“ పూర్ణస్య పూర్ణ మిదం పూర్ణమేవావశిష్యతే … పూర్ణం నుంచి పూర్ణం పోతే పూర్ణమే మిగులుతుంది. అది శూన్యం. ఆ శూన్యం లో నుండి అనంతానంత మైన ఘోష వినిపిస్తుంది . మానవ మస్తిష్కం పొరల్లో దాగిఉన్న ఆలోచన సమూహాలను కదిలించి ఈ ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తుంది . ఏదో ఆవేదన, దేనికో తపన . తన చుట్టూ రోజు రోజుకు మారుతున్న సమాజం … పెరుగుతున్న అవసరాలు … వాటి మధ్య నలిగిపోయిన ఆశయాలు , ఆదర్శాలు . అలా ఒంటబట్టించుకుని ఎదిగిన శరీరం … దాన్ని ఆశ్రయించి ఉన్న ఆత్మ మారుతున్న కాలంతో మారలేక రాజీ పడలేక శూన్యమై పోతుంది . మారనిది ఒక్కటే ప్రకృతి సిద్ధాంతం .
పదమూడేళ్లకే నాతో సంసార జీవితం ప్రారంభించి డెభై లో పడి చివరి ప్రస్థానంలో నన్ను వదిలి వెళ్ళిపోయింది నా ప్రాణ సఖి … నా అర్ధాంగి . ఆమె నా పక్కన ఉన్నంత కాలం నా దగ్గరికి చేరలేక పోయింది నా ఒంటరితనం . ఇప్పుడు నా ఒంటరితనమే నా తోడు.
ఎన్ని నాళ్ళ గత మో గుర్తు లేదు . అనుభవాలు మాత్రం నన్నంటే ఉన్నాయి నా ఒంటరితనంలో. సన్నటి కునుకుకు తల పక్కకు ఒరిగింది రామనాధం మాస్టర్ గారికి . ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన వృత్తి ధర్మాన్ని జీవన ధర్మము గా మార్చుకొని ఎంతో దూరం పయనించారు . ఎన్నో సంఘర్షణలను, ఘర్షణలను తట్టుకొని, మారుతున్న మనుషులతో రాజీ పడలేక తన పాత పంచకే చేరుకున్నారు రామనాథం గారు . బాగా పాత బడి బాగుపడే ఓపిక లేనట్టున్న పాత పెంకుటింట్లో ముందు వసారాలో నరసారావు పేట పడక కుర్చీలో జరిగిలపడి కూర్చున్న మాస్టారు గారు గతం లోనే జీవిస్తుంటారు . ఆయనకు వర్తమానము తో పనిలేదు .భవిష్యత్తు మీద నమ్మకం లేదు .
* * *
అది శివ నాగుల పల్లె . పైరు పచ్చలతో గుంటి వాగు ప్రవాహంతో కేవలం మూడు బజారులు మాత్రమే మిగిలి ఉన్న ఒక చిన్న గ్రామం. ఒకప్పుడు ఆ పల్లెలో కనీసం వంద కుటుంబాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో!
ఆ ఊరి కరణం వెంకటప్పయ్య పంతులు గారి ఒక్కగానొక్క కోడుకు రామనాధాంగారు. పది ఎకరాల మాగాణి, ఒక పెంకుటిల్లు , ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల పల్లెలో కూడా మంచి కుటుంబం అన్న వారసత్వాన్ని కొడుక్కి అప్పగించారు .
తన కొడుకు తన కళ్ళ ఎదుటే ఉండాలని ఊరికి మేలు చేయాలని ఉభయతారకంగా సర్కారీ వారి చుట్టూ తిరిగి ఆ పల్లెలో ఒక టీచర్ స్కూల్ ని కూడా తెప్పించారు. రామనాధం గారి చేత టీచర్ ట్రైనింగ్ చేయించి ,ఆ బడి కె మాస్టారి గ వేయించుకున్నారు . మేన కోడలు వైదేహి నే తన కోడలుగా తెచ్చుకున్నారు . ఇద్దరు మనుమలు, ఒక మనుమరాలితో కొడుకు యొక్క సంసారిక జీవితం లోని సరిగమలు మాత్రమే విని ఆనందించి గోవు తోక పట్టుకుని వైతరిణి దాటేసారు. రామనాధం గారు కూడా ‘తండ్రి గారి కర్మ కాండలను చాలా గొప్పగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నాడు’ అని అక్కడ ఉన్న పెద్దమనుషులతో అనిపించుకున్నారు. .
* * *
పర ధ్యాసలో వాగు వెంబడి గా నడుస్తున్న రామనాధం గారు ఉలిక్కి పడ్డారు. ఎవరో పలకరించి నట్లయింది . తలెత్తి చూశాడు , తన ఒక జ్ఞాపకం ఆ మద్ది చెట్టు . దాని చుట్టూ చప్టా , తన కంటే ముందు నుంచే తరాలుగా కాపురముంటున్న గువ్వలు .
ఆ గువ్వలు తనని పిలిచాయేమోనని పించింది మాస్టర్ గారికి.
అవును ! తానెప్పుడూ సాయంత్రాలు ,ఉదయాలు అలా తిరిగే టప్పుడు కొద్దిసేపైనా ఆ చెట్టు కింద కూర్చుని తన మిత్రులతో బాతాఖానీ కొట్టండదె తోచేది కాదు . ఇప్పుడు ఎవరున్నారు. అందరూ వెళ్లి పోయారు. తాను మాత్రమే మిగిలాడు.
అలా వారు వెంటే నడుస్తూ గుడికి చేరుకున్నారు . ఆంకాళమ్మ దేవత . ఆ గుడి ఆ ఊరి వారి కళాక్షేత్రం. అక్కడే మొక్కులు కడతారు, పూజలు చేస్తారు , దీక్షలు పడతారు , జాతరలు, కొలుపులు చేస్తారు. చాల సచ్చమున్న దేవత. ముఖ ద్వారం చిన్నది కావడంచేత తలవంచి మండపంలోకి వెళ్ళవలసి ఉంటుంది. రామనాధం గారు మండపం లోకి వెళ్లారు. చిన్న దీపం వెలుగు తున్నది . “నేనిక్కడే ఉన్నాను “ అన్నట్లు అనిపించింది.కానీ ఆనాటి సందడి లేదనిపించింది . రెండు సార్లు గంట మోగించారు. జ్జైమంటూ సైరన్ మోగింది. చేట్లను ఆశ్రయించి ఉన్న పక్షులు బెదిరి , చెదిరి అరవడం మొదలుపెట్టాయి ఆ శబ్ద ఘోష లో ఘంటారావం కూడా కలిసిపోయింది. బాధగా మనసు మూలిగింది . అలాగే నడుస్తున్నారు రామనాథం గారు.
* * *
గుంటివడ్డునంత పరుచుకున్న ముల్ల తుమ్మ చెట్టు. ఎంతో దట్టంగా ఉండి ఎంత ఎండా కాలమైనా చల్ల గాలిని ఇస్తుండేవి. తన చిన్నతనం లో సెలవు రోజుల్లో 11- 12 గంటల మధ్యలో వాగుకు స్నానానికి వెళుతుండేవారు ఆయన . ఉదయాన్నే ఆడవారి స్నానాలు , మడి నీళ్ళ వ్యవహారాలు,ఇరుగు పొరుగు కబుర్లతో గుంటి వాగు కి ఊపిరి ఆడేది కాదు . ఆ తర్వాత చాకలి ఉతుకులు . అందుకే ఆయన ఆలస్యంగా గుంటి దగ్గరికి వెళ్లేవారు. ఆ తుమ్మ కొమ్మలకు అల్లుకున్న గి జ్జిగాడి గూళ్లు కనిపించేవి. కొత్త గూడేదైనా కట్టిందా అని వెది కి మరి చూసేవారు. మురిపెంగా ఆ గూడు ని చేత్తో ఉపేవారు. అల్లుకున్న చిన్న ద్వారం గుండా శత్రువుల, మిత్రుల అని తల మాత్రమే కనిపించేటట్టు చూసే గి జ్జిగాడిని చూడ్డం ఆయనకెంతో ఇష్టం. గి జ్జిగాడంటే ఆపేక్ష .ఎంతో అమరికగా ఉన్న ఆ గూడు ను చూస్తే గి జ్జిగాడు ఎంత అదృష్టవంతుడు . ఇంత అందమైన ఇంటిని కట్టుకున్నాడు అనుకొంటూ గిజ్జిగాడి ముక్కు ను ప్రేమగా తాకేవారు.వెంటనే గిజ్జిగాడు తలను లోపలకు పొదుపుకునేవాడు. ఈ గూళ్ళ ని షో పీస్ లాగా జనాలు తీసుకు వెళుతుంటారు. ఎంతో శ్రమించి కట్టుకున్న ఆ గూళ్ళ ని తాకొద్దని , తుంచవద్దని మాస్టరు ఎప్పుడు పిల్లలకు పెద్దలకు చెబుతుండేవారు.
ఆయన మనసంతా ఆత్మీయతతో నిండిపోయింది. ఆ ఆత్మీయతే ఆయన్ని ఆ వైపు లాగింది.
* * *
గతంలోని ఆలోచనలతో గతాంలోనే ఉన్న రామనాధాంగారు వర్తమానంలోకి నడుస్తూ చమురు కంపు రావడంతో ఉలిక్కి పడ్డారు గుంటి నీరంతా నూనె తెట్టులా ఉంది. ఏవో గొట్టాలు వాగులోకి పెట్టబడ్డాయి. ముళ్ల చెట్లు మచ్చుకి కూడా కనిపించలేదు. పెద్ద పెద్ద బైండింగ్ వైర్ , ఫెన్సింగ్ తో ఆ వాగు ఒడ్డు కనిపించింది. పాపం గిజ్జిగాడు కూడా మారిపోయాడు. చెట్టు లేకపోతె పోయే ఆ తీగలకే గూడు ని కట్టుకొని త్రిశంకులా వేలాడుతున్నాడు.
రామనాథం మాస్టారి గారి మనసు కలుక్కుమంది. ఉద్యోగ రీత్యా నగరాలకు వలస పోయిన చాలామంది ఊరికి బయట మురికివాడల్లో జీవితం గడపడం చూశారు ఆయన.
తన కొడుకులిద్దరూ ఉద్యోగాల పేరిట ముంబై లో ఉన్నారు. మూడు గదుల్లో ఇరుకైన జీవనం . ఆ ఇరుకు జీవితాన్ని భరించలేక గతానుభూతులను నెమరువేసుకుంటూ శివ నాగులపల్లె చేరుకున్నారు రామనాధం గారు.
ఇన్ని సంవత్సరాలు తనకోసం ఏమి మిగుల్చు లేకపోయినా … తన ఇంటిని గుడి పూజారి కుటుంబం ఉండటానికి వదిలి నందుకు, తనకీ రోజు తన ఊరిలో తన ఇంటి వసారాలో కూర్చునే నీడ ఉందనిపించింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. పాపం గి జ్జిగాడు .. గూడు కట్టుకునేందుకు ఒక్క పేడు కూడా మిగలలేదు. ఆయన మనసు రోదించింది . ఉదయాన్నే మనసుండ పట్టలేక గుంటి ఒడ్డుకు మళ్ళి వచ్చి కూర్చున్నాడు .
అలా ఎంత సేపు కుర్చున్నారో తెలియలేదు. ఒక్కసారి గ చాకలి రేవు నుంచి అరుపులు వినిపించాయి. జనమంతా మంటలు.. మంటలు కాలిపోతున్నాయి అని అరుస్తూ ఫెన్సింగ్ ల వైపు పరిగెడుతున్నారు. రామనాథం గారు కూడా హడావిడిగా అటు వైపు నడిచారు. అంతే నిర్వీణు డై పోయారు. గుండెలవిసి పోయాయి. ఏదో నిస్సహాయత ఆయన్ని కమ్మేసింది . మధ్య మధ్యలో కరెంట్ తీగ వైపు చూస్తున్నారు . గిజిగాడి గూళ్లు ఒకటి తర్వాత ఒకటిగా కాలిపోతున్నాయి . గిజ్జిగాడి పిట్టలు ప్రాణాలను దక్కించుకోవాలన్నట్లు ఎగిరిపోతున్నాయి. కొన్ని పిట్టలు తప్పించుకోలేక అక్కడే ఆహుతి అయిపోతున్నాయి .
అతి వేగంగా పెరిగిన మానవ వైజ్ఞానిక తృష్ణకి సోదర భావంతో నీరాజనాలు
పడుతున్నట్లనిపించిందా దృశ్యం .
“ కుళ్ళు కల్మషం లేని ఈ మూగ జీవాలు, నీదేలే ఈ రాజ్యం, మేము నీతో కురుక్షేత్రం జరపం అంటూ వాన ప్రస్థానం చేస్తున్నట్లుంది “…
ఎంత వేగంగా మంటలు పుట్టాయో అంతే వేగంగా ఆరిపోయాయి. లైన్ మాన్ మెయిన్ ఆపేసాడు. గిజ్జిగాడి గూళ్ళు మాత్రం ఆర లేదు . క్రింద పరుచుకొని ఉన్న రెల్లు గడ్డి కూడా మాడి మసైపోయింది. ఎక్కడో దూరంగా రాలిపోయిన గూటీ ని చూస్తూ ఎగురుతున్న గి జ్జిగాడు.
మాస్టారి హృదయం ద్రవించి ఆ గుంటి ప్రవాహం లో కలిసిపోయింది.
ఎలా ఇల్లు చేరుకున్నారో ఆయనకే తెలియదు . వస్తూనే వసారాలో ఉన్న పడక కుర్చీలో కూలబడిపోయాడు. “బాబు గారు ఎండకు డస్సినట్లున్నారు” అనుకొంటూ పూజారి గారి కోడలు మజ్జిగ తెచ్చి ఇచ్చింది . మౌనంగా తాగేశారు. కానీ మనసులో ఉన్న బాధని ఆ దాహం తీర్చలేదు.
కొద్ది సేపట్లో ఆమె భోజనం వడ్డించింది . ఆకులో అనుపా కం ఏమంత లేదు. ఆయన మనసుకు అదేమీ పట్టలేదు. చేతిలో మజ్జిగ పోయించుకుని భోజనం అయింది పెంచుకున్నారు. ఆచారి గారి కోడలికి ఆయన అలా ఎందుకు ఉన్నారో అర్థం కాలేదు.
“మీరు మీ కొడుకు లు దగ్గరికి వెళ్లి పొండి మాస్టారు. నలుగురితో ఉంటే మనసు కుదుటపడుతుంది ”అని అన్నది కానీ ఆయన నుంచి ఏమి సమాధానం లేదు. ఆయన అలా ఆ కుర్చీలో కూర్చుండి పోయారు ఆ రోజంతా.
ఆమె రాత్రి భోజనానికి ఆయన్ని పిలిచింది . చేతితోనే వద్దని చెప్పారు. ఆ ఊరినే ఆశ్రయించుకొని ఉన్న గిజ్జిగాడు పదే పదే గుర్తుకొస్తున్నాడు . అంత చిన్న ప్రాణి యొక్క శ్రమ, ఆవాసము రెండు బూడిదై పోయాయి. ఆ చోటును వదలలేని గిజ్జిగాడు అక్కడే ఎగురుతున్నాడు ఆ రాత్రంతా ఆందోళనగా. కలత నిదురలో నే రాత్రంతా గడిపారు. గిజ్జిగాడి గూళ్లు ఒకటి తర్వాత ఒకటిగా కాలుతున్న దృశ్యం కళ్ళముందు కదులుతూనే ఉన్నది .
తెల్లవారు జాము లో ఆయనకు కునుకు పట్టింది. కొద్దిసేపట్లోనే ఒళ్ళు చెమటలు కమ్మటం మొదలైంది .ఎడం భుజం లో నొప్పి ,ఊపిరి కూడా అందడం లేదు, ఎవ్వరి పిలిచేందుకు కూడా నోరు పెగలడం లేదు. చిన్న మూలుగు ఏద లోతుల్లోంచి . .
ఎక్కడో అన్నంత దూరాల ఒంటరిగా ఎగురుతున్న గిజ్జిగాడు. గుండె వేగం పెరిగింది…… కొద్దిసేపట్లోనే ఆ హృదయ స్పందన ఆగిపోయింది.
* * *
“ పూర్ణస్య పూర్ణ మిదం పూర్ణమేవావశిష్యతే … పూర్ణం నుంచి పూర్ణం పోతే పూర్ణమే మిగులుతుంది. అది శూన్యం. మారనిది,ఎప్పటికీ చెదరనిది ఒక్కటే ప్రకృతి.
“ఎవరు నువ్వు ?”
“ నేనా! ఇప్పటివరకు ఈ దేహాన్ని ఆశ్రయించిన ఆత్మ ని”
“నీవెవరు “?
“ నేనా ఆ గిజ్జిగాడి గూట్లో ఉండే వాడిని?”
తెల్లవారింది. తిరిగి తిరిగి గూడును చేరుకున్న గిజ్జిగాడికి గూడు లేదని తెలిసిపోయింది. మరో గూడు కట్టుకోవడానికి దూరంగా ఉన్న రెల్లు పొదల్లోకి దూరింది.
మాస్టారు మాత్రం శాశ్వతంగా గా వెళ్లి పోయారు.
(రామనాథం గారి – గిజ్జిగాడి కథ సంపూర్ణం)