వ్యక్తిత్వ వికాసం

రాధిక సూరి

మనిషి తనకంటూ సొంత అభిప్రాయాలు కలిగి సద్వర్తనతో, ఉన్నతమైన ఆశయాలతో తన చుట్టూ ఓ వలయాన్ని నిర్మించుకొని ఆదర్శవంతమైన జీవనం సాగించాలి .’వ్యక్తిత్వాన్ని కోల్పోవడం మరణ సదృశం’.
ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి తన ఆశయాలను ,ఆదర్శాలను ,జీవన గమ్యాన్ని దారి మళ్ళించకూడదు. అలాంటి సందర్భం తారసపడితే అతడు ‘జీవన్మృతుడి’కిందే లెక్క. తన నడవడికను ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ, సరి చేసుకుంటూ జీవితాన్ని సాఫీగా సాగేలా దిశానిర్దేశం చేసుకొని ముందుకు నడవడంతోనే వ్యక్తిత్వం వికాసవంతం ఔతుంది. పరిశుద్ధమైన ఆత్మావలోకనం, పవిత్రమైన ఆలోచనల సమాహారమే వ్యక్తిత్వ వికాసానికి మూల స్తంభాలు. రాగద్వేషాలు లేని అకుంఠిత దీక్షయే వ్యక్తిత్వ వికాసం. క్షమ కొన్నిసార్లు అత్యవసరమౌతుంది .అన్నివేళల్లో సమతౌల్యత పాటించాలి. సమయస్ఫూర్తి జీవన సోపానానికి తొలిమెట్టు లాంటిది .’ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోవాలి లేకుంటే అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు’ అని స్వామి వివేకానంద ప్రవచించారు .’నీ వెనక ఏముంది ముందు ఏముంది అనేది నీకు అనవసరం .నీలో ఏముంది అనేది ముఖ్యం .”మందలో ఒకడిగా ఉండకు వందలో ఒకరిగా ఉండు” అంటూ ఇలా ఎందరో ప్రేరేపించారు. నీ విలువ గుర్తించని వారిని వదిలివేసెయ్. ఒకరి మనోభావాల్ని కించపరచకుండా వారి వ్యక్తిత్వాన్ని గౌరవించాలి ‘.ప్రేమ ,నిజాయితీ, పవిత్రత ఉండే వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేద’న్నది నరేంద్రుల వారి ఉవాచ. ఒక వ్యక్తి నుండి మంచిని స్వీకరించాలంటే వారు అత్యంత ప్రభావశీలురే కావాల్సిన అవసరం లేదు. మన మధ్యలో ఎంతో మంది సామాన్యులు సైతం విశేషమైన వ్యక్తిత్వ లక్షణాల్తో అలరారుతుంటారు .వారి నుండి కూడా స్ఫూర్తి పొందవచ్చు. ‘తెలుగులోనే మాట్లాడతాను ,కోపం వస్తే తెలుగులోనే తిడతాను కానీ నాకు చిన్న చిన్న రీజన్స్ కి కోపం అంత త్వరగా రాదన్న ఓ ఎన్నారై చిన్నారి హృదయ (వ్యక్తిత్వ) వికాసం . పరస్త్రీపై అంగాంగ వర్ణన చేయలేను. అందుకే ఇల్లాలినే కవిత వస్తువుగా తీసుకుంటానంటూ చెప్పిన ఓ ప్రజాకవి హృదయౌన్నత్య వికాసం . భార్యలోనే కాళీమాతను దర్శించిన రామకృష్ణుల వారి హృదయ సౌందర్య పరిమళాలు మాటల్లో వ్యక్తపరచడం చాలా కష్టం. సామాన్యమైన జీవనసరళిని అలవర్చుకుని అనన్య సామాన్యమైన ప్రతిభాపాటవాలతో విరాజిల్లిన ఏ.పీ.జే .అబ్దుల్ కలాం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే కదా !ఎంతో ఉన్నత స్థితిలో ఉండి కూడా తమ సంస్కృతి- సాంప్రదాయాలకు వారధిగా నిలుస్తూ ,భారతీయ వారసత్వ సంపదైన ‘చీరకట్టు’తో ప్రపంచ వేదికలపై తన ప్రభావశీలమైన ఉపన్యాసాలతో విరాజిల్లే ఇన్ఫోసిస్ ‘సుధా మూర్తి ‘గారు సదా గౌరవనీయులే కదా ! వ్యక్తిత్వ వికాసంలో బాలసాహిత్యపు పాత్ర గణనీయమైంది .అనుభవసారంతో కూడిన వ్యక్తిత్వ వికాసం అత్యంత ఆచరణీయం, ప్రభావశీలం. “వ్యక్తిత్వానికి కొలమానం అతని హోదా ,డబ్బు కాదు,సత్ప్రవర్తనతో కూడిన అతని వ్యక్తిత్వం.ఈ లక్షణం తోనే వ్యక్తి గౌరవించబడతాడు. సామాజిక అసమానతల నిర్మూలనం , ఉత్తమ ఆశయాలతో ఎదుగుతూ, అంతరాలను ఛేదించినప్పుడే వ్యక్తిత్వం వికాసవంతమౌతుంది.

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మృగరాజు భాష

అత్తగారి బ్లాక్ మనీ