“అమ్మా ఈసారి సమ్మర్ హాలిడేస్‌లో ఎక్కడికి వెళ్దాం?” పిల్లలు అడుగుతున్నారు.
ఒక్కసారిగా నా మనసు వెనక్కి పరుగులు తీసింది.
నా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, ప్రశాంతతకు, ప్రకృతి రామణీయతకు పెట్టిన పేరయిన గంగాపురం వెళ్ళాలంటే ఒక పండుగ వచ్చినట్టే. ఎటుచూసినా పచ్చని పంటపొలాలు. పాయలుపాయలుగా నీటి కాల్వలు. వరిపొలాలపై ఎక్కడినించో వచ్చివాలిన తెల్లని కొంగలు నీరెండకు మెరుస్తూ ఆకుపచ్చని తివాచీ పై తెల్లని వెండిజరీ పూలు అద్దినట్టు కనిపిస్తే కన్నుల పండుగగా ఉండేది. పక్కనే ఉన్న సరస్సులాంటి మోట బావి ఇంజిన్ పెడితే గొట్టంలోంచి ఒక జలపాతంలా నురగలు కక్కుతూ దుమికే నీళ్ళల్లో కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటె ఆ సంబరం అంతాఇంతా కాదు. ఇక సాయంత్రాలు డాబా మీద చల్లగాలికి కూర్చుని అమ్మమ్మ మాకిష్టమని చేసిన రకరకాల అమృతంలాంటి పిండివంటలు, ఆమె మాకు కధలు చెపుతూ కొసరికొసరి వడ్డిస్తూంటే, ఇంతకన్నా స్వర్గం మరెక్కడా లేదేమో అనిపించేది.
ఆరోజుల్లో ఆవూళ్ళో ఎలెక్ట్రిసిటీ లేదు. ఆ సంధ్య వెలుగులో డాబా పిట్టగోడకానుకుని చూస్తే దూరంగా కనిపించే వేములకొండ ఊరు, నరసిమ్హస్వామి గుట్ట, వాటి అంచుల్లోంచి ఆకాశానికి కుంకుమ పులుముతూ మెల్లిమెల్లిగా అస్తమించే సూర్యుణ్ణి చూస్తూ, ప్రకృతి చీకటి దుప్పటి కప్పుకునేవరకూ అలాగే ఒక తన్మయత్వంలో ఉండేవాళ్ళం.
గుట్టపైన నరసిమ్హస్వామి స్వయంభుగా ఒక సొరికలో వెలిసాడని ప్రతీతి. గంగాపురం వెళ్ళినప్పుడల్లా ఆ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉండేది మాకు. చిన్న గుడి దానిపక్కనే ఓ అయిదారు నీటి గుండాలు. వాటిల్లో పెద్దపెద్ద మీసాలతో, నామాలతో అన్ని రకాల రంగుల్లో పెద్దపెద్ద చేపలు ఈదుతూ ఉండేవి.
మేము బియ్యం వేస్తే అవి పైకొచ్చేవి. మా మామయ్య మమ్మల్ని జాగ్రత్తగా ఎత్తుకుని తీసుకెళ్ళి చూపించేవాడు. ఆతర్వాత అందరం స్వామి దర్శనం చేసుకుని ఆ గుట్టమీది రాళ్ళపై కూర్చుని మామయ్య మాకోసం తెచ్చిన చాక్లెట్లు తినేవాళ్ళం.
“అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ ఇదివరకే ప్లాన్ చేసుకున్నారట మనమెప్పుడూ ఇంతే. లాస్ట్ మినిట్ వరకూ ఏ ప్లాన్ చెయ్యం. పిల్లలు చెరో చెయ్యి పట్టి లాగుతూ అల్లరి చేయడంతో బలవంతంగా గతాన్ని తెంపుకుని మనసు వర్తమానంలోకొచ్చి పడింది. ఆకాశం కనిపించని ఈ కాంక్రీట్ జంగిల్ లోని కృత్రిమ వాతావరణం, తలుపు మూసివున్నా చెవులు బ్రద్దలయ్యే ట్రాఫిక్ రణగొణ ధ్వని. టీవిలు, స్మార్ట్ ఫోన్ల ప్రపంచం. క్షణం తీరికలేని ఉరుకులపరుగుల జీవన స్రవంతి…ఈవాతావరణంలో పెరుగుతున్న పిల్లలు. ఒక్కసారిగా ఈ పిల్లలను అమాంతం ఇక్కడినుంచి తీసుకెళ్ళి ఆ ప్రశాంతమైన ప్రకృతితో, స్వచ్చమైన గాలితో, స్వేచ్చా విహంగాలతో నిండిన పల్లెవాతావరణం చూపించాలని అనిపించింది. ఏది ఏమైనా సరే ఈసారి గంగాపురం వెళ్ళాల్సిందే.
“గంగాపురం వెళ్తున్నాం.” చిరునవ్వుతో చెప్పాను.
*
కొత్తగా సున్నం బదులు రంగులు వేసారు తప్పితే అమ్మమ్మ ఇల్లు మాత్రం ఏం మారలేదు.
ఆ డాబా ఇంటి ముందు ఇరువేపులా ఉండే గుల్మొహర్ చెట్లు ఇప్పటికీ అప్పటిలాగే ఎరుపు, గులాబీ రంగులతో విరగబూసి ఉన్నాయి.
మెట్లెక్కగానే దర్శనమిచ్చిన అమ్మమ్మా, తాతగార్ల నిలువెత్తు చిత్రపటానికి నమస్కరించాను. దర్జాగా ఇంగ్లీష్ ఫాషన్లో కుట్టించుకున్న సూట్ లో పొన్నుకర్ర ఠీవిగా పట్టుకుని, గంభీరంగా రాజసం ఉట్టిపడుతూ ఉన్న తాతయ్య పక్కన అమాయకంగా , పద్మపత్ర విశాలాక్షి అన్నట్టు పెద్ద కళ్ళు, గుండ్రని కుంకుమబొట్టు, పట్టుచీరలో అందంగా అమ్మమ్మ. ఒకపక్క వాళ్ళను తలుచుకొని ఆనందం, మరో పక్క వాళ్ళు లేని విషాదం. కళ్ళు చెమ్మగిల్లాయి.
“రండి రండి ఎన్నాళ్ళకు…ప్రయాణం కులాసాగా జరిగిందా?” ఆప్యాయంగా పలకరిస్తూ మామయ్య, ఆ వెనకే చిరునవ్వుతో అత్తయ్య. మండుటెండలో మలయమారుతంలా మనసుకు హాయినిచ్చింది వారి చెరగని ప్రేమ.
ఆమరునాడు నరసిమ్హ స్వామి గుట్టమీదికి పిక్నిక్ కి వెళ్దామని ప్లాన్ చేసారు మామయ్య. నాకెందుకో గుట్టమీద జరిగిన ఆ మార్పులూ, చేర్పులూ, ఆర్భాటాలూ నా చిన్నప్పటి అనుభూతిని తుడిచేస్తాయేమో అనిపించింది. మీరంతా వెళ్ళిరండి. నేను అత్తయ్యతొ పాటు ఇంట్లో ఉంటానని చెప్పి వాళ్ళను పంపించాను.
భోజనాలయింతర్వాత అత్తయ్య ఎవో కబుర్లు చెపుతూ అలాగే దివాన్ మీద ఒరిగి నిద్రలోకి జారుకుంది.
నాకేం తోచక చిన్ననాటి ఙ్గ్ఞాపకాలు నెమరువేసుకుంటూ అలా ఒక్కొక్క గది తిరుగుతూ , ఆ కాలంలొ దివాన్ ఖానా అని పిలువబడే గదిలోకి వెళ్ళాను.
ఒక మ్యూజియంలోకడుగుపెట్టిన అనుభూతి. ఎదురుగా తాతగారు కూర్చునే కుర్చీ, రాసుకునే బల్ల, దానిపై సిరా బుడ్డి, ఇంక్ ఫిల్లర్, రెండు మూడు పాళీ కలాలు. పక్కనె పుస్తక భాండాగారం, ఒక పెద్ద చెక్క బీరువా. నగిషీలు చెక్కిన తలుపుల్లో ఒకదానికి పొదిగిన అద్దం, పూలు లతలతో, సగం కళాయి పోయి ఉంది.
కొద్దిగా పట్టిన బూజు దులిపి, ఇత్తడి హాండిల్ ను పట్టి తిప్పితే బరువుగా తెరుచుకున్నాయి తలుపులు. లోపల పై రెండు అరల్లో రామాయణ, మహాభారత సంస్కృత గ్రంధాలు. తర్వాత అరల్లో శరత్ సాహిత్యం మొదలుకొని, ప్రేంచంద్, రవీంద్రనాథ్ ఠాగూర్ కాబూలీవాలా , గోర్కీ తెలుగు అనువాదం అమ్మ, కొన్ని చారిత్రాత్మక నవలలు, జీవిత చరిత్రలు ఉన్నాయి.
ఆరోజుల్లో తాతయ్య ఇన్ని మంచి పుస్తకాలు చదివారా అని విస్మయ పడుతూ, కింది అరలో చూసాను. ఏవో కట్టలు రసీదులు, మరేవో ముఖ్యమయిన గాగితాలు. వాటిమధ్యలో ఇరుక్కుని ఉన్న ఒక నోట్ బూక్ ఆకర్షించింది నన్ను. మెల్లిగా లాగి చేతిలోకి తీసుకున్నాను. నీలి రంగు బైండింగ్ వెలిసిపోయి, అక్కడక్కడ గోధుమరంగు మచ్చలతో ఉన్న ఒక డైరీ అది.
వెలిసిపోయిన కొన్ని అక్షరాలు నీడలా మిగిలినా, నా పెదవులు కూడబలుక్కుని ‘కిషన్ రావ్’ అంటూ చదివాయి. ఓహో ఇది తాతయ్య డైరీనా! ఒక్కసారిగా ఏదో సంభ్రమం రేకెత్తింది నాలో. ఆపుకోలేని కుతూహలం అప్రయత్నంగానె పేజీ తిప్పించింది నన్ను. గోధుమరంగులోకి మారిన తెల్లకాగితాలపై తేమకు కొంచెం చెదిరి వెలిసినా ముత్యాల సరాల్లాంటి సిరా అక్షరాల వెంట పరుగెత్తాయి నా కళ్ళు.
ఫిబ్రవరి 1940
గంగాపురం
రాత్రి 10.30
ప్రియమయిన డైరీ,
ఈరోజు ఉదయమే హైదరాబాదుకు ఊరి పన్ను కట్టడానికి నిజాం గారి ఆఫీసుకు వెళ్ళి వచ్చేసరికి రాత్రయిపోయింది. నాకోసం అమ్మ కళ్ళల్లో వత్తులు వేసుకుని తినకుండా ఎదురుచూస్తూంది. ఎందుకో ఆకలి లేకపోయినా అమ్మకోసం ఏదో తిన్నాననిపించాను. “బాగా అలిసిపోయినట్టున్నావు. నువ్వు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదవకుండా, ఆరాతలూ ఈరాతలూ రాయకుండా త్వరగా పడుకో.” అంటూ హెచ్చరించింది అమ్మ. కాని కంటిమీద కునుకు రావడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా ఆ అమ్మాయే కనిపిస్తూంది. ఎప్పుడూ లేంది మనసంతా ఏదో గమ్మత్తుగా ఆహ్లాదమయిన మత్తులో ముణిగిపోయి ఉంది. అసలు ఈరోజు రూపేష్ ఇంటికి వెళ్ళకుండానే వచ్చేద్దామనుకున్నాను కానీ చివరి క్షణంలో, చాలా రోజులయింది వాడిని చూడక, మళ్ళీ నెల వరకూ కుదరదుకదా అని, మనసు మార్చుకుని వెళ్ళాను.
అవునూ డైరీ, అసలు నీకు రూపేష్ గురించి ఇంతవరకు చెప్పలేదు కదూ. వాడు నా చిన్నఫ్ఫటినించీ ఎఫె వరకూ క్లాస్ మేట్. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో గుజరాత్ నుంచి వర్తకం చేయడానికి హైదరాబాద్ వచ్చి అక్కడే స్తిరపడి పోయారు. దుర్దృష్టవశాత్తు చిన్నప్పుడే మా నాన్నగారు పోయినా, ఎప్పుడూ గడపకూడా దాటి ఎరగని అమ్మ అన్నీ తనే అయి మమ్మల్ని చూసుకుంది. నన్ను హైదరాబాద్ పంపించి చదివించింది. ఆమె కష్టం చూడలేక నేనే ఎలాగో అమ్మను వొప్పించి చదువు మానేసి ఇంటికి వచ్చాను. నాన్నగారి జమీందారీ డ్యూటీలతో పాటు ఆయన మిగిల్చిన 200 ఎకరాలా సుక్షేత్రం, వ్యవహారాలు బరువుబాధ్యతల్లో ముణిగిన నాకు ఇలాంటి ఈ హాయయిన అనుభూతి ఎప్పుడూ కలగలేదు.
అవును అసలు విషయం ఏంటంటె, నేను రూపేష్ ఇల్లు చేరి తలుపు తట్టాను. కాసేపటికి తెరుచుకుంది తలుపు. ఎదురుగా ఒక మెరుపుతీగ. నా ఎదలో ఒక వీణ మీటు. చూపు మరల్చుకోలేకపోయాను. మిగల కాచిన పాలమీగడ తరగలాంటి చాయ. తళుక్కున మెరిసే నీలి కలువ కళ్ళు, సంపంగి మొగ్గలాంటి ముక్కు, లేత గులాబీ పెదవులు. శంఖంలాంటి మెడలో ఒంటిపేట బంగారు గొలుసు ఆమె రంగుముందు వెలవెలబోతూ ఎప్పుడో ఆమె కదిలినప్పుడుమాత్రమే తళుక్కుమని నేనున్నానని చెపుతూంది. లతలాంటి ఆమె మేనిని చుట్టుకున్న ఆకుపచ్చ చీర జరీ అంచు ఆమె పసిమి పాదాలపై జీరాడుతూ, కవులు వర్ణించే కావ్య కధానాయిక ఈమేనేమో అనిపించింది.
“ఎవరు కావాలండీ?” వినిపించిన ప్రశ్నతో ఈలోకంలో పడి, నన్ను నేను సంబాళించుకుంటూ, “రూపేష్ ఉన్నాడా?” అడిగాను గొంతు పెగుల్చుకుని.
“అన్నయ్య ఇంట్లో లేరండీ,” వీణ మీటినట్టు సమాధానం.
రానని మొరాయిస్తున్న మనసును అక్కడే వదిలేసిన నన్ను బలవంతంగా లాక్కొచ్చాయి నా కాళ్ళు.
సరే మరి ఇక నన్ను కలల్లో తేలిపోనీ.
శుభరాత్రి.
*
ఏప్రిల్ 1940
గంగాపురం
ప్రియమయిన డైరీ
అప్పుడే మెరుపుతీగను చూసి రెండు నెలలు కావస్తూంది. ఎన్నిసార్లు అనిపించిందో మళ్ళీ వెళ్ళి చూడాలని. కానీ ఎప్పుడూ ఏవో పనులు తీరికలేకుండా. అయినా మనసు నిలకడగా లేక విహంగంలా ఆమె వేపు పరుగులు తీస్తూనే ఉంది.
“ఏంటిరా అలా పరధ్యానంగా ఉంటున్నావ్? కూర అద్భుతంగా ఉందనో, పులిహోర రుచి స్వర్గాన్ని తలపిస్తుందనో, పూరీలు చందమామల్లా ఉన్నాయనో పొగిడే వాడివి. ఈమధ్య ఇలా అయిపోయావేమిటి? ఆ తిండి ఏమిటి కెలుకుతూ?” అమ్మ అంటూనే ఉంది.
అసలు నాకేమయిందో నాకే తెలియడం లేదు. పచ్చని పంట పొలాలను చూస్తే ఆకుపచ్చ చీరలో ఉన్న ఆమే రూపం వనకన్యలా దర్శనమిస్తూంది. ఆకాశంలో మేఘాల వెండి అంచులు చూస్తే ఆమె పాదాలపై జీరాడే జరీ అంచు తలపున పడుతూంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబం ఆమె నుదిటిపై ఎర్రని బొట్టు గుర్తొస్తూంది. సెలయేరు గలగలల్లో ఆమె నవ్వు ప్రతిధ్వనిస్తూంది. మేఘాల మాటున చటుక్కున మెరిసి మాయమయ్యే మెరుపుతీగలా, కమనీయ స్వప్నాల తటిల్లతలా అనుక్షణం ఆమె ధ్యాసే. ఆమెను చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతూంది. ఆమెతోనే బ్రతికేయాలని ఎదలో ఏదో అనూహ్యమయిన ఆరాటం.
నవ్వుతున్నావా డైరీ! అవును నేను ఉన్మాదిలా అయిపోయానేమో?
అయినా ఈ నిరీక్షణ ఇంకా ఎంతో కాలం కాదు. పన్నులు వసూలు పనులు అయిపోయాయి. రేపు హైదరాబాద్ వెళ్ళి కట్టి రావాలి. ఆమెను త్వరలో చూడబోతున్నానని తలుచుకుంటే మనసులో ఏదో పులకింత. అర్థంకాని గిలిగింత నన్ను నిద్రపోనీయడం లేదు.
సరే ఇక నన్ను కలల్లో తేలిపోనీ…
శుభరాత్రి
*
జూన్ 1940
ప్రియమయిన డైరీ
ఈరోజు హైదరాబాద్‌లో పని త్వరగా ముగించుకుని రూపేష్ వాళ్ళింటికి అఘమెఘాల మీద బయల్దేరాను. మనసు దూది పింజలా గాల్లో తేలిపోతూంది. కాళ్ళు భూమిపై నిలవడం లేదు. అరమైలు దూరం అరవై మైళ్ళదూరంలా అనిపించింది.
గేట్ తీసుకుని వెళ్ళాను. ఈసారి తలుపు ఓరగా తీసే ఉంది. ముందు హాల్లో గొలుసుల ఉయ్యాల్లో అటు తిరిగి అలవోకగా పడుకుని ఏదో పుస్తకంలో లీనమయి ఉంది మెరుపుతీగ. తెల్లని ఆకాశంలాంటి దిండుపై నల్లని మేఘాల్లా రిగులు రింగులుగా పరుచుకుని ఉంది ఆమె జుట్టు. లేత పసుపు చీర కొంగు ఉయ్యాల మీంచి జలపాతంలా కిందికి జారి నేలను తాకుతోంది. జాకెట్కూ చీరకు మధ్యనున్న సన్నని వొంపు తిరిగిన నడుము ఆమె చీర అంచు పసిడి రంగులో కలిసిపోయి కాంతులీనుతూంది. ఆమె పసిడిపాదాల మువ్వలు ఉయ్యాల చిరుకదలికకు అప్పుడప్పుడూ ఘల్లుమంటున్నాయి.
ఎంతసేపయినా ఆమెను అలాగే చూడాలనిపించింది. మౌనంగా అలాగే నిలబడిపోయాను.
“అరే కిషన్ అలా బయటనే నిలబడిపోయావేం? లోపలికి రా.” పిలిచాడు రూపేష్.
కల చెదిరినట్లు ఒక్కసారే ఉలిక్కిపడ్డాను.
ఒక్క ఉదుటున లేచి తిరిగిచూసిన ఆమె కన్నుల నీలి తళుకుల్లో నన్ను గుర్తుపట్టిన ఏదో మెరుపు. పెదవులపై చిరుదరహాసం అంతలోనే ఆమె ముఖంలో ఎనలేని సిగ్గు గులాబీలు.
చేతిలో పుస్తకం అలాగే పట్టుకుని లోపలికి పారిపోయింది.
“మా ఇద్దరికీ కొంచెం టీ పెట్టమ్మా,” అంటూ లోపలికి వినిపించేలా చెప్పి, నన్ను కూర్చోమని కుర్చీ చూపించాడు రూపేష్.
ఏవో కబుర్లు చెప్పుకుంటుండగా ఒక ట్రేలో టీ, బిస్కెట్లు తెచ్చి టీపాయ్ మీద ఉంచి మళ్ళీ లోపలికి పారిపోయింది ఆ తటిల్లత.
“కిషన్…” గొంతు తగ్గించాడు రూపేష్, “నా చెల్లికి సంబంధాలు చూస్తున్నాను. అమ్మా నాన్న ఉంటే ఈపాటికి ఎప్పుడో ఆమె పెళ్ళి అయిపోయేది కానీ నీకు తెలుసు కదా మాకెవరూ బంధువులు కానీ ఆప్తులు గానీ ఇక్కడెవరూ లేరు. గుజరాత్ లో ఎవరో దూరపు బంధువులున్నారు కానీ దూరం. అదీగాక పుట్టినఫ్పటినించీ ఇక్కడే ఉన్నాం. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మతో కలిసి ఒకసారి వెళ్ళామేమో అహ్మదాబాద్ కు. నాకు సరిగా గుర్తేలేదు. కిషన్ నీకన్నా ఆప్తులు నాకీప్రపంచంలో ఎవరూ లేరు….” నా రెండు చేతులూ పట్టుకున్నాడు.
“చెప్పు రూపేష్. నేను చేయగలిగేది ఏదయినా సరే చేస్తాను.” అతని చెయ్యి మీద చేయి వేస్తూ అన్నాను.
“నువ్వేం అనుకోనంటే ఒకటి అడగొచ్చా?”
“తప్పకుండా. నాదగ్గర నీకు సంకోచమా?”
“నీకూ నాలాగే అభ్యుదయ భావాలున్నాయని తెలుసు కిషన్. అందుకే అడుగుతున్నాను. నీకు అభ్యంతరం లేకుంటే నా చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటావా?”
“రూపేష్…” సంభ్రమాశ్చర్యాలలో ముణిగిన నా హృదయంలోంచి పెల్లుబికిన ఆనందం నన్ను మూగవాణ్ణి చేసింది.
చివరికి ఎలాగో గొంతు పెగుల్చుకుని “అంతకన్నానా రూపేష్. అది నా భాగ్యమనుకుంటాను.” అన్నాను.
“మా చెల్లి చాలా అదృష్టవంతురాలు” అంటూ కన్నీళ్ళతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు రూపేష్.
“మరి అమ్మగారు ఒప్పుకుంటారా?” అంతలోనే అనుమానంగా అడిగాడు.
“నువ్వేం దిగులు పెట్టుకోకు. నేనంటే మా అమ్మకు పంచప్రాణాలు. ఇంతవరకూ నా ఇష్టం ఎప్పుడూ కాదనలేదు. తప్పకుండా ఒప్పుకుంటుంది.” హామీ ఇచ్చాను.
నేను బయల్దేరే ముందు మరోసారి నీలికళ్ళు తళుక్కున మెరిసి తలుపుచాటుకు మాయమయ్యాయి. ఆ ఒక్క క్షణంలో ఆమె ముఖంలో కనిపించిన ఆరాధనా భావం నా మనసును మరింత కట్టిపడేసింది.
హృదయాన్ని ఆమె కైవసం చేసి భూమి మీద కాలు నిలువకుండా ఎలా ఇంటికి చేరానో నాకే తెలియదు.
సరే డైరీ, నా కలల రాణితో జీవిత రమ్యహర్మ్యాలను ఊహించుకోనీ.
శుభరాత్రి.
*
ఆగస్ట్ 1940
ప్రియమయిన డైరీ
అబ్బ ఎన్నాళ్ళయింది నా మెరుపు తీగను చూడక! ఎలా ఉందో? కళ్ళుమూసినా తెరిచినా ఆమె రూపే. రెక్కలు కట్టుకుని వాలాలని ఉంది ఆమె చెంత. రోజొక యుగంలా గడుస్తూంది. కానీ ఏం చేయను? ఊళ్ళో వ్యవహారాలు, ఏస్టేట్ పనులు. దానికితోడు విపరీతమయిన వర్షాలకు గుట్టపై గుండాలు నిండి ఒక జలపాతంలా కింది చెరువులో పడుతున్నాయి. చెరువు నీళ్ళు అంచులుదాటి పొంగి పొర్లుతున్నాయి. కట్ట ఎక్కడ తెగి పంటల్ని ముంచెత్తుతుందో అని భయం. దానికోసం నాలాలు, కాలవలు తవ్వించాల్సొచ్చింది.
ఈరోజు అమ్మ అన్నం వడ్డిస్తూ , “ఒరేయ్ కిషన్, ఎన్నిరోజులనుంచి అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదేమిట్రా? ఆ బ్రాహ్మణకోడూరు సంబంధం వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. ఎన్ని సార్లు పెళ్ళిచూపులకు వెళ్దామన్నా నువ్వు పట్టించుకోవడం లేదు.”
“నాకిప్పుడు ఎన్ని పనులున్నాయో నీకు తెలుసుకదమ్మా.” అంటూ తప్పించుకోజూశాను.
“ఎప్పుడూ ఏవో కుంటిసాకులు చెప్పడం నీకలవాటయిపోయింది. నాకూ వయసు మీద పడుతూంది. నీకు పెళ్ళి చేస్తే నేను కృష్ణా రామా అనుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు కాస్త తెరిపి ఇచ్చాయి కదా. ఎప్పుడు బయల్దేరి వెళ్తామో చెప్పు. సిద్ధాంతిగారినడిగి ఈ పౌర్ణమి లోగా మంచిరోజు చూసి వాళ్ళకు ఉత్తరం రాయమంటాను.”
గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది నాకు. నర్మద విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. చచ్చేంత సిగ్గుగా, మొహమాటంగా ఉంది. గ్లాస్ మంచినీళ్ళు గడగడా తాగే నెపంతో కాసేపు ఆగి, “రేపు ఆలోచించుకుని చెప్తానమ్మా” అంటూ ఇప్పటికి తప్పించుకున్నాను.
ఇక రేపు అమ్మకు నా మెరుపు తీగ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచించుకోవాలి.
శుభరాత్రి.
*
అక్టోబర్ 1940
ప్రియమయిన డైరీ
ఈరోజు ఏమయిందో తెలుసా? ఉదయం అమ్మ వెండి కప్పులో టీ ఇస్తూ, “ఒరేయ్ కిషన్, ఇప్పటికి nela రోజులుగా చెవినిల్లు కట్టుకుని నా నోరు నొప్పి పెట్టేలా చెపుతున్నా కదరా ఆ బ్రాహ్మణకోడూరు సంబంధం గురించి. ఉలుకూ పలుకూ లేకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఎలారా? మా పెదనాన్నగారి అబ్బాయి వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు చూశాను చిన్న అమ్మాయిని, కుందనపు బొమ్మ అనుకో. పచ్చని మేలిమి బంగారు చాయ, పెద్ద కళ్ళు, పొడుగాటి జడ. అసలు రెందు కళ్ళూ చాలవనుకో. అలాంటి పిల్లను ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు. వాళ్ళకు కూడా మన సంబంధం ఎంతో నచ్చింది. అసలు నిన్ను నాతో తీసుకెళ్ళాల్సింది. నువ్వు కూడా చూస్తే ఆ తతంగం ఏదో కానిచ్చి ఖాయం చేసుకునేవాళ్ళం. నేను మా అన్నయ్యకు మాటిచ్చాననుకో. కానీ నువ్వూ ఒకసారి చూస్తే…”
ఫుల్ స్టాప్, కామాలు లేకుండా అలా జాలువారుతున్న ఆమె వాగ్ధోరణి ఇక వినలేక “అమ్మా..!” అని అరిచాను.
“ఎందుకురా అలా అరిచావు? నాకు తెలుసు నువ్వు సవాలక్ష కారణాలు చెపుతావు ఇప్పుడెందుకు నీకు వీలుకాదో అని. నీకెప్పుడూ ఉండే పనులే. ఇక నువ్వేం చెప్పినా నేను వినేది లేదు. ఎల్లుండి పంచమి తిథి బాగుంది. ప్రయాణానికి ఏర్పాట్లు చూడు.” అంటూ ఆఙ్ఞ జారీ చేసి, నేను చెప్పేది వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది.
మనసులో ఎంత రెహార్సు చేసినా ఎంత ధైర్యంగా నర్మద గురించి చెప్పాలనుకున్నా, అమ్మ ముందు నా ధైర్యం నీరుకారిపోతూ, నోరు పెగలడం లేదు. ఎలా? ఇప్పుడు చెప్పకుంటే ఇక ఇంతె సంగతులు అన్నంత పని చేస్తుంది అమ్మ.
మెల్లిగా నేనూ వంటింట్లోకి వెళ్ళి, “అమ్మా…” అని చిన్నగా పిలిచాను.
“ఏంటి నాయనా?” అని లాలనగా అడిగింది.
“ఏం లేదమ్మా…నీతో ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో తెలియడం లేదు…” నసిగాను.
“నా దగ్గర నీకు మొహమాటం ఏంటి కిషన్. చెప్పు ఏంచెప్పాలనుకుంటున్నావో.” ప్రేమగా నావేపు చూసింది అమ్మ.
“మరేం లేదమ్మా…” తడబాటుతో నా గొంతు పూడుకుపోయింది.
“ఫర్వాలేదు నాయనా చెప్పు. అమ్మదగ్గర మొహమాటం ఏమిట్రా?”
“మరేం లేదమ్మా, నా స్నేహితుడు రూపేష్ గురించి చెప్పనుకదా నీకు?”
“అవును. ఆ గుజరాతీ అబ్బాయె కదూ?”
“అవునమ్మా. మొన్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు…” మళ్ళీ తడబడ్డాను.
“ఆ వెళ్ళినప్పుడు?” అమ్మ ప్రశ్నార్థకంగా చూసింది.
“వెళ్ళినప్పుడు అతడు వాళ్ళ చెల్లి ప్రసక్తి తీసుకొచ్చాడు.”
“ఏ విషయంలో?” తరుగుతున్న వంకాయ అలాగే వదిలేసి నా వెపు చూసింది.
“అదే…వాళ్ళ చెల్లికి సంభంధాలు చూస్తున్నానని, ఎక్కడా మంచి సంబంధం దొరకలేదని, నీకిష్టమయితే మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని ఉందని అన్నాడమ్మా. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టమని చెప్పాడు. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు రెండు మూడుసార్లు చూసాను ఆ అమ్మాయిని. చాలా అందంగా అణుకువగా ఉంటుంది. నీకు చాలా నచ్చుతుంది. నువ్వు కాదనే ఉద్దేశ్యంతో సరే అని మాటిచ్చానమ్మా.” ఒక్క ఉదుటున గుక్క తిప్పుకోకుండా చెప్పేశాను.
నేను చెప్పేది ఇక వినిపించుకోనట్టుగా తల అడ్డంగా ఊపింది అమ్మ. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడడం గమనించాను. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలింది. “నువ్విలాంటి పని చెస్తావని కలలో కూడా అనుకోలేదు. నేను నీకన్నా ముందే మా అన్నయ్యకు మాటిచ్చాను. పైగా వాళ్ళు గుజరాతీ వాళ్ళు. మన ఆచారాలు వేరు వాళ్ళవి వేరు. భాష, కట్టుబొట్టు అన్నీ వేరు. వాడికి బుద్ధి లేదు సరే అసలు నీకేమయిందిరా? నువు చెప్పొచ్చు కదా మనకూ వాళ్ళకూ కుదరదని? పైగా మనది నిప్పులు కడిగే వంశం. మీ నాన్నగారు ఎంత నియమనిష్టలతో ఉండేవారో తెలుసా? మన వంశ గౌరవాన్ని ఎలా కాపాడుకొచ్చారో తెలుసా? నువ్వింకా ఏదో చిన్నవాడివనుకున్నాను కానీ నువ్విలా చేస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుందనుకున్నావా?.”
“అమ్మా…” ఏదో చెప్పబోయాను. కానీ చెయ్యి అడ్డం పెట్టి ఆపింది.
“పిచ్చిపిచ్చి వేశాలు కట్టబెట్టు. ఎల్లుండి పెళ్ళి చూపులకు బ్రాహ్మణకోడూరు వెళ్తున్నాం. అంతే!” ఖరాఖండిగా చెప్పి అటు తిరిగి తరిగిన వంకాయలు పోపులో పడెసింది అమ్మ.
ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే అమ్మకు ఇంత కోపం వస్తుందనుకోలేదు. ఎందుకో తల గిర్రున తిరిగినట్లయింది. కాళ్ళకింద భూమి కదిలినట్లయింది. మెల్లిగా లేచి నా గదిలోకొచ్చాను. ఏం చేయాలో, రోజులు మారాయని అమ్మకు ఎలా చెప్పి ఒప్పించాలో అర్థంకాకుండా ఉంది. మళ్ళీ రేపొకసారి అమ్మను బ్రతిమాలుతాను. ఈలోపల అమ్మ కూడా ఆలోచించి మనసు మార్చుకుంటుందేమో?
శుభరాత్రి
*
డిసెంబర్ 1940
ప్రియమయిన డైరీ
ఈరోజు లేచినప్పటినుండీ అమ్మ ముభావంగానే ఉంది. అడగాలంటే ఏదో సంకోచం. ఎలాగయినా మాట్లాడించాలని కరివేపాకు చెట్టుకు నీళ్ళూపోస్తున్న అమ్మదగ్గరికి వెళ్ళి, “అమ్మా…” అని పిలిచాను. ఏం మాట్లాడకుండా నావేపు చిరాగ్గా చూసింది.
“అమ్మా, ఒక్కసారి నావెపునుంచి ఆలోచించమ్మా. నాకూ ఆ అమ్మాయంటే చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయి. మన ఆచారాలన్నె నేర్చుకుని నీకు తగిన కోడలిగా ఉండడానికి ఆమె ఒప్పుకుందని రూపెష్ హామీ ఇచ్చాడమ్మా. నాకూ ఆనమ్మకం ఉంది. అదీగాక మారే రోజులతోపాటు మనం కూడా మారాలికదా. దయచేసి ఒక్కసారి ఆలోచించమ్మా.”
“ఆలోచించడానికి ఏముంది నాయనా! నా ఊపిరి ఉన్నంత వరకు నేను మీ నాన్నగారి వంశానికి అప్రతిష్ట తీసుకురాలేను. పైగా గుర్నాధం అన్నయ్యకిచ్చిన మాట తప్పినదాన్నవుతాను.” అంటూ పెరట్లోంచి ఇంట్లోకి విసురుగా వెళ్ళీపోయింది.
ఇంకా ఏం చెపితే అమ్మను ఒప్పించగలనో? అసలు అమెను ఒప్పించడం సాధ్యమవుతుందో లేదో? మనసంతా ఎప్పుడు కలగని ఏదో బాధ, గుబులు. భారమయిన మనసుతో అలాగే ఎంతసేపు నిల్చున్నానో తెలియదు. భోజనం వడ్డించాను అనే అమ్మపిలుపుతో ఈలోకంలోకొచ్చిపడ్డాను.
కంచం ముందు కూర్చున్నా ఒక్క ముద్ద కూడా గుంతు దిగలేదు. ఏదో అయిందనిపించి లేచాను.
“అదేంటిరా, ఏం తినకుండా చెయ్యి కడిగేసావు?”
“ఆకలి లేదమ్మా,” అంటూ నా గదిలోకొచ్చి మంచంపై ఒరిగిపోయాను.
ఎంత ఒద్దనుకున్నా నా మెరుపుతీగ గుర్తుకురాక మానడం లేదు. సూర్యోదయం వేళ ఉదయభానుని లేలేత కిరణాల మెరుపులో ఆమె కళ్ళే కనిపిస్తున్నాయి. సాయంత్రపుటాకాశం లోని అరుణిమ ఆమె సిగ్గుతో కందిపోయిన బుగ్గల ఎరుపును తలపిస్తోంది. మబ్బుల చాటున దోబూచులాడుతూ, కొబ్బరి ఆకుల సందుల్లోంచి కనీకనిపించకుండా వెండి వెలుగులు నిండు జాబిల్లి లాంటి ఆమె ముఖారవిందాన్ని చూడకుండా నెను బ్రతకగలనా?
రాత్రి భోజనాలయింతర్వాత ఇక మనసాగక, ఇప్పటివరకు అమ్మ నాగురించి ఏమయినా ఆలోచించి ఏమయినా మనసు మార్చుకుని ఉంటుందేమో అనే ఆశతో అమ్మ గదిలోకి వెళ్ళేసరికి పడుకుని ఉంది. ఇంకా నిద్రపోలేదనిపించి, అమ్మా… అని పిలుస్తూ మంచం చివర కూర్చున్నాను.
“ఏంటి నాయనా ఇంత రాత్రప్పుడు వొచ్చావు?” అంది ఇటు తిరుగుతూ.
“అమ్మా..,” తటపటాయించాను, “అమ్మా నిన్నెప్పుడు ఏదీ అడగకుండానే నాకన్నీ సమకూర్చి పెట్టావు. అలాగే నా మాట కాదనవనే ఉద్దేశ్యంతో రూపేష్ కు మాటిచ్చానమ్మా. ఆ అమ్మాయి కూడా నామీద చాలా ఆశలు పెట్టుకుంది. దయచెసి కాదనకమ్మా. ఈ ఒక్కవిషయంలో నన్ను అర్థం చేసుకో అమ్మా…”
ఇంకా నా మాట పూర్తికాకుండానే విసురుగా, “నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుపో!” అంటూ కోపంగా అటు తిరిగి ముసుగు పెట్టుకుంది.
చేసేదేం లేక తిరిగి నా గదిలోకొచ్చేశాను. ఇంతకు ముందెప్పుడూ ఎదురవ్వని ఇరకాటపరిస్తితి.
శివరాత్రి
*
జనవరి 1941
ప్రియమయిన డైరీ
కనీసం నీకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా చెప్పలేదని అనుకుంటున్నావు కదూ! ఏం చెప్పను? ఎలా చెప్పను? ఎంత బ్రతిమాలినా, నేను అలిగినా అమ్మ అస్సలు నా మాట వినడం లేదు సరికదా నాతో మాట్లాడడం కూడా మానేసింది. ఇప్పటికి పది రోజులుగా అన్నం నీళ్ళు ముట్టుకోకుండా అలాగే భీష్మించుకుని ఉంది. పస్తులతో పడుకుంటున్న అమ్మను అలా చూడాలంటే చాలా బాధగా ఉంది. నాన్నగారు పోయినప్పటినుండీ నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఆరోప్రాణంగా పెంచిన అమ్మ ఇంతలా బాధపడడం ఇదే మొదటిసారి చూస్తున్నాను. అమ్మ అంటే నాకు ప్రాణం. అమ్మను కాదని ఏ నిర్ణయం తీసుకోలెక సతమతమవుతున్నాను.
కాదని చెప్పి రూపెష్ కి నా ముఖం ఎలా చూపించను? మా స్నేహానికున్న విలువ ఏమైపోతుంది? ఎన్నో ఆశలతో నాపై ఇష్టం పెంచుకున్న నర్మద ఏమవుతుంది? ఆమె సున్నిత హృదయం తట్టుకోగలదా? అసలు దేవుడు మనసు ఎందుకిచ్చాడు? అందులో ప్రేమ అనే అనిర్వచనీయమయిన భావం ఎందుకు పెట్టాడు? ఆమెను చూడగానే అనుకోకుండా నాలో ఈ మధుర భావం ఎలా ఉదయించి శాఖోపశాఖలుగా విస్తరించి నరనరాలలో జీర్ణించుకుపోయి, ఆమె రూపానికి హృదయంలో ప్రతిష్టాపన ఎలా జరిగింది? ప్రేమ ఎంతో మధురమనీ, ప్రేమించడం ఒక గొప్ప వరమనీ ఇన్నాళ్ళూ పుస్తకాల్లో చదివాను. అలాంటి అనుభవం నాకూ కలిగిందని మురిసిపోయాను, ఆమెను తల్చుకుని అందమయిన ఊహల్లో తెలిపోయాను. ఆమె నవ్వులో నా జీవిత సరిగమలు పలికాయనుకున్నాను. ఇప్పుడు అపశృతులు పలికే ఈజివితాన్ని ఎలా భరించగలను? ఆమెను మర్చిపోవడం సాధ్యమా? హృదయంలో చెలరేగుతున్న ఈ మంటలను ఎలా ఆర్పగలను? తుఫాను భీభత్సంలో, నడి సముద్రంలో పిడుగుల వర్షంలో చిక్కుకున్న నావలా కొట్టుమిట్టాడుతూ సుళ్ళు తిరుగుతున్న, నా ఈ మానసిక సంఘర్షణ నాలో మరణమృదంగం మ్రోగిస్తోంది.
ఒకవేపు చిక్కి శల్యమయిన అమ్మను చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతూంది. ఇంకా ఆలస్యం చేస్తే అమ్మ దక్కేట్టు లేదు. కన్నతల్లి కోరిక తీర్చడం నా కనీస ధర్మం. ఈ వయసులో ఆమె మనసు కష్టపెట్టలేను.
నా మెరుపుతీగ…అలా పిలిచే అర్హత కోల్పోయాను . నర్మదకు నేను చేయబోతున్న అన్యాయం నన్ను నేను క్షమించుకోలేనిది. కానీ ఏంచెయ్యగలను? ఒక మోసగాడిలా చిరస్తాయిగా ఆమె మనసులో ఉండిపోయినా ఫర్వాలేదు కానీ ఆమెను అర్థం చేసుకుని ఆరాధించే మరో మంచి అబ్బాయి ఆమెకు జీవిత భాగస్వామిలా రావాలనీ, ఆమె నీలి కళ్ళల్లో తళుకు మాయగూడదనీ, నీళ్ళు సుళ్ళు తిరగకూడదనీ, ఆమె గులాబీ పెదవులపై చిరుదరహాసం అలాగే నిలవాలనీ కోరుకోవడం తప్ప?
రెపే రూపేష్ కి ఉత్తరం వ్రాయాలి…నన్ను క్షమించు మిత్రమా…అంటూ….
కాళరాత్రి.
*
డైరీ చదువుతున్న నా కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. అక్షరాలు మసకబారాయి. ఆత్రంగా పేజీ తిప్పిన నాకు మిగతా పేజీలన్నీ ఖాళీగా కనిపించాయి. ఆరోజుల్లో కూడా మా తాతయ్యకి ఇంత ప్రేమకధ ఉందా! అనుకుంటూ, కళ్ళు తుడుచుకున్నాను.
ఒక్కసారిగా అమ్మ ఎప్పుడూ చెపుతుండే మాటలు గుర్తొచ్చాయి, నీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటానని వాళ్ళమ్మకు మాటిచ్చి, అసలు పెళ్ళిచూపులకు కూడా వెళ్ళకుండా మా అమ్మమ్మ రత్నమాల మెళ్ళో మూడుముళ్ళూ వేసాడట తాతయ్య.
నాకు తెలిసి మా అమ్మమ్మ ఆ వయసులో కూడా చాలా అందంగా ఉండేది, కాకపోతే తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ, కొన్ని సార్లు నవ్వుతూ, కొన్ని సార్లు బాధగా తన లోకంలో తను అన్నట్టుగా ఉండేది. ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతూంది. బహుశా తాతయ్య ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, పెళ్ళిచేసుకున్న అమ్మాయికి దగ్గరవ్వలేక నానా యాతనా పడిఉంటాడు. మనస్పూర్తిగా ప్రేమించిన భర్త ప్రెమాదరణలను పూర్తిగా నోచుకోని అమ్మమ్మ మనసు కలత చెంది ఉంటుంది. అందుకే ఆమె అలా అయిపోయిందేమో?
“అమ్మా ఎంతసేపట్నించీ పిలుస్తున్నా, ఇక్కడున్నావా? మనం ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. మర్చిపోయావా? నాన్న రమ్మంటున్నారు,” మా పాప మాటలకు ఈలోకంలోకి వచ్చాను.
చేతిలో ఉన్న డైరీలోంచి నీలికళ్ళు తళుక్కుమని మాయమయ్యాయి.