నా తరంలో అసలు బయట ఏదైనా తినడం ఉండేదే కాదు అసలు మా నాయనమ్మ అయితే మంచినీళ్లు కూడా తాగొద్దు అనేది. అది చాదస్తం కాదు ఆరోగ్యరీత్యా చాలా మంచిది కదా!
ఇంట్లో కూడా ఏదీ కొనుక్కొచ్చిన వస్తువులు , అంటే ఉడికినవి వాడే వాళ్ళు కాదు . నాకు బుద్ధి తెలిసి నప్పటినుండి అటుకులు కూడా ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళు . వేడి నీళ్లలో వడ్లు వేసి పెట్టి తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఉడికిస్తూ అదే వేడి మీద రోకళ్ళతో దంపేవాళ్ళు. మడికట్టుకొని మరీ మా అమ్మ మా పెద్దక్క నాయనమ్మ ఆధ్వర్యంలో చేసేవాళ్లు . ఆ అటుకులు నిజంగానే చాలా తీయగా ఉండేవి చాలా రుచిగా ఉండేవి . తర్వాత చాలా ఏళ్ళకి బయట కొనుక్కోవడం మొదలుపెట్టారు . కానీ ఇడ్లీ, దోస అలాంటివి బయట మాత్రం ఎప్పుడూ తినలేదు . నా కాలేజీ చదువుకు పోయే వరకు కూడా నేను బయటకి తినలేదు . ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో ఇంత నిష్టగా ఉండే వాళ్ళమో దీనికి విరుద్ధంగా ఒకటి జరిగింది.
మా ఇంట్లో పనిచేయడానికి ఒక పిల్లవాడు ఉండేవాడు 15 ఏళ్ళు ఉంటాయేమో? మా ఇంటికి వచ్చి పోయే అతిథులు ఎక్కువే. చాలామంది రాత్రులు భోజనాలే చేసేవాళ్లు . ఎవరో కొంతమంది ఉపాహారం చేసేవాళ్లు . వాళ్ల కోసం ఇంట్లోనే విసిరిన బియ్యపు రవ్వతో ఇప్పుడు పిండి చేసేవాళ్లు . లేదా తపాల రొట్టె లేదా మొక్క జొన్న రొట్టె ఇలా ఏదో ఒకటి ఉండేది .
ఒకసారి రాత్రి వేళ కొంతమంది ఆఫీసులో వాళ్ళు వచ్చారు . వాళ్లు రాత్రి మా ఇంట్లో బస చేశారు . ఈ రొట్టెలు అవి వాళ్ళకి ఏవి అలవాటు లేవట . అప్పట్లో బాంబే రవ్వ తెచ్చుకుని ఉప్మా చేయడం చాలా గొప్ప విషయం . ఎక్కువ ఎవరు కొనుక్కునే వాళ్ళు కాదు . ఇలా ఎవరైనా అతిథులు వస్తే తెచ్చేవాళ్ళు . అయితే వాళ్లని కూర్చోమని చెప్పి , మా బాపు మా ఇంట్లో పని చేసే నరసింహడికి డబ్బులు ఇచ్చి బాంబే రవ్వ కొనుక్కొని తెమ్మని చెప్పారు . ఇంటి వెనక దారి నుండి వెళ్ళమని మరీ మరీ చెప్పారు.
అప్పటికే మా భోజనాలు కూడా అయిపోయాయి వాళ్లను కూర్చోబెట్టి , మంచినీళ్లు ఇచ్చి ,మజ్జిగ గ్లాసుల్లో పోసి ఇచ్చింది అమ్మ . ఈలోపల రవ్వ వస్తే వాళ్లకోసం ఉప్మా చేయవచ్చని…
ఇంతలో మా నరసింహుడు రానే వచ్చిండు.. చేతిలో ఒక పెద్ద పొట్లం పట్టుకొని ! తీసుకొచ్చి దానిని మా బాపును పిలిచి ” పంతులు ఓ పంతులు ఇగో తెచ్చిన” అని ఇచ్చాడు.
మా బాపు దానిని తెరవకుండానే అమ్మకు ఇచ్చేశాడు .బాపు కూడా ఏమరపాటులో అదేంటో గమనించలేదు .అమ్మ ఏం చేసిందంటే పొట్లము విప్పి ఉప్మా చేద్దామని అనుకుంది… పొట్లం విప్పగానే ఆశ్చర్యపోవడం అమ్మ వంతు అయింది ! అలాగే గుడ్లప్పగించి చూసింది . అక్కడి నుండి వెళ్తున్న మా నాయనమ్మ చూసి..” ఏమయ్యిందే అట్ల నిలబడి చూస్తున్నావ్ పూర్తి గుడ్లు వెళ్ళబెట్టినవ్” అన్నది. ఏం లేదు అత్తయ్యా అనుకుంటూ గబగబా అక్కడి నుండి కదిలింది. ఆమెకు ఆ పొట్లంలో ఉన్నది చూపిస్తే పెద్ద ప్రమాదం అని తెలిసి మెల్లిగా నా దగ్గరికి వచ్చింది. పొట్లం విప్పి చూపి ” నరసింహుడు ఏం తెచ్చిండో చూడు” అన్నది.
“ఏం తెచ్చిండమ్మా!” అని పొట్లం తీసి చూశాను ఇంకేముంది ఆశ్చర్యపోవడం నా వంతు అయింది🫣…
ఆశ్చర్యం నుండి చేరుకున్న నేను నవ్వడం మొదలు పెట్టాను . ఎంతగా నవ్వానంటే కడుపు నొప్పి లేచింది . అలా మెలికలు తిరుగుతూనే ఉన్నాను… ఇంతకీ అందులో ఏముందో తెలుసా ? పాలకూర పకోడీ🤣.. మా ముసలి చూస్తే ఇంకేమైనా ఉందా మా వీపులు పగలగొట్టదూ!
ఇక వెంటనే నరసింహున్ని అమ్మ పిలిచింది . పిలిచి “ఏంటిది రా ఇది.. రవ్వ తీసుకొని రమ్మంటే పకోడీ తీసుకొచ్చినవ్” అన్నది.
“ఒరేయ్ బయట నుండి కొనుకొచ్చినయ్ మేము ఎప్పుడైనా తిన్నామా ? అందరి ముందు పరువు తీయడానికా ఇట్లా తీసుకొచ్చినవ్?” అన్నది అమ్మ.
“వాపస్ ఇచ్చి బాంబే రవ్వ కొనుక్కొని రా” అన్నది అమ్మ.
“ఇప్పుడు ఆ హోటలు బంద్ చేస్తారమ్మా రేపు పొద్దుగాల వాపసిస్తతి” అన్నాడు నరసింహుడు.
“సరే కోమట్ల షాపులో బాంబే రవ్వ అయితే కొనుక్కొని రా పో” అని పంపించింది.
వాడు వెళ్లి మళ్ళీ రవ్వ తీసుకొని వచ్చాడు . తర్వాత అమ్మ వాళ్లకి చక్కని ఉప్మా చేసి పెట్టింది . అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ,కొత్తిమీర,కరివేపాకు,సెనగపప్పు ,పల్లీలు వేసి చేసి పెట్టింది . ఆ ఉప్మా అంటే మాకు కూడా ఎంతో ఇష్టం కానీ ఎప్పుడో ఒకసారి దొరికేది ఇలా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే…
అసలు విషయం చెప్తాను . ఆ పకోడీ పొట్లాన్ని తీసుకెళ్లి అమ్మ అల్మారా లో పెట్టింది. తర్వాత ఈ విషయం బాపుకు తెలిసిపోయింది . వాడిని పిలిచి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పెట్టాడు..
నాకేమో నవ్వు అస్సలు ఆగడం లేదు . అప్పటికీ బాపు నన్ను కూడా తిట్టాడు” పిచ్చిదానిలా ఆయన నవ్వేంటిది “అని.
తర్వాత మెల్లగా ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూశాను . ఆ పొట్లం తీసుకొని వాసన చూస్తే ఆహా అనిపించింది . కానీ బయట వస్తువులు తినకూడదు ఎలా?
నియంత్రణల కన్నా బుద్ధి మహా చెడ్డది కదా ! పైగా చిన్న పిల్ల చేష్టలు!! మెల్లగా ఎవరూ చూడకుండా పొట్లం తీసి ఒకటి నోట్లో వేసుకున్నాను . చాలా కమ్మగా అనిపించింది . అలా దొంగ చాటుగా ఐదు ఆరు బజ్జీలు తిన్నాను . మళ్ళీ ఏమీ తెలియకుండా పొట్లం కట్టేసి పెట్టాను🤫..
కాని నవ్వడం మాత్రం నవ్వుతూనే ఉన్నాను పడుకున్నప్పుడు కూడా! తెల్లవారి లేచిన తర్వాత నరసింహుడు ఎప్పుడు కనబడితే అప్పుడు… కూడా!!
ఆ తర్వాత తెల్లవారి అమ్మ పొద్దున్నే ఆ పొట్లం ఇచ్చేసి వాపస్ ఇచ్చి రమ్మని పంపించింది… ఏది ఏమైనా ఉప్మా అంటే పకోడీ అనే వాడికి ఎలా వినిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.. కనీసం అక్షరాలు ఒకేలాగా కూడా లేవు వాడి బుర్రే బుర్ర… మా ఉప్మా , పకోడీ ల కథ అలా జరిగింది. ఏదేమైతేనే ఆనాటి ఆ పాలకూర పకోడీలు చాలా కమ్మగా ఉన్నాయి