ఈగోల”కి పోయి నాశనం అవుతున్నాయి. ఇదంతా వాళ్ళ తలరాతలు అనుకుందామా కర్మ సిద్ధాంతంతో, లేక సమాజం పురోగమిస్తోంది ఎల్లలు చెరుపుకుని అని అంగీకరిద్దామా. ఏది ఏమైనా మరో సృష్టికి వారు శ్రీకారం చుట్టి జీవితాలను సుఖమయం చేసుకోవాలని కోరుదాం.
* సర్వేషాం సుస్థిర భవతు *

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

క్షమయా ధరిత్రి.

చిన్నారి స్వగతం