‘ఎర్రరంగు బురద’

ధారావాహిక నవల

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పఃడుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు.
ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు. ఏదులుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పై కుట్ర చేసి ఏదులు భార్య నాంచారికి కరెంటు షాక్ తగిలిస్తారు. రత్నం సేటు చికిత్స చేయిస్తాడు.
————ఇక చదవండి——–

6వ భాగం

తెల్లారి ఈ సంగతులు నాంచారి చెవిన ఏసింది మల్లమ్మ.

నాంచారికి భయం దుఃఖం రెండు ముంచుకొచ్చినయి. ఏదులు తోటి ఈ సంగతి సెప్పాలో వద్దో కూడా తోచలేదు.

పగటాలె మందులేసుకొమ్మని దగ్గరి కొచ్చిన మొగనితో “మా అయ్యను, అవ్వను ఒకపాలి వచ్చి పొమ్మని కబురు సెయ్యయ్యా” అన్నది.
“మొన్నటి దాక మన సుట్టే తిరిగిరి, వాల్ల కొంపెట్టున్నదో.. అయినా ఎవల్లతోనన్న చెప్పంపుతలే..” అన్నడు ఏదులు ఏ ఆలోచనున్నడో….
బన్ను రొట్టలమ్మే సైకిలాయనతో చెప్పి పప్పిండు..
తెల్లారి పగటాలకు నాంచారి తల్లిదండ్రి వచ్చిన్రు. వస్తొస్త ఉడుకుడుకు తెల్లన్నం, చింతకాయ తొక్కు, యాట మాసం వండుకొచ్చిన్రు. అల్లుని కోసం జొన్న రొట్టెలు తెచ్చింది అత్త. పిల్లలు తల్లి కడుపు నిండ తిన్నరు… అయ్యిన్ని ఇయ్యిన్ని – జొన్నలు, సజ్జలు, కారప్పొడి ముల్లె కట్టుకొచ్చింది. లేవిడి సంసారాలల్ల చిన్న చిన్న ఆసరాలు ఇయ్యే… ఏదులు బయిటికి పోయినప్పుడు, తల్లి ఇనకుంట తండ్రికొక్కనికే సేటు డబ్బులిద్దామనుకుంటున్నది, దానికి మామ మరిది ఎట్ల అడ్డం పడతన్నది, అన్ని ముచ్చట్లు చెప్పింది. నాంచారి తండ్రి ‘ఎరుకల ఈరన్న’ ఇగరం కల్లోడు. ఏదులు కోపం తెలిసినోడు.. అయినా తండ్రి పట్టిచ్చుకోనప్పుడు చేరదీసి పిల్లనిచ్చి ఆదుకున్నోడు కనక మేనమామంటే ఇస్వాసంగుంటడు ఏదులు … బిడ్డ సెప్పిందంత ఇని… ” సరే బిడ్డా.. నువ్వు పికర్ చెయ్యకు బిడ్డా.. నేను అల్లునితో మాట్లాడతా..” అన్నడు. 
గుడిసెల్నే అల్లునితో మాట్లాడుడు సరికాదనుకొని, నిమ్మలంగ నడుసుకుంట తాళ్ళదారి పట్టిండు. ఊరు బయట డొంక దాటినంక రోడ్డున కాలువ కల్వర్టు మీద ఏదులొక్కడే కనపడ్డడు. అటుమొకం చేసికూసున్న ఏదులు, మామ వచ్చుడు సూడలేదు. డొంక దారెమ్మటొచ్చి రోడ్డెక్కిన ఈరన్న అల్లున్ని పలకరిచ్చిండు. 
“ఏందయ్య ఒక్కనివే కూసున్నవు. ఏమన్న దగడు పడ్తన్నవా” అని.
“ఏం లేదు మామ, ఇద్దరం సేసుకుంటెనే నడుస్తదా.. నేనొక్కడ్నే కైకిలి చేసిన మిమ్మల్నందరిని సాత్త .. నేనంత పానం ఓపనోన్నా… అన్నడు చిన్న బుచ్చుకొని. “నీ సంగతి నాకెరకలేదా నా సేతుల్ల పెరిగినోనివే కదా… బెంగటిల్లుతున్నవేమోనని అడిగిన” అన్నడు. 
“నాంచారి లేసి తిరుగు తుంటే పోరల్లను సూసుకుంటే నాకు ధైర్నం.. అది మంచాన పడుంటె.. మా అవ్వ యాదికొస్తంది. గుండె చెదురుతంది. అది మరవడానికి ఒక చుక్కేసుకుంటన్న… నీ బిడ్డ పిరాదు చేసిందా ఏంది” అన్నడు.
 “మా పొల్ల నాంచారి నీ మీద ఒక్క మాట సెప్పదు – నువ్వంటె దానికి పానం నీకెర్క లేదా..! నా తోటి మాటలు సెప్తన్నవ్ కని… నేనే ఒక మాట సెప్తామని నిన్నెతుక్కుంట వచ్చినయ్యా..” అన్నడు ఈరన్న.
 “ఏంది మామా..! ఏదన్న మతలబా. కులం పంచాతా..” ఆత్రంగ అడుగుడు మొదలు పెట్టిండు. 
“గయ్యన్ని కావు గని… రేప్పొద్దుగాల గా భవంతి సేటును కలవాలె, నువ్వు నేను పోదామని సెబ్దామని ఎతుక్కుంట వచ్చిన” అన్నడు.
“ఏందానికి మామ.. గా సేటు శాన మంచోడు.. లేకుంటే నాంచారి మనకు దక్కక పోవును” అన్నడు.
  “ఏం లేదు పిలగా.. గా సేటు దగ్గర ఎంతోకంత డబ్బులు నట్టపరిహారంగ అడుగొచ్చని మావూళ్ళె పంతులు అన్నడు.. గట్ల ఆయినేమన్న రొక్కమిస్తే, నీ పిల్లగాల్లకు ఆదరవు ఉంటది కదా! ” అన్నడు.
 “వద్దు మామ.. మనసు కట్టపెట్టుకుంటడేమో.. కట్టుబడాగి పోయి ఆయిన సుత లుక్సానయ్యిండు కదా.. మనకోసం మస్తు ఖర్చుపెట్టిండు. ఇంక డబ్బులడుగుతే బాగుండదేమోనే”.

“అదంత నిజమే గని మరీ సత్తెకాలపోని లెక్క మాట్లాడకు. అడగనిదే అమ్మయిన పెట్టది.. ఒక పాలి అడిగి సూద్దాం.. ఏం ఆరిపోతది ? రేపొద్దుగాల పోయొద్దాం..” అన్నడు.
 “సరే మామ.. నీకంటెక్కువ ఎరకా నాకు..? సరె గని ఒక బింకి కల్లు బొట్టు నాలిక తడుపు కుందాం పా” అనుకుంట లేచిండు ఏదులు. ఇద్దరు కలిసి గౌండ్ల కనకడి దగ్గరికి పోయిన్రు.
కల్లొంచుకుంట కనకడు కూడా అదే మాటన్నడు “గాయం మానకముందే సేటునేదన్న రొక్కమియ్యిమని అడగండి. పుండు పాత బడినంక అడిగితే బాగుండదు.. ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి… అన్నది పాత సామెత” అని.
 “మా మామ సుత అదే అంటండు.. నేనే ఒద్దంటన్న” అన్నడు ఏదులు .
 “నువ్వో పిచ్చి కుత్తలోనివి.. తెల్లటియన్ని పాలు నల్లటియన్ని నీల్లంటవు.. మీ మామ కంటె నీకెక్కువ ఎరుకనా..” అని కసురుకున్నడు.
 కల్లు తాగి ఇంటి కొచ్చి ఊరుకెల్లి అత్త తెచ్చిన జొన్న రొట్టెలు మాంసకూర తిని హాయిగా నిద్రపోయిండు ఏదులు.

తెల్లారి పొద్దున్నే మామలల్లుళ్ళు కలిసి సేటు కాడికి పోయిన్రు… వీల్లను వాకిట్ల సూసిన సేటు నవ్వుకుంట పలకరించిండు. “నేనే పిలిపిద్దామను కుంటాన్న మీరే వచ్చినరు. నాంచారి గాయం మానిందా.. ఏదులూ…” అడిగిండు.
“ఇంకా పూరాగా మానలేదు సేటు, మందులు తింటనే ఉన్నది” అన్నడు ఏదులు.
“పది రోజుల తర్వాత మల్లొకసారి దావఖానకు పోవాలె గుర్తున్నదా..” అని అడిగిండు సేటు.
 “ఆం.. యాది కున్నది సేటూ.. తీస్కపోత..” అన్నడు ఏదులు.
“ఎందుకో మమ్మల్ని పిలిపిద్దామనుకుంటన్నా…  అన్నరు ఎందుకయ్యా..?” అడిగిండు ఏదులు మామ.
“చెప్పుత గని పాండి.. గా సర్పంచ్ ఇంటి దాకా పోదాము, అక్కడే మాట్లుడుతా.. నాతోటి రాండీ..” అనుకుంట సెప్పులేసుకొని… నాలుగిళ్ళవతల వున్న సర్పంచ్ ఇంటికి దారి తీసిండు. 
వీళ్ళు పొయ్యే సరికి సర్పంచ్ ఎటో బయలు దేరుతుండు. వీళ్ళని చూసి ఆగిండు “ఏం రత్నయ్య సేటు… పొద్దున్నే నాతో ఏమి పని పడింది. పిలిస్తే నేనే ఒద్దును గదండీ.. మా ఊర్ల దుకనం పెడదామని కట్టుబడి మొదలు పెడితే పని ఆగింది.. నాకు మస్తు బాధ అనిపించింది” అన్నడు. “ఏరా ఏదులు నాంచారి ఒంటెట్లున్నది” అని వాళ్ళను పలకరిచ్చిండు . రత్నయ్యి సేటు కూసోటానికి కుర్చీ చూపిచ్చిండు. పక్కనే ఉన్న బల్ల మీద మామ – అల్లులను కూసోమన్నడు.. రత్నయ్యిసేటు కూసున్నడు.
ఎందుకులే దొర ఈడ కూసుంటమని మెట్ల మీద కూసున్నరు ఏదులు వాల్లు.
“ఏమి లేదు సర్పంచ్ గారూ.. నా వల్ల వీళ్ళకు శాన నష్టమయింది. చేసుకుంటెనే బతికేటోళ్ళు కదా.. నాంచారికి ఒక సెయ్యి సచ్చుబడ్డది. అందుకనీ… వాళ్ళ పిల్లలు ముగ్గురికీ ఒక్కొక్కరి పేరు మీద యాబై వేలు ఫిక్స్ చేస్తా.. ఒక యాబైవేలు నగదు ఏదులు కిద్దామనుకుంటన్న… నావల్ల జరిగిన నష్టానికి ఎంతోకొంత సాయం..” అన్నడు సేటు. 
“మంచి ఆలోచన.. మీరు మంచోరు, మీలాంటోళ్ళు సల్లగుండాలె” అన్నడు సర్పంచ్… 
“ఏం ఏదులు ఇన్నవా?” అని అడిగిండు.. 
“ఇన్న దొర… సేటు మంచోడు. మా పిల్లల బతుకుల గురించి సుత ఆలోసిత్తండు” అని దండం పెట్టిండు. “ఏమంటవు మామా..” అని మామని అడిగిండు.. బాగుందని తలూపిండు ఈరన్న.
“కానీ ఒక తిరుకాసొచ్చి పడింది. సర్పంచూ…” అన్నడు  సేటు.

” ఏమయింది సేటు.. ఇండ్ల తిరకాసేమున్నది..” సర్పంచ్. 
“ఏంలేదు మొన్నొకనాడు ఏదులు తండ్రి సంగడు వాని కొడుకు ఎంకులు వచ్చి. డబ్బులు ఎక్కువ కావాలె మావోడు తిక్కలోడు, వానికేం తెలవదు. డబ్బు మా చేతికియ్యండి. లేకపోతే పోలీసుల కాడికి పోతా అన్నరు. అందుకనే వీళ్ళను తీసుకుని నీ దగ్గరికి వచ్చిన” అన్నడు.
 ఆ మాటలు విన్న ఏదులు కోపంగ పండ్లు కొరుక్కుంట తండ్రిని తిట్టుడు మొదలు పెట్టిండు. వీరన్న అల్లుని భుజం మీద చెయ్యేసి… “లొల్లి సెయ్యొద్దు, గమ్మునుండు పెద్దోల్ల మాటలు భద్రంగిను” అన్నడు గొంతు తగ్గిచ్చి. 
ఏదులు తిట్లు ఆపిండు.. గునుసుక్కుంట కూసున్నడు.. 
సర్పంచ్ మామలల్లుళ్ళకెల్లి సూసుకుంట “ఇన్నారా.. సంగడి ఆగాయిత్యం … మీకు డబ్బు లెక్కువ కావలంటే.. నన్నే అడగక పోతిరి. నాకు సెప్పక పోతిరి… వాడినెందుకు తోలిన్రు” అన్నడు గట్టిగనే.
 “అయ్యో… నీ బాంచెను మాకు తెల్వనే తెల్వదు సత్తె పమానంగా… నేను ఏ డబ్బులు అడగమని సెప్పలేదు. నా పిల్లల మీదొట్టు.. భూతల్లి మీదొట్టు ” ఏదులు కోపంగ అన్నడు…..
“లేద్దొర మా అల్లునికేం తెల్వదు.. వాల్ల సంగతి మీకెరక లేనిదా.. నేను మీకు కొత్తగ సెప్పాల్నా.. గా సంగడు కాజెయ్యిడానికే డబ్బులడిగుంటడు. మా అల్లునికేమి తెల్వది – ఏదులొద్దంటంటే ఏమన్న అడుగుదామని నేనే సేటు కానికి తోలుకొచ్చిన.. సేటు మీకానికి తొలుకొచ్చిండు… మాకేమి తెల్వనే తెల్వదు” అన్నడు ఈరన్న… 
“అవునండీ.. ఆ సంగడు బట్టేబాజుగాడు.. ఆని కొడుకు ఎంకులుగాడు అంతకంటె బద్మాష్ గాడు… గుడిని గుళ్ళె లింగాన్ని మింగే బాపతు, రత్నయ్యసేటూ… మీరనుకున్నట్టే చెయ్యండి. నన్ను కాదని ఏ పోలీసు స్టేషనుకు బోతడో సూస్త.. కుంట కింద భూమి నా కాల్లేల్ల పడి పండిచ్చుకుంటండు.. నాలుగు గింజలు కండ్ల చూసేటప్పడికి, ఏకు మేకైతాండు..”  అన్నడు సర్పంచ్ పేరయ్య…
 “అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చిన వీళ్ళు నన్నేది అడగలేదు ” అన్నాడు సేటు..  “మంచిది సేటు మీరనుకున్నట్టు సెయ్యండి.. ఏం ఏదులు సరెనా..” అన్నాడు. 
“సరె దొర బాంచెను… మీరు మా పిల్లల గురించి ఇంతగనం ఆలోసిస్తున్నరు. అంతకంటే ఏం కావాలె?” అన్నడు ఏదులు.
“పిల్లల పేరు మీద డబ్బులు వేయాలంటే వాళ్ల పేరు మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా సర్పంచ్..!” అన్నడు సేటు.
“ఆ పనులన్నీ మా పంచాయతీ గుమస్తా చేసిపెడతడు, లేదంటే ఏదులు మామ కూడా రాసుడు పూసుడు తెలిసినోడే.. ఆయన చూసుకున్నా ఏం లేదు” అన్నడు సర్పంచ్.
“సరే దొర నేను గయన్నీ చూసుకుంట కనీ.. మల్లెప్పుడు కలవమంటరు ?” అన్నడు ఈరన్న.
……..సశేషం………

Written by Jwalitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అణచివేతల నుంచి ఎదిగిన అగ్నిజ్వాల

ఆత్మన్యూనత