అట్టడుగు వర్గాల జీవన వికాసమే లక్ష్యం

ప్రముఖ సాహిత్యవేత్త, బిజేపి జాతీయ నేత జాజుల గౌరీ గారితో తరుణి ముఖాముఖి ఇంటర్వ్యూ ఎస్ యశోదా దేవి

ఆమె జీవితం, ఉద్యమం వేరు వేరు కాదు. జీవితంలో మొదలైన తిరుగుబాటు క్రమంగా ఉద్యమం దిశగా నడిపించింది. చిన్నతనం నుంచి  సాహిత్యంపై ఉన్న అభిలాషను  తన జీవితంలో ఎదురైన సంఘటనలు, భావాలను కలిపి కవితలుగా, కథలుగా మలిచారు.  తెలుగుసాహిత్యంలో దళిత సాహిత్యానికి పెద్దపీట వేశారు.   మాదిగ దండోరా సాహిత్యవేదిక ఉపాధ్యక్షురాలిగా,  ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక అధ్యక్షురాలిగా, అనేక సాహిత్యవేదికల్లో కీలకపాత్ర పోషించి రాజకీయ రంగంలో వచ్చిన అవకాశాన్ని అందుకుని ప్రజల్లో ఉంటే ప్రజాసేవ చేసే అవకాశం తప్పక వస్తుందని నిరూపించారు. ఆమే ప్రముఖ రచయిత, జానపద గాయనీ, బిజేపి జాతీయనేత  జాజుల గౌరీ గారు.. ప్రజల్లో మమేకమై ఉండాలన్న సంకల్పమే తనను ముందుకు నడిపిస్తున్నది అంటున్న ఆమెతో తరుణి ముఖాముఖీ …

జాజుల గౌరీ

తరుణి :  మీ మొదటి కవిత “ఉతికి ఆరేస్తా” ఎంతో ఆవేశంతో, సమాజం మీద అక్కసుతో రాసినట్టుగా ఉంది. ఈ కవిత ఎలా ప్రచురణకు ఎంపిక అయ్యింది. ఏ పత్రికలో వచ్చింది?

జాజుల గౌరీ :  మాకు గెస్ట్ లెక్చరర్ గా ఉన్న డాక్టర్ ప్రభంజన్ కుమార్ గారు ఉద్యోగం కోసం నేను డిగ్రీ చదువుతున్నాను అని తెలిసి.. పిఆర్ఓ ఉద్యోగం వస్తుంది జర్నలిజం చదవమని సూచించారు. దాంతో ఉస్మానియా యూనివర్సిటీలో బిసిజె ఎంట్రెన్స్ రాసి కాలేజీలో చేరాను. ఆ తర్వాత ఎం సి జె పూర్తి చేశాను. ఒకవైపు చదువు సాగుతున్న నేపథ్యంలో సాహిత్యవేత్తలతో పరిచయం పెరిగింది. ప్రభంజన్ సార్ నేను రాసిన కవితలు చూసి నన్ను రాంనగర్ లోని “ఏకలవ్య” పత్రిక ఆఫీస్ కు తీసుకువెళ్లారు. అక్కడే ప్రముఖ రచయిత, చారుమంజుదారుతో కలిసి నక్సల్ ఉద్యమాన్ని స్థాపించిన  ఉద్యమకారుడు  కె.జి సత్యమూర్తి అలియాస్ శివసాగర్ సార్ గారు, ఆయన భార్య పార్వతిగారు,  మరికొందరు సాహిత్యవేత్తలు, ప్రజాస్వామ్యవాదులు కలిశారు.  నేను రాసిన కవితలను తీసుకురమ్మని సత్యమూర్తి గారు చెప్పారు.  1997 జనవరి 14న సంక్రాంతి పండుగ.  అప్పటివరకు నేను రాసిన కవితలన్నింటిని తీసుకుని “ఏకలవ్య” పత్రిక ఎడిటర్ శివసాగర్ గారి ఇంటికి వచ్చాను. అందులోని ఒక  కవిత

తరతరాల చరిత్రపుటల్లో

తగిలేయబడ్డ వాస్తవాన్ని

అమాయకత్వపు అంచున నిలిచి

సమాజపు ఛీత్కారానికి

దగాకోరుల దర్పణానికి

ఇంట్లోని మగ అహంకారానికి బలైన దళితురాలిని

కారు చీకటిలోని నల్లని తారునై

వెండివెలుతురులోని మండే మంటనై

వాగులో వరదనై

వానలో బురదనై

ఎటు తోస్తే అటు గమ్యం తెలియక

వెనుదిరిగే వెర్రిదానని

మైనింగ్ ప్రాంతంలో ప్రజలతో

అక్షరాలకు దూరం చేసి నన్ను వెక్కిరిస్తారు

ఉప్పనే వచ్చినా

ఊర్లే కొట్టుకుపోయినా

ఈ బతుకునేలపై

తల్లేత్తుకుని నిలిచే

పిడిగెడు చైతన్యాన్ని

ఎన్నేన్ని అవమానాలు ఎదురైనా

ఎంతెంత అగచాట్లు ఎదురైనా

తలవంచక ఎదురునిలిచే

మాదిగ బతుకుల నుంచే తిరుగుబాటు ప్రకటిస్తున్నా

ఇంట్లోని అహంకారాన్ని

సమాజంలోని దురంకారాన్నిఉతికి ఆరేస్తా

అంటూ రాసుకున్నాను. అది చదివి బాగుందని మెచ్చుకున్నారు. అలా నేను రాసిన కవితల్లో ఏకలవ్య పత్రికలో ప్రచురించడానికి ఎంపికైన మొదటి కవిత ఇది. ఈ కవితను అప్పటి దసరా – దీపావళి సంచికలో వచ్చింది.  చదివి చాలామంది అభినందించారు. వెనువెంటనే మరో కవిత అచ్చు అయ్యే అవకాశం వచ్చింది. ప్రముఖ రచయిత ననుమాసస్వామి గారు “ఉస్మానియా దళిత దండోరా” పుస్తకం కోసం ఒక కవిత ఇవ్వమన్నారు.

అనంతమైన ఆకాశంలో

మినుకుమినుకుమనే నక్షత్రాల్లా..

అఆఇఈలు మనకు అందని చుక్కలైతే

నా అక్కఅన్నలని, అమ్మనాన్నలని

ప్రశ్నిస్తాను నేను ఎందుకు అందుకోలేదని

అక్షరమన్నది ప్రజ్వలించే సూర్యబింబమైతే

ఆ అక్షరాన్ని కబళించిన దగాకోరులను

మంటలమై మనమెందుకు అంటుకోలేదని

ప్రశ్నిస్తాను నా గతాన్ని పదేపదే

అంటూ రాసిన కవిత ఇచ్చాను. కొద్దిరోజుల తేడాతోనే వచ్చిన ఈ రెండు కవితలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఆ తర్వాత మరో కవిత పంపించమని అడిగారు. దళితులను మంత్రగాళ్లు అంటూ దహనం చేసే దురాగతాలు ఎక్కువగా జరుగుతున్న ఆ రోజుల్లో నేను రాసిన మరో కవిత “కాస్టం “

బతుకు కోసం

మెతుకు కోసం

భూమిపై ఉనికి కోసం

వెతకాల్సిన దౌర్బగ్యం

మంత్రగాళ్లని తంత్రగత్తెలని

చిత్రించి ముద్రించిన

దొడ్డు మనసుల గొడ్డుతనం

ప్రాణమున్న పచ్చనాకులని

పక్కకింద పాన్పు చేసి

బతుకు పొరలను వేటాడితే

అధికారులతో

అంటూ రాసిన కవిత  దళిత దండోరా సంచికలో వచ్చింది. ఈ మూడు కవితలు వెనువెంటనే రావడంతో ఎంతో గుర్తింపు వచ్చింది. శ్రీశ్రీ కవిత్వంలోని పదాలు కనిపిస్తున్నాయి అంటూ  చాలామంది ప్రశంసించారు.

తరుణి :   ఆవేశభరితమైన, ఉత్తేజకరమైన కవితలు రాశారు. ప్రముఖ కవి శ్రీశ్రీ గారి  మాదిరి పదాలు మీ కవిత్వంలో ఉంటాయని ప్రశంసలు అందుకున్నారు. మరి కథ ప్రక్రియలో మిమ్మల్ని ప్రోత్సహించిన వారు ఎవరూ? ఇప్పటివరకు వచ్చిన మీ రచనలు, అందుకున్న అవార్డుల గురించి చెప్పండి.

జాజుల గౌరీ :   నిస్సందేహంగా నాగప్పగారి సుందర రాజు గారే. మనసులోని భావాలను కవితల రూపంలో రాసేదాన్ని. నా కవితలు చదివి చాలామంది మెచ్చుకుంటూ లేఖలు రాసేవారు. అలా లేఖల ద్వారా పరిచయం అయిన నాగప్పగారి సుందరరాజు గారు ఎదురుచూపులు కథా సంకలనం కోసం కథ రాసి పంపించమని అడిగారు.  కథా వస్తువు మీ జీవితం నుంచి తీసుకోవాలి. అమ్మ భాషలో ఉండాలి అన్నారు. కొత్త రచయితలు, మాదిగ రచయితలు 30మంది మాత్రమే రాసిన కథలతో ఈ సంకలనం వచ్చింది.  అప్పటివరకు కవితలకే పరిమితమైన నేను మొదటిసారి కథ రాశాను. ఇరవై నిమిషాల్లో నాలుగు పేజీల్లో నేను రాసిన కథ మన్నుబువ్వ.  ఈ సంకలనంలో వచ్చిన మొదటి కథ మన్నుబువ్వ. చివరికథ దస్తకత్ రెండు కథలు నావే కావడం నాకు, నా కథలకు లభించిన అరుదైన అవకాశం. ఈ కథలు చదివిన తర్వాత ప్రముఖ రచయిత కొలకనూరి ఇనాక్ గారు,  బిసి కమిషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సామాజిక వేత్త బి.ఎస్. రాములు గారు లేఖల ద్వారా అభినందనలు తెలిపారు.  ప్రముఖ  కవి, దళితవాద ఉద్యమకారుడు కత్తి పద్మారావు గారు “కథా నిర్మాణంలో గొప్ప ఇంజనీరు గౌరీ” అంటూ అభినందించారు. నా కథలపై ప్రముఖ రచయిత పోరంకి దక్షిణామూర్తి గారు రాసిన ముందుమాటలో రాసిన వ్యాఖ్యానం బాగా నచ్చి ఏకధాటిగా  20 రోజుల్లో 20కథలు రాసేశాను. అప్పటివరకు ఎంతో మంది ప్రముఖులు తన ప్రశంసలను లేఖల ద్వారా తెలియజేశారు. అయితే నా కవితలు, కథలు, నవల ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో ప్రచురణకు నోచుకోలేదు.   బి.ఎస్. రాములు గారిని ఎనిమిదేండ్ల తర్వాత మొదటిసారి గుజరాత్ గాయం సభలో కలిశాను. ఆయన  నా కవిత్వాన్ని, కథలను ఎంతో మెచ్చుకున్నారు.  అదే సమయంలో సుశీల నారాయణ రెడ్డి గారి స్మారక అవార్డు ప్రకటన వచ్చింది. అప్పటికే నేను రాసిన కవిత్వం, కథలు, నవల రాశాను. అముద్రితంగా ఉన్నాయి. బిఎస్ రాములు సార్ గారి చొరవతో నా కథలన్నీ డిటిపి చేయించి, పోటీకి పంపించారు. ఆయన అందించిన ప్రోత్సాహంతోనే బిఎస్ రాములు గారి విశాల సాహిత్య అకాడమీ ద్వారా 2004లో నేను రాసిన కథలు మన్నుబువ్వ కథా సంకలనంగా వచ్చింది.  అంతేకాదు ఈ కథా సంకలనానికి  సుశీల నారాయణ రెడ్డి అవార్డు, చాసో సాహిత్య పురస్కారంతో పాటు 12 పురస్కారాలు వచ్చాయి. ఈ కథాసంకలనంలోని మన్నుబువ్వ కథ యోగి వేమన యూనివర్సిటిలో, కంచె కథ శ్రీకష్ట దేవరాయ యూనివర్సిటీలో పాఠాలుగా ఎంపికయ్యాయి. ఈ కథను  అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశీలనా పాఠంగా  తీసుకున్నారు. ఎంఫిల్, పిహెచ్ డి, పోస్ట్ పిహెచ్ డి లకు నా కథలు తీసుకున్నారు. అంతేకాాదు మౌళిక సాహిత్యంపై మక్కువగా గ్రామాల్లో తిరిగి అనేక పాటలను సేకరించాను.  తెలంగాణ జనపదం, జానపదం  మౌళిక సాహిత్యం పుస్తకం ప్రచురణకు సిద్ధంగా ఉంది.  ఇప్పటివరకు 300 పైగా కవితలు 75పైగా కథలు, ఒక నవల 20 పాటలు రాశాను. భూమి బిడ్డ కవితా సంకలనం, ఇంకో రెండు పుస్తకాలు అచ్చువేయాల్సి ఉంది. 

తరుణి :  జర్నలిస్ట్  అవుదామనుకున్నారు. కష్టపడి చదివి ఇంటర్వ్యూ వరకు వచ్చినా ఉద్యోగం కొద్దిలో తప్పిపోయింది. దళిత సాహిత్యవేత్తగా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అడ్వకేట్ గా ఎందుకు కెరీర్ ఎంచుకున్నారు?

జాజుల గౌరీ :  మనం ఏదో కావాలని అనుకోవడం కాదు. మనల్ని కాలమే ఎంచుకుంటుంది అని గట్టిగా నమ్ముతాను. జీవితంలో వచ్చే ప్రతి మలుపు కొత్త గమ్యం దిశగా నా గమనం సాగింది. గ్రూప్ 1 పరీక్షలు రాశాను. ఇంటర్వ్యూ వరకు వచ్చాను. చాలా బాగా ఇంటర్వ్యూ చేశాను. అయినా పిఆర్ఓ ఉద్యోగం  రెండు మార్కులతో పోయింది. ఈ పోస్ట్ కు నాతో పాటు పోటీ పడిన ఆమె  ఆంధ్ర, నేను తెలంగాణ అంతే.. పిఆర్ఓ ఉద్యోగం చేజారి పోవడంతో కొన్నిరోజులు దిగులు పడ్డాను. దాదాపు మూడునెలలు సరిగ్గా నిద్రపోలేదు. ఆ తర్వాత మళ్లీ చదువు వైపు దృష్టి మళ్లింది. పిజీ చేద్దాం అనిపించింది. అయితే నేను పనిచేసే ఆఫీస్ లో మా బాస్ నేను ఎప్పుడు మాట్లాడినా లా పాయింట్లు మాట్లాడుతున్నావు  అనేవారు. దాంతో ఎందుకో నాకు తెలియకుండానే అడ్వకేట్ కావాలన్న ఆలోచన వచ్చింది. అంతకు పదేళ్ల ముందే ఆల్వీన్ లో మా ఆయన ఉద్యోగం పోయింది. తమ హక్కుల కోసం ధర్నా చేసిన వారందరినీ అరెస్ట్ చేసి కేసు పెట్టారు. మా ఆయన కోసం  కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.  నల్లకోటు వేసుకున్నవారు గొప్పగా కనిపించారు. నాంపల్లి కోర్టు ఆవరణలోని వేపచెట్టు కింద నిలబడి అడ్వకేటు కోటు వేసుకోవాలని కలలు కన్నాను. ఆ తర్వాత లా సెట్ రాసి ఎల్ ఎల్ బి, ఎల్ ఎల్ ఎం(క్రిమినల్ లా) పూర్తి చేశాను. న్యాయవిద్యలోనే పిహెచ్ డి ప్రవేశం కూడా వచ్చింది. అయితే పూర్తి చేయలేకపోయాను. ఇదంతా కూడా ఒక పెద్ద యుద్దమే. కొద్దిరోజులు ప్రాక్టీస్ చేసిన. సీన్సియర్ అడ్వకేట్ గా పేరుతెచ్చుకున్నాను. ఎక్కువగా ఎన్జీవోలతో కలిసి న్యాయపరమైన సహాయం అందించాను.  మరోవైపు ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక అధ్యక్షురాలిగా పనిచేస్తూ, దళిత బహుజన సామాజిక ఉద్యమాలతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో విసృత్తంగా పాల్గొన్నాను. 

స్కూల్ పర్యవేక్షణలో

తరుణి :   మాదిగ సాహిత్య వేదిక  గురించి మీకు ఎలా తెలిసింది ?

జాజుల గౌరీ :   చదువు, సాహిత్యం తీసుకువచ్చిన మార్పు ఇది. డిగ్రీ కోసం కాలేజీలో చేరితే సాహిత్యరంగం పరిచయం అయ్యింది. ఒకవైపు చదువు,  సాహిత్యం, మరోవైపు కుటుంబం భర్త ఉద్యోగం, పిల్లల చదువులు. నేను పనిచేసే ఆఫీస్ కు ఈనాడు పత్రిక వచ్చేది. పత్రిక మొత్తం చదివేదాన్ని.  అందులో ఒకరోజు నాగప్ప గారి సుందర రాజు గారు మాదిగ సాహిత్య వేదికకు కవితలు కావాలని ప్రకటన ఇచ్చారు. దాంతో నేను రాసిన 8,9 కవితలు పంపించాను.  ఆ తర్వత కొద్దిరోజులకు పోస్ట్ లో పెద్దకవర్ వచ్చింది. నేను పంపిన కవితలన్నీ తిరిగి వచ్చాయి అనుకున్నాను. కానీ, నా అంచనాలు తారుమారు చేస్తూ నాలుగు పేజీల ఉత్తరం అందులో ఉంది.   కవితలన్నీ బాగున్నాయి. “ఇంతటి కలం బలం ఉన్న బలమైన గళం ఇంతవరకు దళిత ఉమ్మడి సాహిత్యంలో కనిపించలేందుకు” అని అడుగుతూ..”చాలా బాగా రాసారు” అంటూ అభినందిస్తూ, మరిన్ని సూచనలు చేస్తూ నాగప్ప గారి సుందర రాజు గారు రాసిన ఉత్తరం. అది చదవగానే ఆనందం కలిగింది. గతంలో రాసి పంపిన కవితలపై ఎలాంటి సమాచారం లేకపోవడం వల్లనేమో ఈ ఉత్తరం నాలో కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత నేను రాసిన కవితలు పంపించడం, ఆయన సూచనలు చేస్తూ, అభినందిస్తూ ఉత్తరాలు రాయడం జరిగింది. చాలా రోజుల తర్వాత   ఛండాల చాటింపు సాహిత్య సమావేశంలో ఆయనను కలవడం జరిగింది.

తరుణి :   ఎంఆర్ పిఎస్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యోగం నుంచి ఉద్యమం వైపు  సాగిన పయనం?

జాజుల గౌరీ :   ఏకలవ్వ పత్రిక నుంచే సాహిత్య ప్రస్థానంతో పాటు ఉద్యమం కూడా నా జీవితంలో ప్రారంభమైంది. సాహిత్యవేత్తలనే కాదు ఉద్యమకారులు చదివే ఏకలవ్వ పత్రికలో నా కవితలు చూసి కృపాకర్ మాదిగ ఫోన్ చేశాడు.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పిఎస్) సమావేశం ప్రెస్ క్లబ్ లో జరుగుతుంది రమ్మని చెప్పారు. మొదటిసారి నేను ఎంఆర్ పిఎస్ ఉద్యమానికి వెళ్లాను. ఆ సభలో మేరీ మాదిగ గారు, కృపాకర్ మాదిగ ఆ తర్వాత మంద కృష్ణ మాదిగ గారు పరిచయం అయ్యారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఆ సమయంలో దళితుల జీవితాలను, వారి సాహిత్యాన్ని , ఉద్యమ క్రమాన్ని గ్రంథస్తం చేయడానికి మేధావి వర్గాన్ని ఆహ్వానిస్తున్నామని ఒక సమావేశంలో చెప్పారు.  మాదిగ సాహిత్య వేదికకు ఎనలేని సేవలు అందించిన  డాక్టర్ కొల్లూరి చిరంజీవి, దార్ల వెంకటేశ్వర రావు తదితరులతో కలిసి ఐదారు సమావేశాలు జరిగిన తర్వాత మాదిగ సాహిత్య వేదిక  1998 – 1999 మధ్య ఏర్పడింది. డాక్టర్ నాగప్ప సుందర్ రాజు గారు కన్వీనర్,  నేను ఉపాధ్యక్షురాలిని. అప్పటికీ నాకు సాహిత్యంలో ఓనమాలు కూడా సరిగ్గా తెలియవు. కానీ, చదువు జీవితాన్ని మార్చుతుందన్న నా జీవనపోరాటమే ఈ ఉద్యమంలో నాకు స్థానం కల్పించింది. మాదిగ దండోరా ఉద్యమంలో నేను మాదిగ సాహిత్య వేదికకు ఉపాధ్యక్షురాలుగా 1998 నుంచి కొనసాగుతున్నాను.  ఇప్పటికీ నా రచనలు మాదిగ సాహిత్య వేదికకు కొనసాగింపుగానే వస్తున్నాయి.

తరుణి :    మీరు కవిత్వం రాస్తే ఆ పదాలు ప్రజలను చైతన్యపరుస్తాయి. కథల్లోని పాత్రలు సజీవంగా కండ్ల ముందు నిలిచి వాస్తవితను తెలియజేస్తాయి అంటారు. రచయితగా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమనేతగా ప్రజల్లో మమేకమైన మీ జీవితం రాజకీయ రంగం వైపు ఎలా మలుపు తిరిగింది?

జాజుల గౌరీ :  కాలం దిద్దిన జీవితం నాది. నాకు ఏదీ కావాలని నేను ప్రయత్నం చేయలేదు. నా పిల్లల భవిష్యత్ కోసం మంచి ఉద్యోగం కావాలనుకున్నాను. అందుకోసం చదువు అనే ఆయుధాన్ని ఎంచుకున్నాను. ఆ చదువు, సామాజిక అంశాల పై అవగాహన పెంచింది. గ్రూప్ 1 ఉద్యోగం చేజారడంతో నాలాగా ఎందరో అన్న భావనతో ఆ సమయంలో నా జీవితం ఒక జీవనమరణ సమస్య. ఉద్యోగం చేజారిన వెంటనే నేను చేసిన మొదటి పని నా జీవితాన్ని కథలు కథలుగా రాశాను. బతుకుదేరువు కోసం ఒకవైపు చిన్న ఉద్యోగం చేసుకుంటూనే  న్యాయవిద్యను చదివి అడ్వకేట్ గా మారాను. ప్రజలకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు పరిష్కారం సూచిస్తూ స్వచ్చంధ సంస్థలతో కలిసి పనిచేశాను. నా దినచర్యతో, కవితలతో నిండే డైరీలు కౌన్సిలింగ్ స్టోరీలతో నిండాయి. వందలాది కుటుంబాల సమస్యలను పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగు నింపే అవకాశం నాకు లభించింది.   అనునిత్యం ప్రజల్లో ఉన్నా.. ప్రజలతో ఉన్నా.. దాంతో రాజకీయ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది.  ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ఎస్  ప్రభాకర్ గారు నా సేవలు చూసి పార్టీ లోకి ఆహ్వానించారు. ఉద్యమ బాట ఎంచుకున్న నాకు సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకు సామాజిక అభివృద్ధి ఫలాలు అందాలన్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి వ్యాఖ్యానాలు, అట్టడుగు వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్న భారతీయ జనతాపార్టీ సిద్దాంతాలు నచ్చాయి. ఆ  పార్టీ ఆహ్వానం మేరకు 2013లో  రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో పార్టీలో చేరాను.

తరుణి :   ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా, ధనబలం లేకుండా రాజకీయాల్లో రాణించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. మరి మీకు రాజకీయ పార్టీలో ఎలాంటి అవకాశాలు లభించాయి.?

జాజుల గౌరీ :   నిజమే. నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చాలామంది నన్ను అవహేళన చేశారు. నాయకత్వం, రాజకీయాలు అంటే ఆమెకు ఎం తెలుసు అన్నారు.  అయితే నేను బాధపడలేదు. ఎందుకంటే నేను ప్రతి రంగంలోనూ జీరో నుంచి ప్రారంభం అయ్యాను. రచయితగా నాకు ఎలాంటి వారసత్వం లేదు. ఉద్యమల్లో ఎలాంటి వారసత్వం లేదు. ప్రతిచోట నన్నునేను తీర్చిదిద్దుకుంటూ ఎదిగాను. ఇందుకు కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచింది. మా చిన్నబాబు లేఖక్ శ్రీ సిద్దార్థ్  పుట్టిన కొద్ది నెలల తర్వాత మా ఆయనకు పక్షవాతం వచ్చింది.  ఇంట్లో బాధ్యతలు పెరిగాయి. అదే సమయంలో పార్టీలో ఎక్కువ సమయం పనిచేయాల్సిన అవసరం ఉంది. పెద్దబాబు మహేష్ కుమార్ బాధ్యతలను తీసుకున్నాడు. అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. ప్రజల కోసం పనిచేయడం అనేది కొందరికే సాధ్యం అవుతుంది. నీవు పార్టీ కోసం పనిచేయి.. నేను ఇంటికోసం పనిచేస్తాను అంటూ తండ్రిగా ధైర్యం ఇచ్చాడు. నా కుటుంబం ఇచ్చిన అండతో రచయితగా, జర్నలిస్ట్ గా, ఉద్యమకార్యకర్తగా, న్యాయవాదిగా ఉన్న అనుభవంతో రాజకీయ రంగంలో పనిచేసేందుకు సిద్ధమయ్యాను.

తరుణి :   అతి తక్కువ కాలంలోనే జాతీయస్థాయి నాయకురాలిగా ఎదిగారు. భారత బొగ్గుల గనుల శాఖ, జార్ఖండ్ రాష్ట్ర డైెరెక్టర్ గా పనిచేశారు. రాజకీయ రంగంలో ఎదురైన మీ అనుభవాలు ..

జాజుల గౌరీ :   సంఘర్షణ నుంచి మొదలైన నా జీవిత సంఘటనల నుండి  ఎంతో నేర్చుకున్నాను.  అక్షరాలు నేర్చుకునే సమయంలోనే అణిచివేతను గమనించాను.  నిరంతరం నిత్య విద్యార్థిగా ఈ సమాజం నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవడం అలవాటు అయ్యింది. రాజకీయ రంగంలోనూ నాకున్న పరిశీలన, అవగాహన ఉపయోగపడ్డాయి. ప్రజల మధ్య ఉండే అవకాశం కల్పించిన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నా శాయశక్తుల కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. పార్టీ నాకు ఇచ్చిన పనిని మనసావాచాకర్మన పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమించాను.  ఉప్పల్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చినా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి బాధ్యతలు ఇచ్చినా అంతే అంకితభావంతో పనిచేశాను. స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ గా, బిజేపి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను.  ఆ తర్వాత భారత బొగ్గుగనుల శాఖ, జార్ఖండ్ డైరెక్టర్ గా నియమించారు. దేశ సంపదనను సృష్టించే  అక్కడి ప్రజల జీవనవిధానం తెలుసుకునే అవకాశం కలిగింది. కేవలం అధికారిగానే కాకుండా ప్రజల్లో ప్రజల మనిషిగా మమేకం అయ్యాను. నా దృష్టికి వచ్చిన వారి సమస్యలను ఉన్నతస్థాయి అధికారులకు తెలియజేసి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాను.  కార్మికుల ఆత్మీయతను అందుకున్నాను. త్వరలోనే వారి జీవితాలపై నా పరిశీలన ఒక పుస్తకంగా రానుంది.

ప్రధాన మంత్రి మోదీగారికి స్వాగతం పలుకుతూ

తరుణి :  బహుముఖ రంగాల్లో మీ ప్రతిభను చాటుతున్నారు. ఏ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారు?

జాజుల గౌరీ : సాహిత్యం, ఉద్యమం, రాజకీయ ఈ మూడు నా జీవితంలో ఒకదానితో ఒకటి అంతర్లీనంగా పెనవేసుకున్నాయి.  వ్యవస్థలుగా పనిచేసిన ఎంతో మంది వ్యక్తులు,ఎన్నో ఎన్జీవోస్, విద్యా సంస్థలు, సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, నాకు గురువులుగా దిశా నిర్దేశన చేసి మార్గదర్శకత్వాన్ని ఇచ్చారు . వారందరికీ కృతజ్ఞతలు.

అయితే రెండు విషయాల్లో నాకు స్పష్టత ఉంది. ప్రజా సేవ తక్షణం నన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లితే,  సాహిత్యం నా తదనాంతరం కూడా నన్ను ప్రజల్లో ఉంచుతుంది. జనం ఎక్కడుంటే మనం అక్కడే అన్నదే  నా జీవిత లక్ష్యం. సాహిత్యం ద్వారా ఉద్యమంలోకి వచ్చి.. ఉద్యమంలో శ్రమించి రాజకీయ రంగంలో ఉన్నాను. ఎక్కడ ఉన్నా ప్రజల మధ్యే నా జీవితం. ప్రజల కోసమే నా ఆరాటం. ఎందుకంటే సమాజంలో  అట్టడుగు ప్రజల జీవితం ఎప్పుడు వారి ప్రమేయం లేకుండానే ఒకరి చేత శాసించబడుతూ తెల్లవారకుండానే  పొద్దుగుంకుతుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి.  ఈ అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను నా కలంతో ప్రశ్నిస్తాను.. ఎదిరిస్తాను. ఏ పదవిలో ఉన్నా ప్రజల కోసమే ఆలోచించి పనిచేస్తాను. 

తరుణి :  ఇటీవల మీరు రాసిన ఒక పాట మా కోసం…

జాజుల గౌరీ :

అక్కంటే ఆ అంటది

అమ్మంటే అభయమిస్తది

మాతా మనికేశ్వరి శిష్యురాలు

కళ్యాణ కర్ణాటక బిజెపి నాయకురాలు

ఆమే మన లలితక్క ఆమె మన లలితమ్మ “ఆమే”

జనం బాటన నడిసొచ్చే ప్రగతి పథము రా

 ప్రజల కొరకు ప్రాణమిల్లే ప్రజల మనిషి రా

 అన్యాయాన్ని ఎదిరించే జననాయకిరా

అడుగడుగున వెంటుండే మన నాయకిరా “ఆమే”

అడుగడుగున రాజసం

అణువణువున నీరాజనం

 పుడమి అంత ఓర్పు తనం

ప్రకృతంత నేర్పు తనం

బహుజన బహుటమై తల ఎత్తినది. “ఆమే”

హక్కులకై ఆరాటం

వసతులకై పోరాటం

కదం కదం కలిసి అక్కతో కలిసి సాగుదాం

పదం పదం కలిపి బహుజన పాట పాడుదాం

 వికసించిన కమలానికి ఓటు వేద్దాం

 పల్లె బాట నడిచి ప్రగతికి బాటలు వేద్దాం “ఆమే”

తరుణి :  నేటి రాజకీయ రంగంలో రాణించాలనుకునే మహిళలకు మీరిచ్చే సూచన, సలహా..

జాజుల గౌరీ : నేడు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. బిజేపి పార్టీ మహిళలకు రాజకీయరంగంలోనూ పెద్దపీట వేస్తుంది. మహిళలు అన్నిరంగాల్లో వస్తున్నా రాజకీయ రంగం అనగానే తమకు సంబంధించినది కాదని వెనుకడుగు వేస్తున్నారు. నిర్ణయాధికారం తీసుకునే స్థాయిలో మహిళలు ఉన్నప్పుడే సమాజం పురోగతి సాధిస్తుంది. అయితే ఏదో కావాలని ఆశించి అడుగులు వేయడం కన్నా తమ చుట్టూ ఉన్న సమస్యలపై స్పందిస్తూ.. తమను తాను తీర్చిదిద్దుకుంటూ సమాజ హితం కోసం పని చేయాలి. ప్రజల మధ్య నిత్యవిద్యార్థిగా ఉండాలి. ప్రజల సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కారం దిశగా పనిచేయాలి. అప్పుడే రాజకీయరంగంలోనూ మహిళలు రాణించగలుగుతారు.

https://www.facebook.com/JajulaGowramma?mibextid=ZbWKwL

https://m.facebook.com/story.php?story_fbid=pfbid01EhuEUp23KMk3WNYkV5TP8jMHCgjydbs1HXmVqZSFzsnnvvgAYMpA6mALUnLUWZCl&id=100043271405675&mibextid=Nif5oz

ఎస్ యశోదా దేవి

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి ముఖ చిత్రం

పౌరాణిక స్త్రీలు