అయినదిపో… మేమేలా పోవలె… పోతిమిపో….

నందమూరి తారకరామారావుగారి శతజయంతి ఉత్సవం కోసం రాసిన గల్పిక

రెండురోజుల నుంచీ జ్వరం అని నాగా పెట్టిన యాదమ్మ పొద్దున్నే వచ్చి గబగబా గిన్నెలు తోముతోంది.

“ఏంటి యాదమ్మా? జ్వరం తగ్గిందా? అంత హడావిడిగా ఉన్నావేమిటి?” అడిగాను.

మాలాకుమార్

“అమ్మా యాప్రాన్ చెరువు దగ్గర యన్.టి. ఆర్సినిమా షూటింగ్ అట” సంబరంగా చెప్పింది.

అవునా అని పిట్టగోడ మీదుగా బయటకు చూసాను. మా ఇంటి వెనుకనే అనాబ్ షాహీ ద్రాక్షతోటలూ, ఆ పక్కనే యాప్రాన్ చెరువు ఉన్నాయి. ద్రాక్షపండ్ల కాలంలో మా స్నేహితులము, పిల్లలతో ఆ తోటలకెళ్ళి కాసిని తిని, కాసిని కొనుక్కొని, చెరువు వడ్డున తిరిగి వస్తుంటాము.

 

“అక్కడేమీ కనిపించటం లేదుగా?” అడిగాను.

“వస్తారటమ్మా, నేను పోతున్నా” అని వెళ్ళిపోయింది.

ఓ అయిదుసంవత్సరాల క్రితం వరకూ ఎండాకాలం సెలవలల్లో అమ్మ ఒకటో రెండో సినిమాలకు, అవీ గుళేబకావళికథ, జగదేకవీరునికథ, కృష్ణావతారంలాంటి సినిమాలకే తీసుకెళ్ళేది. పెళ్ళి తరువాత ఓపెన్ ఏయిర్ థియేటర్ లో వచ్చే హిందీ సినిమాలే తప్ప తెలుగువి చూడలేదు. అందుకని నాకు యన్.టి.ఆర్తప్ప ఇంకే హీరో తెలియదు.

లంచ్ కు ఏమండి వచ్చినప్పుడు “మనింటి వెనుక యన్.టి.ఆర్సినిమా షూటింగ్ అట. పొట్టిపొట్టి గౌన్లు వేసుకొని కత్తియుద్దాలు చేస్తాడేమో! వెళ్ళి చూద్దామా?” సరదాగా అడిగాను.

“పొట్టిగౌన్ల సినిమా కాదుట. కర్ణుడి సినిమాట. ఇక్కడ యుద్దం సీనులు తీస్తారట. షూటింగ్ చూసేందుకు రమ్మని మాకు ఇన్విటేషన్ పంపారు” జవాబిచ్చారు.

అబ్బా కర్ణుడి పాత్రంటే నాకెంత ఇష్టమో! తప్పకుండా షూటింగ్ చూడాల్సిందే అనుకొని, పని చేసుకుంటూ మధ్యమధ్య పిట్టగోడ మీద నుంచి తొంగితొంగి చూస్తూ ఉండగా….

చూస్తుండగానే చకచకా గూడారాలు వేసారు. రధాలు, గుర్రాలూ, ఏనుగులూ బోలెడు వచ్చేసాయి. సైనికులు ఎంత మంది వచ్చారో! యాప్రాన్ చెరువు ఒడ్డంతా యుద్దభూమిలా మారిపోయింది. ఎంత హడావిడి, ఎంత హంగామా!

మా ఆర్డర్లీ దివాన్ చంద్ “షూటింగ్ షురూ హోనేవాలా హై. చలో బేటీ, బాబా ఘోడా, హాతీ  దేఖేంగే” అని పిల్లలిద్దరినీ తీసుకెళ్ళాడు. మూడేళ్ళు కూడా నిండాలేని మా అబ్బాయి కూడా ఘోడా, హాతీ దేఖేంగే అని ఉషారుగా వెళ్ళాడు. అప్పటికే కాలనీలో పిల్లలందరు హాతీ, ఘోడా అని పరుగులు తీస్తున్నారు.

షూటింగ్ మొదలయ్యిందని తెలిసాక మా ఫ్రెండ్స్ మి వెళ్ళాము. మమ్మలిని చక్కగా రిసీవ్ చేసుకొని ముందు వరుసలో కుర్చీలేసి కూర్చోబెట్టారు. చక్కగా చాయ్, స్నాక్స్ పెట్టారు. స్నాక్స్ వద్దని చాయ్ మాత్రం సుతారంగా తీసుకున్నాము. అబ్బా ఈ చాయ్ కంటే మన లంగర్ చాయ్ బాగుంటుందనుకుంటూ అది పారబోయలేక, తాగలేక మింగుతూయన్.టి.ఆర్కోసం చుట్టూ వెతుకుంతుంటేయన్.టి.ఆర్కుఆ రోజు షూటింగ్ లేదు అందుకని రాలేదు అని చాయ్ అంత చల్లగా చెప్పారు. హుం.నిరాశగానే కాసేపు షూటింగ్ చూసివచ్చేసాము.

ఆ రోజు యన్.టి.ఆర్వస్తున్నారని మా దివాన్ చంద్ కబురు తేగానే మళ్ళీ పొలోమంటూ వెళ్ళాము. దాదాపు ఇరవై కిలోల బరువు ఉన్న ఆభరణాలు, కిరీటం ధరించి, మంచి మంచి పట్టు చీరలతో పట్టుపంచె… భుజ కీర్తులు… ఈ అలంకారాలతో,యన్.టి.ఆర్ దుర్యోధనుని గెటప్ లో కనిపించారు. అమ్మో ఎన్ని నగలో అని ఆశ్చర్యపోతూ ఒకరిమొహాలొకరం చూసుకున్నాము. అబ్బా ఎంత మేకప్ అనుకున్నాము. అంత మందమైన మేకప్ చేసుకోవాలా? యుద్దభూమిలో అన్ని నగలు అవన్ని అవసరమా అని విస్తుబోయాము. నాకు మటుకు మొదటిసారియన్.టి.ఆర్ ను నా కిష్టమైన కర్ణుడి పాత్ర లో చూడలేదని కాస్త నిరాశ కలిగినా రారాజులా ఠీవిగా బాగానే ఉన్నాడులే అని సద్దుకున్నాను. షూటింగ్ విరామసమయంలో ఆయనతో మాట్లాడుదామని వెళితే, మమ్మలిని మర్యాదగా కూర్చోబెట్టి చాలా సేపు మాట్లాడారు. ఆర్మీ ఆఫీసర్స్ భార్యలమని తెలియగానే మమ్మలిని చాలా పొగిడారు. దేశసేవకోసం మేము చాలా త్యాగాలు చేస్తున్నామని పొగిడేస్తుంటే కాస్త సిగ్గు, మొహమాటం అనిపించినా చెప్పొద్దూదేశరక్షణ భారమంతా మేమే మా భుజస్కందాల మీద మోస్తున్నంతగా ఫీలైపోయాము. షూటింగ్ అయిపోయక ఓరోజు విందుభోజనానికి తప్పక రావలెనని ఆహ్వానించారు. అంత పెద్దాయనఅంత అభిమానంగా మాట్లాడుతుంటే ఎంత సంతోషమేసిందో!

అక్కడేమో కానీ మా కాలనీలో ఒకటే షూటింగ్ హడావిడి! పనివాళ్ళు నాగాలు పెట్టకుండా యంటీవోడ్ని చూడాలని రోజూ వచ్చి పని చేసి పోతున్నారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే హాతీ, ఘోడా అంటూ తిండి కూడా సరిగ్గా తినకుండా అటే పరుగులు పెడుతున్నారు.ఇంట్లో చీపురు కట్టలు చెదిరిపోయి పుల్లలు కత్తులుగా, బాణాలుగా మారిపోతున్నాయి. పాతపేపర్లు కిరీటాలుగా తలల మీద నిలబడలేక వాలిపోతున్నాయి. రోజొక కొత్త చీపురు తేలేక కృష్ణ కిరాణా షాప్ నుంచి ఓ అట్టెపెట్టె, రంగురంగుల మెరుపు కాగితాలు తెచ్చి, పిల్లలిద్దరికీ కిరీటాలూ, కవచము,కత్తులు, బాణం తయారు చేసిచ్చాను. అంతే కిరాణాషాప్ లో పారేయటానికని పెట్టిన అట్టెపెట్టెలన్నీ కిరీటాలు, కత్తులు, బాణాల రుపాంతరం చెందాయి. షూటింగ్ అయిపోగానే మా ఇళ్ళ ముందు కత్తియుద్దాలు మొదలు. చీమ చిటుక్కు మన్నా వినిపించేంత భయంకరమైన నిశబ్ధంలో ఉండే మా సైనిక్ పురి వెనక వైపు నుంచి ఏనుగుల ఘీంకారాలూ, గుర్రాల సకిలింపులూ, సాయంకాలం పిల్లల యుద్దాల అరుపులూ అందులోనే అసలు సిసలు కొట్లాటలు హబ్బో కాలనీ అదిరిపోతోంది!

ఏమండీకి భోజనం వడ్డిస్తూ షూటింగ్ ముచ్చట్లు చెపుతుంటే దివాన్ చంద్ పిల్లలను తీసుకొని గాభరాగా వచ్చాడు. ఏమిటాని చూస్తే ఇద్దరి వళ్ళూ కాలిపోతోంది. వెంటనే యం.ఐ రూంకు పరిగెత్తాము. అప్పటికే మా వాళ్ళు కొంత మంది  పిల్లలను భుజాల మీద వేసుకొని ఉన్నారు. ఒక్కళ్ళకు కూడా టెంపరేచర్ 105/ 106 డిగ్రీలకు తక్కువగా లేదు! నర్సింగ్ అసిస్టెంట్స్, డాక్టరమ్మా బిజిబిజీగా ఉన్నారు. బాబును మంచం మీద పడుకోబెట్టి వాళ్ళిచ్చిన ఐస్ తో నేను స్పాంజింగ్ చేస్తుంటే, ఏమండి మా అమ్మాయిని పట్టుకొని ఇంజెక్షన్ ఇప్పించేందుకు తన వెనుక, ఏమండి వెనుక నర్సింగ్ అసిస్టెంట్ సిరంజ్ పట్టుకొని పరుగులు తీస్తున్నారు. అమ్మలు కళ్ళనీళ్ళతో ఒకరికి ఐస్ స్పాంజింగ్ చేస్తుంటే, నాన్నలు ఇంకోళ్ళ వెనుక గసతీస్తూ పరుగులతో కురుక్షేత్రాన్ని మరిపిస్తోంది యం. ఐ. రూం! ఓ క్షణం ఐసింగ్ ఆపి, పిల్లల వెనుక యూనీఫాం లో పరుగులు తీసుతున్న నాన్నలనుచూస్తే, వాళ్ళ డ్రిల్, క్రాస్ కంట్రీ ఎక్సర్సైజ్ ఎప్పుడూ చూడలేదేమో చెప్పొద్దూ భలే ముచ్చటేసింది. పాకిస్తానోడు కూడా ఇంతలా పరుగులు పెట్టించి ఉండడు. అంతేలే ఎంతవారలైనా పిల్లల దాసులేగా అనుకొని ఐసింగ్ లో పడిపోయాను.సూదిమందు ప్రహసనం అయ్యాక, పిల్లలు ఆగమ్మకాకుల్లా ఆ షూటింగ్ కు ఎండలో పరుగులు పెడుతుంటే, ఆపకుండా కత్తులూ కఠారులూ చేసిచ్చారు అని ఏమండీలు మా మీద తూటాలు వదులుతుంటే “అసలు ఆ షూటింగ్ ఇక్కడ ఎందుకు అవవలే… అయినదిపో…  మేమేలా పోవలె…పోతిమిపో….” అని పరిపరి విధముల చింతించితిమి!

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలంగాణ బంగారునిధి

బొమ్మలో బొమ్మ