సంస్కారవంతమైన మనసుకు ప్రతిబింబం నమస్కారం.’ నమస్సు’ అనే సంస్కృత శబ్దం నుండి ఉద్భవించింది. నమస్సు
/నమః అంటే మనిషిలోని ఆత్మను గౌరవించడం .ఒక్క నమస్కారం మనిషి వ్యక్తిత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. నమస్కారానికి ఎన్ని పార్శ్వాలు/ కోణాలు ఉన్నా కులమతాలకు అతీతమైన భారతీయ సంస్కార సంపద మన నమస్కారం.
పంచభూతాత్మికమైన ఈ శరీరానికి ,చేతులు జోడించి నమస్కరించడం వల్ల శరీరం ఉత్తేజపూరితమవుతుందని ఒక అభిప్రాయం. మనిషి ముందుగా రెండు చేతుల జోడించి నమస్కరించడం వల్ల అతని వ్యక్తిత్వం మానసిక వికాస పరిమళం మనకు అవగతం అవుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా వ్యక్తి ప్రతిభను గుర్తించి నమస్కరించడం ఒక సద్వర్తన.
శాస్త్రాలు నమస్కారాన్ని నాలుగు విధాలుగా చెప్పాయి.
1. సాష్టాంగనమస్కారం
2. దండ ప్రమాణం
3 పంచాంగనమస్కారం
4. అంజలి ప్రమాణం.
సాష్టాంగ నమస్కారం: మనసు, బుద్ధి, అభిమానం రెండు పాదాలు, రెండు చేతులు ,శిరస్సు 8 అవయవాలతో చేయు నమస్కారం సాష్టాంగ నమస్కారం. శరీర అష్ట భాగాలు భూమిని తాకుతూ దేవుని ఎదురుగా సాగిలపడి చేసే నమస్కారం.
2. దండ ప్రమాణం : నేల మీద పడిన దండము (కర్ర లాగా) శరీరాన్ని భూమికి ఆన్చి కాళ్లు చేతులు చాపి చేసే అంజలి దండ ప్రమాణం.
3. పంచాంగ నమస్కారం: రెండు పాదాల
వేళ్ళు ,రెండు మోకాళ్లు, తల భూమిపైన ఉంచి రెండు చేతులను
తలవద్ద చేర్చి అంజలి ఘటించుట, దీన్ని పంచాంగ నమస్కారం అంటారు . ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తారు.
4. అంజలి ప్రమాణం :ఇది సాధారణమైనది. రెండు చేతులు కలిపి నమస్కారం అని చెప్పడం.
వైదిక విధానంలో చేసే నమస్కారాన్ని’ ప్రవరతో నమస్కారం’ అంటారు. చతుస్సాంగ పర్యంతం గోబ్రాహ్మణస్య శుభం భవతి… అభివాదయే అంటూ నమస్కరించడం వైదిక పద్ధతి. చేతివేళ్లు చెవుల వెనక్కి చేర్చి కాస్త ముందుకు వంగిన భంగిమలో పై సంస్కృత వాక్యాన్ని ఉచ్ఛరిస్తూ మనుషులకు నమస్కరించేటప్పుడు కుడి చేయి ఎడమ చెవికి ఎడమ చేయి కుడి చెవికి చేర్చి ప్రవర చెప్పాలి. అదే దేవతలకు చెప్పే క్రమంలో ఎడమ చెవికి ఎడమ చేతిని, కుడి చెవికి కుడిచేతిని చేర్చి ప్రవరతో నమస్కరించాలి. ఇవి నమస్కారం యొక్క రకాలు.
కొందరు సద్గురువుల చిత్రపటాలను చూస్తే ముకుళిత హస్తాలతో నమస్కారముద్రతో మనకు కనిపిస్తారు. ఎంత నేర్చినా, ఎదిగినా ,ఒదిగి ఉండాలనే తత్వానికి భాష్యం చెబుతున్నట్లుగా కనబడతారు. సదా వినమ్రంగా నమస్కారముద్రతో కనిపించే ఆ హనుమ వినయానికి స్ఫూర్తి ప్రదాత. అంటే ఎంత గొప్ప వారైనా సరే నమస్కారం అనే సంస్కారాన్ని అలవర్చుకోవడంతో సంస్కార పరిమళాలు నాలుగు దిశలా వ్యాపిస్తాయి.
నేటితరం ఆధునిక పోకడలతో విలువలు కాస్త మరచిపోతున్నారు. దానికి మొదటి కారణం తల్లిదండ్రులనే చెప్పాలి. పిల్లలకు బాల్యం నుండే రెండు చేతులు జోడించి నమస్కరించడం నేర్పి విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేస్తే సంస్కారానికి ప్రతీకలు కారా ?మనం విలువలని పాటిస్తేనే కదా భావి తరాలు సంస్కరించబడి విలువలెరిగి సంఘంలో గౌరవించబడతాయి. విజ్ఞతతో కూడిన ఆలోచనలతో ముందు తరాలకు సంస్కారాన్ని అందించే వారధులుగా నేటితరం విలువలు ఎరిగి మసులుకోవాలి. అప్పుడే భారతీయ సంస్కార పరిమళాలు విశ్వవ్యాప్తమవుతాయి.