పుట్టినిల్లు

కవిత

దామరాజు విశాలాక్షి

మన్వతంరాల నుండి మహిళలు భువిలోన మార్పులెన్నో తెచ్చి
మురిసినారు ..

గర్భస్థ శిశువైన కాకున్న…. కాపాడి..
కారుణ్యం తో పోషించి పెంచుతుంటారు

మాతృస్వామ్య మైన పితృస్వామ్యమైన
మంచిగా చూస్తే చాలని
తప్పులన్నీ మన్నిస్తుంటారు

ప్రాధాన్యమిచ్చినా
ఈయకున్నా వారి
జాలి తో
విధులునిర్వర్తించి
చూపుతారు.

అరాచకాలనైనా
ఆగ్రహాలనైనా
అతివలు సహనముతో భరించుతారు .

అవమానములనన్ని అధిగమించిచూపి
ఆత్మస్థైర్యంతోనే
అడుగేస్తుంటారు

అక్షరం రాకున్నా
అవగాహనతో బ్రతుకు
అర్ధవంతంగా
తీర్చి దిద్దుతారు .

ఆధిపత్యపు పోరు అధికమైనప్పుడు
అధమమైనా క్షమించి బ్రతుకుబ్రతుకుతారు.

ఆకాశమంతెదిగి
అసమానతల నదిమి
ఆర్థికంగా గెలిచి
చూపుతారు..

అవకాశాలనన్ని అందిపుచ్చుకునేందుకు ఎదిగి
ఆత్మగౌరవాన్ని
నిబెట్టుతారు..

అలనాటి స్త్రీలూ ఆదర్శమేనని తలచి
వాళ్ళ అడుగుజాడల్లో
నడచి చూపుతారు..

ఆధునిక మహిళలు
ఆత్మవిశ్వాసం
ఆయుధం గా చేసుకొని
అన్ని పనులను
ఆచరించి చూపి
మెలగుతారు ..

అమ్మగా భార్యగా
అక్కగా చెల్లిగా
అన్ని పాత్రలను
పోషించుతారు.

అంతం చేస్తున్నా
సొంతవారని నమ్మి
ఆత్మీయతను
మన్నించే అమాయకులు వాళ్ళు

ఒత్తిళ్ళు రోగాలు
ఒడిదుడుగులన్నిటిని
దిగమింగి ధైర్యంగ
మెలగుతారు .

ఆధునిక కాల
అన్ని యంత్రాలలో
తానొక యంత్రమై
గడుపుతారు .

అవమానాల
అత్యాచారాల
అసమానతలకేడ్చి
దిగమ్రింగుతారు ..

మెట్టినింటికీర్తి
మేరుశిఖరముజేసి
పుట్టినింటి కీర్తిని
పెంచుతారు..

ఆకాశమంతెదిగి
అందలమెక్కినా
ఆత్మీయతతొ మెలగి
ఒదుగుతారు ..

వాళ్ళే మహిళలు మగువలూ
మాననీయ మానవతామూర్తులు

మహి లో తిరుగే
దేవతలు

వాళ్లంటూ ఉంటేనే
అవనికందం వస్తుంది

ఆనందాన్నిచ్చి
మల్లెతీగలవోలె
పరిమళాలూ ఇచ్చి
హారతి కర్పూరం
ఓలె హరించుకు పోయినా
ఆదర్శ నారీమణులై మెలగుతారు..
అట్టి ఇట్టి అని అనడమెందుకుగాని

పుట్టినిల్లైన
భరత భూమిని కూడ
తల్లి తీరు కొలుస్తారు

సేవించి తరించి
దాస్య విముక్తి చేసి
పేరుగాంచిన
పెన్నిధి అనిపించుకుంటారు

భరతభూమిది మాది
భాగ్యాలరాశి అంటూ
ఖ్యాతినే చాటిస్తారు
జన్మ మున్నంత వరకు
విలువలన్నీ పాటిస్తారు
వాళ్ళ కు ఈ నేల
పుట్టినిల్లు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మాట

మీరు ముందు వాళ్ళు వెనుక