ఆత్మస్థైర్యానికి , పోరాట పటిమకు ప్రతీకలుగా నిలిచి తమ అనుభవాలను ఎందరికో స్ఫూర్తిగా అందించిన కొందరిలో సుధాచంద్రన్ ఒకరు. భరతనాట్య కళాకారిణిగా , నటిగా నిలదొక్కుకోవడానికి వీరు చేసిన పోరాటం తెలుసుకుందాం.
1965 వ సంవత్సరం , సెప్టెంబర్ 27వ తేదీన కేరళ రాష్ట్రంలోని, కన్నూర్ లో , బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు . ముంబై నగరంలోని మిథిభాయి కళాశాల నుండి బి. ఏ . పట్టా ఆ తర్వాత ఎం. ఏ . ఎకనామిక్స్ పట్టా పొందారు.
1981 వ సంవత్సరంలో , 16 ఏళ్ల వయసులో ఉండగా తమిళనాడు రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లి తల్లిదండ్రులతో తిరుగు ప్రయాణంలో ఉండగా ఘోర రోడ్డు ప్రమాదం వీరి జీవితాన్ని తలకిందులు చేసింది . ఆ ప్రమాదంలో వీరు తమ కుడి కాలికి గాయం అవగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకొని , రెండు వారాల అనంతరం మద్రాసులోని ఒక ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా వారు ఆమె కుడికాలిని తీసివేయడం తప్ప గత్యంతరం లేదని చెప్పారు . ఆ తర్వాత ఆమె కాలుని తీసివేయడం , జైపూర్ డాక్టర్ల ప్రతిభతో కృత్రిమ కాలిని అమరచడం అందరికీ తెలిసిన విషయమే .
రెండు సంవత్సరముల విరామానంతరం ఆమె ఆ కృత్రిమ కాలు సహాయంతోనే పలు నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
వీరి ఆత్మవిశ్వాసానికి , మనోనిబ్బరానికి అబ్బురపడి ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఆమెను ఆహ్వానించాయి . పలు అవార్డులు కూడా ఆమెను వరించాయి .
తర్వాత ఆమె చలనచిత్ర , టెలివిజన్ రంగాలలో ప్రవేశించి తన ప్రతిభను చాటుకున్నారు .తమిళం , మలయాళం , హిందీ ,తెలుగు , కన్నడ భాషలలో వివిధ చిత్రాలలో నటించారు.
1984వ సంవత్సరంలో వీరి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో మయూరి అనే చిత్రాన్ని నిర్మించారు . ఈ చిత్రానికి గాను ఆమెకు 33వ జాతీయ ఫిలిం ఫేర్ అవార్డు (1985), 1986వ సంవత్సరంలో స్పెషల్ జ్యూరీ అవార్డు ఆమెను వరించాయి.
భారతదేశం , సౌదీ అరేబియా , అమెరికా సంయుక్త రాష్ట్రాలు , యునైటెడ్ కింగ్డమ్ ,కెనడా , యుఎఇ, ఖతార్ , కువైట్ , బెహ్రైన్ , యేమెన్ , ఒమన్ దేశాలలో పలు నృత్య ప్రదర్శనలిచ్చారు . బెర్లిన్ లోని ఇన్వర్టిస్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో వీరిని సత్కరించింది. రవి డాంగ్ అనే సహాయ దర్శకుడిని 1994వ సంవత్సరంలో వివాహమాడారు.
వీరు నటించిన చలనచిత్రాలు :
1984 వ సంవత్సరంలో తెలుగు భాషలో ‘మయూరి ‘ అనే చలనచిత్రంలో మయూరి పాత్రలో వీరు ప్రదర్శించిన నటన ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది .1986వ సంవత్సరంలో హిందీలో నిర్మించిన ” అనే చిత్రంలో మయూరి పాత్రలో నటించారు .1986వ సంవత్సరంలో మలయాళ భాషలో మలరం కిలియం అనే చలనచిత్రంలో నటించారు. ఇదే సంవత్సరంలో తమిళంలో నిర్మించిన సర్వంశక్తిమయం అనే చలన చిత్రంలో శివకామి పాత్రలో అందరినీ మెప్పించారు. 1987వ సంవత్సరంలో చిన్న ప్రవే మెల్లాపెసు అనే చలనచిత్రంలో శాంతి పాత్రలో, ఇదే సంవత్సరం తమిళంలో తీసిన చిన్నతంబి పెరియా తంబి అనే మరో చలనచిత్రంలోనూ నటించారు .1987లోనే మలయాళంలో కలాం మారి కథా మారి అనే మరో చలనచిత్రంలో ఆరిఫా పాత్రలో వెండితెరలు ప్రత్యక్షమయ్యారు . 1988వ సంవత్సరంలో కన్నడ భాషలో ఒలావినా ఆసారే అనే చలనచిత్రంలో , 1990లో హిందీ భాషలోని పాటీ పరమేశ్వర్ అనే చలన చిత్రంలో నటించారు. ఇదే సంవత్సరం హిందీ భాషలోని థానేదార్ అనే మరో చిత్రంలో శ్రీమతి జగదీష్ చంద్ర అనే పాత్రలో కనిపించారు. తల్లిగా , సోదరిగా , స్నేహితురాలిగా ,డాన్సర్ గా , జడ్జిగా , రిటైర్డ్ జడ్జిగా , డాక్టర్ గా పలు చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించారు.
నిశ్చయ్ , పూలన్, హసీనా , రామ్ కలి , బాలి , ఉమర్ కో సలాం , రఘువీర్ , అంజామ్, మిలన్ , హమ్ ఆప్ కే దిల్ మే రహే హై , ట్యూన్ మేరా దిల్ లే లియా , మలమాల్ వీక్లీ , షాదీ కర్కే ఫస్గయా యార్, సత్యం , అలెగ్జాండర్ ది గ్రేట్ , వెంగై , క్లియోపాత్ర , అమేరిన్ , ఆది వంటి పలు చలనచిత్రాలలో నటించారు.
వీరు నటించిన కొన్ని టెలివిజన్ కార్యక్రమాలు:
నాగిని , దైవం తందా వీడు ,ఆర్ద్రం , ఏక్ థి నాయ్కా, జల్లోష్ , సువర్ణ యుగచ, అదాలత్ , జిల్మిల్ సితారో కా అంగాన్ హోగా , తేన్డ్రాల్ , తంకా తిమి థా, సౌందరవల్లి, కావ్యాంజలి, జయం , సాథ్ సాథ్, కైసే కహుం, కలశం , కస్తూరి , క్యా దిల్ మే హై , హమారీ బహు తులసి, హమ్ పాంచ్, చష్మీబాదూర్ ,చంద్రకాంత , అంతరాల్ , ఆరసి వంటి పలు కార్యక్రమాలలో నటించారు.
ఒక నృత్యకారిణినికి తన కళను ప్రదర్శించడానికి అత్యంత అవసరమైన (శరీరంలోని అన్ని అవయవాలు సహకరిస్తేనే మనిషి విజయం అయినప్పటికీ) కాలిని కోల్పోయినప్పుడు ఆమె అనుభవించిన శారీరక , మానసిక వేదన ఎంతగా ఉంటుందో ఊహించవచ్చు.
ఈ వ్యాసం వ్రాస్తూ ఉండగానే మనసులో ఒక్కసారిగా చాలా సంవత్సరాల కింద నేను చదివిన ద్వివేదుల విశాలాక్షి గారి ‘రేపటి వెలుగు ‘ అనే నవలలోని ఒక విషయం నా మదిలో మెదిలింది.
“ఒక్క మట్టి పెల్ల విరిగిపడినంతలో కొండ త రిగిపోదు , ఒక్క చేదు అనుభవంతో జీవితం అంతా మురిగిపోదు . ఈ రోజు చవిచూసిందే కాదు జీవితం అంతా. రేపులో దాగుంది నీకోసం ఇంకా ఎంతో”
ఈ విషయం వీరి జీవితానికి సరిగ్గా సరిపోలుతుండటమే నాకు వెంటనే స్ఫురించడానికి కారణం. జీవితాలను నిలబెట్టే ఇటువంటి విలువైన రచనలను గానీ, స్ఫూర్తివంతమైన ఇటువంటి వ్యక్తుల జీవిత కథలను గానీ పిల్లలకు విడమరచి చెప్పినట్లయితే చాలా చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటూ , జీవితాలు ముగించుకోవాలనుకునే పరిపక్వత లేని మానసిక స్థితి నుండి వారు బయటకు రాగలగడానికి కొంత వరకైనా దోహదపడతాయనీ, ఆలోచించే శక్తినిస్తాయనీ మనం గ్రహించాలి.