సంసారం ఆటుపోటుల సాగరం

చిన్న కథ

కామేశ్వరి వాడ్రేవు

ప్రమీలా…. ప్రమీలా…. అంటూ శేఖర్ ఇల్లంతా తిరిగి, పెరట్లోకి వచ్చి, మల్లె పందిరి కింద ఉన్న తిన్న మీద కూర్చుని ఆలోచనలో మునిగి ఉన్న ప్రమీల పక్కకు వచ్చి కూర్చున్నాడు. అయినా ప్రమీల శేఖర్ ఉనికిని గమనించలేదు. అప్పుడు” ప్రమీల ఎందుకలా ఉన్నావు. నీకోసం ఇల్లంతా వెతికాను. ఒంట్లో బాగాలేదా ” అంటూ నుదురు మీద చెయ్యి వేసి చూసాడు. నార్మల్ గానే ఉంది.” ఆఖరికి మన ఇద్దరమేమిగిలిపోతామని అనుకోలేదండి. కొడుకులు కోడళ్ళు, మనమలు ఎంతమంది ఉన్నా ఎక్కడో దూర ప్రదేశాల్లో ఉన్నారు. రెక్కలు వచ్చి వాళ్ళ దారిన వాళ్లుఎగిరిపోయారు. ఈ గూట్లోముసలి పక్షులమి ద్దరమే మిగిలాం. ఏమిటో బెంగగా, అయోమయంగా, చేతికి పని లేక కట్టిపడేసినట్లు ఉంది. నా 20వ ఏట కాపురానికి వచ్చినప్పటి నుండి నా అత్తమామలు, మరుదులు, ఆడపడుచులను చక్కదిద్దేటప్పటికి, మన పిల్లలు ఎదిగి వచ్చారు.వాళ్ల చదువు సంధ్యలు, పెళ్లిళ్లు అయ్యి, చివరకు మీ రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఉన్నదానిలో సర్దుకుపోవటం ముందు నుంచి నాకు అలవాటే. డబ్బు సమస్య కాదు ఒంటరితనమే నన్ను పీల్చి పిప్పి చేస్తుంది మీరు మగవారు కనుక కాసేపు బయట తిరిగి వస్తారు. పైగా ఎన్ని బాధలు ఉన్నా గుంభనగా ఉండడం మగవాడి లక్షణం. కానీ స్త్రీకి భగవంతుడు ఆ భాగ్యం ఇవ్వలేదు. మనసులో అది కక్కుకుంటే గాని బరువు తీరదు “అంది.
‌ దానికి శేఖర్ పగపకా నవ్వుతూ ” అవన్నీ మన విధులు బాధ్యతలు. కష్టసుఖాలు అంటావా మనుషులకి కాక మానులకు వస్తాయా. వాటికి కూడా వస్తాయనుకో అవి మనలాగా పైకి చెప్పుకోలేవు. సంసారం సాగరం అన్నారు పెద్దలు. సాగరం ఎంత ఈది నా తరగదు. ఒకసారి సముద్రాన్ని పరిశీలించావా. కెరటపు దెబ్బలు సముద్రపు అంచుకేతగులుతాయి. బాగా లోపలికి వెళితే సముద్రంప్రశాంతంగా, నిండుగా, గంభీరంగా ఉంటుంది. రత్న గర్భ అయినా ఎగిసి పడదు. తనలో ఎన్ని బడబాగ్నులు ఉన్నా కదలక మెదలకఅలాగే ఉంటుంది. మనం సంసారం అనే సముద్రంలో అడుగుపెట్టేటప్పుడు కెరటాలు అనే వడిదుడుకుల దెబ్బలు తినవలసిందే. సంసారంలోని బాధ్యతలు కెరటాల వంటివి వస్తుఉంటాయి పోతూ ఉంటాయ. కెరటాలను దాటుకుని నడి సముద్రంలోకి చేరాము ఇవన్నీ దాటిన తర్వాత మలి వయసుకు చేరుకుంటాము.అప్పటికి మనం ఎన్నో అనుభవాలు గడించి స్థిత ప్రజ్ఞలం అయి ఉండాలి. నిర్మలంగా నిశ్చలంగా ఉండటం నేర్చుకోవాలి. ఎన్ని నదీనదాలు తనలో వచ్చి చేరిన బెదరదు,హద్దు దాటదుకడలి తన లో చేరిన చెత్తనంతాను కెరటాల ద్వారా బయటికి తోసేస్తుంది. అలాగే మనం కూడా ఈ ఒంటరిత నం పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేద్దాం , అనాధలకు సహాయం చేద్దాం, వృద్ధాశ్రమాలకు వెళ్లి సేవలు చేద్దాం… సముద్రుని వలే నిశ్చింతగా శేష జీవితాన్ని గడుపు దాం అంటూ ప్రమీలను దగ్గరికి తీసుకున్నడు.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆలోచన

నీలికళ్ళు