” ఒక సిరా చుక్కా వెయ్యి మెదళ్ల కదలిక ” అంటూ ప్రముఖ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు గారు చెప్పిన మాట ఎందరో రచయితలు తమ బాటగా మార్చుకుని తమ కలాన్ని అక్షరాల వెంట పరుగులు తీయిస్తున్నారు. సమాజాన్ని చైతన్య పరుస్తున్నారు. అలాంటి రచయితలు వెయ్యి మందికి పైగా ఒక చోట చేరితే.. వారి కలాల నుంచి వచ్చే సాహిత్య పరిమళాలు విశ్వమంతా వ్యాపిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఆ రచయితలంతా మహిళా మణులు అయితే.. జగమంతా కుటుంబం నాది అంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతారు. సామాజిక దురాగతాలను రూపుమాపుతారు. సమసమాజ నిర్మాణానికి అక్షరాలతో పాటుపడతారు. సరిగ్గా ఇదే జరుగుతుంది తెలుగు సాహిత్య చరిత్రలో… అక్షరయాన్ సంస్థ ఆవిర్భావమే ఒక ప్రభంజనంగా వందలాది మంది రచయితలను ఒక వేదిక పైకి తీసుకువచ్చి వారి రచనల ద్వారా చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నంతో పాటు,దశాబ్దాలుగా అక్షరసేద్యం చేస్తున్న సాహిత్య మాతృమూర్తులను సత్కరించుకుంటూ భవిష్యత్ తరాల వారికి సాహిత్యబాటను వేస్తున్నారు. ఆమె ఎవరనుకున్నారు?
ఆమె నే ప్రముఖ కవయిత్రి,రచయిత్రి, వ్యాఖ్యాత్రి,తెలుగు విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ (చిత్రవాణి) అయినంపూడి శ్రీలక్ష్మి గారు!!
“నేను మాత్రమే రాయడం కాదు మనందరం రాయాలి.. మన కలం ఎక్కు పెట్టిన బాణం కావాలి” అంటూ సాహిత్యరంగంతో రచయిత్రు లను అంతరిక్షం దిశగా అక్షరయానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అక్షరయాన్ ఏర్పాటు చేయడంతో పాటు.. షష్టి పూర్తి కలాలకు మాతృవందనం అంటూ సత్కరిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి రూపశిల్పి అయినంపూడి శ్రీలక్ష్మి గారితో ఈ వారం మన తరుణి ముఖాముఖీ…
తరుణి : సాహిత్యంతో మీ సహవాసం ఎప్పటి నుంచి ఏర్పడింది మేడమ్?
శ్రీలక్ష్మి గారు: సాహిత్యంతో నా సహవాసం.. బహుశ అమ్మ కడుపులో ఉండగానే ప్రారంభం అయ్యిందేమో.. ఎందుకంటే నాన్న ఆయినంపూడి శ్యామసుందర రావు గారు. స్కూల్ హెడ్ మాస్టర్. ఆయనకు స్కూల్ అన్నా. పిల్లలు అన్నా ఆరోప్రాణం. పిల్లంటే ఎంత ఇష్టమో పాటలు రాయడం అన్న అంతే ఇష్టం. విద్యార్థుల్లో ఉత్సాహం కలిగించడానికి ఆయన ఎన్నో దేశభక్తి పాటలు రాసి వారి చేత పాడించేవారు. కథలు, నాటికలు రాశారు. అలా ఆయన పాటలు వింటూ అమ్మ కడుపులో పెరిగానేమో.. అందుకే అక్షరం అంటే అంత ఇష్టం ఏర్పడింది. ఊహ తెలియక ముందే నాన్న పాటలు వింటూ పెరిగాను. ఊహ తెలిసే నాటికి ఆయన రాసిన పాటలు పాడుతూ పెరిగాను. నాన్నగారు పాట రాసిన తర్వాత నాకు తమ్ముడికి నేర్పించేవారు. స్కూల్ లో ఏ ఫంక్షన్ జరిగినా మైక్ తీసుకువచ్చి నాకు ఇచ్చేవారు. నాన్నని అందరూ మెచ్చుకుంటుంటే నాన్నే నా హీరో కాబట్టి నాన్నలా రాయాలని అనిపించి మొదలుపెట్టాను.రాసి వినమని అన్నాతమ్ముళ్ళని హింస పెట్టదాన్ని . అలా వేదికపై నాన్న రాసిన పాటలు పాడుతూ సాహిత్యంతో సహవాసం అనుబంధంగా మారింది.
తరుణి : అక్షరాలతో అనుబంధం పెనవేసుకోవడానికి , అక్షరాల దారి వెంట పరుగులు తీయడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన వారు, మీ చెయ్యి పటుకుని నడిపించిన వారు ఎవ్వరు?
శ్రీలక్ష్మి : అక్షరాలకు స్ఫూర్తి మా నాన్నగారు. అనుబంధం పెరగడానికి కారణం అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ చెప్పిన కథలు. నా చేయి పట్టుకొని నడిపించినవారు మా గురువుగారు సైబ పరంధాములు గారు , మరో గురువుగారు నాళేశ్వరం శంకర గారు. వీరందరి కంటే ముందు సాహిత్యం పై మక్కువ పెంచిన గురువు కృష్ణమూర్తి గారు. నాన్నగారు ప్రైమరీ స్కూల్ పని చేస్తూ ఎక్కువగా చిన్న ఊళ్ళకు ట్రాన్స్ ఫర్స్ ఉండేవి. అందుకని ఎనిమిదో తరగతి నుంచి బోధన్ లో నాన్నమ్మ ఇంట్లో ఉంచి చదివించారు. కృష్ణ మూర్తి సారు నన్ను అన్ని పోటీలలో పాల్గొనమని ప్రోత్సహించేవారు. వ్యాసరచన, వృకృత్వ, పాటలు, కథల అన్ని పోటీలలో జిల్లా స్థాయిలో మాకే బహుమతి లు వచ్చేవి. ఆయనే మంచి విద్వత్తు ఉన్న అమ్మాయి అంటూ నాళేశ్వరం శంకరం గారికి నన్ను పరిచయం చేశారు. భాషపై మంచి పటుత్వం ఉంది సరికొత్త పంథాలో విషయాన్ని రాస్తావు అంటూ ఆయన నన్ను ప్రోత్సహించారు. డిగ్రీకి వచ్చిన తర్వాత నేను రాసిన కవితను ఇందూరు భారతి సంస్థ వారు మెచ్చుకున్నారు. స్కూల్లో కవి సమ్మేళనాలు నిర్వహించి కవిత్వం పై ఆసక్తి ఉన్న చిన్నారులకు పెద్ద పెద్ద కవులు చేత తర్ఫీదు ఇప్పించేవాళ్ళు. అలా ఇందూరు భారతి ద్వారా కవిత్వంలో నేను రాణించగలిగాను. ఆ తర్వాత కాలంలో ఇందూరు భారతిలో నేను జాయింట్ సెక్రటరీగా కొంతకాలం పని చేశాను. అక్కడే వ్యాఖ్యాతగా ఓనమాలు నేర్చుకున్నాను.
తరుణి : మీ కుటుంబం గురించి చెప్పండి?
శ్రీలక్ష్మి: నిజామాబాద్ జిల్లా బోధన్ మాది. ఉమ్మడి కుటుంబం. అన్న, తమ్ముడు, నేను, మా బాబాయి వాళ్లు, వారి ముగ్గురు పిల్లలు, తాత, నానమ్మ అంతా కలిసే ఉండేవాళ్ళం. దిగువ స్థాయి మధ్యతరగతి జీవితాలు. చిన్న పూరిల్లులో ఉండేవాళ్లం.
చినుకు పడితే కురిసే గుడిసే మాది. పేదరికం గురించి మాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. నాన్న జీతం సరిపోయేది కాదు. దాంతో ఇంట్లో ఉన్న పాడి సంపద మాకు తోడుగా ఉండేది. ప్రతి ఇంటికి వెళ్ళి పాలు, పెరుగు ఇచ్చి వచ్చే వాళ్ళం. నాన్న సమాజ సేవే ముఖ్యం అనుకునేవారు. పేద పిల్లలను విద్యావంతులను చేయాలన్నది ఆయన లక్ష్యం అయితే తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్న తపన అమ్మది. చిన్న సీసాబుడ్డీ దీపం వెలుతురులో చదువుకునే మాకు అన్నం తినిపిస్తూ రేపటి రోజు కడుపు నిండా అన్నం దొరకాలంటే ఈరోజు బాగా చదువుకోవాలి అంటూ జీవితసత్యాలను అమ్మ నేర్పించారు. పది మందికి ఆదర్శంగా ఉండే జీవితం, పది మందికి అన్నం పెట్టగల స్థాయి ఉండాలని చెప్పేవారు. ఇప్పటికీ అమ్మ మాటలు మేం మర్చిపోలేదు. ఇంటికి ఎవ్వరు వచ్చినా ముందుగా వారికి భోజనం పెట్టేవారు. అమ్మ లోని దాన గుణం, నాన్నలోని సమాజ సేవ మాకు ఆదర్శం. ఇప్పుడు ఇంతమంది ఆదరణ, ప్రేమ పొందుతున్నాం అంటే అందుకు చిన్నతనంలో అమ్మనాన్న నేర్పిన విలువలే కారణం. మా అన్న, తమ్ముడు విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రతి ఏడాది అమ్మనాన్న కోసం వస్తారు. మా వారు నాగేశ్వరరావు నాకు మేనబావ వరుస. ఇష్టపడి పెండ్లి చేసుకున్నారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెండ్లిళ్లు అయ్యాయి. వాళ్ళ మెట్టినింట్లో వాళ్ళని మా వియ్యాలవారు కూడా మహారాణులుగా చూస్తారు .అమ్మమ్మగా ప్రమోషన్ వచ్చింది. కుటుంబ సహాకారంతోనే మహిళలు రాణిస్తారు. మా వారు మంచి భర్త.. స్నేహితుడు.. మా పిల్లలకు మంచి తండ్రి, మా అమ్మనాన్నకు మంచి అల్లుడు. అమెరికాలోనైనా, ఇండియాలోనైనా ప్రతి ఏడాది మా కుటుంబం అంతా కలిసి ఉంటాం. అనుబంధం కలకాలం నిలవాలంటే కలిసి జీవించాలి. మా మనవరాలు రాకతో ఇంట్లో మూడు తరాల అమ్మలం అయ్యాం.
తరుణి : నిన్నటితరం జీవితాలతో పెనవేసుకున్న వినోద సాధనం రేడియో. మీ జీవితంలో రేడియో అనుబంధం ?
శ్రీలక్ష్మి : చిన్నతనం నుంచే వేదికలన్నా, మైక్ అన్న ఏ మాత్రం భయం లేకుండా పెరిగాను. అయితే రేడియో లో జాబ్ మాత్రం నా జీవితంలో ఒక గొప్ప మలుపు. డిగ్రీ ఫైనల్ పరీక్షలు అయిపోయిన రెండో రోజు మా పెండ్లి జరిగింది. నెల్లూరు జిల్లా గూడురులో మా ఆయనకు బ్యాంక్ జాబ్. నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనలో రైల్వే పరీక్షలు రాశాను. జాబ్ రాలేదు. ఇంతలో మాకు ఒక అమ్మాయి. బోధన్ లో బి ఎడ్ చేస్తున్నాను. అప్పుడు నిజామాబాద్ లో రేడియో స్టేషన్ ఏర్పాటుచేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం ఎగ్జామ్ పెట్టారు. నేను, స్నేహితులు రాశాం. నాకు టాప్ స్కోర్ వచ్చింది. ఈలోగా బిఎడ్ ఫలితాలు వచ్చాయి. డిస్టింక్షన్ కాలేజీ టాపర్ గా పాస్ అయ్యాను. అదే రోజు రేడియో జాబ్ కోసం ఇంటర్వ్యూ.. అందరి ఇంటర్వ్యూ ఐదు నిమిషాల్లో అయిపోతే.. చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన సర్టిఫికెట్స్ చూసేందుకే వారికి ఐదు నిమిషాలు టైం పట్టింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆల్ ఇండియా రేడియో ఉద్యోగిగా కెరీర్ ప్రారంభం. డిగ్రీలో ఉన్నప్పుడే యువవాణి లో నా కవితలు వచ్చేవి. రేడియో ఆర్టిస్ట్ కావాలన్నది నా డ్రీమ్. చేతికి గడియారం లేని రోజుల్లో సమయపాలన నేర్పింది ఆకాశవాణి. ఆ రోజుల్లో రేడియోలో వచ్చే కార్యక్రమాలను అనుసరిస్తూ దైనందిన కార్యక్రమాలు ఉండేవి. 1992 జనవరి 23న రేడియో లో జాయిన్ అయ్యాను. ప్రపంచానికి ప్రజా జీవితానికి ఉన్న వారధి రేడియో. వార్తలు తెలుసుకోవాలన్నా.. వినోద కార్యక్రమాలు వినాలన్న ఆకాశవాణియే.. అలా నాకు ఎంతో ఇష్టమైన రేడియో నా జీవితంలో ఒక భాగమైంది. నా వృత్తి. ప్రవృత్తి ఆకాశవాణిగా మారింది. అమ్మ తినిపించిన గోరుముద్దలు, నాన్న పెట్టిన సాహిత్య భిక్ష, ఆకాశవాణి పెంచిన విజ్ఞాన తృష్ణ నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి.
తరుణి : ఆకాశవాణిలో మీరు చేపట్టిన స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమిటి? మీకు బాగా గుర్తుండిపోయిన విషయం ఏది?
శ్రీలక్ష్మి : నేను ఉద్యోగంలో చేరిన వెంటనే నాకు ఇచ్చిన కార్యక్రమం పేరు “విషయం ఇంతే మరి. “నేను రైటర్ ను కాబట్టి ఇచ్చిన అంశాన్ని చాలా సున్నితంగా మనసుకు హత్తుకునేలా చెప్పాలి. ఐదు నిమిషాల ఈ కార్యక్రమం చాలా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత కబుర్లు అంటూ ప్రతిరోజు సాయంత్రం వచ్చే కార్యక్రమం నిర్వహణ బాధ్యత ఇచ్చారు. నేను మరో ఆర్టిస్ట్ కలిసి ఈ కార్యక్రమం చేసేవాళ్ళం. ఒక సంఘటన బాగా గుర్తింది. పదో తరగతి ఫలితాలు వచ్చాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆత్మస్థైర్యం కల్పించేలా పాస్ కావట మే బతుకుకు అర్ధం కాదంటూ పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రముఖుల జీవితాలను ఉదాహరిస్తూ ఐదు నిమిషాలు కబుర్లు చెప్పాం. అన్ని కార్యక్రమాలు మాదిరిగానే మేం చేసిన కార్యక్రమాలు మరిచిపోయాం. అయితే పదిహేను రోజుల తర్వాత మా స్టేషన్ కు ఒక ఉత్తరం వచ్చింది. పదో తరగతి ఫెయిల్ అయిన నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్న సమయంలో మీ రేడియో కబుర్లు విన్నాను. చనిపోవాలన్న ఆలోచన విరమించుకున్నాను. మీ కబుర్లు నా ప్రాణాలు నిలబెట్టింది అంటూ వచ్చిన ఆ ఉత్తరం చదివి అందరూ అభినందించారు. మా కబుర్లు ఒక ప్రాణం కాపాడాయి అని ఎంతో ఆనందించాం.
తరుణి: ఆకాశవాణి ద్వారా మీరు ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. వారిని ఇంటర్వ్యు చేసే సమయంలో మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవారు. ఎలాంటి విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించారు?
శ్రీలక్ష్మి : ఆకాశవాణి ఎప్పుడూ కూడా మనలను నిత్య విద్యార్థులను చేస్తూ ఉంటుంది. అక్కడ పని చేయడం కూడా కత్తి మీద సామే. ఎందుకంటే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు నిష్ణాతులు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలంటే పూర్తిగా వారి గురించి తెలుసుకోవాలి. నిరంతరం చదువుతూనే ఉండాలి. అందుకని ఎప్పుడు అప్డేట్ లో ఉండాలి. అందుకని నేను ప్రతి రోజు పుస్తకాలు, ఐదారు పేపర్లు చదువుతుంటాను. ఎవరి గురించి వచ్చినా రాసుకొని ఒక ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకుంటాను. రేపు ఎవరిని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినా ఇబ్బంది పడకుండా ఫైల్ మెయింటెన్ చేసుకునే దాన్ని. నాకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏంటంటే 1994లో సి. నారాయణ రెడ్డి గారు , జో న్నవిత్తుల , జంధ్యాల , మారుతీరావు లు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి వచ్చారు. వాళ్ళను ఇంటర్వ్యూ చేసే బాధ్యత నా మీద పడింది. సాహిత్య దిగ్గజాలైన వాళ్ళందర్నీ ఇంటర్వ్యూ చేయడం అంటే ఎగిరి గంతేసి వాళ్ళ కోసం ఎంతో సమాచారాన్ని సేకరించాను. వాళ్ళు బాగా మెచ్చుకోవాలి అని నేను చందన్ రావు గారు కలిసి సినారె గారిని చేసాము. వారు చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత నాకు హైదరాబాద్ ఆకాశవాణిలో తెలంగాణ తేజ మూర్తులు అనే కార్యక్రమం చేసే అదృష్టం కలిగింది. ఆ కార్యక్రమం శ్రోతలను చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే నేను వారానికి ఒక లేఖ – కొత్త ప్రేమలేఖలు అని రాశాను. దానికి అభిమానుల నుంచి ప్రశంసలు ఎన్నో… అన్నీ మనసును కదిలించాయి.
తరుణి: వ్యాఖ్యాతగా మీరు చేసిన కార్యక్రమాలు ? బాగా సంతృప్తినిచ్చిన కార్యక్రమం ?
శ్రీలక్ష్మి : జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమం వ్యాఖ్యాతగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత రాష్ట్ర గవర్నర్ నుంచి రాజకీయ ప్రముఖులను, సినీ కళాకారులను, సాహిత్యవేత్తలను ఎంతో మందిని ఇంటర్వ్యూల చేసే అవకాశం వచ్చింది. ప్రతి కార్యక్రమం విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ఎంతో దోహదపడేది. ఇలా దాదాపు మూడు దశాబ్దాలుగా వేలాది కార్యక్రమాలను నిర్వహించాను.
దశాబ్దం క్రితమే మూడువేలకు పైగా కార్యక్రమాలు వ్యాఖ్యానం చేశానని అభినందన సంస్థ వారు విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో సత్కారం చేశారు. ఆ తర్వాత నేను లెక్కపెట్టుకోలేదు. ఎందుకంటే వ్యాఖ్యానం అనేది వృత్తిలో భాగమైంది.
మీ మెదటి వ్యాఖ్యానం ఎలా మైదలైంది ?
దాశరథి గారిని బంధించిన ఖిల్లా జైలు వద్ద1985 లో నా వ్యాఖ్యానం ప్రారంభమైంది. అక్టోబర్ సెకండ్ నాడు అక్కడ కవి సమ్మేళనం పెట్టారు. అనుకోని పరిస్థితుల్లో వ్యాఖ్యానం నువ్వే చేయాలి అంటూ సైబ సర్ నన్ను ముందుకు తోసేశారు. దాంతో వ్యాఖ్యాతగా అయిపోయి, అదే జీవితకాలం మొత్తం గడపాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో చాలా అద్భుతమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఆకాశవాణిలో నా గళానికి మంచి ఫాలోయర్స్ ఉన్నారు అనేది చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం.(వచ్చేవారం మిగతా భాగం)