ఎర్రరంగు బురద

ధారావాహిక నవల

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పఃడుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు..

————ఇక చదవండి——–

అప్పుడే మారుతల్లి కొడుకు ఎంకులు, గుడిసె ముందు కూసున్న ఏదుల్ని చూసి, మీసం మెలేసి ఓరగంట సూసుకుంట, సన్నగ ఈలేసుకుంట పోతున్నడు. ఆడి ఉచ్చిలి చూడంగానే తన తల్లి బడ్డ నరకయాతన యాదికి అచ్చింది. పాత పగ రగిలింది, గుండె భగ్గుమంది. బూతులు తిట్టుకుంట దిగ్గున లేచిండు. 

అరుపులకు ఏదులు పెళ్ళాం బయటకు వచ్చింది. ఏమయిందో అర్థం కాలే…

 “మళ్ళీ ఏం ముంచుకొచ్చిందయ్యా..” అని అడిగింది. 

ఏదులు కోపంగా “కొత్తగ ఇంకేం జరుగుతది” అనుకుంట రోడ్డు పట్టిండు. చీకటి పడ్డంక ఫుల్లుగ తాగి ఇల్లు చేరిండు.

సోయిలేకుండ మత్తుల ఒర్రుకుంట కూలబడ్డడు.

 పెడ్లాం తల్లెల అన్నమేసి ముందల పెట్టి “సోరింత కుడువే యయ్యా” అన్నది.

ఏదులు ఏడ్సుడు సురూ సేసిండు.. “మా అవ్వను సంపిండు, మా అక్కను బొంబాయికి అమ్మేసిండు.. మారాజోతిగ చింత లేకుంట, కొత్త పెండ్లాన్ని కొత్త కొడుకుని చూసుకుంట మురుస్తాండు, ముసలి నా కొడుకు.. వాన్ని పందిని పొడిచినట్టు పొడుస్త.. వాని కొడుకును సుత వదిలిపెట్ట..” అంట ఒర్రుతాండు.. ఏడుస్తండు.. బూతులు… ముతక తిట్లు తిడుతుండు.

 పోరగాళ్ళు భయం భయంగ తల్లి సాటుకు నక్కిన్రు. తండ్రి తాగినప్పుడేసే బాగోతమే.. అయినా రోజూ భయమే వాల్లకు. గుడిసెల దీపం గాలికి రెపరెపలాడుతాంది, ఏ గడియల ఆరి పోతదో అన్నట్టు. 

తమ బతుకులోతిగ రెపరెపలాడే దీపం కెల్లి సూసుకుంట కూసున్నది ఏదులు పెళ్ళాం.

మొగన్ని ఊకుంచాలని దగ్గరికి పోయింది చానా సార్లు.. సోయిల లేని ఏదులు ఇసిరిసిరి కొడతాండు.. ఒర్రీ ఒర్రీ కూసున్న సోటనే ఒరిగి నిద్ర పోయిండు. నాంచారికి ఏమి సెయ్యాలో తోస్తలేదు.. పొద్దుగాల గంతగనం ఏడ్సి మొత్తుకుంటె సల్లబడ్డోన్ని మల్ల రెచ్చకొట్టిండు ఎంకులు.

‘పిల్లికి చెలగాటం ఎలకకు పాన సంకటమన్నట్టు’ ఉన్నది నాంచారి బతుకు.  

కులం కట్టుబడి కాబట్టి, ఊరొదిలి కదలడు మొగడు. ఊల్లె వుంటె గతం ఎంటాడి ఏటాడుతంది… ఏం సెయ్యలేదు తను. “ఎంకన్న సామి నీదే దయ.. ఎరకల నాంచారమ్మా.. తల్లా నువ్వే దారి సూయించు మాకు” అంట దినాం దండాలు పెట్టుద్ది, నూరు మొక్కులు మొక్కుతది నాంచారి. 

మొగుడు ఒంటి మీద సోయి లేకుండ పన్నడు, ఏ నేతిరి లేస్తడో తెలవదు.. 

పొద్దుగాల అడుక్కొచ్చుకున్న సల్లనీల్లల్ల సంకటి ఒక ముద్దేసి కాసిన్ని నీల్లు పోసి ఉప్పుగల్లేసి బాగ పిసికి మూత బెట్టి గంపకింద పెట్టి, ఒక రాయి బరువు పెట్టింది. మిగిలిన సంకటి ముద్దల ఇంక మరిన్ని నీల్లు పోసి ఉప్పేసి బాగా పిసికి పిల్లలిద్దరికి తాగిచ్చింది. మిగిలిన రెండు గుటకలు తాను తాగింది. బస్త సింపులు పక్కోతిగ పరిసి పిల్లల్నేసుకుని ఒరిగింది.. 

బయట సర్కారు తుమ్మ కంప మొదట్ల పన్న పిల్లల తల్లి సుక్కపందికి తనకు తేడా లేదనిపించింది నాంచారికి.. ఏ చనాన ఏమయితదో తెలవదు… అంతా అయో మయం జగన్నాధం. 

ఏదులు మంచోడే కని తల్లి సావుకు, అక్క ఎడబాటుకు కారణం తన తండ్రే అన్న బాధ, మనాది వాన్ని ఉన్మాదిని చేస్తంది. ఊల్లందరు డబ్బున్నా లేకున్నా కాయకష్టం చేస్కొని కలోగంజో తాగి ఒక్క నీడన బతుకుతున్నరు. తన తండ్రి జులాయి తనం, ఏది పట్టని తనం, తనసుఖమే తను చూసుకునేట్టు చేసింది. తల్లికి రోగమొస్తె మందులిప్పియక, ఆమె సావుకు ఆమెను వదిలి పెట్టి, ఇల్లొదిలిపెట్టి మరో ఆడదానితో కూడిండు. రోగం ముదిరినంక మేనమామలొచ్చి అరుసుకున్నా లాభం లేకపోయింది. తల్లి సచ్చినంక నెల రోజులకే ఏదులు పెద్దక్క తొమ్మిదేళ్ళ పిల్లను బొంబాయోల్లకు అమ్మేసిండు.  కన్న పిల్లల్ని కాటేసే కసాయి సర్పమయ్యిండు. 

మేనమామ ఈరన్న అడుగుతే.. ఉరికురికి జగడమాడిండు… అక్కే సచ్చినంక ఈ మోర్దోపోనితో లొల్లెందుకని సప్పుడు జేయకుంటున్నడాయిన.  

తల్లి సచ్చినప్పుడు ఏదులుకు ఏడేళ్ళు వాడి సెల్లెకు ఐదేళ్లు. రోజంత ఆడాడ తిరిగి నేతిరైతె గుడిసెల ముడుసుకొని పండుకునేది. పండుగకో పబ్బానికో ఊల్లోల్లే ఎవరో ఒకరు వాళ్ళ కడుపు నిండ తిండి పెట్టేది, పాపాత్ముడు తండ్రి మాత్రం పట్టిచ్చుకోలే… అంత చిన్నతనంల పడే అవమానాలకు- కష్టాలన్నిటికి తండ్రే కారణం అని ఏదులు పసిమనుసుల నాటుకుంది. తనకెవరు లేరు తానొంటరోడన్న ఎత తినేస్తుండె.  

ఓరేతిరి ఆల్ల గుడిసెలకు పాము జొరబడింది. బుడ్డి దీపం ఎలుగుల… మెరుస్తున్న పామును ఏదులే సూసిండు ముందల. సెల్లె సెయిపట్టి గుడిసెల కెల్లి బయటకు తీసుకొచ్చిండు సప్పుడు కాకుండ.. వాకిట్ల నిలబడి పేగులు బైటికొచ్చేట్టు గట్టిగ పెడబొబ్బలు పెట్టిండు… నిద్రమబ్బుల బైట నిలబడ్డ వాని సెల్లె ఉలికి పడి లేసింది, ఏం జరిగిందో తెలవక ఏడుపందుకుంది. చుట్టుపక్కల గుడిసెల జనం మూగి పామును చంపిన్రు. పసిపోరల్లు దగడు పడ్డరని పక్కగుడిసెల గొల్లరామక్క తనింట్ల పండపెట్టుకుంది. తెల్లారినంక పక్కూర్లున్న మేనమామను పిలిపిచ్చిన్రు. ఊల్లున్న తండ్రికి సెప్పలేక… పసిపోరల్లు భయపడ్డరు.. గజ్జున వనుకుతున్నరు. తండ్రి తర్వాత తండ్రసంటోడు మేనమామంటె… వాల్లను నువ్వే కాసుకోవాలని సెప్పిన్రు.

 “నా అక్క పిల్లలు నాకు బరువుకాదు… వాల్ల తండ్రొక మూర్ఖుడు. ఆ మోర్దోపోనితోని జగడమాడ లేక ఊకున్న..” అని తోలుకొని పొయ్యిండు ఈరన్న. 

ఆస్తులు పాస్తులుండవు పేదోడి గుడిసెల్ల. కోళ్ళు పందులున్నట్టె మేనమామకున్న ఇద్దరు పిల్లలకు తోడు ఏదులు, వాని చెల్లె రాములమ్మ చేరిన్రు. ఏదులు పందులు కాసేది. మామకు సాయం చేసుకుంట బుట్టలల్లడం, ఈతరొట్ట తేవడం వంటి సంగతులు నేర్చుకున్నడు.. వాడి చెల్లెలు అత్తపిల్లలను ఆడిచ్చుకుంట ఇంట్ల పనిల సాయం చేసేది. 

*

ఏదులుకు పదమూడేళ్ళు రాంగానే మేనమామ తన బిడ్డ నాంచారినిచ్చి పెళ్ళి చేసిండు.. రెండేళ్ళు ఇంట్లపెట్టుకొని.. తర్వాత పాడుబడ్డ ఏదులు గుడిసెని బాగుచేయించి అల్లున్ని, బిడ్డను అందుల తోలిండు. పదిహేను పందులను కట్నంగ ఇచ్చిండు.

ఏదులుకు తండ్రి సేసిందే మనసుల నాటుకుంది.. ఊళ్ళోళ్ళందరికి తలల నాలికోలే కలిసి పోయిండు, కష్టం సుఖం తెలుసుకుండు, మంచి మర్యాద నేర్చుకున్నడు మామ తాన. బడికి పోకున్నా, ఏ సదువు రాకున్నా, ఇగరమంతునిగా మంచి బుద్దులు తెలుసుకున్నడు. కానీ తండ్రి మీద పగ పెంచుకున్నడు.

పెండ్లప్పుడు మామిచ్చిన పదిహేను శాల్తీల పందులు ఐదేండ్లకు ఏబై కంటె ఎక్కవ పెరిగినయి, కొన్ని అమ్మిండు, కొన్ని ఉంచుకున్నడు. ముగ్గురు పిల్లలయ్యిన్రు.. పచ్చపచ్చగ ఉంటున్నడు.. 

ఏదులుని చూసి సంగడి మారుమనువు కొడుకు ఎంకులికి కండ్లు మండినయి.. దానికి తోడు ఎంకుల్ని చూడంగనే ఏదులు బూతులు తిట్టేది తండ్రిని, మారు తమ్ముడిని చూడంగనే తల్లిసావు తలుసుకొని..

*

ఏదులు తండ్రి సంగడు స్వార్ధ పరుడు. దొరలు పటేళ్ళను చూసి విలాసంగా బతకడం కోరుకుండు.. కపటం మోసకారితనం నేర్చుకొండు. తన సుఖం కోసం కన్న బిడ్డను కూడా అమ్ముకున్న పాపాత్ముడు. మాటలు సెప్పి మతపరిచ్చే విద్దె తెలిసినోడు. కుంటకింద అలుగు పక్కున్న లోతట్టు భూమిని పందుల మేపెటందుకు పోయినప్పుడు సూసిండు. అది ఎవరి ఇలాకా కాదని తెలుసుకున్నడు. 

పంది వార్లల్ల మంచిగ సవురున్నయి పట్టకపోయి దొరకు ఇచ్చిండు.. “అలుగు పడితే మునిగిపోయే నేలచెక్క.. నేను గింజలు సల్లుకుంట సామి” అని ఊరి దొరను కాక పట్టిండు. 

సరె అనిపిచ్చుకున్నడు. ఎరికల సంగడు ఎగసాయం మొదలు పెట్టిండు… అంతకు ముందు నుంచే కులపోల్ల పందుల మందనించి శాల్తీలను మాయం చేసేటోడు.. పట్నం బస్సు డ్రైవర్లకు ఫోర్క్ పొట్లాలు అందించెటోడు. 

నెత్తురు చుక్క కనపడదు. పంది జాడ కనపడదు. కాని సంగడి జేబు నిండేది… జగడాల మారోడ్ని అడగ లేక కులపోళ్ళు ఒకర్నొకరు తిట్టుకొని గమ్మునుండెటోల్లు…. 

 **

ఊళ్ళె కొత్తగ దుకనం పెట్టెటందుకు ఊళ్ళున్న కోమటాయన చుట్టం పట్నం నించి వచ్చిండు. ఆయనే రత్నయ్య సేటు. మంచి అనువైన చోటు సూసి భవంతి కట్టుడు మొదలు పెట్టిండు..

 

** సశేషం***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అన్ని రోజులూ అమ్మవే

శ్రీకృష్ణున్ని ఇంత మధురంగా ఎవరూ ప్రేమించి ఉండరు!