చెప్తానే! నేను తప్పకుండా వస్తా!
‘లేదు లేదు’మాట తప్పను.”
——
” లేదు, ఇంట్లో చెప్పలేదు. చెప్పకుండా ఎందుకొస్తానే? ఈ రోజే చెప్తాను,సరేనా”
అచ్చుతమ్మ ఫోన్లో గట్టిగా మాటాడుతుంటే ముందు హాల్లోకి వినిపిస్తున్నాది. రమామణి కాఫీ
కప్పులు తీసుకొచ్చి కాబోయే వియ్యపురాలికి, వియ్యంకుడికీ ఇస్తున్నాది. సత్యమూర్తి కాఫీ కప్
తీసుకుంటూ “రమా! అమ్మ ఎవరితొ మాటాడుతోంది! ఎక్కడకి వస్తానంటోంది” అని అడిగేడు.
“ఏమోనండీ! నిన్న కూడా ఫోన్ లో “వస్తాను, చెప్తాను,అంటున్నారు”
అని రమామణి అంటుండంగానే అచ్చుతమ్మ సెల్ ఫోన్ లో “అయిదు నిమిషాల్లో ఫోన్ చేస్తానుగా” అంటూ
హాల్లోకి వచ్చింది.
కాఫీలు తాగుతున్న దేవకీ, శివరావులని చూసి “ఎంతసేపయిందమ్మా, మీరొచ్చి?” అని ఆదరంగా పలకరించింది.
“ఇప్పుడే పిన్నిగారూ, ఓ పావుగంట అయిందేమో, కూచోండి” అంది
దేవకి. రమామణి లోపలకి వెళ్ళి ఇంకో కప్పు కాఫీ తెచ్చి అత్తగారికి ఇచ్చింది. “అమ్మా ఎక్కడకి వస్తాను
అంటున్నావ్?” సత్యమూర్తి కప్పు టేబుల్ మీద ఉంచేస్తూ అన్నాడు.
“చెప్తాలేరా…ఒక దగ్గరకి వెళ్ళాలి” క్లుప్తంగా అంది అచ్చుతమ్మ.
సత్యమూర్తి కనుబొమలు ముడిపడ్డాయి. దేవకి ఆసక్తిగా చూస్తున్నాది.
“క్లియర్ గా చెప్పమ్మా, మన కిషోర్ కి కాబోయే అత్తగారు, మావగారు, మనవాళ్ళే. వాళ్ళదగ్గర దాచిందికి ఏమీలేదు” అన్నాడు సత్యమూర్తి.
“అబ్బే, వాళ్ళు వినకూడదని కాదురా, నా ఫ్రండ్ సుశీల గురుతుందా, తెగ రమ్మంటున్నాదిరా”
“ఇప్పుడు దేనికీ? సుశీల పిన్నిఇప్పుడు ఎక్కడుంది?”
“సుశీల పిన్ని, భర్త చనిపోయిన తరవాత ఇల్లు వెనక గదులు వేయించింది”
“దేనికీ? కొడుకు అమెరికాలో ఉన్నాడు. తీసుకెళిపోతాను అన్నాడుగా” అనుమానంగా చూసేడు సత్యమూర్తి.
“వినుమరీ, అమ్మా రమా నువ్వూవిను, మా స్నేహితులు రంగనాయకీ, విమలమ్మ, సత్యవతీ సుశీలని తెగ ప్రాధేయ పడుతున్నారట. అందరం కలిసి ఉందాం అని”
“అయితే?” రమ అడిగింది “అదేనే, నన్ను కూడా సాయానికి రమ్మంది. వాళ్ళ మేనల్లుడు భార్యా
పక్క ఎపార్టమెంట్ లోనే ఉంటారు.
ఒక వంటమనిషినీ పనిమనిషినీ పెట్టేరు. ప్రతీ గదికీ ఎటాచ్డ్ బాత్ రూమ్ ఉంటాయి. టివి కావాలంటే
వాళ్ళు పెట్టుకుంటారు. నేను ఉంటే దానికి ధైర్యం అంటుంది సుశీల”
ఆగింది.
“నీకు పిచ్చా ఏమిటమ్మా? ఈ వయసులో ఓల్డ్ ఏజ్ హోమ్ లొ ఉన్నట్టు అక్కడ ఎందుకు? నాకు నచ్చలేదు”
కోపంగా అన్నాడు సత్యమూర్తి.
రమామణి విసుగ్గా చూస్తోంది.
అచ్చుతమ్మ నిదానంగా “నాయనా సత్యం, సుశీలపిన్ని నీకు బాగా తెలుసు. రెండు గంటలు ప్రయాణం.
నేనేం శాశ్వతంగా ఉండను కదా, ఆపాటి సాయానికి వెళితే ఏమయిందిరా, నిన్ను ఎలా అయినా ఒప్పించమందిరా” అంది.
దేవిక కూడా చనువుగా “అయ్యో పిన్నిగారూ, మా ప్రణవికి అందరూ
ఉన్న కుటుంబం అంటే ఇష్టం. మీరూ వదినగారు ఇంటి దగ్గరే ఉంటారు. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని నేను
ఆశపెట్టుకుంటున్నా. మనవడి పెళ్ళి ముందు ఎందుకండీ?” అంది.
రమామణి నిష్ఠూరంగా “మీరయినా చెప్పి ఒప్పించండి వదినగారూ, నేను ఇదేవినడం. ఎవరన్నా వింటే నన్ను
తిట్టుకోరూ?” అంది కొంచెం కోపంగా.
“అయ్యో తల్లులూ, అదేం కాదు. కిశోర్ పెళ్ళి అవకుండా ఎక్కడికీ వెళ్ళను. అమ్మాయ్ దేవకీ, నువ్వూ రమా నాకు సమానమే సుమా, ఇందాకల అబ్బాయి అన్నాడు కదా, మనం అందరం ఒక కుటుంబం మాదిరే అని. ఆ చనువుతోనే చెప్తున్నాను. నేను ఎల్లకాలం అక్కడ ఉండను. పాపం సుశీలకి కాస్త సేవాగుణం ఎక్కువ. ఇలా తెలిసిన వాళ్ళని రెండు ఇళ్ళలో ఉంచి కొన్నాళ్ళు చూద్దాం అనుకుంటోంది. నన్ను రమ్మని ఎంతో ఇదిగా అడుగుతోంది. రానంటే బాగోదర్రా… మనలో మనం సహకారంగా
ఉండొద్దూ? సత్యం బాబూ, పెళ్ళికి సుశీల పిన్ని వస్తుంది. దాన్ని ఏమీ అనకేం” అంది అచ్చుతమ్మ.
దేవకి నవ్వుతూ “పిన్నిగారూ, మీ ఫ్రండ్ గుణం నాకు తెలీదుగానీ, మీకు మాత్రం చాలా హెల్ప్ చేసే స్వభావం ఉందండీ, ఈ వయసులో వాళ్ళకోసం ఉంటాను అని ఒప్పుకున్నారంటే గ్రేటే” అంది.
అచ్చుతమ్మ మొహం విప్పారింది.
రమామణి మొహం ‘ధుమ ధుమ’ లాడుతోంది. ఆ రోజుకి సమావేశం ముగిసింది.
కిశోర్ పెళ్ళికి ముందు మళ్ళా ఇంట్లో సత్యమూర్తి, రమామణీ, కిశోర్ ఫేమిలీ మీటింగ్ పెట్టి అచ్చుతమ్మ
సుశీల ఇంటికి వెళ్ళడం పట్ల స్పష్టంగా అయిష్టం చెప్పేరు.
“ఏమోరా, మీ నాయనమ్మకి నేను చేసినవి నచ్చటంలేదేమో, ఏవండీ, మీ అమ్మకి నా మొహం చూడ్డంకన్నా
వాళ్ళ స్నేహితురాళ్ళ మొహాలే ఇష్టం ఏమో, లేకపోతే నా కొత్త కోడలు నన్ను ‘అత్తగారిని తగిలిసిందని’ అనాలని మనసులో ఉందేమో ” పుల్లవిరుపుగా అన్నాది రమామణి.
ఎవరెన్ని అన్నా, బతిమాలినా సరే అచ్చుతమ్మ కొన్నాళ్ళు అక్కడ ఉండి వచ్చేస్తాననే అందిగానీ అభిప్రాయం మార్చుకోలేదు.
అంగరంగ వైభోగంగా పెళ్ళి అయిపోయింది. ఎక్కడవాళ్ళు అక్కడ సద్దుకున్నారు. కొత్తకోడలు ప్రణవి ఇంకా కాపురానికి రాకముందే అచ్చుతమ్మ సుశీల దగ్గరకి బయల్దేరింది.
“నువ్వు ఇంతలా పట్టుపట్టేవు కాబట్టి సరే గానీ, అమ్మా వేగంవచ్చీ” అయిష్టంగా సాగనంపేడు సత్యమూర్తి. రమామణి
మండిపడుతూ కనీసం పైకిఅయినా రాలేదు.
తన మనసులో భయాలు పూర్తిగా సుశీలకి కూడా చెప్పలేదు అచ్చుతమ్మ.
కొడుకు చిన్నతనంలో భర్త చనిపోతే అచ్చుతమ్మ సత్యమూర్తిని కళ్ళలో ఒత్తులు వేసుకొని పెంచింది. పెరిగి పెద్దయి బేంక్ ఉద్యోగస్తుడు అయేడు సత్యమూర్తి.
ఏదో పెళ్ళిలో రమామణిని చూసి తల్లికి ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని ఉందని చెప్పేడు. రమామణితో స్వయంగా మాటాడి ఒప్పించేడు. నామకహా ఆమె తల్లితండ్రులు అచ్చుతమ్మతో మాటాడినా పెళ్ళి అంతా వాళ్ళ ఇష్టప్రకారం జరిగింది.
అప్పటికి అచ్చుతమ్మకి కూడా స్థితప్రఙ్ఞత లేదు. కొడుకు దూరం అవడానికి రమామణే కారణం అన్న ఆవేశం చూపించేది. ఏదో కారణంకి ఇద్దరికీ దెబ్బలాటలు అయేవి. రమామణి పిసరంత తగ్గేదికాదు.
ఏళ్ళు గడిచి అచ్చుతమ్మ మారిందిగానీ రమామణి మారలేదు. అత్తగారిని చులకనగా, హేళనగా మాటాడ్డం,
ఆవిడని ఓ గడ్డిపరకలా తీసీడం రమామణికి నిత్యకృత్యంగా అయేయి.
సత్యమూర్తి ఒకటి రెండుసార్లు మందలించినా, ఆమె తిరుగులేని తప్పు అత్తగారి వేపునించే చూపించి భర్త
నోరు మూయించేది.
ఈ పరిస్థితుల్లో కిషోర్ పెళ్ళి కుదిరింది. అచ్చుతమ్మ కొంచెం భయంగా ఉంది.ప్రణవి ఇంట్లో అడుగు పెట్టేసరికి, ఇల్లు ఆమెకి హాయిగా ఉంది అనిపించేలా ఉండాలి. అంటే రమామణి కాస్త ప్రసన్నంగా నవ్వుతూ ఉండాలి.
తను ఉంటే జరగదు. రమామణికీ, ప్రణవికీ ఒక అవగాహన రావాలి.
ఆ సమయంలో మధ్యలో తనలాటి వృద్ధులు ఉంటే జరగదు. రమామణి ఏరోజూ వ్యంగ్యాలు, పాతవిషయాలు తలచుకొని దెప్పడాలు మానదు.
ప్రణవికూడా తన అత్తగారి పట్ల, తన అత్తగారిలాగే అయితే? “మహామీకు మీ అత్తగారితో ఏం సఖ్యత ఉంది?” అంటే?
ఎందుకొచ్చిన మాటపేచీలు. మొదట కొన్నాళ్ళు అని చెప్పి సుశీలతో వెళుతోంది. అక్కడ నచ్చితే మళ్ళా కొడుకు ఇంటికి వెళ్ళకుండా ఉండాలన్నదే ఆమె ఉద్దేశం.
తన అవసరాలకి తన దగ్గరున్న డబ్బు చాలు. “భగవంతుడా, నా కొడుకు కోడలునీ, వాళ్ళ కొడుకూ, కోడలినీ పుట్టబోయే పసివాళ్ళనీ దీవించు” అని మాతృ హృదయంతో దేవుడికి దండం పెట్టింది అచ్చుతమ్మ.