సులోచనాలోచనలు

కథ

రంగరాజు పద్మజ

సులోచన అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉన్నది. చిరాకుగా గేటు వైపు చూస్తున్నది. మళ్లీ ఇంట్లోకి వస్తున్నది. భర్త కోసమో? కన్నవారి కోసమో కాదు. పనిలో సహాయపడేందుకు వచ్చే అమ్మాయి కోసం.
అయినా ఇంత చిన్న అగ్గిపెట్టె అంత ఉన్న ఇంటిలో పని చేయడానికి సహాయకురాలి కోసం ఎదురు చూస్తుంటే నవ్వొస్తుంది… చిన్నప్పుడు అందరం ఎంత పని చేసే వాళ్ళం? 60 సంవత్సరాల క్రింది ఆలోచనలోకి జారుకుంది సులోచన. గతం గుర్తుకు వస్తే ఎంత బావుంటుందో…
తన పుట్టిల్లు ఎంత విశాలంగా ఉండేదో! చతుర్ శాల భవంతి, నాలుగు వైపులా మన సాలలు, నాలుగు అఱ్ఱలు, ముందు బంకులు, వెనుక దేవుని అఱ్ఱ, వంట ఇల్లు, భోజనాలు చేసే పెద్ద హాలు, దాని పక్కనే చాయ కోసం సాయబాన , ఆపక్కనే దాలి ఉండేది. అంటే, పాలు పిడకలతో కాచే పొయ్యి అఱ్ఱ ! దానిలోనే మజ్జిగ చిలికే వారు. ఒక పొడుగాటి స్తంభం ఉండేది,దానికి తాళ్లతోపెద్ద కవ్వం కట్టి, చల్ల చేసి, వెన్న తీసేవారు. ఆ గదిలో పైకి మడి బట్టలు పూర్తి ఆరవేసే దండాలు ఉండేవి. గైకఱ్ఱలుండేవి. వెదురు బొంగుతో బట్టలు జరిపి ఆరవేసేవారు.
మా ఊరు పల్లెటూరే… అయినా అందంగా ఉండేది. ఆ మా పల్లెలో మావాండ్ల ఇళ్లన్నీ పక్కపక్కనే… ఎదురెదురుగా ఉండేవి. దాదాపు ఏ కుల వృత్తుల వారి ఇండ్లు వరుసలో అలాగే ఉండేవి. అంత పూర్వకాలంలో కూడా మా గ్రామం డిజైన్ ఎవరు వేసారో కానీ ఊరంతా అందంగా నిర్మించారు.
ఆడపిల్లలందరూ ఈ కొన నుండి ఆ కొస వరకు ఎవరు ఎంత పెద్ద ముగ్గు వేస్తారో అని పోటీ పెట్టుకొని వేసేవాళ్ళం. ముందుగా పని వాళ్ళు పేడతో అలుకు పెట్టి, వెళ్ళగానే చిన్న చీపురుపుల్లలు కట్టగట్టి, పిండి రుబ్బి లేదా సున్నం ముంత పట్టుకొని, టక్కు…టక్కున డిజైన్ వేసేవాళ్ళం. ఎర్రమన్ను, లేదా జాజుతో అలికి తీనెలు ,తీగవలె డిజైను అన్నమాట! తీసి,తెల్లటి గోడమీద ముగ్గు వేస్తే ఎంత అందంగా ఉండేదో? మా అన్నయ్య కూడా ముగ్గులు వేసే వాడు. ప్రతి శుక్రవారం ఇల్లు మొత్తం అలికి, ముగ్గులు పెట్టాలి. అంత పెద్ద ఇంట్లో ముగ్గులు పెట్టేసరికి మాకు నడుంనొప్పి లేచేది. సహజమైన బంతి పూలతో అలంకరణ చేస్తే పండగ మొత్తం మా ఇంట్లోనే జరుగుతున్నట్టుండేది. ఇప్పుడు ముగ్గులకు కెమికల్ రంగులతో వేస్తున్నారు… వాటి వాసనతో ఇంట్లో ఉండబుద్ధి కానేకాదు.
దేవుడి పాత్రలు చాకలితో తోమించకుండా, మేమే శుభ్రం చేసే వాళ్ళం. మధ్యాహ్నం నౌకర్లు అడవి నుండి మోదుగ ఆకులు కోసుకొని తెచ్చేవారు. భోజనాలు అందరికీ విస్తర్ల లోనే వడ్డించే వారు. అందుకే దాదాపు 100 విస్తళ్ళు అవసరమయ్యేవి. అందరం కలిసి కుట్టేవాళ్లం. అందులోనూ మా అన్నయ్య నేర్పరే.
ఆకులు దొరకే కాలంలోనే సుతిలి తాడుకు తోరణాలు కుచ్చి, ఇసుర్రాయి కింద అణగపెట్టి, ఎండబెట్టి, కొయ్యలకు వేలాడదీసే వాళ్ళం. ఆకు దొరకని కాలంలో వాటిని ఉపయోగించే వాళ్ళుం.
రోజూ ఆకుపచ్చని విస్తరిలో, ముద్దపప్పు, ఆవకాయ, చారనిండా నెయ్యి, దోసిలి నిండా గడ్డ పెరుగుతో అన్నం తింటే రోజూ పండుగనే… పంచభక్ష్యాలు తిన్నంత సంబరమే! కూరగాయలు దొరకకపోయినా, చక్కని ఆరోగ్యంతో ఉండేవాళ్ళం.
పెద్దవాళ్ళకు ఏకాదశి, శనివారాలు ఉపవాసముంటే ఉప్పుడు పిండి, తప్యాల చెక్క ఫలహారమే కానీ, ఇడ్లీ ,దోశ వంటి ఫలహారాలు తెలియవు.
వేసవి కాలం సెలవులలో పిల్లలంతా ఉంటే వేపుడు బియ్యం, కారప్పూస, చక్కిలాలు వంటి నిల్వ ఉండే పిండి వంటలు చేసే వారు.
వేసవిలో మేమంతా పచ్చీసు ఆడితే… మా అన్నయ్య కూడా ఆడేవాడు… మేము ఏ పని చేస్తే మా అన్నయ్య ఆ పనిని సక్రమంగా చేసేవాడు.
ఇంట్లో ఆలుగడ్డ, క్యారెట్, టమాటాలు, ఉల్లి , వెల్లుల్లి నిషేధం. అవిమా ఊళ్లో దొరకక పోయేవి కూడా! మాకు అటువంటి కూరకాయలు ఉంటాయని తెలియని కూడా తెలియదు. చాయలు, కాఫీలు ఉండక పోయేవి. పెద్దలు తాగే వారు. మేము పిల్లలందరూ పాలు తాగే వాళ్ళం.
బస్తీ నుండి వచ్చిన కోడళ్లకు చాయ్ తాగి అలవాటుంటే… నీళ్ళు కాచే గదిలో చాటుగా కుంపటి మీద చాయ్ చేసుకొని తాగేవారు.
ఇంట్లో రోజూ 20 మందికి స్నానాలు చేయడానికి నీళ్లు కట్టెల పొయ్యి మీద కొప్పెరతో కాగబెట్టే వాళ్ళం.
ఇక మా ఊళ్లో ఏ ఇంట్లోనూ తాగేందుకు బావులలో తీయటి మంచి నీళ్ళు ఉండేవి కావు. ఉప్పగా ఉన్న నీళ్లే ఉండేవి. అందుకే ఊరి పక్కనే పారే వాగులో మంచినీళ్లు తెచ్చుకునే వాళ్ళం. మా ఊరు నానుకొని రెండు వాగులు ఉన్నాయి. ఒకటేమో దయ్యాల వాగు, రెండోది పెద్ద వాగు. దయ్యాల వాగు అంటే ఊర్లో ఎవరైనా చనిపోతే వారిని ఆ వాగు చుట్టుపక్కల దహనం చేసి, ఆ వాగులో స్నానం చేసి, బట్టలు ఉతుక్కొని వచ్చేవారు. చిన్నపిల్లలు, పెళ్లికాకముందు చనిపోతే ఆ వాగు ఒడ్డున పాతి పెడతారు. ఆ చనిపోయిన వారు దయ్యాల అవుతారని నమ్మేవాళ్ళు. అందుకే ఆ వాగును అందరూ దెయ్యాల వాగని అంటారు. ఇక దాన్ని దాటి ఇంకొంచెం ముందుకు వెళితే పెద్ద వాగు వస్తుంది. దాంట్లో తాగేందుకు మంచినీళ్లు తెచ్చుకోవాలి. అందరి ఇళ్లల్లోని ఆడపిల్లలం కలిసి ఒకేసారి వాగుకు వెళ్లి, చింతపండు బిందెలలో వేసుకొని, మేము రోజు తొడుక్కునే రవికలు ఉతికేందుకు, సన్లైట్ సబ్బు ఆబిందెలో వేసుకొని వెళ్ళేవాళ్ళం… నింపాదిగా ముచ్చట్లు చెప్పు కుంటూ, బట్టలు ఉతుకు కుంటూ, బిందెలతోముకొని, మంచినీళ్లు నింపుకొని, ఒడ్డున కూర్చుని, మా వదిన, మా చిన్నాయన భార్య చిన్నమ్మ చక్కగా పాటలు పాడేవారు.. వారు పాటలు పాడుకోవాలి అనుకుంటే ఇంట్లో తాతయ్య ఏంటి ఆ పాటలు పాడడం, భోగం మేళం వలె అని ఆ కాలంలో ఆటపాటలు ఒక భోగం కులం వాళ్లే పాడేవారు అని తాతయ్య ఉద్దేశం.
మాకేమో మా వదిన, చిన్నమ్మ పాటలు పాడితే వినాలని కోరిక ఉండేది. అందుకే అలా ఆ వాగు ఒడ్డున మంచినీళ్లు తెచ్చే నెపంతో…. కూర్చొని పాటలు విని వచ్చేవాళ్ళం.
పెద్ద వారందరికీ మడితో మంచినీళ్లు వంట స్వామి తెచ్చేవాడు. రోజు 50 మంది ఉన్న ఇంట్లో ఎన్ని నీళ్లు తెచ్చినా సరిపోక పోయేవి. ముచ్చట్లు పెట్టుకునేందుకు వాగు ఒక అడ్డా…. వాగు నుంచి వచ్చేటప్పుడు తల మీద బిందె, ఆ బిందె మీద మరో బిందె పెట్టుకొని, చేతిలో రెండు చెంబులు పట్టుకొని, మోకాళ్ళ లోతు నీళ్లలో నుండి చీరలు తడవకుండాచెక్కుకొని, కొంగు నడుము చుట్టు తిప్పుకొనిచెక్కి, పొలం గట్టు వరాల మీద నుండి నడిచి వచ్చేవాళ్ళం… ఒక్కొక్కసారి వర్షాకాలం జారిపడే వాళ్ళం.
అత్తలు కోడళ్ళు అందరూ కలిసి నీళ్లకు వెళ్ళే వాళ్ళం. దయ్యాల వాగులో నీళ్లు తాగ లేక పోయే వాళ్ళం… దెయ్యాల వాగు దాటి పెద్ద వాగుకు పోయినా భయమే ఉండకపోయేది… నీళ్లు వాగు నిండా ఉన్నప్పుడు ఈత కొట్టేవాళ్లం, ఆడుకునే వాళ్ళం.
మా ఊళ్లో పోస్ట్ ఆఫీస్ లేదు. పక్క ఊర్లో ఉండేది. మా అన్నయ్య వార పత్రికలు తెప్పించేవాడు పోస్టులో… అవి ఎప్పుడో వారం పది రోజులకు వచ్చేవి. వాటి కోసం రోజు ఎదురు చూసే వాళ్ళం. ఆ పత్రికలలోని కథలు చదువు రానివాళ్లకు, చదివే తీరిక లేని వాళ్లకు బిందెలు తోముతూ, జాకెట్లు ఉతుకుతూ… ఆ కథలో చెప్పుకునే వాళ్ళం… ఇంటిదగ్గర ఒక్కళ్ళు చదివితే అందరూ వినేవాళ్ళు.. ఆ కథల మీద చర్చలు చేసేవాళ్ళం. అలా సరదాగా గడిచిపోయేవి రోజులు.
మా మేనత్త, అన్నయ్యలు, అక్కయ్య, వదిన అందరూ రామాయణ భారత భాగవతాలలోని కథలు, పద్యాలు చెప్పేవారు. పల్లెటూరు కావడంతో ఏ ఇతర వ్యాపకాలు లేక, సినిమాలు లేక మాకు పుస్తకాలే పెద్ద కాలక్షేపం.. మధ్యాహ్నం చాపలు పరచుకొని, ఎనమండుగురు కూర్చొని ఆడేవాళ్ళం. నలుగురు ఒకవైపు నలుగురు మరొకవైపు కూర్చుని పచ్చీసు వాడేవాళ్ళు. మిగతా వాళ్ళు వామన గుంటలు ఆడేవాళ్ళు, కొందరు కచ్చకాయలు ఆడే వాళ్లు. ఇక పచ్చీసు ఆడే వాళ్ళు పెట్టుకునే పంచాయతీలు అంతా ఇంతా కాదు… నా కాయ చంపేశారని ఒకళ్ళు…. దూగపందెం పడితే… దస్ అన్నాడని తొండి పందెం వేశారని గోలగోలగా ఉండేది.
కచ్చ కాయలు వాగు నుండి రాళ్లు ఏరుకొని తెచ్చుకొని, రోటిలో ఉనక( వరి పొట్టు) వేసి నూరే వాళ్ళం. అవి గుండ్రంగా తయారయ్యేవి. వాటితో ఆడుకునే వాళ్ళం.
పండగలయితే మా ఇంట్లో ఒక వైభవమే! ముఖ్యంగా శ్రీకృష్ణాష్టమి రోజు మా తాతయ్య మమ్మల్ని అందర్నీ వరుసలో నిలబెట్టి భాగవతంలోని కృష్ణ జనన కాలఘట్టం చాలా శ్రావ్యంగా పాడించేవాడు.
* స్వచ్ఛంబులై పొంగే జలరాసులేడును* అని,
* పాడిరి గంధర్వోత్తములు ఆడిరి* అని,
* చేత వెన్నముద్ద* అని కృష్ణుని మీద పద్యాలన్నీ మా పిల్లలందరికీ కంఠోపాఠమే! ఎవరికన్నా నోటికి రాలేదనో, చదవకపోతేనో గుడ్లురిమి చూసేవాడు మా తాతయ్య.
పెద్దపెద్ద స్తంభాలు ఉట్టి కట్టి, అందులో పెరుగు మీగడ ముంతలు కట్టేవారు. ఒకళ్ళు ఆ ఉట్టి కొడితే వాడికి అందకుండా మరొకడు తాడు పైకి లాగేవాడు. అదో సరదాగా ఆటగా కృష్ణ జననం సందర్భంగా ఉట్లు కొట్టి ఘనంగా చేసేవారు.
రథసప్తమికి కూడా సూర్య నమస్కారాలు చేసి, పాయసం చేసి సూర్యుడికి అర్ఘ్య పాద్య నైవేద్యం ఇచ్చేవారు పెద్దవాళ్ళు.
ఇలా ఏ పండగకు ఆ పండగ విధివిధానంగా జరిపేవారు. ఉగాది పండుగకు మామిడి తోరణాలు కట్టి, ఇల్లంతా శుభ్రం చేసి, పచ్చడి చేసి, భక్ష్యాలు, మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, మామిడికాయ రోటి పచ్చడి పెట్టి నైవేద్యాలు పెట్టేవారు. ఇలా పండుగ భోజనం పరమాద్భుతం! ఆడపిల్లలతో ఇల్లు కళకళలాడేది.
సాయంత్రం పంచాంగ శ్రవణం సాయంకాలాలు పడమటి మనసాలలోరెండు పెద్ద పెద్ద తాటి చాపలు,రెండు తుంగచాపలు పరిచి,
పురోహితుడిని పిలిపించి, గ్రహచారాలు, గ్రహగతులు, ఏ నక్షత్రం వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? రాజ్య పూజ్యాలు ఎలా ఉన్నాయని చెప్పించుకునే వారు.
దసరాకు అల్లుళ్లు వచ్చేవారు. మా ఊళ్లో గడలు కట్టేవారు. గడలంటే మొక్కజొన్నకంకులతో పాటు చెట్టు కాండాలు తెచ్చి కట్టగట్టి పెట్టేదాన్నంటారు. కాణిగిరి బడిపంతులు( ప్రైవేట్ టీచర్) ముందు నడుస్తూ పిల్లలందరూ ఇద్దరు జట్లు జట్లుగా…. అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు* అంటూ పాడుతూ ఇల్లిల్లూ తిరిగి, వాళ్లు చేతులలో కట్టెల కు రంగురంగు కాగితాలు జెండాలవలె అతికించి, అవి పట్టుకుని బడిపంతులు గారి వెంట తిరిగేవాళ్ళం. అందరూ అయ్యవారికి డబ్బులు ఇచ్చే వాళ్ళు”.
వీధిభాగవతాలు చెప్పేవాళ్ళు.
దీపావళి అయితే తెల్లవారు జామునే పెరుమాళ్ళకు హారతిచ్చి, ఆ హారతిని ఇంటి మగవాళ్లకు కూడా బట్టి, తర్వాత మంగళ స్నానాలు చేసి, దుందువలు తిప్పేవారు. దుందువ అంటే , చింత పేళ్ళు, బొగ్గులు, సోరుప్పు దంచి, పల్చటి బట్టలో మూట కట్టి, తంగేడు పంగల కర్రలు తెచ్చి, మూడు కర్రల మధ్య ఈ మూట నారతోకట్టేదాన్ని దుందువ అంటారు. దానిమీద బండి ఇరుసులకు వాడే ఆయిల్ పోసి అంటించేవాడు మా నౌకర్. ఆ నౌకరు మా చిన్న వాళ్లందరినీ జాగ్రత్తగా మధ్యలో నిలబెట్టి, మా చుట్టూ ఈ దుందుభులు, కోలలు తిప్పేవాడు. ఇప్పుడు కాకర ఒత్తులు ఎలా చిటపటమని వెలిగేవో…. అలాగే దుందువలు వెలిగేవి. తమాషాపాటలు పాడుతూ… తిప్పి దృష్టి దోషం తీసేవారు.
కార్తీక పౌర్ణమి రోజుకు ఒకరోజు ముందే కుమ్మరి పెద్ద గంప నిండా మట్టి ప్రమిదలు తెచ్చేవాడు. ఇంట్లో ఉన్న వృద్ధనారీ మణులంతా ఒక నెల ముందు నుండే పత్తితోవత్తులు చేసే వారు. ఆముదం, నువ్వుల నూనె సిద్దెలలో! సిద్దె అంటే ఇత్తడితో చేసిన కెటిల్ వంటి నూనె పాత్ర. నింపి, వత్తులు మట్టి ప్రమిదలలో వేసి, ఇంటి చుట్టూ దీపాలు, తులసి కోటలో దీపాలు వెలిగించి, నువ్వులు బెల్లం, జామ కాయ ముక్కలు జీడి కంటి రాములవారికి నైవేద్యం పెట్టి, దీపాల దగ్గర కూడా నివేదన చేసి, అందరూ కుంకుమ ధారణ చేసుకుని, బాట వెంట వెళ్లే బాటసారులకు* జీడి కంటి రాములవారి ప్రసాదం* తినండి రాముల వారి దీవెనలు పొందండి* అంటూ ప్రసాదం పంచేసేవారు. దాన్నే పంచ కజ్జాయం అనేవారు.
సంక్రాంతికైతే నెల రోజుల పండగ. మార్గళి.తిరుప్పావై నోము నోచుకోవడం , తెల్లవారు ఝామున గోదాదేవి రచించి గానం చేసిన తిరుప్పావై పాడడం, కోవెలకి వెళ్లి అక్కడ పాశుర అనుసంధానం చేసి, భాగవతోత్తముల అందరితో కలిసి గోష్ఠి నిర్వహించుకొని, వేడివేడిగా పొంగలి ప్రసాదం తీసుకొని ఇల్లు చేరడంలో చలినీ కానీ, మంచు వానను కానీ లెక్క చేయక పోయే వాళ్ళం.
ఉదయమే వాకిలినిండా ముగ్గులు, బంతిపూల దండలు కుచ్చడం, భోగిపళ్ళు పోయడం, పల్లెల్లో బుడబుడ పళ్ళు పిల్లలకు పోయడం, నోములు, వాయనాలు, గోదా కళ్యాణం ఇలా ఎన్నో వేడుకలు చేసుకునేవాళ్ళం.
చక్కిలాలు, అరిసెలు మేమే స్వయంగా మడి బట్టలు కట్టుకొని, రోకళ్ళతో పిండి దంచుకొని, ఒకరి ఇంట్లో మరొకరు సాయం చేసుకునే వాళ్ళం. చక్కిలాలు అల్లడానికి వచ్చేవాళ్ళు గ్రహస్థితులు వచ్చేవాళ్ళు. అలా అలసట లేకుండా కుంచెడు పిండితో సునాయాసంగా చేసే వాళ్లం.
కొత్త పెట్టే వాళ్ళు . అంటే , కార్తీక మాసంలో కొత్తగా పండిన వరి పంట దంచిన బియ్యము. ఆ బియ్యంతో పాయసం చేసి భగవంతుడికి నివేదన చేసేవాళ్ళు.అదొక హడావుడి… ఎలా అంటే రోళ్ళు- రోకళ్ళు కడిగి, కుందెనలతో సహా అన్నిటికీ సున్నం జాజుతో అలంకరణ చేసి, రోట్లో కొత్త వడ్లు పోసి పాటలు పాడుతూ దంచి బియ్యం చేసేవారు. ఆ పాట ఎంత బాగుండేదో!

“యెంకటేసుడవయ్యా…వెన్నూడవయ్యా…
ఎట్ల నెరిసితి వయ్యా…ఈ గట్లా నడుమా…
ఆహూ…ఆహూ…సువ్వీ..సువ్వీ…ఆహూ..

గట్టుల్లు కావమ్మా…కనకసిరి మేడల్లూ…
మేడల్లు కావమ్మా….మేరు నగవుల్లూ…
ఆహూ…ఆహూ…యెంకటేసుడవయ్యా….
ఎట్లనెరిసితివయ్యా…ఆహూ…ఆహూ..సువ్వీ ..సువ్వీ యనెరే సుదతుల్లార…”

ఇలా దంచుకుంటూ … పాటలు పాడుకుంటూ ఆనందంగా కొత్త పెట్టుకునేవాళ్ళం!
ఇంట్లో పాడిబఱ్ఱెలు ఈని కొత్త దూడలను కంటే అదో సరదా! జున్ను పాలు అందరికీ ఇంటింటికి ఇచ్చి రావడం, ఇంట్లో పాలు కాచి కృష్ణునికి నైవేద్యం పెట్టడం, అందరూ ఆ జున్నుపాలు తాగే వాళ్ళం… జున్ను పాల పండుగను ఎంతో సంబరంగా చేసుకునే వాళ్ళం. ఆ పుట్టిన లేతదూడలకు* వెన్న ముద్ద* ఆకు పొలాల్లో నుండి ఏరుకొని తెచ్చేవాళ్ళం… దూడలకు తినిపించే వాళ్ళం. సజ్జలు ఘట్క వండి, నూనె కలిపి ఈనిన బఱ్ఱెలకు పెట్టేవాళ్ళు.
మాకు పండ్ల తోటలు ఉండేవి. మామిడి, సీతాఫలాలు పుష్కలంగా తోట నుండి వచ్చేవి. అల్ల నేరేడు చెట్టు ఉండేది. చాలా రకాల పండ్లు అంటే వెలగపండు, రేగు చెట్టు ఉండేది.. అవి కూడా తినేవాళ్ళం… జామకాయలు పుష్కలంగా కాసేవి.
ఇక మా చదువుల గురించైతే మరీ విడ్డూరం. చెక్క పలక చాలా పెద్దదిగా ఉండేది.. దానికో తాడు మధ్య మధ్య ఆ చెక్క పలక కు కాకరాకు మరియు బొగ్గు దంచి ఆ పసరు పూసేవాళ్ళం. దానిమీద రాయడానికి రాయిబలపం ఉండేది… దాన్ని కూడా దారంతో చెక్కకు కట్టి బడికి పంపేవాళ్ళు పెద్దవాళ్లు. ఆ చెక్క చాలా బరువు ఉండేది… తాడు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం.
మంచిగా చదువని వాళ్లను పంతులుగారు కోదండం ఎక్కించేవారు. గోడ కుర్చి వేయించేవాడు, బిస్కీలు తీయించే వాడు.
ఆడపిల్లలకు శిక్ష ఏమిటంటే బండమీద ఇసుక పోసి వేలితో అక్షరాలు దిద్దించే వాళ్ళు… సాయంత్రానికల్లా వేలు వాచి పోయేది…. ఒకటే నొప్పి… పంతులు చేతిలో బెత్తం ఉండేది. దాంతో కొట్టేవాడు. ఒకసారి సాతాని పంతులుగారు నన్ను కొడితే… మా అమ్మాయిని కొడతావా? అని మా నాయన కోపంతో ఆ పంతులును ఊరి నుండి పంపించి వేశాడు.
బడికి వెళ్లేటప్పుడు చంకలో ఒక తాటిచాప, చేతిలో చెక్క పలక తీసుకొని వెళ్ళేవాళ్ళం. బడిలో నేల మట్టితో చదును చేసి ఉండేది. సిమెంటు గచ్చు లేకపోయేది.
అలా అయినా సరే జీవితాలు ఒక క్రమ పద్ధతిలో సాగేవి… ఇంటి పెద్దలు ఏ ఆచార- వ్యవహారాలు పాటిస్తే… కుటుంబం మొత్తం అలాగే పాటించేవారు. అంటే వర్ణానికి సంబంధించి, వంశానికి సంబంధించి, ఇంటికి సంబంధించి పూర్వం నుండి ఇంట్లో ఎలా పాటిస్తే అలా పాటించడం… వంశాను సారంగా పెళ్ళిళ్ళు ప్రయోజనాలు, ఊరి పడికట్టు అలా పాటించేవారు.. ఇవేవో కట్టడివలె ఉందని విసుక్కోక పోయెవారు. ఎలా అంటే ఎవరింట్లో నైనా తిరువధ్యయనాలకు భోజనానికి వెళ్ళావలసి వస్తే ఎవరి చెంబు వారే తీసుకొని వెళ్లి, ఆత్మీయంగా వేసిన పీటల పైన కూర్చుని,బాసింపట్టు వేసుకొని, అన్నం తినే వాళ్ళు… అదేదో నిర్బంధం వలె కాకుండా సాధారణంగానే కొనసాగించేవారు. వైశ్వానరమని ఒక మొదటి ముద్ద విస్తరిపక్కన నమస్కరిస్తూ పెట్టడం, ఔపోసపట్టి భోజనం చేయడం మొదలైనవి సక్రమంగా పాటించేవారు.
ఋతువుల ప్రకారం ఆహారాలు నైవేద్యంగా సమర్పించి తినడం వల్ల, ఆరోగ్యంగా, పూర్ణాయుష్షు లతో జీవించారు. భోజనానికి భోజనానికి మధ్య ఏమి తినేవారుకారు. ఆడా మగా అందరూ శ్రమించేవారు. బావి నుండి నీళ్ళు తోడడం, పిండ్లు విసరడం, పచ్చళ్ళు నూరడం మొదలైనవి చేసేవారు.
కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ ముద్దనూరి, నువ్వుల ముద్దనూరి ఒంటికి పట్టించి, మంగళ స్నానం చేయించే వారు. అందుకే శరీరాలు నిగనిగలాడేవి. మా నాయనమ్మ పిల్లలందరికీ తలకు నూనెమర్దన చేస్తే తలలో పొగలు తేలేది. గంగాళం నిండా నీళ్లతో తలస్నానం చేయించేవారు. ఇలా ప్రతి వారు ఇంతమందికి ఓపికగా… మేమే కాదు.. మా ఇంటికి పండగలకు మా మేనత్త లు ఎడ్లబండ్లు కట్టుకొని వస్తే… వాకిలి నిండా బండ్లు ఉండేవి. అంతమందికి అలాగే చేసేవారు.
ఇంటి ముందు మెట్లమీద గంగాళంలో నీళ్లు, చెంబు ఉండేది. వచ్చినవాళ్లు రాగానే కాళ్లకు నీళ్ళిచ్చేవారు. ఆ సమిష్టికుటుంబ వైభవమే వేరు! లోపలికి వచ్చిన వారిని మంచి తీర్థమా? చల్ల తీర్థమా? అని అడిగేవారు. చల్ల తీర్థం అంటే పల్చటి మజ్జిగ. ఏది అడిగితే అది ఇచ్చేవారు. అప్పుడు ఛాయలు కాఫీలు లేవు. కానీ మర్యాద మన్నన మెండు.. పెద్దలు రాగానే అందరూ వారి కాళ్ళకి దండాలు పెట్టేవారు.
మా ఇంటి దగ్గర ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. రాంబాయమ్మగారని ఒక వైదిక బ్రాహ్మణ వృద్ధురాలు ఉండేది. మేము బొడ్డెమ్మ ఆట కోసం రుద్రాక్ష పూల కోసం ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆమె మమ్మల్ని రానివ్వక పోయేది. రుద్రాక్షపూలు దండ అల్లి, దీపపు చెమ్మ చుట్టూ పెట్టి ఉంచేది. మేము ఆమె ఇంటి వెనకకు వెళ్ళగానె …
రాంబాయమ్మగారు:– అస్సే ! ఎవరషే? ( ఎవరే పిల్లా) అనేది బిగ్గరగా..
మేమే… అమ్మమ్మా… అనగానే
అష్లాగషే! యేమిషే? ( అలాగా ? ఏమిటీ? ఎందుకొచ్చారూ) అని తొంగిచూసి,
* విస్సా వఝల వారి బుజ్జి నష* ఆవిస్సాయి కిస్సారషే !* అంటే, వఝులవారింటి మనవరాలు వచ్చిందే అని కోడలికి చెప్పేదన్నట్టు!
యెంత వర్చష్షే? అని అన్నారంటే, ఎంత అందంగా ఉందో అని…
ఒషేష్! అల్లా వెళ్ళకు! ఆ పక్కన* గావంచా* ఆరే శాను… తాకకు! అనేవారు అంటే , నా మడి బట్ట ఎండే సాను ముట్టుకోకు అని అనడమన్నట్టు! కోడలు వైపు చూసి, అది ఎండిం ఛావా? లేధంఛావా? అంటే , ఎండినదా? లేదా? అని అన్నట్టు.
వోసీ ! చెముడషే! చూస్తివషే! అంటే, నీకేమైనా చెవుడా? విన్నావా ? మడి బట్టనుచూసావా? అని !
మేము ఆమె మాటలు వినడానికీ, ఆమె కట్టిన రుద్రాక్షపూల దండను దొంగిలించడానికి వెళ్లేవాళ్లం. ఆమెను ఎవరో పిలుస్తున్నారని చెప్పి, ఆమె ఇంటి ముందుకు వెళ్ళగానే వాళ్ళింట్లోని వెలక్కాయలు, పూలు దొంగతనంగా తెచ్చుకొని వాళ్ళం.
ఆ బ్రాహ్మల ఇంట్లో అన్నమ్మ నాయనమ్మ తులసి ముందు చిలుక నోము, కన్నె నోము, సంజె నోము ఇలా ఎన్నో నోముల నోచుకోని వాయినాలు ఇచ్చేవారు… పసుపు కుంకుమలు, నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి, బంగారం (పుట్టమన్ను) నువ్వులు బెల్లం దంచి ముద్ద చేసి, పిండి బెల్లం ప్రసాదంగా పెట్టేవారు. ఆ నాయనమ్మ ఎన్నో పాటలు పాడేది… వారంతా మా ఇంటికి కూడా పసుపు కుంకుమ లకు వచ్చే వాళ్ళు.
ఇలా ఎన్నో జ్ఞాపకాలు సుడులు తిరుగుతూ ఉండగా పనిమనిషి రాకకోసం ఎదురు చూస్తున్న సులోచన” అమ్మగారూ” ఏంటండీ? ఎందుకలా కూర్చున్నారు? ఏమైంది? ఒంట్లో బాగా లేదా? అని అడిగేసరికి ఒక్కసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లయింది సులోచనకి… బాగానే ఉన్నా నే… మా చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం వచ్చి అలా కూర్చుండిపోయాను… అంతే అంటూ గబగబా… ఇల్లు తుడిచేయి… అయ్యగారికి పూజకు వేళయింది… అంటూ లోపలికి వెళ్ళింది సులోచన!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వద్దు వద్దు

మన మహిళామణులు