ఆత్మవిశ్వాసం ఈ మాట ఎంతో ఆసక్తిని, ఇష్టాన్ని, గౌరవాన్ని కలిగించే పదం. ఆత్మ అంటే సెల్ఫ్, తనదైన అని అర్థం ఇస్తుంది. విశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ ,నమ్మకం అని అర్థం ఇస్తుంది. ఈ రెండు పదాలు ఏకపదంగా విడదీయలేని పదంగా భౌతికంగా తోడుగా
ఉన్నప్పుడు మనుషులు గా అంత ఎత్తులో తమను తాము పెట్టుకోగలరు. కొంత ఆత్మబలం కొంత సామాజిక బలం మనిషికి వెన్నుదన్నుగా ఉన్నప్పుడు ఇక ఎదురు అనేది ఉండదు. ఆత్మబలం జీవన హేతువు ఆత్మన్యూనత చావుతో సమానం. ఈ అంతరార్ధాన్ని గ్రహించిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా బ్రతుకు కొరకే ఆలోచిస్తారు.విశ్వాసాలు బలంగా ఉన్నవాళ్లు ప్రేమ కోసం,సంబంధ బాంధవ్యాల కోసం,తోడు కోసం, నలుగురి కోసం, తమదైన తెలివిని నిలుపుకోవటం కోసం తమదైన అస్తిత్వాన్ని చూపడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఇది అప్పుడే చిగుర్లు తొడిగిన పచ్చదనం వంటిది. ఈ మొక్క ఎదిగి ఎదిగి మహావృక్షమైతుంది.ఎవరో రావాలి ఏదైనా సాయం చేయాలి అని అనుకోకుండా ఒక సింపతి, sympathy ని కోరుకోకుండా ఉంటేనే ఈ వృక్షం ఫలవంతమవుతుంది. జాలిని కోరుకున్నారు అంటేనే సగం చచ్చినట్టు. బ్రతుకు కదా కావాల్సింది!
ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో అహంభావ వికారాలు అంత చేటు చేసేవి. వీటన్నింటినీ గుణిస్తూ, గణిస్తూ ముందుకు పోవాలి. మన అడుగులు వేరే వాళ్లకు అడుగుజాడలు కావాలి. ఒక చిరునవ్వు పలకరింతతో నడిచే మార్గం రాజ మార్గంలో ఉన్నప్పుడు సూత్రధారివి నీవే అవుతావు,పాత్రధారివి నీవే అవుతావు.ఈ జీవన నాటక రంగంలో ప్రేక్షకుల చప్పట్లలా నువ్వు చేసే మంచి పనులు మిర్రర్ ఇమేజ్, mirror image లా కనిపిస్తూనే ఉంటాయి
ఎంతటి కష్టమైన పనినైనా నేను సాధించాలి!సాధిస్తాను! అని అనుకున్నప్పుడు నిజంగా సాధించినప్పుడు ఆత్మవిశ్వాసము పెట్టని ఆభరణమే అవుతుంది. అయితే ఒక చిన్న మూల సూత్రాన్ని పసిగట్టాల్సిన అవసరం కూడా ఉంది ఈ పనిని నేను తప్పకుండా చేయగలను అని అనుకోవడానకీ, ఈ పనిని నేనే చేయగలను అనుకోవడానికి ఉన్న తేడా గమనింపులోకి తెచ్చుకోవాలి.
మనలో ఏదైనా భయం, ఏదైనా నిరాశ నిరాసక్తత ఉన్నప్పుడు ఆత్మ న్యూనత లో పడవేస్తున్నప్పుడు అప్పుడు వెంటనే పెద్దల మాటలను స్ఫూర్తి పథంలోకి తెచ్చుకోవాలి.మంచి మంచి ఉపన్యాసాలను వినాలి. ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించాలి సినిమా పాటలు, లలిత గీతాలను వినాలి. ఎవరు ఏది చెప్పినా వ్యతిరేక అర్థం తీసుకునే అలవాటును మానుకోవాలి ఆత్మ విమర్శ సరైన మార్గంలో నడిపిస్తుంది. నేను చేస్తాను నేనే చేయగలను ఈ భావాల తేడాను అర్థం చేసుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం పెట్టని ఆభరణమే అవుతుంది ఎక్కని నిచ్చెననే అవుతుంది. ఆత్మవిశ్వాసం ముందు అన్ని తలవంచి సలాములు చేస్తాయి రాత్రి చీకటి ఎంతసేపూ? తెల్లారే ఉదయం వెలుగులు ఉండవూ!!ఏ వైకల్యాలు ఉన్నా గెలిపించి తీరుతుంది ఆత్మవిశ్వాసం. ఎప్పుడు ఓదార్పును కావాలనుకోవడం కంటే నువ్వెప్పుడు ఇతరులను ఓదారుస్తావు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు వేసుకున్నప్పుడు తప్పకుండా ఉన్నతమైన స్థానంలో నలుగురు శభాష్ అనేలా నిలిచి గెలుస్తారు.