ఆశాకిరణ్

మాలాకుమార్

ఆశా, కిరణ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోనే ప్రేమలో పడిపోయారు. ఒక వైపు చదువు, ఇంకో వైపు కిరణ్ కు ఇష్టమైన శోభన్ బాబు సినిమాలు చూస్తూ, ఆడుతూపాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసారు. ఇద్దరికీ GRE లో మంచి స్కోర్ రావటముతో యు.యస్ లో మంచి యూనివర్సిటీలో యం.యస్ లో సీట్ వచ్చింది. అదృష్టవసాత్తు ఇద్దరికీ ఒకే యూనివర్సిటీ లో రావటముతో వారి ఆనందానికి అవధులేకుండా పోయాయి. కాకపోతే ఓ చిక్కు వచ్చి పడింది. ఇద్దరి ఇళ్ళల్లోనూ వారి ప్రేమను ఆమోదించినా, ఆశ తాతయ్య మటుకు పెళ్ళి చేసి పంపాల్సిందేనని పట్టుబట్టారు. పెళ్ళి చేసుకొని జంటగా వెళ్ళితే చదువు గంట కొడుతుందేమోనని భయం. చేసుకోకుండా ససేమిరా పంపననితాతయ్య భీష్మించుకొన్నాడు. నాన్న తాతయ్య మాట జవదాటడు. తాయ్యను ఒప్పించుకో అని వదిలేసాడు.ఆ విషయమై చర్చించుకునేందుకు కిరణ్ కు ఇష్టమైన శోభన్ బాబు సినిమా “ఏమండీ ఆవిడ వచ్చింది” కి వచ్చారు ఇద్దరు. కిరణ్ కు శోభన్ బాబు సినిమాలంటే ఉన్న పిచ్చి ఇష్టం ను, కిరణ్ మీద ఉన్న పిచ్చిప్రేమతో బలవంతాన భరిస్తుంది ఆశ.

“నా మీద నమ్మకం లేదా ఆశా?” పాప్కార్న్ నములుతూ, మెడలో శోభన్ బాబు స్టైల్ లో వేసుకున్న స్కార్ఫ్ ను సవరించుకుంటూ అడిగాడు కిరణ్.

నువ్వంటే నమ్మకంలేక కాదు బాబూ, నువ్వు చూసే ఈ ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు శోభన్ బాబు సినిమాల మీద నమ్మకంలేదు అని మనసులో అనుకొని, “ఏమి చేద్దాం కిరణ్? తాతయ్య పెళ్ళి కాకుండా పరాయి మొగవాడి వెంట పంపటం మా ఇంటావంటా లేదు అని వప్పుకోవటము లేదు” అంది ఆశా కాస్త దిగులుగా.

ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కూడా పరాయిమగవాడినవుతానాని ఆవేశపడ్డా చేసేదిలేక ఆశా మెడలో మూడు ముళ్ళూ వేసి,జంటగా విమానమెక్కాడు కిరణ్.

అమెరికా బయిలుదేరే ముందు రాయల్ టాకీస్ గల్లిలో వెతుక్కొని తెచ్చుకున్న, శోభన్ బాబు సినిమా కాసెట్లు వి.సి.ఆర్ కింద సద్దుతున్న కిరణ్ తో “ఈ కాలం వాళ్ళలాగారాం చరణ్, జూనియర్ యన్.టీ. ఆర్ సినిమాలు కాకుండా ఈ శోభన్ బాబు సినిమా పిచ్చి ఎట్లా వచ్చిందిరా మగడా? పైగా బాబా జమానాగాడిలా ఈ వీసీఆర్, కాసెట్లూ ఏమిటీ? హాయిగా లాప్ టాప్ లో చూడవచ్చుగా!” అడిగింది విసుగ్గా ఆశా.

“మా బాబాయి, ఆయన ఫ్రెండ్స్ కు శోభన్ బాబు సినిమాలంటే, శోభన్ బాబు లాగా స్టైల్ కొట్టటమంటే ఇష్టం. శొభన్ బాబు సినిమా రిలీజ్ అవగానే చూసేవారు.ఒక్కడే వెళితే చదువుకోకుండా సినిమాలు చూస్తున్నాడని మా డాడీ కోపం చేస్తారని,నన్ను క్రికెట్ ఆడించటానికి తీసుకెళుతున్నానని డాడీకి చెప్పిమా బాబాయి నన్ను తీసుకెళ్ళేవాడు.లాప్ టాప్ లో చూస్తే ఏం మజా ఉంటుంది. ఇలా సెట్ చేసుకొని చూస్తే  భలే ఉంటుంది. అయినా శోభన్ బాబు భలే అందగాడు తెలుసా” పరవశంగా అన్నాడు కిరణ్మెడలో స్కార్ఫ్ స్టైల్ గా సద్దుకుంటూ.

“మీ బాబాయ్ పుణ్యమా బాబూ ఇది. నువ్వూ అంతటి అందగాడివే బాబూ అందుకే నాకిన్ని తిప్పలు” అంది నిష్టూరంగా ఆశ.

“పోనీయిలే అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూద్దాం”తనను శోభన్ బాబంత అందగాడన్నందుకు సంతోషపడిపోతూ కాస్త కన్సెషన్ ఇచ్చాడు.

ఇంట్లో ఈ గోల. కాలేజ్ కి వెళితే ఫ్రెండ్స్ అందరూ ఆంటీ ఆంటీ అని పిలిచి ఏడిపిస్తారు.తనకొక్కదానికే పెళ్ళయ్యింది మరి. వాళ్ళంతా హాయిగా బాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.  అదో గోల.తను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయకుండా తొందరపడి పెళ్ళి చేసుకున్నానా అని కొన్నిసార్లు విరక్తి వచ్చేస్తోంది ఆశాకి. ఇవన్ని వదిలేసి హాయిగా ఇంట్లో కూర్చుందామా అనుకుంటుంది. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి కిరణ్ తనను చాలా ముద్దుగా చూసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర వంట కూడా నేర్చుకున్నాడేమో కొన్ని అయిటంస్ రుచిగా వండి ప్రేమగా తినిపిస్తాడు. ఇంటి పనులల్లో సహాయం చేస్తాడు. ఒక్క ఆ సినిమాల పిచ్చి తప్ప వేరేఏఅలవాటూ లేదు. గుడ్ బాయ్. పైగా మాస్టర్స్ చేస్తే కాస్త మంచి ఉద్యోగం వస్తుంది కానీ బాచులర్ డిగ్రీతో ఏమొస్తుంది?  అందుకే శోభన్ బాబు గోల, ఆంటీ గోల ఏదో తట్టుకుంటోంది.

క్లాస్ అయిపోయాక ఎందుకో నీరసంగా అనిపిస్తుంటే ఇంటికి వచ్చేసింది. పుస్తకాలు పక్కన పడేసి మంచానికి అడ్డంగాపడుకున్న ఆశాను చూసి ఏమయ్యిందంటూ గాభరా పడ్డాడు కిరణ్.

“ఎందుకో కాస్త నీరసంగా అనిపిస్తోంది. చాలా నిద్ర వస్తోంది” జవాబిచ్చింది ఆశ.

“నీకు ఇష్టమని గులాబ్ జామూన్ లు చేసాను. రెండు తిను. కాసేపు ఇంగ్లిష్ సినిమా చూడు” అని బౌల్ లో గులాబ్ జామూన్లు  తెచ్చి ఇచ్చాడు. టివీ లో ఇంగ్లిష్ సినిమా పెట్టాడు.

గులాబ్ జామూన్ నోట్లో పెట్టుకుంటూనే కడుపులో తిప్పినట్లైయి వాష్ రూంలొకి పరిగెత్తింది ఆశా. వాంతి చేసుకొని గోడకు ఆనుకొని నిలబడింది. ఏదో ఆలోచన వచ్చి, పొట్ట మీద చేయి వేసుకుంది. ఏదో బుజ్జిగా కదిలిన భావన కలిగింది.అంటే అదేనా? నిస్త్రాణంగా వచ్చి మంచం మీద వాలిపోయింది. ఇహ నుంచి తనను ఫ్రెండ్స్ అమ్మమ్మా అని ఏడిపిస్తారా? తన చదువు అటకెక్కినట్లేనా? సంతోషించాలా? బాధ పడాలా?

“ఏమిటీ పడుకున్నావు? సినిమాలో మాంచి హాట్ హాట్ సీన్లు వస్తున్నాయి చూద్దాం రా” దగ్గరికి వచ్చి ఉత్సాహంగా పిలిచాడు కిరణ్.

“నీ సినిమా పిచ్చి తగలెయ్య. శోభన్ బాబు సినిమాలు చూపించి ఆయనంత అందగాడివి నీకూ ఇద్దరు పెళ్ళాలు కావాలేమో, ఎప్పుడు నేను ‘ వరేయ్ ఆవిడొచ్చిందిరా ‘ అని పిలవాల్సి వస్తుందేమోనని హడలగొట్టించి పెళ్ళి చేసుకున్నావు. హాట్ హాట్ సీనులంటూ ఇంగ్లీష్ సినిమాలు చూపించి అమ్మను చేసావుగదరా” అంటూ పుస్తకాలతో కిరణ్ నెత్తిన రెండంటించింది ఆశ.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఛందోరీతులు

నవ్వుల రత్నాలు