అక్షయపాత్రగా అక్షరయాన్

అయినంపూడి శ్రీలక్ష్మిగారితో ముఖాముఖి

మనిషిని చైతన్య పరిచేది సాహిత్యమే. సాహిత్యసృజన కలిగిన వారు సమాజం హితాన్ని ఆకాంక్షిస్తారు. అయితే సమాజ హితాన్ని కోరే రచయితకు కావల్సింది కాస్త ప్రోత్సహం. తన రచనలను రేపటి తరానికి అందించే మార్గం. మరి నేటి పరిస్థితుల్లో రచయితలు తమ రచనలను పుస్తకాలుగా తీసుకువచ్చే అవకాశాలు, ఆర్థిక స్వావలంబన ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. అందునా ఆడవాళ్ళకి ఆ అవకాశాలు మరీ మృగ్యం . సాహిత్యాభిలాష ఉండి అవకాశాలు రాక, ఆర్థిక స్వావలంబన లేక కలాలను మూలకు పెడుతున్న ఎందరో రచయిత్రులను గుర్తించి , గౌరవించి, అక్షరమే అక్షయపాత్రగా భావించి అక్షరయాన్ ను ఏర్పాటు చేశారు. అక్షరయాన్ సభ్యులకు అ. (అవకాశం) ఆ (ఆర్థిక స్వావలంబన) కల్పించేందుకు కృషి చేస్తున్నారు అక్షరయాన్ వ్యవస్థాపకులు అయినంపూడి శ్రీలక్ష్మి గారు. తన వృత్తి , ప్రవృత్తి సాహిత్యసేవ కాగా తనతో పాటు ఎందరో రచయిత్రులకు ఆలంభనగా, ఆసరగా నిలుస్తున్నారు. సమాజహితాన్ని కోరే సాహిత్యమే తన అభిమతం అంటున్న శ్రీలక్ష్మి గారితో తరుణి ముఖాముఖీ రెండవ భాగం ..

తరుణి :- చార్మినార్ పై డాక్యుమెంటరీ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
శ్రీలక్ష్మి :- చార్మినార్ మీద డాక్యుమెంటరీ చాలా చిత్రంగా తీయడం జరిగింది. చార్మినార్ అంటే నాకు ఎంతో ఇష్టమైన . అందరూ షాపింగ్ కి చార్మినార్ కి వెళ్తే నేను కేవలం చార్మినార్ ని చూస్తూ అలా కూర్చోవడం కోసమే చార్మినార్ కు వెళ్తాను. వచ్చిపోయే వారిని, అక్కడ ప్రజల రోజువారీ జీవన కోణాన్ని గమనిస్తూ ఉండటం నాకు ఇష్టం. పొద్దున్నుంచి పొద్దుగూకే వరకు అక్కడ కూర్చున్న నాకు ఎలాంటి విసుగు అనేది రాదు. నేను చూసినవన్నీ కూడా రాసుకుంటాను. రంజాన్ నెలలో చార్మినార్ ఎలా ఉంటుందో డాక్యుమెంట్ చేయాలని అనుకున్నాం. మొత్తం ఐదుగురు ఆడవాళ్ళం కలిసి సరదాగా వెళ్లి 24 గంటలు ఆ చార్మినార్ ని షూట్ చేశాం. ఆ తర్వాత అంతా ఎడిట్ చేసుకున్నాక అప్పుడు నేను చార్మినార్ ను దృశ్యమానం చేస్తూ కవిత్వం రాశాను. అంటే ఒక పాటకి ట్యూన్ ఇచ్చాక మనం దానికి అనుగుణంగా పాట ఎలా రాయాలో అలా నేను డాక్యు పోయెమ్ రాయడం జరిగింది. అప్పటివరకు ఇలా డాక్యుమెంటరీలకు కవిత్వం రాసే ప్రక్రియ లేదు. దాంతో ఇది సాహిత్యంలో సరికొత్త ప్రక్రియగా నమోదు అయ్యింది. డాక్యు పోయెమ్ అనే ప్రక్రియ చాలామందికి నచ్చింది. అప్పటిదాకా ఒక ప్రక్రియ తయారు చేస్తారు అని విన్నాను. కానీ కొత్త సాహిత్య ప్రక్రియ క్రియేట్ చేయాలి అనే ఆలోచన కూడా నాకు లేదు. కవిత్యం రాసుకుంటూ వెళ్ళాను.. డాక్యుమెంటరీ చేసిన వాళ్లందరం కూడా ఆడవాళ్ళమే కావడంతో అది చాలా వేగంగా జనాలలోకి వెళ్ళిపోయింది. చార్మినార్ డాక్యు పోయెమ్ నాలుగు భాషలోకి అనువాదం చేశారు. పదిమంది వరకు ఈ కవిత్వాన్ని అనుసరిస్తూ డాక్యూ పోయెమ్ రాశారు. ఇప్పటికీ గూగుల్ లో డాక్యు పోయెమ్ అని సెర్చ్ చేస్తే శ్రీలక్ష్మి అని నా పేరు వస్తుంది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

తరుణి :- వూండెడ్ హార్ట్ – దీర్ఘకవిత వస్తువు ఏమిటి, రాయడానికి ప్రేరణ ఎవరు?
శ్రీలక్ష్మి :- వూండెడ్ హార్ట్ క్యాన్సర్ మీద రాసిన దీర్ఘకవిత. అప్పట్లో మా ఇంట్లో ఐదు, ఆరు మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వారిని దగ్గరగా గమనించడం వలన ఏఏ దశలో ఎలా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు అవసరం అన్న అంశాలపై నాకు అవగాహన పెరిగింది. క్యాన్సర్ జబ్బుకి మాత్రల కంటే ధైర్యాన్నిచ్చే మాటలే ముఖ్యమని నేను గమనించాను. క్యాన్సర్ బారిన పడిన వారికి కుటుంబం అంతా అండగా నిలవాలి. ఎవరైనా సరే దాని గురించి కొద్దిగా అవగాహన కల్పించేలా చెప్తే బాగుండేది. ఇంకా కొద్ది జాగ్రత్త లు తీసుకునే వాళ్ళం అనిపించేది. అలా మా కుటుంబంలో వారికి ధైర్యం చెప్తూ నేను రాసిన కవిత్వమే వూండెడ్ హర్ట్. నా అనుభవాలు , బాధ తప్త హృదయంతో రాయడం జరిగింది. అది రాసిన తర్వాత చాలా మందికి ఒక స్వాంతన కలిగించింది. క్యాన్సర్ వస్తే బ్రతుకు క్యాన్సిల్ కాదులే అనే భరోసా ఇచ్చింది నా కవిత్వం . అదే పొయెటిక్ థెరఫీ. ఇలా ఉంటుంది, ఆపరేషన్ చేస్తారు.. రేడియేషన్ ఇస్తారు.. అయితే ఏమవుతుంది ? జీవితం ఆగిపోదు కదా… తిరిగి జీవితాన్ని కొనసాగించొచ్చు అని అనుకోని దాన్ని రాయడం జరిగింది. అది చాలామందికి నచ్చింది. చాలామంది మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అని ఇక్కడి నుంచి అమెరికా ఆ పుస్తకాన్ని తీసుకువెళ్లారు. ఆ పుస్తకం నాకు చాలా మంచి గుర్తింపును, ఆత్మ సంతృప్తిని ఇచ్చింది. మొదట్లో ఒక 500 పుస్తకాలు, ఆ తర్వాత ఒక 200 పుస్తకాలు, ఆ తర్వాత 2000 పుస్తకాలు ముద్రించాం. ఎంతో మందికి ఉచితంగా పంచాం. ఆ పుస్తకం నాలుగు భాషల్లోకి అనువదించారు. కన్నడ భాషలోకి అనువదించిన పుస్తకాన్ని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు బెంగళూరులో ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్క క్యాన్సర్ బాధితులు దాన్ని చదవాలి. ఎందుకంటే క్యాన్సర్ పై అవగాహన కలిగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మ ధైర్యాన్ని ఇస్తుంది. వేల కాపీలు కొన్ని వేల మంది ఇళ్ళకు చేరి స్వాంతన ఇచ్చాయి.

తరుణి :- మీరు రాసిన పుస్తకాలు, అందుకున్న అవార్టుల గురించి చెప్పండి
శ్రీలక్ష్మి :- అలల వాన తో నా పుస్తక రచన ప్రారంభమైంది. కవిత్వమే ఒక గెలాక్సీలో చాలా వైవిధ్య భరితమైన కవిత్వాన్ని రాశాను. అది నాకు ఎంతో ఇష్టమైన పుస్తకం. ఇప్పటికి 16 పుస్తకాలు రాశాను. 50 కి పైగా పుస్తకాలకు సంపాదకత్వం బాధ్యతలు నిర్వహించాను. నాలుగు పుస్తకాలు ఇతర భాషల్లోకి అనువాదం చేశాను. ప్రముఖ నర్తకి మృణాళిణి సారాభాయ్ పుస్తకం ముద్రణకు సిద్ధంగా ఉంది. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు కూడా అనువాదం చేస్తున్నాను.

ప్రముఖ రచయిత పత్తిపాక మోహన్ గారు నాకు ఈ అకాశం కల్పించారు. మామిడి హరికృష్ణ గారితో కలిసి ప్రపంచ కవి ఖలీల్ జిబ్రా గారి రచనలు అనువాదం చేశాం. రంగవల్లి ప్రచురణలు వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. రేడియోలో ప్రతి సోమవారం ఒక కార్యక్రమం నిర్వహించేదాన్ని. కొత్త ప్రేమలేఖలు అన్న అంశంపై చెట్టుకి , పుట్టకి అంతరించుతున్న పిచ్చుకకి ఇలా సృష్టిలోనే సమస్త పశుపక్ష్యాధులతోపాటు వస్తువులకు వాటిని గుర్తు చేసుకుంటూ రాసిన పుస్తకం కొత్త ప్రేమ లేఖలు. జీవిత చరమాంకంలో ఉన్న మనిషి సాటి మనిషికి లేఖ రాస్తే ఎలా ఉంటుంది.. ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ 54 వారాలుగా ఈ శీర్షికను నిర్వహించాను. వాటన్నింటినీ ఒక పుస్తకంగా తీసుకువచ్చాను. ఆ పుస్తకం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఆవిష్కరించారు. మా కుటుంబసభ్యులంతా వచ్చారు. పది నిమిషాల టైం కేటాయించిన గవర్నర్ గారు దాదాపు రెండు గంటలు మాతో గడపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

ఇక నా సాహిత్య ప్రస్థానంలో అందుకున్న అవార్డ్స్ చాలానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ అవార్డు విశిష్ట మహిళా పురస్కారం (లక్ష రూపాయల నగదు పురస్కారం), తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం, కుందుర్తి రంజని జాతీయ పురస్కారాన్ని అందుకున్నాను. అలాగే పాకాల యశోద రెడ్డి గారి పురస్కారం, నాయిని కృష్ణకుమారి పురస్కారం,

 
అమృత లత గారి పురస్కారం, శరత్ జ్యోత్స్న రాణి పురస్కారం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాకపోతే అవార్డ్స్ గుర్తు పెట్టుకోవడం కంటే అక్షరాలను గుర్తు పెట్టుకోవడం బాగుంది అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే రాయడమే తప్ప నేనెప్పుడూ అవార్డుల గురించి ఆలోచించలేదు.

తరుణి :- రచయిత్రులను ఒక వేదికగా తీసుకురావాలన్న సంకల్పం ఎందుకు కలిగింది ?
శ్రీలక్ష్మి :- రచయిత్రులు ఒక వేదిక మీదకు తీసుకురావాలని సంకల్పం కలగడానికి కారణం తెలంగాణ ఆవిర్భావ అనంతరం కొంత స్తబ్దత ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డాక ప్రాంతీయవాదం కొంత ప్రబలడంతో మీరు ఎక్కడి వారు? మీరు ఎక్కడ పుట్టారు? ఇలాంటి ప్రశ్నలు రావడంతో అప్పటిదాకా చక్కటి వేదికల మీద ప్రసంగించిన వాళ్లంతా మేము తెలంగాణ కాదు కదా మమ్మల్ని ఎవరు పిలవలేదు కదా అన్న ఒక బాధకి లోనయ్యారు. సో ఏ వేదిక చూసినా నలుగురు, ఐదుగురు తప్ప ఎక్కువమంది మహిళలు కనిపించట్లేదు. అందుకనే మహిళలందరికీ ఒక వేదిక కావాలి. సాహితీ బతుకమ్మలు అందరినీ ఒక వేదిక మీదనే చూడాలి అనుకున్నాను. రచయితకి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. అందుకే మా అస్తిత్వం కాపాడుకోవడానికి 40మంది మహిళా రచయితలతో రెండు సంవత్సరాల కిందట ‘అక్షరయాన్‌’ ఆవిర్భవించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న దాదాపు 1500మంది తెలుగు మహిళా రచయిత్రులంతా సభ్యులుగా ఉన్న అతిపెద్ద సాహిత్య సంస్థగా ‘అక్షరయాన్’ రూపొందింది. ఇప్పుడు మేం నిర్వహించే కార్యక్రమాల్లో అంతా మేమే. కొన్ని కార్యక్రమాలకు పురుషులు వచ్చి మమ్మల్ని కూడా కాస్త గుర్తుంచుకుని పిలవండి అని అడగటం మా ఐక్యతకు నిదర్శనంగా భావిస్తున్నాం. సమాజహితం కోరే రచయిత్రులంతా మా అక్షరయాన్ లో సభ్యులే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాటు పడేవారికి ఇక్కడ స్థానం లేదని చాలా స్పష్టంగా చెప్పాం.
మా కంటూ ఒక వెబ్సైట్, ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నాం.

తరుణి :- అక్షరయాన్‌ ద్వారా ఇప్పటివరకు మీరు నిర్వహించిన కార్యక్రమాలు?
శ్రీలక్ష్మి :- ఎక్కడైనా ఒక మంచి కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడుతుంది అంటే దాంట్లో అక్షరయాన్ భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉంటుంది. 1500 మంది సాహిత్యవేత్తలు అక్షరయాన్ లో సభ్యులుగా ఉన్నాం. ప్రతి ఒక్క జిల్లాకి ఒక కమిటీ ఉండేలా వాట్సాఫ్ గ్రూప్ లను మేము ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఆరు జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో కమిటీలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు మహిళా సాహిత్యవేత్తలు అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చాం. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాటిలో కొన్ని.. రాజ్ భవన్‌ లో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో అధిక సంఖ్యలో మహిళా రచయిత్రులు పాల్గొన్నారు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్‌ గురించి పుస్తకం తీసుకువచ్చాం. విత్తన భండాగారంగా మారిన తెలంగాణ లో విత్తనం గురించి ఒక పుస్తకం రాశాం. పసిపిల్లలు, మహిళల మీద అత్యాచారాలు చూసి తట్టుకోలేక మహిళా భద్రతా విభాగానికి ఫిర్యాదు చేద్దామని వెళ్లాం. వాళ్ళు మమ్మల్ని సాదరంగా ఆహ్వనించి మన మనోవేదనను విన్నారు. ఒక రోజు మా రచయిత్రులందరినీ కూర్చోబెట్టి ‘అత్యాచార బాధితుల’ను పిలిపించి వారితోనే మాట్లాడించారు. జరుగుతున్న నేరాల్లో ఎవరి పాత్ర ఎంతో అర్థం చేసుకున్నాం. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలన్న ఆలోచనతో తల్లిదండ్రులకు, స్కూల్, కళాశాల పిల్లలకు అవగాహన కల్పించేలా పుస్తకాలు తీసుకువచ్చాం. ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి మాకు చేతనైనా ఆర్థిక సహకారం అందిస్తూ వారికి జీవనోపాధి కల్పించే ఏర్పాటు చేశాం. రెండు సంవత్సరాల అక్షరయాన్ ఇప్పుడు ఎలాంటి అంశంపై అయినా 24గంటల్లో వందకు తక్కువ కాకుండా రచయిత్రుల రచనలతో పుస్తకాన్ని తీసుకువచ్చేంత శక్తిని సమకూర్చుకుంది.

తరుణి :- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య సాంస్కృతిక పునర్ నిణ్మాణంలో అక్షరయాన్ పాత్ర
శ్రీలక్ష్మి :- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య సాంస్కృతిక పునర్నిర్మాణంలో అక్షరయాన్ పెద్ద పాత్రనే పోషించిందని చెప్పుకోవాలి. తెలంగాణ ఆవిర్భావం కాకముందు ఎయిడ్స్ ప్రాజెక్టు. ఆ తర్వాత ఒక సివిక్స్ సెన్స్ తర్వాత ఒక వినియోగదారుల అవగాహన కలిగించడం కోసం రకరకాల కార్యక్రమాలు చేసాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతిని దేశవిదేశాలకు చాటేలా సింగిడి పుస్తకాన్ని తీసుకువచ్చాం. ప్రపంచం యావత్తు సీడ్ బాల్ ఆఫ్ ఇండియా గా చూస్తున్న తెలంగాణ విత్తనం పట్ల అవగాహన కలిగించడం కోసం విత్తనం మీద ఒకరోజు సెమినార్ ను నిర్వహించాం. 350 మహిళా సాహితీ వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నడంతో పాటు తమ రచనల ద్వారా ప్రజల్లో సేంద్రీయ వ్యవసాయం, స్వదేశీ విత్తనం పై అవగాహన కల్పించారు.

 

తరుణి :- దశాబ్దాలుగా సాహిత్యంలో ఉన్న ఎవ్వరికీ తెలియని రచయితలను మీరు గుర్తించి వారికి మాతృవందనం అంటూ తెలుగువిశ్వవిద్యాలయం తో కలిసి సత్కారం చేయడానికి ప్రేరణ?
శ్రీలక్ష్మి :- మూడు దశాబ్దాలకు పైగా ఆకాశవాణిలో వ్యాఖ్యాత్రిగా పనిచేశాక తెలుగు విశ్వవిద్యాలయానికి డిప్యూటేషన్ మీద చిత్రవాణి స్టూడియో డిప్యూటీ డైరెక్టర్ గా వచ్చాను. విసి తంగడి కిషన్ రావు గారు గతంలో హైదరాబాద్ ఆకాశవాణిలో చేసిన అనేక వైవిధ్యమైన కార్యక్రమాలు తెలుగు విశ్వవిద్యాలయంలోనూ చేద్దామని ప్రోత్సహించారు. తెలంగాణ తేజ మూర్తులు, వైతాళికులు కార్యక్రమం ద్వారా చాలామందిని వెలికి తీసుకురావడం ఆయనకు తెలుసు. అలాంటి కార్యక్రమాలు రూపొందించాలని ఆయన సూచించారు. సాహిత్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన వారి జీవన ప్రస్తానాన్ని రికార్డ్ చేసి ఆడియో వీడియో రూపంలో భద్ర పరిస్తే విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని విసీ గారు చెప్పటంతో దాదాపు 150మంది జీవన ప్రస్తానాన్ని రికార్డ్ చేశాం. అలా ప్రముఖులను కలిసినప్పుడు, వారి సాహిత్య సేవను గురించి తెలుసుకున్నప్పుడు వారిని సత్కరించాలన్న ఆలోచన కలిగింది. దశాబ్దాల పాటు సాహిత్యరంగంలో రాణిస్తూ తెలుగు సాహిత్య కీర్తిని చాటిన అనేక మంది కనిపించారు. వారిలో మహిళా మూర్తులను గుర్తించి మాతృ వందనం కార్యక్రమం ప్రతి ఏడాది మే నెలలో చేయాలన్న ఆలోచన వచ్చింది. ‘షష్టి పూర్తి కలాలు’ పేరుతో దాదాపు 60 ఏండ్లుగా రాస్తూ ఉన్న వారిని సత్కరించే కార్యక్రమానికి తెలుగు యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది. సమాజానికి ఉపయోగపడే చాలా విలువైన విషయాలు అంటే కేవలం సాహిత్యం, సంస్కృతి కాకుండా సమాజానికి ఆ రచనలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అన్నదాని ప్రాతిపదికగా తీసుకొని ఈ రెండు సంవత్సరాల్లో దాదాపుగా 65 మంది మహిళా రచయిత్రులను సత్కరించాం. అంతేకాదు వీళ్ళందరి జీవన ప్రస్థానం, సాహిత్య ప్రయాణం, వృత్తి, వ్యక్తిగత విశేషాలు కూడా రికార్డ్ చేసి తెలుగు యూనివర్సిటీలో ఆడియో వీడియో రూపంలో భద్రపరిచడం జరిగింది. ఎందరో మహానుభావులు..వారి సాహిత్యప్రస్థానం రానున్న తరానికి తెలియజేయడం కోసమే మా ప్రయత్నం. రేపటి తరంలో తెలుగు భాష అంతరించిపోకుండా వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

అయినంపూడి శ్రీలక్ష్మిగారితో ముఖాముఖి నిర్వాహకురాలు వంగ యశోదా

తరుణి :- అక్షరయాన్ ను ఎక్కడికి తీసుకువెళ్లాలన్నది మీ ఆలోచన? మీ భవిష్యత్ కార్యాచరణ ?
శ్రీలక్ష్మి :- భవిష్యత్తు ప్రణాళిక చాలా పెద్దదే. అక్షరయాన్ లో ఉన్న అందరూ ఉమెన్ రైటర్స్ ని కూడా చాలా పెద్ద స్థాయికి తీసుకువెళ్లాలి. ప్రతి ఒక్కరూ కూడా సమాజాభివృద్దికి ఉపయోగపడే ఎన్నో రచనలు చేయాలి. సమాజానికి ఉపయోగపడే సాహిత్య సృజన జరగాలి. అది సమాజానికి దిశా నిర్దేశం చేయగలిగే రీతిలో ఆ సాహిత్యం ఉండాలనేది నా అభిలాష. అలాగే బాల సాహిత్యాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. రేపటి తరంలో తెలుగు భాషను కాపాడేలా నేడు బాల కవుల్ని తయారు చేయాలి.

Written by vanga Yashoda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీరు ముందు వాళ్ళు వెనుక

ఆలోచన