జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పఃడుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు.
ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు.
————ఇక చదవండి——–
ఐదవ భాగం
ఊళ్ళె కొత్తగ దుకనం పెట్టెటందుకు ఊళ్ళున్న కోమటాయన చుట్టం పట్నం నించి వచ్చిండు. ఆయనే రత్నయ్య సేటు. మంచి అనువైన చోటు సూసి భవంతి కట్టుడు మొదలు పెట్టిండు..
కట్టుబడి పని నడిసేటప్పుడు ఇటికెలు, సిమెంటు బస్తాలకు కాపలా కాసేందుకు.. కట్టిన సిమెంటు గోడలకు నీళ్ళు కొట్టేటందుకు మనిషి కావలిసొచ్చింది.
సంగడు తన కొడుకు ఎంకుల్ని కాపలా పనికి పెట్టుకోమని కొత్తసేటును అడిగిండు. నమ్మకమైనోడు కావాలనుకున్న సేటు సంగడి సంగతి తెలుసుకొని వద్దన్నడు…. ఏదులు – నాంచారి నిజాయితి కల్లోల్లని ఊళ్ళే దుకనం ఉన్న చుట్టపాయన సెప్తే. వాళ్ళని పనిల పెట్టుకున్నడు. ఇద్దరు కష్టపడి పని చేసెటోళ్ళే.
అది తెలిసి సంగడికి కోపమొచ్చింది. ఎంకుల్ని పెట్టుకోలేదని. ఏదులు కూడ తన కొడకేనన్న సంగతి మరిసి పోయి పగ పెంచుకున్నడు. ఎంకులు తండ్రిని మించిన పాపకారి, వాడి కండ్లు మండినయి.
ఒక రోజు పొద్దుగుంకినంక నాంచారి, మోటరేసి ప్లాస్టిక్ డ్రమ్ము నింపుకొని కట్టుబడికి మెట్లెక్కి నీల్లు కొడుతున్నది. గోడలు మెట్లు నేల అంత తడికి నీల్లోడుతున్నయి. అదును సూసి కరెంటు వైరు సగం ఊడదీసి నీళ్ళ డ్రమ్ములేసి దూరంగ సాటుకు నక్కిండు ఎంకులు.
నీళ్ళ కోసం డబ్బా పట్టుకుని డ్రమ్ముల చెయ్యి పెట్టంగనే ఈడ్చి కొట్టినట్టయింది.
ఇంతెత్తు ఎగిరి మెట్టు మీద పడి “వామ్మో సత్తినే..” అని నాంచారి పెట్టిన బొబ్బ ఊరంత మోగింది. ఫీజు పేలిన చప్పుడొచ్చింది. కరెంటు పోయింది. అందరు ఉరుకొచ్చిన్రు. నాంచారి. సోయి తప్పి పడివుంది, మెట్లకు నెత్తి గుద్దుకొని నెత్తురోడుతాంది. ఊళ్ళున్న వైద్యుని కాడికి తీస్కపొయిన్రు అందరు కలిసి.
“కరెంట్ షాకు బలంగ తగిలింది.. నలబై శాతం కాలింది.. పట్నం తోలకపోతె మంచిది” అన్నడు వైద్యుడు.. సేటు తన కార్ల పట్నం దావకానకు తీసకపోయిండు. రెండు నెల్లు దవాఖానలున్నది. నరాలు సచ్చు బడ్డయి చెయ్యి, వొల్లు కూడ కాలింది, తలకు పెద్ద దెబ్బ తగిలింది పన్నెండు కుట్లు పడ్డయి. కుడి చెయ్యి సచ్చుబడ్డది. ఖర్చంత భవంతి కట్టుబడి యజమానే భరించిండు.
కని ‘రెక్కాడితినే బుక్కాడె’ నాంచారి చెయ్యి సచ్చు బడ్డది, సచ్చేది బతికింది. దావకానాల నుంచి ఇంటికొచ్చినంక నాంచారి తల్లి కొన్నాళ్ళుండి వండిపెట్టింది.
ఎన్నాళ్ళుంటది ‘మల్లొస్త బిడ్డా’ అని ఇంటికి పోయింది నాంచారి తల్లి తిరపతమ్మ.
ఏదులుకు ఏమి చెయ్యాలో తోచట్లేదు పిల్లలు చిన్నోళ్ళు. ఇంటి పని బయిటి పని ఒక్కడే సేసుకునెటోడు. నాంచారి దావకానల కెల్లి వచ్చినంక, ఒకరోజు ఏదులు దోస్తు రంగడు వచ్చిండు..
“సెల్లె పానమెట్టున్నదే” అనుకుంట.
“నా పిల్లలు అన్నాయమై పోయిన్రన్నా అవిటి బతుకయ్యింది…” అని ఏడ్సింది నాంచారి.
“అన్నిటికి పైనున్నోనిదే భారం సెల్లె, మేమందరం లేమా.. ఆధైర్న పడకు…. నిన్నిట్ట చేసినోన్ని దేవుడొదిలిపెట్తడా… ఏడ్సకు” అని ఓదార్చిండు.
ఆ మాటలు ఏదులు సెవున బడ్డయి.. “ఇంగ మందలిచ్చ మనిషొచ్చినప్పుడల్ల సోకాలు పెడ్తనే ఉంటవా… ఇప్పుడు నీకేమయింది, నాలుగొద్దులయితే నీ పని నువు సేసుకుంటవు… ధైర్నంగ ఉండమనె కద డాక్టరు… రాయె రంగన్న బావ.. అన్న సెల్లెల్లు బగ్గనే ఉన్నరు కని” అనుకుంట.. రంగన్ని లేపుకొని గుడిసె ముందల ఏపసెట్టు కిందికి తీసుకొచ్చిండు.
కూసో బావ అంట, బీడీలకట్ట జేబులకెల్లి తీసి, ఒక బీడి రంగడికిచ్చి ఒకటి తను ముట్టిచ్చిండు. గట్టిగ రెండు దమ్ములు గుంజి…
“ఇందాక ఏమంటున్నవే బావ ‘నిన్నిట్ట సేసినోణ్ణి దేవుడొదిలి పెడ్తడా..’ అంటివి… ఏందే కత మీ సెల్లెకు కరెంటు షాకు నేను పెట్టిన్నా… అంత పాపాత్మున్నా నేను…” అని ఏడ్వ బట్టిండు ఏదులు.
రంగనికి ఏమి సెయ్యాల్నో తోచలేదు. అసలు ఏదులేమంటండో మొదలు అర్ధం కాలే.. అర్ధమయినంక భయమయ్యింది.
” సెప్పే బావ నీ సెల్లెకు…” ఇంకేదో అనబోతున్న ఏదుల్ని ఆపెటందుకు.. “ఏ ఊకో నీ తిక్కల పాసుగాల.. నేనెందుకన్న అట్లని, ఏడ్సుడు ఆపు” అని కసురుకున్నడు.
“మరి నువ్వన్నది గదే గదా.. నేను తాగుబోతోన్నే. కోపిష్టోన్నే. గని మా నాయినోతిగ కట్టుకున్న దాన్ని ఇంస పెట్టెటోన్ని కాదు బావ” అన్నడు ఏదులు.
“ఆగో నేనెప్పుడన్న అట్టని, నీ సంగతి నాకు తెల్వనిదా… మీ అమ్మకు రోగమొస్తె బాగు సేయించక సంపిండని మీ నాయిననే తిట్టుకుంట తిరగ బడితివి. నువ్వుందెకు అట్ట సేత్తవు, నేనెందుకంటనే… ” అన్నడు రంగడు.
“మరి నువ్వు మీ సెల్లెతోని అన్నదేంది..?”
“ఏదో దుఃఖంల ఉన్నదని ఓదార్చిన ఏమన్ననే” అన్నడు. కని రంగనికి భయమయ్యింది నిజం సెప్తే ఏమి లొల్లస్తదో నని.
“బావ నాకు జరంత పనుంది మాపటాల్ల కలుస్త తాల్లకాడ” అని లేసి దారిపట్టి పోయిండు రంగడు. ఏదులు కండ్లు తుడుసుకున్నడు.
“యయ్యా అవ్వ పిలుస్తంది…” అనుకుంట గుడిసె గుమ్మంల నిలబడ్డ పిల్లలను సూసి. లేసి ఇంట్లకు పోయిండు.. నాంచారికి మందు బిల్లలు మింగించి. కాలిన గాయానికి మందు రాసిండు.. పొయ్యి కాడికి పొయ్యిండు. పిల్లలకి ఏదన్న చేద్దామని. కని ఏమిసెయ్యాలో తోచలేదు…
ఇంతల్నె పొరిగింటి మల్లమ్మ ఉడుకుడుకు చాయి సెంబెడు పట్టుకొని వచ్చింది “నాంచారీ ఎట్టున్నదే పానం” అనుకుంట.. “ఓ పిలగ ఏదులు… ఈ ఉడుకు నీల్లు తలా ఇంత తాగండి, జరంత పనున్నది మల్లొస్త..” అనుకుంట వచ్చినంత బేగిన తిరిగెల్లి పొయ్యింది. పిల్లలకు చెరింత, నాంచారికింత చాయి పోసిచ్చి, మిగిలింది పక్కకు పెట్టిండు. “నువ్వింత తాగే..” అన్నది నాంచారి. “నేను సలీం టీకొట్టు కాడ తాగుత తియ్..” అని బయటికొచ్చిండు. ఏదులు జాసంత రంగడన్న మాట మీదనే మల్తంది. ఎందుకన్నడో అర్థం కాలేదు. మొత్తానికి ఏదో సంగతున్నది. అసలు సంగతరుసుకోనిదే తనకు మనసు సుతరాయించదు..
సాయంత్రం తాల్లల్ల కలిసిండు రంగన్ని. రెండు బింకిలు కల్లం తాగినంక మల్ల అడిగిండు పొద్దటి సంగతి “ఏమన్నవే నువ్వు. ఎందుకన్నవట్ల. ఏదో ఉన్నది సెప్పు బావా..” అన్నడు రంగడిని బతిమిలాడినట్టు..
“ఊకో బావ సిన్నపోరనోతిగ మంకు పట్టి ఒకటే ముచ్చట పట్టుకున్నవు…” అని కసిరిండు.
“సెప్పుబావా.. నాకు నువు తప్పెవలున్నరే..” ఏడ్సుడు సురూ చేసిండు.
“ఆగాగు సెప్పేదాక వదలవు కదా..
కరెంటు షాకు కొట్టిన నేత్రి ఎంకులుగాడు గౌండ్ల శీనుతో అన్నడట. ‘కరెంటుతీగ పీకి నీళ్ళల్ల నేనే పడేసిన, దెబ్బతోటి ఇద్దరి రోగం కుదురుద్ది సూడు. కాపలా పని నాకియ్యమంటే ఇయ్యకుంట వానికిచ్చిండు ఆ సేటు. ఇప్పుడు కట్టుబడి ఆగిపోద్ది… ఇగ మావోని పెండ్లం సస్తదో బతుకుతదో తెలవదు’ అని. తాగివాగినా నిజాలు సెప్పిండట. పక్కనే కల్లు తాగుతన్న సాకలి చంద్రడిన్నడట. నువ్విప్పుడు లొల్లి సెయ్యకు. అసలె సెల్లె ఒంట్లె బాగలేదు” అని చేతులు పట్టుకున్నడు రంగడు.
దిగ్గున లేసి నించున్నడు ఏదులు. “వాయ్యో నీ బాంచెను బావా.. లొల్లి సెయ్యకు” అంట కాళ్ళందుకున్నడు రంగడు.
అయ్యన్ని ఇంటున్న గౌండ్లాయిన కూడ “ఏ ఊకో ఏదులు.. ఇప్పుడు కాలం బాగలేదు. ఓపిక పట్టు, ఇప్పటికే నీ పెండ్లాము మంచంలున్నది, పిల్లల మొఖం సూడు, సల్లబడు. ఈ పోత్తాటి కల్లు ఒక దొప్ప పట్టు ఇప్పుడే ఇడుసుకొచ్చిన.. ” అనుకుంట ఏదుల్ని లేవనీయకుంట ఆకు చేతుల పెట్టి బింకిల కల్లొంచిండు.
ఆ తరువాత సాన సేపు ఎవ్వరు ఏమి మాట్లాడ లేదు.
ఏదులు నిమ్మలంగ లేసి పొయ్యొత్తనే అనుకుంట ఇంటి దారి పట్టిండు.
అన్ని గుడిసెలల్ల దీపాలు ముట్టిచ్చినట్టున్నరు. తాళ్ళగడ్డ దిగుతంటే గుడెసెల సూర్లల్లకెల్లి ఎలుగులు మినుకు మినుకు మంట, మినుగురు పురుగుల గుంపులోతిగ కంటికానతన్నయ్.. అడుగులు అటిటు ఏసుకుంట ఇల్లు సేరిండు ఏదులు..
**
సల్ల మల్లమ్మ, వడ్డెరెంకమ్మ నీల్ల బాయికి కుండలు పట్టుకొని నడుత్తాన్రు.. ఏదులు గుడిసె ముందు నుంచి నడుసుకుంట “పాపం పాడుగాను.. పాడుకాలమొచ్చింది – మనుషులు కంటె మెకాలే నయమనిపిస్తాంది. అయ్యి ఆకలైతనే ఏటాడతయి. గీ మడుసులేందో, కడుపు నిండ తిన్నా ఇంకా నోరుతెరుసుకొని ఉంటరు..” అన్నది సల్లమల్లమ్మ.
“ఏమయింది ఈ పొద్దు.. ఎన్నడు లేనిది పాప సింతన సేత్తున్నవు. ఇగరంగా సెప్పరాదొదిన” అన్నది వడ్డెరెంకమ్మ, “ఎవల్ల సంగతి సూసిన గట్టనే ఉన్నది. నిన్న పొద్దుగుంకేల్ల మీ అన్న దుకనపు సేటింటికి పోయిండు. ఆవుపాలు ఇచ్చెతందుకు. ఆడ సంగడు, ఆని కొడుకు ఎంకులు భవంతి కట్టే సేటుతో మాట్లాడతాన్రట. కాపల పని మాకియ్యమంటే ఇయ్యిక పోతివి సేటు, ఇగురం లేని ఎడ్డె మొకపోనికి ఇస్తివి.. ఇప్పుడేమయింది. డబ్బు కర్సాయె.. నీ పనాగి పాయె రెండ్నెల్ల సంది, అన్నడట సంగడు” సెప్పుకొచ్చింది మల్లమ్మ.
“సేటే మన్నడట…” ఎంకమ్మ ఆత్రం.
“నా ఇల్లు ఇయ్యాల కాకపోతే వచ్చే ఏడు కట్టుకుంట, వాల్లకేమన్న అయితే పాపం సుట్టుకుంటది.. డబ్బులు ఇయ్యాల కాకపోతె రేపు సంపాయించుకోవచ్చు – అన్నడట సేటు” అన్నది మల్లమ్మ. మల్ల తనే
“అదేలే కని ఎంత అడుగుతాండు మావోడని ఎంకడడుగుతే, వాడేమి అడగలే నేనే ఓ లచ్చిద్దా మనుకుంటున్న, వాళ్ళు దుఃఖంల ఉన్నరు, నేనే తర్వాత నిమ్మలంగ పట్టక పొయ్యి ఇస్తనన్నడట సేటు. ‘అదేమయితది మూడు లచ్చలన్న కావాలె… లేకుంటే పోలీసు కేసు పెట్టమంట.. అని కొడుకంటే… ఆ ఇచ్చేదేదో నాకియ్యుండి సేటు, వాల్లు దుఃఖల ఉన్నరు నేను పట్టక పొయ్యిస్తనన్నడట తండ్రి. లేదు లేదు నాంచారికి నిమ్మలమయినంక, నేనే సర్పంచ్ ఇంటికి వాల్లను పిలిపించి అందరి ముందల ఇస్త అన్నడట, సేటు మంచోడు” అన్నది మల్లమ్మ.
“ఎంత అన్నాలం.. సావు తప్పి కన్ను లొట్ట పొయ్యి వాల్లుంటే.. వాల్లకిచ్చే డబ్బులు మీద ఈ అయ్య కొడుకుల కన్ను పడింది. ఆని బుద్దెంత పాపిష్టి బుద్ధి, అయ్య కొడుకులు ఒకటే..” అన్నది ఎంకమ్మ.
“ఆల్ల ముచ్చట్లన్ని మీ అన్న ఇంటండని, ఏమింటున్నవో ఎర్రిగోల్లాయిన.. పాల సర్విచ్చినవు కద ఇకపో దారి బట్టు అన్నడట. ఆ ఎంకులు గాడు సిన్నంతరం పెద్దంతరం లేకుంట, పాడుకాలమొచ్చింది” అని వాళ్ళు మాట్లాడుకుంట నడుస్తుండగానే బాయి దగ్గరకు చేరిన్రు. మాటలాపి నీళ్ళు నింపుకొని ఇంటి దారి పట్టిన్రు.
“ఈ సంగతి ఆ నాంచారికి సెప్పాలె జర తెలివిగ ఉండమని.. ఆ ఏదులుగాడు ఉత్త కుక్క పేగులోడు, ఏదాపుకోలేడు, కోపమొచ్చినా దుఃఖమొచ్చినా” అన్నది సల్లమల్లమ్మ.
“ఔ సత్తెమే.. ముందే తండ్రంటే పడదు వానికి, సంగడు చేసే పాడుపనులు నచ్చవు ఏదులుకి.. ఆపిల్లకి సెప్పాలె.. మామ కన్ను పడ్డదంటే జరన్న జాగ్రత్త పడతది. వాళ్ళ నాయినను పిలిపిచ్చు కొమ్మని చెప్పాలె” అనుకుంట ఇంటికి పోయిన్రు వాల్లు.
సశేషం