ఆలోచన మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది .మానవుడి అర్థవంతమైన జీవన ప్రమాణానికి ప్రధాన ఆయుధం ఆలోచన మాత్రమే. ఆలోచనలు గెలుపు ,ఓటమి ,విజ్ఞత ,వ్యక్తిత్వాల్ని నిర్ణయిస్తాయి .మంచి ఆలోచనలు ప్రభావవంతమై ముందుకు నడిపిస్తాయి. చెడు ఆలోచనలు సర్వదా వినాశహేతువులు.
వివిధ అధ్యయనాల ప్రకారం మనిషికి ఒక రోజులో కనిష్టంగా 12,000 నుండి గరిష్టంగా 80,000 ఆలోచనలు వస్తాయని అంచనా. కానీ ఇది ప్రామాణికం మాత్రం కాదు .’క్వీన్స్ యూనివర్సిటీ ఆఫ్ కెనడా ‘పరిశోధకుల అధ్యయనం ప్రకారం ప్రతి మనిషి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అతని సగటు ఆలోచనలు 6,200 అంటూ పరిశోధక బృందం తేల్చి చెప్పింది. దీనికి ‘థాట్ వర్మ్ ప్రాసెస్’ అని పేరు.
ఆలోచనల్లో వ్యక్తి బుద్ధి కుశలత తేటతెల్లమౌతుంది .అతని ఆలోచనా విధానాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది.ఆలోచనల్లోని వ్యత్యాసం అతడి విచక్షణను తెలుపుతుంది .’ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి’ చేరవేసే సాధనాలు ఆలోచనలు మాత్రమే .ఉన్నతమైన ఆలోచనలు శక్తివంతమై ముందుకు నడిపిస్తాయి .అధమమైన ఆలోచనలు అందమైన బాటకు ముళ్ళకంచెలా మారి రహదారిని మూసేస్తాయి .సంయమనం కోల్పోయిన ఆలోచనలు ఎల్లప్పుడు సంశయాత్మకంగానే ఉంటాయి. అవి ఎల్లవేళలా ప్రశ్నార్ధకాలే ! మనిషి అనునిత్యం ఆత్మన్యూనతా భావంతో ఉంటాడు. తనను తాను ప్రశ్నించుకోవడం ద్వారా సరియైన గమ్యం వైపు ఆలోచనల అడుగు వేస్తాడు .’సానుకూలమైన ఆలోచనలతో స్వస్థత చేకూరుతుందని’వైద్యుల నమ్మకం. ప్రతికూల ఆలోచనలతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు.
ఆలోచనలు అన్నివేళలా అనుకూలం కాదు. సందర్భానుసారంగా సాగాలి .కొందరు వ్యక్తులు ఆలోచనల సాలెగూటిలో చిక్కి సతమతమౌతారు. కుశాగ్ర బుద్ధులు అవసరం మేరకే స్పందించి వర్తమానంలో జీవిస్తారు. మనసును అదుపులో ఉంచితేనే ఆలోచనలకు కళ్లెం వేయవచ్చు. మంచి ఆలోచనలను స్వాగతించి చెడు వాటిని ఎల్లవేళలా తుంచి వేయాలి .ఆచరించని ఆలోచనలు వసివాడిన కుసుమాలవంటివి.
విమర్శనాత్మకమైన ఆలోచన అంటే కఠినమైనది కాదు . పరిణతితో కూడిన మేధాసంపత్తి, వ్యక్తిత్వనైపుణ్యం, పరిష్కార మార్గాలు స్పష్టంగా ఉండేది . మనసు పదిలమైతే ఆలోచనలు వశమౌతాయి. ఆలోచనాపరిధిలో అసమతౌల్యత ఏర్పడితే రాగద్వేషాలు పొడచూపి రంగులు మారి పక్షపాతంగా పరిణమిస్తుంది. సరైన ఆలోచనావిధానంతో జీవన సరళి సుగమమౌతుంది .ఆలోచనలకు సృజనాత్మకత తోడైతే నూతన ఆవిష్కరణలకు వేదిక ఔతుంది. క్రమశిక్షణతో కూడిన ఆలోచనల్లో స్పష్టత గోచరిస్తుంది .’ఆలోచనల అమ్ములు పొది నుండి ఆశయాల ఆస్త్రాలను ‘ సంధించినట్లయితే మంచి చెడుల వ్యత్యాసం గ్రహించి , సొంత ఆలోచనలకు ఔన్నత్యాన్ని జోడిస్తే మనిషి విజయం కైవసం చేసుకుని ఉన్నత శిఖరం పైన విరాజిల్లుతాడు.