మిగతా పౌరాణిక స్త్రీల వలె సత్యవతి పాత్ర అంతగా వెలుగులోకి రాలేదు. కురువంశ విస్తరణకు బీజం వేసి, మహాభారత గ్రంధానికి తెరతీసింది సత్యవతియే.మహాభారతంలో, లోక విదితమైన ” భీష్మాచార్యుని” తండ్రి అయిన శంతన మహారాజు భార్య. కౌరవ పాండవులకు మహా పితామహురాలు.
కౌరవ వంశ మాత అయిన ఈమె ఒకప్పుడు పల్లె పెద్ద అయిన దాసరాజు కుమార్తె. పుట్టుకతో ఈమె శరీరము నుండి ఎల్లప్పుడూ చేపల వాసన రావడంతో ” మత్స్య గంధి “అని పేరు కూడా ఉండేది. పరాశర మహాముని ఈమెను చూచి కామించాడు. తాపస్సులకు ఇది తగదని ఆమె వారించిన నిగ్రహించు కోలేకపోయాడు. అలా వారి సంగమం వలన ఆమె” సద్యో గర్భమున ” కృష్ణ ద్వైపాయనుడు ( వ్యాసుడు) జన్మించాడు . ఆమె శరీరం నుండి చెడు వాసన పోయేటట్లు, ఆమె కన్యాత్వము చెడకుండా ఉండేటట్లు వరమిచ్చి పరాశయుడు తన దోవన తాను వెళ్లిపోయాడు. అప్పటినుండి ఆమె శరీరం యోజనం మేర సుగందాలు విరజింపటం వలన మత్స్య గంధి అల్లా “యోజన గంధి ” అయింది.
భారతంలోని ముఖ్య పాత్ర అయినా భీష్ముడి తండ్రి శంతన మహారాజు వేటకు వెళ్లినప్పుడు సత్యవతిని చూచి మోహించి, ఆమె తండ్రి అయిన దాసరాజుని ఆమెని ఇచ్చి వివాహం చేయమని కోరాడు. దానికి దాసరాజు తన కుమార్తె సంతతికే రాజ్యాధికారం ఇవ్వాలని, అలా అయితేనే నా కుమార్తె నిస్తానని దాశరాజు నిక్కచ్చిగా పలికాడు అప్పటికే శంతనునికి గంగ ద్వారా” భీష్ముడు” అనే కుమారుడు ఉన్నాడు. శంతనుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే భీష్ముడు తండ్రి విచారానికి కారణం తెలుసుకొని, తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణంగా ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతిని తనకు మాతృమూర్తిగా చేసుకోమని కోరాడు కూడా.
సత్యవతి శాంతనులకు చిత్రాంగుడు, విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. శంతనుని మరణాంతరం చిత్రాంగుడు ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు. తరువాత విచిత్ర వీరుడు రాజయ్యాడు. అంబా అంబాలికలతో వివాహం కూడా జరిగింది. కొద్ది కాలానికి కామలాలసుడైన విచిత్ర వీరుడు కూడా మరణించాడు. ఇక వంశ పరిరక్షణకు వేరే మార్గం లేక సవతి కుమారుడైన భీష్ముని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది. కానీ ఆయన తన ప్రతిజ్ఞను వీడనున్నాడు. కోడళ్ళు అయిన అంబికా అంబాలికాలకు ” దేవన్యాయం ” ప్రకారం సద్యోగర్భం ద్వారా తనకు జన్మించిన వ్యాసునితో “ఆదానం ” జరిపించి వంశాన్ని నిలబెట్టిన ఆదర్శవనిత సత్యవతి. అందుకే భీష్ముడు ” తన కన్న తల్లి అయిన గంగవలే ఈమె కూడా పరమ పవిత్రమూర్తి. ” అన్నాడు
తర్వాత అంబా అంబాలికల ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. వారి పుత్రులే కౌరవులు,పాండవులు.సత్యవతి తన గతించిన కుమారులను, మనుమలను ఎంతగానో ప్రేమతో చూసుకునేది. వారి ఆలనా పాలనా చూసేది. తన పిల్లలను కోల్పోయిన గాయాల నుంచి సత్యవతి హృదయం అంత త్వరగా కోలుకోలేకపోయింది. మహాస్వాద్వి సత్యవతి వృత్తాంతం ఇది.
ఇలాంటి ఆదర్శనారీమణులు ఎందరో…. అందరికీ వందనాలు.