మేడమ్ గారు నమస్సుమాంజలులు….విదేశాల్లో ఉండి కూడా తెలుగు భాషపై మక్కువతో సాహితీసేవ చేస్తున్న మిమ్మల్ని మా పాఠకులకు పరిచయం చేయాలనే ఆసక్తితో మీ ముందుకు వచ్చాము.
1. మీ జననం, విద్యాభ్యాసాల గురించి మాకు వివరంగా చెప్పండి.
జ: నేను హైదరాబాద్ లో నవంబర్ 20, 1967న జన్మించాను. మా అమ్మ సుశీలాదేవి గారు, మా నాన్న బాల కృష్ణమాచారి గారు. అమ్మానాన్నలిద్దరూ విద్యాశాఖకు చెందినవారు. మా అమ్మ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. మా నాన్నగారు టీచరుగా రిటైర్ అయ్యారు. నేను చిన్నప్పుడు తెలుగుమీడియంలో చదివాను. “ఆంధ్రమహిళాసభ” స్కూల్లో పదవతరగతి వరకు చదివాను. ఇంటర్మీడియట్, డిగ్రీ రెడ్డి ఉమెన్స్ కాలేజీ నారాయణగూడలో చదివా. ఎమ్మెస్సీ, ఎంఫిల్ మాథమాటిక్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాను. ఇప్పుడు నిమ్స్ యూనివర్సిటీ నుండి పిహెచ్ డి మాథమాటిక్స్ లో చేయాలనుకుంటున్నా.
2. సైన్స్ సబ్జెక్టుల ప్రాధాన్యతగా పీజీ, ఎంఫిల్ చేసిన మీకు తెలుగు భాష పట్ల మక్కువ ఎలా కలిగింది?
జ: నేను చిన్నప్పడు తెలుగు మీడియంలో చదవడంతో తెలుగంటే చాలా ఇష్టం ఉండేది. సాహిత్యం పై మక్కువ ఎక్కువ ఉండేది. హిందీలో కూడా బాగా చదివేదాన్ని. పదవతరగతిలో హిందీలో కూడా గోల్డెమెడల్ వచ్చింది. అలాగే స్కూల్ 1st వచ్చినందుకు కూడా గోల్డ్ మెడల్ పొందాను. ఇంటర్, డిగ్రీల్లో సంస్కృతభాషను తీసుకున్నాను. దాంతో అన్నిభాషల పట్ల ఆసక్తిని, ప్రావీణ్యతను సంపాదించుకున్నాను. ఇంటర్, డిగ్రీల్లో సంస్కృతంలో గోల్డెమెడల్స్, స్కాలర్ షిప్స్, అవార్డులు పొందాను. డిగ్రీలో కూడా కాలేజ్ 1st వచ్చాను. MSC లో యూనివర్సిటీ ఆనర్స్ లభించింది. Mphil part 1 లో యూనివర్సిటీ 1st వచ్చాను. హైదరాబాద్ లో పుట్టడం, తెలుగుమీడియంలో చదవడం నాకు తెలుగు పట్ల ఆసక్తిని కలిగేలా చేసాయి. విద్యారత్న వరకు ధార్మిక పరీక్షలు కూడా ఇచ్చాను. సంస్కృతంలో కోవిద్ డిప్లొమా వరకు చేసాను.
3. మీరు హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలు నేర్చుకోవడానికి ప్రేరణ ఎవరైనా ఉన్నారా? మీకు వాటిపట్ల ఉన్న ఆసక్తి కారణమా?
జ: మా నాన్నగారికి, మా అమ్మగారికి మొదటినుంచీ సంగీతం అంటే చాలా ఇష్టం. మా నాన్నగారే నాకు మొదటి గురువు అని చెప్పొచ్చు. మా అమ్మగారు కూడా సితార్ వాయించేవారు. మొట్టమొదటగా హార్మోనియం నేర్చుకొని, సంగీతం నేర్చుకున్నది మా నాన్నగారి వద్దనే. దాని తర్వాత త్యాగరాయ మ్యూజిక్ స్కూల్లో కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాను. తర్వాత ‘మహారాష్ట్ర మండల్ ‘ అని హైదరాబాద్ లోని సంస్థలో హిందూస్తానీ సంగీతాన్ని మధ్యమ, ప్రథమ వరకు నేర్చుకున్నాను. మా అక్కయ్య కూడా సితార్ వాయించేది. అందువల్ల సితార్ మీద అభిరుచి ఏర్పడింది. సితార్ లో కూడా డిప్లొమా చేశాను. సితార్ మరియు కర్ణాటక సంగీతాల్లో సర్టిఫికెట్ లో ఆనర్స్ వచ్చింది.
4. మీకు సంగీత శిక్షణ ఇచ్చిన గురువులెవరు?
జ: ముందు చెప్పాను కదా మా నాన్నగారు మొదటి గురువుని. నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నది మొదటగా సంగీత కళాశాలలో..ఆ తర్వాత కొంతకాలం మహా మహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ గారి వద్ద. మహారాష్ట్ర మండల్ లో మిస్టర్ కరాడే గారివద్ద హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నా. ఇక సితార్ విషయానికి వస్తే కొంత సొంతంగా నేర్చుకుంటే, త్యాగరాయ కళాశాలలో మిస్టర్ రవిశంకర్ గారని ఆయన దగ్గర నేర్చుకున్నా.
5. మహా మహోపాధ్యాయ, పద్మభూషణ్ నూకల చిన సత్యనారాయణ గారివద్ద మీరు సంగీతం నేర్చుకోవడం గొప్ప విషయం. ఆయన సంగీత శిక్షణ ఎలా ఉండేది. మీపై ఆయన ప్రభావం ఎలా ఉంది?
జ: నిజంగా చాలా గర్వించదగ్గ విషయమండీ. ఆయన మంచి క్రమశిక్షణతో మాకు శిక్షణ ఇచ్చారు. ఆయన చెప్తున్నప్పుడు వినడం, నేర్చుకోవడం గొప్ప అనుభూతి.
గమకాలు నేర్పించేటప్పుడు ఆయన చాలా సునిశితంగా నేర్పించేవారు. సాహిత్యం అర్థం చేసుకుంటూ పాడాలనేవారు. సంగీతమనేది సాహిత్యం అర్థాన్ని తెలుసుకున్నప్పుడే రసాస్వాదనకు వీలుగా ఉంటుందని, అప్పుడే సంగీతం రక్తి కడుతుందని ఆయన చెప్పేవారు. అర్థం తెలుసుకున్నప్పుడు గొంతు ఆ భావాలను స్పష్టంగా పలికించగలదని చెప్పేవారు. అందుకే నేను కూడా సాహిత్యార్థాన్ని దృష్టిలో పెట్టుకొని గానం చేస్తాను. ఆయనతో శిష్యరికం చేసిన కొద్దికాలం జీవితానికి మధురానుభూతి.
6. విభిన్నమైన రెండు సంగీత రీతులను నేర్చుకోవడం కష్టసాధ్యం అనిపించలేదా?
జ: కర్ణాటక సంగీతం నేర్చుకునే దాంట్లో ఎక్కువ గమకాలు ఉంటాయి. అవి బాగా అలవాటు కావడం వల్ల హిందూస్తానీ నేర్చుకోవడం కొంచెం సులువుగా అనిపించింది. కష్ట సాధ్యం అని అయితే అనిపించలేదు. ముఖ్యంగా కర్ణాటక సంగీతం నేర్చుకున్న వెంటనే నేను సితార్ నేర్చుకోవడం వల్ల చాలా రాగాలు తెలుసుకున్నా. ఆ తర్వాత హిందూస్తానీ సంగీతం నేర్చుకోవడం చాలా తేలికగా అనిపించింది.
7. ఆ రెంటిలో మీరు దేన్ని ఎక్కువ ఇష్టపడతారు? ఎందుకు?
జ: రెండింటిలో ఏది ఇష్టపడతానంటే చెప్పడం కష్టమండీ.. ఎందుకంటే దేని ప్రాధాన్యత, ప్రత్యేకత, విలువ, స్థానం వాటి వాటికి ఉంటాయి. నేను హైదరాబాద్ సౌత్ ఇండియా నుండి వచ్చాను కాబట్టి తెలుగు భాషపై మక్కువ ఎక్కువ ఉండడంవల్ల త్యాగరాజ కృతులు ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లో ఉండడం మూలంగా నాకు ఎక్కువ కర్ణాటక సంగీతం మీద ఇష్టం ఏర్పడింది. అదీకాక హిందూస్తానీ సంగీతం కూడా చాలా ఇష్టం. దాంట్లో మంచి భావం, రాగం ఉండడం వల్ల అది కూడా అంతే ఇష్టం. సితార్ లో మనకు సాహిత్యప్రధానం ఉండదు కదా! అక్కడ రాగానికే ప్రాధాన్యత. భక్తి రస ప్రధాన కీర్తనలు, భజనలు అంటే చాలా ఇష్టం.
8. కచేరీలు ఏమైనా చేసారా? ప్రస్తుతం మీరు నేర్చుకున్నా సంగీత అనుభవాన్ని బట్టి నూతన ప్రయోగాలు చేయాలనే ఆలోచన ఉందా?
జ: ఇండియాలో వున్నప్పుడు హిందూస్తానీ, కర్ణాటక సంగీతాల్లో కచేరీలు ఇచ్చాను. కానీ ఎక్కువగా కర్ణాటక సంగీతంలోనే ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఆకాశవాణిలో ‘యువవాణి’ అనే కార్యక్రమంలో నెలకు ఒక ప్రోగ్రాం అయినా ఇచ్చేదాన్ని. అమెరికాలో రెండేళ్లు వున్నాను. అప్పుడక్కడ ఒకటి, రెండు కచేరీలు చేసాను. కెనడాలో కూడా ప్రోగ్రామ్స్ చేసాను. ఇప్పడు కూడా చేస్తూనే వున్నా.. సితార్ లో కూడా చాలా ప్రాక్టీస్ చేసి కెనడాలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. తోటి వాయిద్యాలతో పాటుగా చేయడమే కాక సోలో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. కెనడా డే, మదర్స్ డేలు జరిగినప్పుడు, ఇంకా ఇతర ఫంక్షన్స్ జరిగినప్పుడు సితార్ కచేరీ ఇచ్చేదాన్ని. ఇండియా లో ఉన్నప్పుడు కేరళలో టెలిఫోన్స్ లో వర్క్ చేశాను. అక్కడ ఇంటర్ డిపార్టుమెంట్స్ కాంపిటేషన్స్ అయ్యేవి. అందులో కూడా పాల్గొన్నాను. సితార్ లో, కర్ణాటక సంగీతంలో ఆల్ ఇండియా లెవెల్లో రెండుసార్లు 1st ప్రైజెస్ వచ్చాయి. హిందూస్తానీ, కర్ణాటక సంగీతాల్లో స్టేట్ లెవెల్ ప్రైజెస్ పొందాను. వరుసగా మూడేళ్లు సితార్ లో మొమెంటోలు వచ్చాయి. అలాగే 5వ సంవత్సరంలో ప్రైజెస్ వచ్చాయి.
అవునండీ.. ఏదైనా చేయాలనే ఆసక్తితో కొత్త ప్రయోగంగా మంత్రాలు, శ్లోకాలు సితార్ లో వాయిస్తున్నా. దీనిలో ఇంకా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నా.
9. మీరు రచించిన ‘ రాగ మాధుర్యం’ గురించి చెప్పండి.
జ: కెనడా, అమెరికా సంయుక్తంగా నిర్వహించే తెలుగు సభల్లో ‘రాగమాధుర్యం’ అనే కవితను రాశాను. అది ఎంతోమంది ప్రశంసలను అందుకున్నది. అదే కాకుండా “శ్రీనీతి శతకం” అనే పేరుతో 100 ఆశు పద్యాలను రాశాను. అది ఇంకా పుస్తకరూపం లోకి రాలేదు. పిల్లలకు సంబంధించిన నీతికథలు, చందమామ కథలు రాస్తున్నా. ‘తెలుగుతల్లి కెనడా’లో కూడా ఇవి ఎన్నో కథలు ప్రచురితమయ్యాయి. ‘తెలుగు తల్లి’ కెనడాలో ఒక పుస్తకం తీశారు. దాంట్లో కూడా నా కథను ప్రచురించారు. యూట్యూబ్ లో కూడా ఆడియో రూపంలో పెట్టాలనుకుంటున్నా. ఒక కథను పెట్టాను కూడా.
10. తెలంగాణ పురిటిబిడ్డ అయిన మీరు కెనడాలో నివాసం ఏర్పరచుకున్న ప్రస్థాన నేపథ్యాన్ని , మీ కుటుంబ వివరాలు చెప్పండి.
జ: దానికి కారణం నా ఉద్యోగమే. నేను సాఫ్టువేర్ ఇంజనీర్ గా మొదట అమెరికా వచ్చాను. ఆ తర్వాత కెనడా.. ఇప్పుడు అదే వృత్తిలో కొనసాగుతున్నా. మేము మిస్ సాగాలో వుంటున్నాము. మావారు కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
11. కెనడాలో కథల పోటీలో బహుమతులు గెలుచుకున్నారు కదా! అక్కడ నిర్వహించే తెలుగు భాషా సదస్సులు, పోటీల గురించి వివరంగా తెలపండి.
జ : ఇక్కడ ‘మనబడి’ అనే పేరుతో తెలుగు భాషాకృషి జరుగుతున్నది. ముఖ్యంగా తెలుగు తల్లి కెనడా, తెలుగు వాహిని కెనడా అనే సంస్థలున్నాయి. వాటిల్లో నేను పాల్గొంటుంటాను. కెనడా డే, మదర్స్ డే సందర్భంగా పోటీలు జరుగుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పోటీలు ఉంటాయి. సిరిమల్లె అనే ఒక పత్రికను అమెరికా వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో కూడా నేను కథలు రాస్తుంటా. గ్రేటర్ శాక్రమెంటో తెలుగు సంఘం అని ఒకటి ఉంది. వారికి సంబంధించిన తెలుగు పత్రికలో కూడా నేను కథలు రాశాను. చిట్టెం రాజు గారి ఆధ్వర్యంలో కూడా తెలుగు సభలు నిర్వహింప బడతాయి. అందులో ముఖ్యంగా నేను కొన్ని కవితలను రాశాను.
12. మీ అనుభవాల్ని బట్టి మన భాష పట్ల విదేశాల వారికి ఆదరణ ఉందని మీరు భావిస్తున్నారా?
జ: కచ్చితంగా ఆదరణ బాగానే ఉందండీ. ఇందాక చెప్పినట్లు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. దానివల్ల తెలుగు భాష పట్ల అవగాహన పెరిగింది. తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పిల్లలు ‘మనబడి’ లాంటి సంస్థలు, తెనుగు సభలు నిర్వహించే ఎన్నో పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాబోయే తరాలవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నా.
13. మాకోసం మీకు ఇష్టమైన ఒక పాట పాడండి..
14. ఇటీవల “వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్” అవార్డు పొందారు కదా…దాని వివరాలు తెలుసుకోవచ్చా?
జ: అవునండీ.. నేను ఈ మధ్య ” వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్” సొంతం చేసుకున్నాను. శనగపప్పు మీద మన గాయత్రీ మంత్రాన్ని 4.37 ని. తక్కువ సమయంలో పూర్తి చేశాను. అది ఎలాగంటే మార్కర్ తో గాయత్రీ మంత్ర బీజాక్షరాలని ఒక్కో పప్పుగింజపై రాయడం. దాన్ని రికార్డ్ గా గుర్తించి స్వీకరించారు. దానికి ఒక సర్టిఫికేట్, గోల్డెమెడల్ పొందాను. అది ఎంతో గర్వకారణంగా అనిపించింది నాకు.
15. మీరు నేర్చుకున్న సంగీత కళకు మీవరకే పరిమితి విధించుకున్నారా? తరువాతి తరానికి నేర్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
జ: నేను పరిమితులు విధించుకోలేదు. ఇతరులకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను ఆన్లైన్ లో స్కైప్ లో పిల్లలకు, పెద్దలకు కర్ణాటక సంగీతం నేర్పించాను. నేర్పిస్తున్నాను. హిందుస్తానీ సంగీతం, సితార్ లో క్లాసులు తీసుకోవాలని అనుకుంటున్నా. సమయాభావం వల్ల తీరిక చిక్కడం లేదు. సర్వదా సంగీత కళను ప్రోత్సహించడానికి, రాబోయే తరాలవారికి నేర్పించడానికి తపన ఉంది. యూట్యూబ్ ఛానల్ లో కొన్ని పాటలు రికార్డ్ చేసి ఉంచాను..అవి ఎవరైనా నేర్చుకోవచ్చు. సంగీతానికి సంబంధించిన వారి జీవితాలపై తెలుగు వాహినీ సభల కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. అలాంటి వారి జీవిత చరిత్రలను, ప్రత్యేకంగా కర్ణాటక సంగీతంలో ఉండే భజనలను యూట్యూబ్ లో కానీ సిడి రూపంలో కానీ చేయాలనుకుంటున్నా. అంతేగాక మెడిటేషన్ చేస్తున్నప్పుడు వినే మెలోడీ మ్యూజిక్ ని సితార్ మీద చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాను. అది పూర్తి కాగానే మీకు తెలియజేస్తాను.
16. ఇప్పటికీ రచనలు చేస్తున్నారా?
జ: చేస్తున్నానండీ. ఈమధ్య తరుణి, మయూఖ ఆన్ లైన్ పత్రికల్లో ఆధ్యాత్మిక పరమైన వ్యాసాలు రాస్తున్నాను. కథలు ఇంకా రాస్తున్నాను. ధారావాహిక నవల రాయాలనే సంకల్పం ఉంది. సంగీత శాస్త్రజ్ఞుల మీద, సంగీతం పట్ల అవగాహన పెంపొందడానికి ఆ దిశగా కథలు, నవలలు రాయాలని ఉంది. సిరిమల్లె పత్రికకు కూడా కథలు పంపాను. త్వరలో అవి ప్రచురింపబడతాయి. ఇంకో విషయం చెప్పాలండీ.. నా వృత్తి సాఫ్ట్ వేర్ కావడం వలన ప్రొఫెషనల్ గా సాఫ్ట్ వేర్ పైన “Software Testing Made Easy” అనే పుస్తకాన్ని కూడా రాసాను. అది అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది. మరో విషయం ..పిల్లలకోసం కొన్ని పాటలు కూడా రాసాను. నేను, మా నాన్నగారితో కలిసి రాసిన పాట ‘తెలుగుతల్లి’ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గడుగ్గాయి’ పిల్లల పత్రికలో ప్రచురితమైంది. నా కథలు, పాటలు, పద్యాలు ఇవన్నీ చూడాలనుకుంటే నా పర్సనల్ వెబ్ సైట్ లో చూడొచ్చు.
చాలా సంతోషం మేడం. సమయం లేకున్నా మీ అమూల్య సమయాన్ని కేటాయించినందుకు మాపక్షాన, మా తరుణి పాఠకుల పక్షాన మీకు మరీ మరీ ధన్యవాదాలు