గగనమైన
గంభీరమై
గతం
ఇప్పుడో భారీ సాహస చిత్రం గా తోస్తున్నది
పసి మనసులు గెలువగ
యంత్రం
బతుకు చక్రానికి
రంగుల రాట్నమై పోయింది
కిలకిలారావాల సందళ్ళు
వినలేనివై
తొలికిరణం తొంగి చూడని
ఉదయాలు
కనుమరుగై
కంప్యూటర్ విజన్ లో
తలమునకలు చేయిస్తున్నది
కావలసినన్ని కిటికీలను తెరుస్తు
నిన్ను ఇమోజీ లకు కట్టిపడేసి
నీ ఇమేజ్ ను చాట్ చేస్తున్నది
సమూహం నుంచి ఏకాకితనపు
‘యూ‘ ట్యూబ్ తో చుట్టేసి
గ్రూప్ అక్షరపు నవ్వులను పూయిస్తూనో
కాలుస్తూనో
మాటల గారడీ విద్యల లో నిన్ను
నిత్య విద్యార్థి ని చేస్తున్నంత సేపు
చీకటి కాగానే ఖాళీ అయ్యే బీచ్
దృశ్యానివి అవుతున్నావు
ఓర్పు నేర్పు చదువై
పూసిన నగవుల లో
ఏడుపు చిహ్నాల గుర్తులలో
నువ్వు ఒంటరి నక్షత్రానివేనట!
ఈ వర్ణ జగత్తు
నీ ఉదర పోషణార్థమే అయితే
వయసు మనస్సు వంతెనను దాటి
అత్యంత ఆధునికంగా నిన్ను
జీవమున్న బొమ్మను చేస్తున్నది
బొమ్మను చేస్తున్నది….
ముక్కుపచ్చలారని బాల్యాన్ని
అరచేతి చెరలో ఆటాడిస్తూ
పుట్టెడు బుద్ధుల ముదుసలిని చేస్తున్నది
నిన్ను ముదుసలిని చేస్తున్నది..
చిత్ర కవిత రచన – డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు