నింగి నేలా
చెట్టు చేమా
సాక్షీ భూతమైనప్పుడు
మనస్సు మొత్తం మంచి గంధ
సువాసన వెదజల్లినప్పుడు
ప్రేమ ఒక మధురానుభూతి
ప్రేమ ఒక సాహస సాంగత్యం
నిలుపుకునే నిపుణత
నైర్మల్య భావనా సంపత్తికి
స్నేహం ముసుగు వేసి
ప్రేమ ముసుగు వేసి
తప్పటడుగులవుతున్నరనే
అపవాదుకు ధీటుగా
స్వేచ్ఛ కు స్వచ్ఛత ఘాటుగా
మీరో అనిర్వచనీయమైన
జంట పక్షులు అయినప్పుడు
తరులన్నీ విరులతోనే కాదు
వర్ణమయ పత్ర సోయగాల నవ్వులు పంచుతాయి
వాసంత సమీరాలతో
గుండె వాకిళ్ళవుతాయి
స్నేహం లో ప్రేమ
ప్రేమ లో స్నేహం
బ్రతుకు బండికి
బంధనపు చక్ర సమన్వయం కావాలంటే
పెద్ద లు చేసే పెళ్లి గట్టి ఇరుసు అవ్వాలి
అప్పుడే అప్పుడే
దారులన్నీ నవ్వుల పువ్వులవుతాయి
త్యాగం చేసిన సత్యమంతా
నిజ దర్పణ పై నవసమాజ చిత్రాలనే
ప్రియమారగ రువ్వుతాయి
కలవని నింగీ నేల
కలిసిపోయిన దృశ్య సౌందర్యం
అవుతుంది!
నీ హృదయ చక్షువులలో
కమనీయ గాథల మెరుపవుతుంది
చిత్రకారిణి – దరిపెల్లి శ్రియ
చిత్ర కవిత రచన-
డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి పత్రిక సంపాదకురాలు