ఎంత కాదన్నా మనుషులం కదా మనకున్న జ్ఞాపక శక్తిని భావవ్యక్తి కరణ శక్తి నీ కలిగి ఉన్న మనుషులం కదా! భూగోళం పై,
ప్రపంచంపై సమస్త ప్రాణి కోటిలో ఈ రెండు శక్తులు ఉన్న జీవులం కదా!
నిన్నటి మన పరిస్థితులను మరిచిపోయి రేపటికి కావలసిన భవిష్యత్తు గురించి పట్టించుకోక ఈరోజులోనే ఆనందించి అన్నీ మరచిపోతే ఏం లాభం? మన ఆనందానికి నిన్నటి కష్టార్జితం, నిన్నటి మన తెలివి, నిన్నటి ఒక మెలకువ ఇవే కదా కారణాలు. ఇప్పుడు అనుభవించే దుఃఖానికి కూడా నిన్న చేసిన తప్పుడు పనులో, నిన్నటి ప్రయత్న లోపమో, నిన్నటి అసమర్థతో కారణం కదా! నిన్న నేడు మధ్యన ఉన్న ఈ సంబంధాన్ని చర్చించుకోబోయే ముందు భవిష్యత్తును కూడా స్పృషించుకోవాల్సిన అవసరముంది. వర్తమానం తో జోడించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే పెద్దలకు పెద్ద బాధ్యత ఉంటుంది. పెద్దలు అంటే? తల్లిదండ్రులు, తాతలు నానమ్మ అమ్మమ్మ వంటివాళ్ళు. మనం అనుభవించిన కష్టాలు వీళ్ళ కు వద్దు అనుకుని సకల సంపదలు సకల సదుపాయాలు సమకూరుస్తుంటారు. ఇదే పిల్లలను ఏకులు మేకులయ్యేలా చేస్తుంది.
అట్లా కాకుండా, ఇంటి పనులలో చిన్న చిన్న పనులు చెప్పడం, డబ్బు ప్రాముఖ్యత చెప్తూ అవసరాలకూ ఆడంబరాలకు మధ్యనున్న సన్నని గీత వంటి భేదం ఏంటో ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా సందర్భానుసారం గా పిల్లకు చెప్పాలి. ఇవే నిన్నటికీ ఈ రోజు కు మధ్య ఉన్న తేడా ను తెలియజేస్తుంది.
యువకులు ఇంట్లో ఉంటే మరో రకమైన బాధ్యత పెద్దలపై ఉంటుంది. మా కాలం లో నైతే… అని మొదలు పెట్టారు అంటే చాలు వాళ్ళ బుర్రకు అస్సలే ఎక్కించుకోరు . ఓ ఇది మన విషయం కాదులే.. అనుకుంటారు.
అందుకే మార్గదర్శకాలు చెప్పకూడదు . చేసి చూపేవాటినంటారు మార్గదర్శకాలు అని . ఇంట్లో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి యువకులు ఇంట్లో ఓ కొరకరాని కొయ్య లు అవుతారు.
ఈ ప్రమాదం నుండి బయట పడాలంటే నిన్నటి మనదైన జీవితాన్ని ఎన్నటికీ మరచిపోవద్దు. ఒక చర్నాకోల్ లా మనకు మనమే శిక్ష విధించుకుంటూ చిరునవ్వు తో వాళ్ళ ముందు తిరుగాడాలి.
వందల సమస్యలలో ఇవోరెండు రెండు కాలాల మధ్య ఉన్న సంబంధాన్ని చూపుతుంటాయి. అంతే ! గతం గతః అనేది అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో కాదన్నది నిజం!!