ఎర్రరంగు బురద

ధారావాహిక నవల

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పండుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు.

ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు. ఏదులుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పై కుట్ర చేసి ఏదులు భార్య నాంచారికి కరెంటు షాక్ తగిలిస్తారు. రత్నం సేటు చికిత్స చేయిస్తాడు. నష్టపరిహారం కొంత డబ్బు ఇవ్వాలనుకుంటడు సేటు. ఆడబ్బు కోసం ఏదులు తండ్రి సంగడి ఆలోచన తెలిసి సేటు. ఏదులు భార్య పిల్లల పేరు మీద చెక్కులిస్తడు. వాటితో ఇల్లు బాగుచేసుకుని. మామ ఊర్ల భూమి కొనాలనుకుంటడు ఏదులు.

————ఇక చదవండి——–

8వభాగం

సీకటి ఎల్లారక ముందే లేసి ఊరు బయిలెల్లిన ఈరన్న “మల్లో సారి ఇచారించు పిలగా..” అన్నడు.

“ఇచారించేటిది ఏది లేదు మామా.. ఇంక నాలుగొద్దులు అయినంకయిన.. ఈ ఊరొదలాల్సిందే నేను” అన్నడు ఏదులు మొకం మాడ్సుకొని..

“సరె మా ఊల్లె సూత్తలే మరి… నాలుగొద్దు లైనంక ఒక పాలి నువ్వు అటొచ్చిపో..  పిల్లగాల్లను సుత తోలకరా..” అనుకుంట తొవ్వ పట్టిండు.

 ఏదులట్లెందుకన్నడో ఈరన్నకు సమజ్ గాలే.. తండ్రి పోయినంక.. “గీ ఊరెందుకు ఒదుల్తమే యయ్యి..?” అన్నది మొగనితో నాంచారి.

 “అన్ని గిప్పుడే సెప్పల్నా పనికి పోదునా..” అంట బీడి ముట్టిచ్చిండు.

నాంచారి తొంటచేత పొరకందుకొని ఆకిలి నూకి సాన్పిసల్లింది.. ఎర్ర మట్టిపిడస తీస్క గడపలలికింది.. ఎంగిలి బోల్లు జాలాట్లేసి పొయిల బూడిదెత్తు కొచ్చి బోల్లు రుద్ది కడిగింది.

ఒక్కసేత్తోని పెండ్లం తిప్పల పడతాంటె.. ఏదులు కుండందుకొని బాయికాడికి పొయ్యిండు. గోలెం నింపి మంచినీల్ల కుండను గుడిసెల దించి, ఏపపుల్ల నమిలి మొకం కడిగిండు.

ఇంతల పొయ్యి ముట్టిచ్చి చాయి గిన్నె పొయ్యి మీద పెట్టింది.. ఇస్టీలు గలాసు పట్టుకొని గొల్లమల్లమ్మ కాడికి పొయ్యి పాలు తెచ్చింది నాంచారి.. అప్పటికి సాయిపత్త పొట్లం సింపి పొయ్యి మీద గిన్నెలు పోసిండు ఏదులు.. నాంచారి పాల గలాసు అందిచ్చింది. మసులుతున్న నల్లటి డికాషన్ల పాలు గుమ్మరిచ్చిండు.. ఇంతట్ల పిల్లలు ఒక్కొక్కలు లేసిన్రు.

 “పండ్లు దోముకొచ్చుకున్నోల్లకే కమ్మటి ఉడుకుడుకు సాయి.. ఎవలకు కావాలె…” అన్నది నాంచారి. సాయి ఆశకు పిల్లగాళ్ళు మొగాలు కడగటానికి పోయిన్రు.

“ఉత్తగ నీళ్ళతోటి కడుగుడు కాదు. ఇంగో ఈ బొగ్గు నవిలి, దీనితో పండ్లు తోమాలె” అని పోరల్లకు బొగ్గు అందిచ్చింది. తను కూడా బొగ్గుతో పండ్లు తోముకుంది.. సిన్న పిల్ల బొగ్గునమిలి సొల్లంత మీద ఊసుకుంటాంటే.. “సీ.. సి.. సెవ్వ గిట్ట పూసుకుంటరా.. నేను కడుగుతా.. రా…” అని పిల్ల మొగం కడిగింది… అప్పటికే పిల్లగాండ్లు తండ్రికాడికి సేరిన్రు. అందరికి సిన్న సిన్న గలాసుల్ల సాయి పోసి ఉంచిండు ఏదులు…

బిడ్డ వచ్చి “యయ్యా.. నాకు కోపు కొంటంటివి కదా…. నాకు మూతి గాల్తాంది.. తాగొస్తలేదు” అన్నది.

 “ఈ ఐతారం తెస్త బిడ్డ… జర సల్లగయినంక తాగు.. ఉడుకుడుకుది తాగకు” అని బుదగరిచ్చి, “నిమ్మలింగ తాగురి నేను పనికాడికి పోతున్న” అని బయటికి పోయిండు.

గలాసుల్ల ఆ ఉడుకు నీళ్ళను ఊదుకుంట ఉఫ్ ఉప్ అనుకుంట ఊరిచ్చుకుంట తాగిన్రు. ఇంతకు ముందు ఆల్లకు సాయి తెలవదు. నాంచారి దావఖానల చేరినంక తల్లిపాలు తాగే చిన్న పిల్లకు పాలు మరిపిచ్చెటందుకు సాయిసుక్క రుచి చూపిచింది నాంచారి తల్లి. అప్పుడప్పుడు గంజిల ఉప్పుగల్లేసి తాగపెట్టేది. చిన్న పిల్లకు తాపుతాంటే మాక్కావాలని మొగ పోరల్లు మంకు పట్టేది… తల్లిమంచం పట్టింది. బాగయి ఇంటికెప్పటికొస్తదో తెల్వదు పిల్లలు బెంగటిల్లకుండ సూసుకోడానికి సాయి అలవాటు సేసింది మనవల్లకు. అంతకు ముందే ఏదులు అప్పుడప్పుడు బయట సాయి తాగెటోడు.

తియ్యటి ఉడుకుడుకు సాయి తాగినంక పిల్లలు ఏపచెట్టు కింద ఆట మొదలు పెట్టిన్రు… నాంచారి చాట్ల బియ్యం పోసి ఏరతాంది… కరెంటు షాకు కొట్టిన తర్వాత పడ్డబాధలు నరకం సూపిచ్చినయి… చెయ్యి సత్తువ లేకుండయ్యింది… గబగబ పని చేసుకోలేక పోతంది. గని సేటు మంచి తనం సెయ్యబట్టి తమ బతుకుల్ల సానా తేడాలొచ్చినయి.. సేటు కూడా తన మామసుంటోడయితే తమ బతుకులేమవునో.. అనుకుంట తనపని సేసుకున్నది…

మూడ్రోజుల తర్వాత సేటుకు సెప్పిండు ఏదులు “ఒక దినం పని నాగా సేటు.. మా మామ తానికి పోయ్యొస్త.. రేపొక్కరోజే మల్ల బేగిన వస్త” అన్నడు.

“సరిపోయిరా ఒక్క రోజు తోటి ఇక్కడేం మామ్ల గొట్టక పోదులే…”  అన్నడు సేటు.

 చుక్క పొద్దున్నే లేచి పోరగాళ్ళను తీసుకొని.. మేనమామ, పిల్లనిచ్చిన మామ తనకు పెద్దదిక్కు ఈరన్న ఊరికి బయలెల్లిండు… ఎండకాక ముందే.. మామింటికి సేరెండు…

బిడ్ల పిల్లల తోటి వచ్చుడు చూసి కైకిలికని బైలెల్లిన నాంచారి తల్లి నాగపెట్టి ఇంట్లోనే ఉన్నది… ఈ ఒక్క దినం పోకుంటె మాయెలే అన్నాడు ఈరన్న.. తాత సుట్టు మూగిన్రు పిల్లగాల్లు.. వాళ్ళను తీసుకొని దుకనం కాడికి పొయ్యి డబ్బల్రొట్టె పాలపాకెట్ బిస్కోట్లు కొనుక్కోనచ్చిండు.. మీమింక సాయి తాగుతలెం బిడ్డా… మనవళ్ళ కోసం సాయిసేస్త అనుకుంట పొయికాడికి పోయింది.. అమ్మమ్మ పోసిన సాయిల డబల్ రొట్టెలు ముంచుకొని సంబురంగ తిన్నరు పిల్లలు.

ఈరన్న బిడ్డ వచ్చిందని ఇంట్ల పెంచే చుక్కకోడిని పట్టుకొని పెండ్లానికిచ్చిండు. తల్లి బిడ్డలు పోయ్యికాడికి సేరిన్రు. పిల్లగాల్లు అటిటు ఉరుక్కుంట ఆడుకుంటున్నరు. మామలల్లుళ్ళు ఆ ఊరు సర్పంచ్ దగ్గరకు పోయిన్రు, ఊర్లల్ల ఏది సేసినా సర్పంచ్ ఎరకతో సెయ్యాలి… ఏదన్న మంచి సెడయితే ఆయినే చూస్తాడు.

ఆఊరి సర్పంచ్ ఒక కర్ణపాయన.. వీల్లను చూసి “ఏమిరా ఈరన్న.. ఎండల బడొచ్చిన్రు మామలల్లుళ్ళు.. ఏంది సంగతి..” అన్నడు.

“ఏం లేదు దొర.. మొన్న సెపితి కదా  ఊరుబయట.. గౌండ్ల మల్లన్న అరెకరం పొలం అమ్ముతనని అన్నడు. ఈ ఏడాది పిల్లపెళ్లి, పిల్లగాని చదువు రెండు అక్కరలు ఒక్కసారి వచ్చినయట, డబ్బుల కోసం భూమి అమ్ముతన్నడు దొర..” అన్నడు ఈరన్న.

“ఇంతకు పొలం నువ్వు కొంటవా.. నీ అల్లునికి కొనిస్తవా…” సర్పంచ్.

 “నాకెందుకిప్పుడు భూమి దొరా… మొన్న నా బిడ్డకు గిన్ని కొత్తలొచ్చినయి. కరెంటు షాకయినందుకు… అవి ఆగమయితయని..” అని నీళ్ళు నమిలిండు.

“గౌండ్లాయన నన్నే కొనమన్నడు… నాకెందుకు ఆ భూమి.. సరే గని వాన్ని నువ్వే పిలసక రాక పోయినవు..” అన్నడు.

“వస్తొస్త చెప్పొచ్చిన దొర వస్త పా. అన్నడు…” అని సెప్తుండగనే.. గౌండ్లాయనొచ్చిండు.

అరెకరం ఏబయివేలు అన్నడు అటిటు బేరం సేసి నలబయి వేలకు కుదుర్చుకొని కాయతం రాయించుకున్నరు. వచ్చే వారం డబ్బులిచ్చి.. పట్టాపుస్తకం మార్చుకొనేటట్టు బయాన కింద పది వేలిచ్చుండు ఈరన్న… ఆ కాయితం కూడ సర్పంచ్ దగ్గర పెట్టి, ఇంటి దారి బట్టిండ్రు..

వస్తొస్త తాళ్ళల్లకు పోయి .. అల్లునికి కల్లు తాపిచ్చుండు. బిడ్డకోసం సిన్న బింకి నింపుకొని తెచ్చిండు…. తెలంగాణల కల్లు, నీసుతోనె మర్యాదలు పూర్తయితది. పండుగలు మొదలయితది… కల్లు మాసం వాల్ల తిండి అలవాట్లలో భాగమే. కులం మతంతో సంబంధం లేకుండా… సాటుంగ కొందరు బయిరంగంగ కొందరు నడిపిస్తనే ఉంటరు… అడవుల్ల ఉండెటోల్లకు ఈతకల్లు, ఇప్పసార ఊర్ల ఉండేటోల్ల తాటికల్లు, గుడుంబ అది మామూలే..  డబ్బున్నోల్లకు ఇంగ్లీసు సరుకులు … ఊరు వాడ పల్లెపట్నం ఒకటే మత్తుల దొర్లుతాంది..

****

కొన్న అరెకరం పొలం నాంచారి పేరు మీద రాయించిండు ఏదులు.. “అట్లెందుకు పిలగా..” అని ఈరన్న అడిగితే…

 “మా అవ్వకయిన అన్నాయం ఆపలేకపోయిన కద మామా.. నాంచారి సచ్చేది బతికింది, దాని అవిటి తనానికి బదులొచ్చిన డబ్బులతో కొన్నదే కదా అట్లనే ఉండాలి. ఇప్పుడే నీబిడ్డకు ఏం చెప్పకు..” అన్నడు.

 ఒక నెలరోజులు గడిచినయి. సేటు పని ఊపందుకున్నది. ఇంకో నెల రోజులకు రంగులేసుడు, లైట్లు పెట్టుడు అన్ని అయిపోతయి.

డబ్బుల కోసం అడగమని సర్పంచ్ దగ్గరికి పోయిండు సంగడు..

“ఇంకెక్కడి డబ్బులు అయిపోయినయి.. వాల్ల మామూర్ల భూమికొన్నడు..

అయినా వాని డబ్బులతోని నువ్వు కొనేదేందో… వానిది వాడు సూసుకుంటడులే..” అన్నడు సర్పంచ్.

పండ్లు కొరుకుత ఆడికెల్లి కదిలిండు సంగడు. ఎంకులు రోజు డబ్బులంట గోలపెడతన్నడు.. ఆల్లకు ఆపతొస్తె తల్లి పిల్లలు గోస పడ్డరు. ఆని డబ్బులు మనకెందుకు.. అని సెప్పలేక పోయిండు.

మునపటోతిగ ఏదులు నోరు పారేసుకుంట లేదు . నాంచాంరి దవాఖానల ఉన్నప్పుడు సత్తదో బతుకుతదో తెల్వక అల్లాడిండు.. అయ్యన్ని సూసినంక… ఏదులు కోపం సచ్చింది… నెలరోజులల్ల రోగాలతో నొప్పులతో, కాలినోల్లను, కాళ్లిరిగి, తలకాయ పలిగి, కరోనా వచ్చి.. రకరకాల సావుల్ని సూసిండు. సావు.. ఏ చనం ఎవరిని మాయం చేస్తదో తెలవదు. ఈ పెపంచం చిన్నది.. ఈ జీవితం చిన్నది. అన్న ఎరుక ఏదుల్ని చల్లబడేసింది…

***

ఎండలు ముదిరిన రోజూ పనికాడనే సేటు పనోల్లకు పంపే సద్దుల్లనే తాను తినేటోడు… ఆ దినం పానం సొక్కి పోయింది… పనోల్లు రంగులేస్తాన్రు. సేటు కొడుకు పట్నం నుంచొచ్చిండు… పొద్దున్నే. పెయి నొప్పులతో పానం మెత్తగనిపిస్తంది.

 “ఇంటికి పోత సారు.. పానం మెత్తగయింది” అని సెప్పి ఇంటి దారి పట్టిండు… కట్టుబడి ఇల్లు కాడ్నించి పది ఇండ్లు దాటినంక సర్కారుబడి ఉంది. పక్కనే కాళీ జాగుంది. అందుల సర్కారు తుమ్మ పొదలు, లొట్టపీసుచెట్లు, గడ్డి- అంత చిందర వందర గుంటది. పక్కనే రెండు భవంతులున్నయి అండ్లనించి వచ్చే మురికి నీళ్ళతో.. మురికి గుంతలున్నయి. అందుల్నే పందులన్ని  సల్లగ దొల్లుతుంటయి… సుక్క పంది, బట్టపంది పిల్లలతల్లులు గుర్ గుర్ అంట గోడ పక్కన పొదల మద్దెన పండి ఉన్నయి.. పిల్లలన్నీ ఎగపడి పాలు గుడుస్తున్నయి… ఎండేల అన్ని జీవాలు నీడన పన్నయి…

ఏదులు రోజు వస్త పోత వాటిని సూస్త నడుస్తడు. పొద్దుగూకేల గుడిసెకు జేరతయి అయి… ఏబయి సాల్తీలుండేయి.. ఇప్పుడు ముప్పయే మిగిలినయి…

గోడ సందునించి ఎవరో మనిషి కదిలినట్టనిపించింది.. “ఎవలదీ అన్నడు…” ఏదులు – రెండడుగులు ముందు కేసిండు – ఎవరు కనపడలే.. కాని కాలు బురదల దిగపడింది.. సర్కారు ముల్లు నాటింది కాలికి. నిమ్మలంగ ఒంగి కాలుకు నాటిన ముల్లు పీకుతున్న ఏదులు మీద ఉపద్రవమొచ్చిపడ్డది…

??????

(వచ్చిన ఉపద్రవం ఏమిటో తెలవాలంటే.. వచ్చే వారం 9వ భాగం చదవండి)

Written by Jwalitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇది ఎక్కడిది?

తెలంగాణ బంగారునిధి