సంకెళ్లు తెగాయి

నవల – సమీక్షకురాలు పద్మశ్రీ చెన్నోజ్వల

పద్మశ్రీ చెన్నోజ్వల

ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాత రెడ్డి గారి సంకెళ్లు తెగాయి నవల కుల వ్యవస్థ ఇతివృత్తంగా సాగుతూ ఉంటుంది. నిమ్నకులంలో పుట్టిన తెలివైన యువకుడు నారాయణ . అతనికి కులవృత్తి మీద ఏ విధమైన ఆసక్తి ఉండదు . బాగా చదవాలని ,జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కంటూ, వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు కదుపుతూ ఉంటాడు .తరతరాలుగా వారి కుటుంబాలను పట్టిపీడిస్తున్న దాస్యశృంఖలాలను త్రెంచ డానికి , ఇతడు తన విజ్ఞానాన్ని , తద్వారా తాను ఎదిగిన స్థాయిని ఆధారంగా చేసుకుంటాడు. వ్యవస్థలో ఉన్న ఈ అసమానతలను పారద్రోలాలంటే పోరాడే వ్యక్తులలో చిత్తశుద్ధి క్రమశిక్షణ ఉండాలని ఇతడు భావిస్తాడు .

నారాయణలో ఉన్న తెలివితేటలను మొదటగా గుర్తించిన వ్యక్తి వెంకట్రామయ్య మాస్టారు . మెట్రిక్ తో నిలిచిపోవాల్సిన అతని చదువు ముందుకు సాగేలా అన్ని రకాలుగా ప్రోత్సహించిన వ్యక్తి.

జీవితంలో ఎదగాలని అతడు పడే తపన , ఆర్థిక పరిస్థితులు సహకరించక అతడు, అతని తల్లిదండ్రులు అనుభవించే వేదన, స్కాలర్ షిప్ తోనే డిగ్రీ వరకు రాగలిగిన అతని ప్రతిభ, ఆర్థిక, సామాజిక అసమానతలతో అతనికి ఎదురైన సవాళ్లు ,వేద ప్రకాష్ దంపతుల వాత్సల్యపూరిత ప్రోత్సాహం, దిశానిర్దేశం , అనల స్నేహం ,అనంత నారాయణ వంటి మేధావులు ఇచ్చిన విలువైన సూచనలతో తాను కోరుకున్న గమ్యం చేరడం ఇందులోని కథాంశం.

ఇక కథ విశ్లేషణలోనికి వెళితే దొర మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమంతో కథ ప్రారంభం అవుతుంది .దొర మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పనివాళ్లు తిండి కోసం ఎదురు చూడటం , వంటల వాసనకు మరింత ఉత్సాహంగా డబ్బు వాయించడం ,తలకాయ చారు కోసం గొడవలు పడటం , విస్తరాకుల్లోనే మూటలు గట్టుకొని ఇళ్ళకి తీసుకెళ్లడం , పూలమ్మకు చేబదులు తెచ్చే జ్ఞానం లేదంటూ ఫంక్షన్ హడావిడిలో ఉండి కూడా వీరయ్య మనసులో తలుచుకోవడం దుర్భర దారిద్ర్యానికి అద్దం పట్టడమే కాకుండా , కుల వృత్తులు సమాజంలో మనిషి మనుగడకు సరిపడా వనరులను అందించలేక పోతున్నాయననే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మామూలు రోజుల్లో సంగతి ఎలా ఉన్నా , కనీసం ఇటువంటి శుభకార్యాలపుడైనా వీళ్లను అన్ని విధాలుగా సంతృప్తి పరచగలగాలి . వంట వాళ్ల సహకారం , డప్పు వాయించే వారి సహకారం , వ్యవసాయ కూలీల సహకారం గనుక లేకపోయి ఉంటే ,వారింట ఆ పండుగ శోభ అంతగా ఇనుమడించేదా ? అంత ప్రశాంతంగా వారు ఆ కార్యక్రమాన్ని జరుపుకొని ఉండేవారా? ” తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలెవ్వరు ? ప్రభువెక్కిన పల్లకిని మోసిన బోయిలెవ్వరు” అన్న శ్రీ శ్రీ గారి వాక్యాలు ఈ సందర్భంగా జ్ఞాపకం రాకుండా ఉంటాయా ? కడుపు నిండిన ఆనందం కళ్ళలో ప్రతిఫలిస్తూ ఉండగా, వారు మౌనంగా ఇచ్చే ఆశీర్వచనాలకు ఎంత శక్తి ఉంటుందో వీళ్ళకి ఎప్పటికీ అర్థంకాదు . పేదవాడికి చేసే సహాయం భూమిలో నాటిన విత్తనంతో సమానమని మహానుభావులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.
ఇక దొర ను పలకరించమంటూ, అతని కొడుకుతో సఖ్యంగా ఉండమంటూ వీరయ్య తన కొడుకు నారాయణకు చేసే హితబోధలు అతనిలోని అభద్రతా భావాన్ని తెలియజేస్తున్నాయి. నారాయణ మౌనంగా విసిరే నిరసన ఎక్కడ ఆమాత్రం ఉపాధిని కూడా లేకుండా చేస్తుందోనన్న భయం అతని మాటల్లో కనిపిస్తూ ఉంటుంది .

దొర గద్దింపులు, దొరసాని ఛీత్కారాలు భ్రష్టు పట్టిన కుల వ్యవస్థను కళ్ళకు కడుతున్నాయి . ఇటువంటి కుటుంబాల్లో పురుషులు కఠినంగా ఉన్నా స్త్రీలు సాధారణంగా ప్రేమమూర్తులై ఉంటారు (కొన్ని చోట్ల ) . వారి ప్రేమ పూరితమైన మాటలతో వీళ్ళ మనసులకైన గాయాలకు లేపనం చేస్తూ ఉంటారు . దొర గద్దింపులకు , దొరసాని కస్సుబుస్సులకు ఓ పెద్ద దండం పెట్టి ఒక్కసారి తల కాస్త పక్కకు మరల్చిచూస్తే గనుక పని వాళ్ళను కన్నతల్లిలా ఆదరించే దొరసాన్లు, పూలమ్మ వంటి వారితో స్నేహం చేసే సుశీలమ్మలు, తెలివైనవాడైన నారాయణకు అన్ని రకాలుగా సహకారం అందించి , అతని ఉన్నతికి తోడ్పాటు నందించి , అది నెరవేరాక తానే ఆ విజయాన్ని సాధించినంతగా ఆనందపడే రామేశ్వరరావు లూ మన చుట్టే ఉంటారు . ఇక్కడ వ్యక్తుల గురించే తప్ప వ్యవస్థ గురించిన ప్రస్థావన కాదు. మంచి చెడు అన్నిచోట్ల సరిసమానంగా వ్యాపించబడి ఉంటుంది.
సుశీలమ్మ మంగలి షాపు తెరవమని తనకు సలహా ఇచ్చిందని నారాయణ బాధపడుతూ వేద ప్రకాష్ గారితో చెబుతాడు. నారాయణ ఎంత తెలివైన వాడో , సుశీలమ్మకే కాదు దొరతో సహా ఆ ఊర్లో అందరికీ తెలిసిందే .అతని తెలివితేటలు అతన్ని ఎంత ఉన్నత స్థాయికైనా తీసుకెళ్లగలవన్న విషయం సుశీలమ్మకు తెలియకకాదు. కానీ ఎక్కడ అతను తమ స్థాయిని మించి పోతాడో అన్న భయం వీళ్లను లోపల తొలిచేస్తూ ఉంటుంది . ఆ విషయాన్ని పైకి తెలియనీయకుండా ఇటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. పైగా షాపు తెరవడానికి ఆర్థిక సాయం అందిస్తామని కూడా ఎల్లలు లేని ఔదార్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అదే సహాయం సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం చేయమంటే మాత్రం వీరికి పచ్చివెలక్కాయ గొంతులో పడుతుంది. ” అది నీ వల్ల కాదు మంగలి షాపు నడుపుకో చాలు” అనడానికి కూడా వెనుకాడదు వీళ్ళలోని సంకుచితత్వం. నీకు సహాయం చేసే మనసు లేకపోతే చేయకు . ఎందుకు చేయలేదని నిన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు . కానీ చరిత్రనే తిరగరాయగలిగే ఇటువంటి మేధస్సు ఉన్న వాళ్ళకి ఇటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టకుండా ఉంటే అక్కడికి అదే పది వేలు. ఊర్లోనే కాకుండా యూనివర్సిటీ అంతా మారుమోగి పోయే నారాయణకు ఒక విద్యావంతురాలిగా, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్న వ్యక్తిగా తన ఇంట్లో పనివాడైన వీరయ్య కొడుకును ప్రోత్సహించాల్సింది పోయి కించపరుస్తూ ఉంటుంది .ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏది శాశ్వతం కాదు . ఈరోజు నీ వద్ద ఉన్నదేదో రేపు ఉంటుందన్న భరోసా లేదు .

     

రేపు నీకు కావాలనుకుంటున్నదేదో నీకు దక్కుతుందన్న గ్యారెంటీ లేదు . మీదు మిక్కిలి నీవు ఈరోజు ఎవరినైతే హీనంగా చూస్తున్నావో, వాళ్ల చేతుల్లోనే నీవు కోరుకున్న అక్షయ పాత్ర అలరిస్తూ ఉండవచ్చు .అలా కాకుండా నీవు నారాయణకు ఎదగడానికి నీ వంతు సహకారం అందించి ఉంటే , అతడు విజయ బావుటా ఎగరేసిన నాడు మౌనంగా నీ వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసే చూపులోని భావాన్ని గనుక తెలుసుకోగలిగే శక్తి నీకు ఉంటే నువ్వు ఇప్పటివరకు అనుభవించిన ఏ సుఖ సంతోషాలు , హంగు ఆర్భాటాలు నీకు అందించని అనిర్వచనీయమైన ఆనందాన్ని నువ్వు రుచిచూసి ఉండే దానివి . హృదయానికి వైశాల్యం ఉన్నప్పుడే ఈ ఆనందాలు సొంతమవుతాయి .లేకపోతే ఆ మురికి కూపంలో (మంగలి షాపు పెట్టుకోమని ఇచ్చే అటువంటి సలహాలు) పడి ఇటువంటి మనుషులు కొట్టుకుంటూనే ఉంటారు. నీవు నాటిన విత్తనం మొక్కై, మానై శాఖోపశాఖలుగా విస్తరించి , పూలతో విరబూసినప్పుడు ఆ పూల సుగంధాలను ఆఘ్రానించిచూడు నీ మనసు ఎంత ఆహ్లాదాన్ని పొందగలదో !ఆ చెట్టుకు కాచిన పళ్ళను బిచ్చగాళ్లు , అనాధలకు పంచి చూడు . కాలే కడుపుతో వాళ్లు వాటిని ఆబగా తింటూ ఉన్నప్పుడు నీ హృదయం ఎంతగా ఆర్ద్రమవుతుందో ! అదే చెట్టుపై గూళ్ళు కట్టి ఆశ్రయం పొందుతున్న పక్షుల కిలకిలారావాలను ఒక్కసారి విని చూడు . నీ మనసు ఎంత ఆనందదోలలూగుతుందో ! ఇంత గొప్ప అనుభూతుల్ని అణచిపెట్టే నీ సంకుచిత్తత్వాన్ని చూస్తే జాలేస్తుంది.
ఇక సహ విద్యార్థి , సమవయస్కుడు అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా రామేశ్వరరావు నారాయణ చెంపమీద కొట్టడాన్ని గురించి వ్రాయడానికి కలం సిగ్గుపడుతుంది .కదలలే నంటు మొరాయిస్తోంది. ఆ మాటకొస్తే సమవయస్కుడు, సహ విద్యార్థి మాత్రమే కాదు , ఎవరికి కూడా ఏ మనిషిని కొట్టే హక్కు లేదు . సాటి మనిషిని మనిషిగా గుర్తించలేని సంస్కారం వ్యక్తిత్వపరంగా అతడు ఎంత దిగువ స్థాయిలో ఉన్నాడనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. కాలేజీలో, హాస్టల్లో రామేశ్వరరావు అకారణంగా నారాయణను వేధించడం గురించి చూస్తే గనుక ఇది అకారణంగా అని మనం చెప్పలేము .ఆర్థికంగాగాని ,సామాజికంగాగాని తమ కంటే దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తమతో సమానంగా మసులుకోవాల్సి వచ్చినప్పుడు వీరి అహం దెబ్బతిని , అది కాస్తా ద్వేషంగామారి , ఈ విధమైన ప్రవర్తనతో బయట పడుతూ ఉంటుంది .సంపన్నుల పిల్లలు లేని వారితో జతకట్టరు అన్న చాణుక్యుల నీతి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది.

ఇక పల్లెటూరు చూడటానికి అనల వచ్చినప్పుడు అన్ని కుల వృత్తుల వాళ్లను కలిసి ఆసక్తిగా గమనిస్తూ , వారి సాధక బాధకాలు తెలుసుకున్న తీరు ఆమెలోని సేవాతత్పరతకు నిదర్శనంకాగా , ఎన్ని రకాల కులవృత్తులు ఉన్నాయో , అందులో ఎంత కళాత్మక సంపద దాగిఉందో, దాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతగా ఉందో అన్న విషయాలను తెలియజేస్తుంది. నేత కార్మికుడైన దానయ్యతో అనల చీర విషయం మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా తోడికోడలు చిత్రంలోని “జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా? చిరుగుపాకల బరువు బ్రతుకుల నేతగాళ్లే నే సినారు” అన్న పాట పాటకుల మదిలో మెదులుతూ ఉంటుంది .
బాలయ్య సమయస్ఫూర్తి , ఊర్లోకి తన షాపు ద్వారా ఆధునికతను అతడు మోసుకొచ్చిన తీరు , అందరికీ తలలో నాలుకలా ఉండే అతని మాట తీరు ముచ్చట గొలుపుతాయి .ఉపాధి జన్మతః వచ్చినదే అయినప్పటికీ తనకు తెలిసిన అతి తక్కువ విద్యతోనే డబ్బు సంపాదించి , కుటుంబాన్ని పోషించగలిగిన అతని తెలివితేటలు ముచ్చట గొలుపుతాయి.
పోలీసు తూటాకు బలైన రాజయ్య ఉదంతం నిరుద్యోగ సమస్య యువతను ఏ విధంగా హింసా మార్గం వైపు మళ్ళిస్తుందో , ఉపాధి కల్పన ఎంత తక్షణ కర్తవ్యంగా అమలు జరగాల్సి ఉందో ప్రభుత్వానికి ఒక హెచ్చరికను జారీ చేస్తుంది .
కాలేజీలో లెక్చరర్ అయిన వేదప్రకాష్ ఎంతటి ఉన్నతుడో , తండ్రి తాతల నుండి సంక్రమించిన ఉన్నతమైన విలువలు అతడిని ఎంతగా ప్రభావితం చేశాయో , విలువలతో కూడిన విద్యాబోధన సమాజానికి ఎటువంటి ఫలాలను అందించగలదో నారాయణ పాత్ర ద్వారా నిరూపించిన వ్యక్తి .రామేశ్వరరావు పరీక్ష పేపర్లు మొహం మీద విసిరినప్పుడు వీరు ప్రవర్తించిన తీరు పరిణతి చెందిన వీరి వ్యక్తిత్వాన్ని , బాధ్యతనెరిగిన గురువు ప్రవర్తించాల్సిన తీరుని ప్రస్ఫుటం చేశాయి. నారాయణ తెలివితేటలను గమనించి అతనికి అన్ని విధాల సహకారం అందించడం , ప్రోత్సహించడం ,అతనిలో ధైర్యం సన్నగిల్లుతుందని అనిపించిన ప్రతిసారి తన మాటల ద్వారా అతనిలో కొత్త ఊపిరిలూదడం , ఆత్మవిశ్వాసం నింపడం , ఊర్లో ఉండలేకా, పట్నంలో ఇమడలేకపోతున్న తనవాళ్లను వదిలి ట్రైనింగుకు వెళ్లలేకా, వెళ్లకుండా ఉండలేక సతమతమైపోతున్న నారాయణకు ధైర్యం చెబుతూ , తన ఇంట్లో అతని కుటుంబానికి ఆశ్రయం కల్పించిన ఆ దంపతులకు నారాయణ కుటుంబం జీవితాంతం రుణపడి ఉండటం సంగతి అలా ఉంచితే , మంచితనానికి , ఔన్నత్యానికి విలువనిచ్చే మనుషులు సమాజంలో కొంతమంది ఉంటారు . వారు చేతులెత్తి నమస్కరిస్తూనే ఉంటారు .కొంతమంది ఆ విషయాన్ని ప్రత్యక్షంగా అతడికి తెలియక తెలియపరచకపోవచ్చు. ఆ విషయం , అంటే వాళ్లలో తమ పట్ల అంత ఆరాధన ఉందనే విషయం అతనికి ,అతని సతీమణికి ఎప్పటికీతెలియకపోనూ వచ్చు . అయినప్పటికీ మంచితనం మౌనంలో కూడా గౌరవాన్ని పొందుతూనే ఉంటుందనీ, ఔన్నత్యం అంతరంగంలో కూడా పూజించబడుతుందని మనం గమనించాల్సి ఉంటుంది .

అనంత నారాయణ వ్యక్తిత్వం , శాస్త్రీయపరమైన అతని రచనా వ్యాసంగం , వృత్తికి అంకితమైన అతని జీవితం , సంభాషణ చాతుర్యం , కావలసిన సమాచారాన్ని రాబట్టడానికి అతను ప్రశ్నించే తీరు ,ఇంటర్వ్యూలోని మెలకువలను నేర్పిన అతని ప్రతిభ , అతనిపై గౌరవాన్ని , కృతజ్ఞతను నారాయణలో కలిగించాయి . ‘జ్వలించే దీపం మాత్రమే మరో దీపాన్ని జ్వలింప చేస్తుంది ‘ అన్న సూక్తి ఇక్కడ అన్వయమవుతుంది.
ఇక ఇక్కడ మనము నారాయణ గురించిన ఒక చిన్న కోణాన్ని గమనించాలి. ఇతడు తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు, అభినందించదగినదే. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తపిస్తూ ఉంటాడు , హర్షించదగినదే. కానీ ఇతనికి ఎంతసేపు ఊర్లో ఉండడానికి విసుగు. బాలయ్య మాట్లాడుతున్నప్పుడు విసుగు. ఒక విద్యావంతుడిగా , నిరక్షరాస్యులైన తన ఊరి వారికి జ్ఞానాన్ని పంచడం ఒక విద్యావంతుడిగా తన బాధ్యత అనే ఆలోచన ఎప్పుడూ కనబరిచిన విధంగా లేదు. ఈ ఒక్క విషయం మినహా ఈ పాత్రను మనం అన్ని విధాలుగా ప్రశంసించవచ్చు.
ఇక అనల నారాయణతో స్నేహం చేయడానికి కారణం అతనిలోని నిరాడంబరత , నిబద్ధత ,తెలివితేటలకు తోడు అతనిలోని మంచితనం . ఐఏఎస్ సాధించడానికి ఆమె అందించిన ప్రోత్సాహం, ఆమె తన కుటుంబాన్ని ఆదరించే తీరు, ఆమె తల్లిదండ్రుల ద్వారా ఆమెకు అలదిన ఉన్నతమైన వ్యక్తిత్వం అతడిని ఆమె సహచర్యం కోరుకునే దిశగా పురిగొల్పుతాయి. అనల నారాయణతో స్నేహంగా ఉంటుందన్న విషయాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు ఏ విధమైన అభ్యంతరం వ్యక్తపరచక పోవడానికి కారణం వారు నారాయణను పూర్తిగా చదవడమే కాకుండా వారి పెంపకంపై వారికున్న అపారమైన నమ్మకం. ఆమె సమర్థవంతమైన ఆలోచనల వెనుక, పటిష్టమైన భావాల వెనుక ఆమె మస్తిష్క క్షేత్రంలో తాము చల్లిన వంగడాలు ఎంత మేలిమి జాతివి అన్న విషయం వారికి బాగా తెలుసు.

కులవృత్తుల మీద అవగాహన కల్పించడానికి , పల్లెటూరు ఎలా ఉంటుందో తెలియని , ఉన్నతమైన వ్యక్తిత్వం ,సామాజిక స్పృహ ఉన్న ఒక ఆధునిక యువతి ద్వారా పలు రకాల వృత్తులను వివరించిన తీరు అద్భుతం. కుటుంబం పట్ల నారాయణ కనబరిచే ప్రేమ, అతనిలో రగిలే జ్ఞానతృష్ణ, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో మెలగడానికి అతడు తనకు తాను గీసుకున్న సరిహద్దు రేఖలు , అనలతో స్నేహం విషయంలో హద్దులెరిగిన అతని విజ్ఞత ,కలల్ని సాకారం చేసుకోవడానికి అతడు అనుసరించిన మార్గాలు , తన ఎదుగుదలకు సహకరించిన వారి పట్ల అతని కృతజ్ఞతాభావం వంటి పలు అంశాలను రచయిత్రి హృద్యంగా వివరించారు.

పరీక్ష పేపర్లు వేద ప్రకాష్ గారిపై రామేశ్వరరావు విసిరి కొట్టిన సందర్భంలో గౌతమ బుద్ధుడు , మదించిన ఏనుగు అనే ఉపమానం రచయిత్రిలోని రచనాపటిమను బహిర్గతం చేస్తుంది. నారాయణ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా, అన్ని విధాలుగా స్ఫూర్తిప్రదాతగా ఉన్న వేదప్రకాష్ గారు అనలా నారాయణ స్నేహాన్ని చూసి అనల సహకారం నారాయణకు చాలా అవసరం అనుకుంటూ ఉండటంతో నవలను సమాప్తం చేసిన తీరు, నారాయణ కెరీర్ జీవితాన్ని మాత్రమే కాకుండా , వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆలోచిస్తున్న అతని తీరును , గురువు తండ్రి స్థానాన్ని కూడా పోషిస్తాడు అన్న విషయాన్ని అన్యాపదేశంగా రచయిత్రి చెప్పిన తీరు ప్రశంసనీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎర్రరంగు బురుద

ఇల్లొక స్టోరీ టెల్లర్ !!