కవయిత్రి ఈటూరి (కస్తూరి) రమాదేవి గారు

 (1962 – 2021)

ఈటూరి (కస్తూరి) రమాదేవి

రమాదేవి గారిది జనగామ జిల్లా . మెట్టినిల్లు జనగామనే,ఉద్యోగ కార్యనిర్వహణ ప్రాంతం కూడా !వీరు వృత్తి రీత్యా ప్రభుత్వ పాఠశాలలో సామాన్య శాస్త్రం, సాంఘీక శాస్త్రం & తెలుగు విషయాలను బోధించే వారు

అయితే, చిన్నప్పటి నుంచే ఇతిహాసాల పైన,పురాణాల పైన, చారిత్రక విషయాల పైనా చాలా ఇష్టం ఉండడం తో అన్నీ శ్రద్ధగా చదివారు. శాస్త్రీయ సంగీతం అంటే ఆసక్తి చాలా ఉన్నదని రమాదేవి గారిని ఆమె తల్లిదండ్రులు ప్రోత్సాహపరిచారు.

9 వ తరగతి నుండే పత్రికలకు చిన్న చిన్న వ్యాసాలు రాయడం మొదలు పెట్టారు .తన పెండ్లి అయినాక చదువు, ఇంటి పనుల తో పాటు, సంప్రదాయ గృహిణి పాత్రపోషిస్తూనే స్త్రీసమస్యల పై, ఇతర సామాజిక అంశాల పైన కవితలు రాస్తూ ఉండేవారు . తరువాత స్త్రీ ల సమస్యల పై కథలు, నాటికలు రాసారు. అందులో కొన్ని ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ప్రసారమయ్యాయి. సామాజిక కవితలు కథలకే పరిమితం కాకుండా, భక్తి కవితలు, పాటలు, కీర్తనలు ఎన్నో రమాదేవి గారి కలం నుండి జాలువారివి. ముఖ్యంగా వీరు అమ్మవారి భక్తులు కావడం వల్ల శివ కేశవ అభేదాన్ని గాఢంగా విశ్వసించే వారు. కాబట్టి , శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆండాళమ్మ పైన , శైవ, శాక్తేయ సంప్రదాయం లో దుర్గమ్మ పైన ఎన్నో పాటలు రాసినారు. ఇక జీడికంటి రామునిపై కూడా కొన్ని పాటలు రాసారు. రమా దేవి గారు తమ భక్తి విశ్వనాసాలు ప్రతిబింబించే విధంగా ఎన్నో బతుకమ్మ పాటలు కూడా రచించారు. ఆండాళమ్మ పాటలు, దుర్గమ్మ పాటలు , బతుకమ్మ పాటలు కొన్ని పుస్తకం గా ముద్రించారుకూడా.

రమాదేవి గారు పిల్లల పాటలు కూడా కొన్ని రాసారు. 1984 లో విడుదలయిన “ఈ చదువులు మాకొద్దు” సినిమా పై విమర్శ , విశ్లేషణ వ్యాస పోటీలను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అంతటా నిర్వహించినపుడు, రమాదేవి గారు రాసిన వ్యాసానికి రాష్ట్ర స్థాయిలో 3వ బహుమతి వచ్చింది.

వీరికి సైన్సు రంగంతో పాటు భాష సాహిత్యాలు, చరిత్ర అంశాల్లోనూ ఆసక్తి ఉండేది. తన విద్యార్థులను ఆధునిక యుగానికి తగ్గ హేతుబద్ధమైన తార్కిక ఆలోచనలు పెంపొందిస్తూ ఉండే వారు. అదే సమయంలో సమాంతరంగా మన భారతీయ సాంస్కృతిక మూలాలను కూడా ఎంతో ఆసక్తి తో తాను పని చేసిన పాఠశాలల్లో బోధించే వారు.

పాఠశాల పిల్లల సర్వతో ముఖాభివృద్ధి కొరకు క్రీడా, ఉపన్యాసాలు మొదలయిన ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేలా వాళ్ళను ప్రోత్సాహిస్తూ ఉండే వారు. అంతేకాదు వాళ్ళలో అవగాహన సృజన పెంచడానికి వివిధ కల్చరల్ ఆక్టివిటీస్ నిర్వహిస్తూ ఉండే వారు. ఎండా కాలం సెలవుల్లో కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయక పిల్లలకు మన వారసత్వాన్ని తెలియ జేయటానికి టీటీడీ , రామకృష్ణ మఠం వారు నిర్వహించే సాంస్కృతిక బోధనా తరగతుల్లో కూడా ఎంతో ఆసక్తి తో పాల్గొనేవారు రమాదేవి గారు. ఇట్లా వీరు విద్యార్థులకు దేశభక్తి, సాంస్కృతిక విషయాల్లో మెళుకువలు నేర్పించేవారు. ఇట్లా సాంఘీక , స్త్రీ వాద అంశాలతో పాటు భక్తి, సాంస్కృతిక అంశాలపై ఎన్నో రచనలు చేశారు. పిల్లల అంశాల మీద విరివిగా రాస్తూ విస్తృతమైన ఇతివృత్తాలను స్పృశించినారు రమాదేవి గారు.

రమాదేవి గారు ‘బతుకమ్మ‘ పాటలు ఎన్నో రాసారు. వీటిలో ముఖ్యంగా ‘కవయిత్రి మొల్ల ‘ జీవితం పైన రాసిన బతుకమ్మ పాట చాలా గొప్పగా ఉన్నది. వీరికి పలురంగాల్లో ఉన్న అవగాహనకు ఇది మంచి ఉదాహరణ. మొల్ల పై రచించిన ఈ బతుకమ్మ పాట ఆనాటి చరిత్ర, స్త్రీ వాదం, భక్తి తత్త్వం, శివ కేశవ అభేదం వంటి విషయాలు సుస్పష్టముగా గోచరిస్తాయి. పాట ఇటు ఆధునికులు, అటు పాత సాహిత్యాన్ని ఇష్ట పడే వారికీ నచ్చే రీతిలో ఆకట్టుకొనే విధంగా అందంగా రచించడం విశేషం.

రమాదేవి జననం కరీంనగరం లో 1962 డిసెంబర్ 29, వీరి తల్లిదండ్రులు ఈటూరి కమలాదేవి-శ్రీనివాసరావు గార్లు . 1979 లో పెండ్లి తరువాత మన జనగామ తాలూకా లోని లింగాల గణపురం మెట్టినిల్లు అయ్యింది. తరువాత కొన్ని సంవత్సరాలకు హనుమకొండలో వీళ్ళ కుటుంబం స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్నారు. రమాదేవి గారు ఉపాధ్యాయులుగా జనగామ జిల్లాలో ముత్తారం, అయ్యంగారిపల్లి లో పని చేసినారు. ఇంకా డెప్యూటేషన్ పైన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపురం, బమ్మెర ఇంకా , పాలకుర్తి గ్రామాలలో ఉన్న ఉన్నత పాఠశాలలలో కూడా పని చేసారు. 2019 డిసెంబర్ 31 న జనగామ జిల్లా అయ్యంగారిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే వీరు పదవీ విరమణ చేసారు.
ఒక గొప్ప కవయిత్రిని, రచయిత్రిని, సామాజిక చింతనతో నూ , భక్తి తత్పరలతోనూ రచనలు చేస్తున్న సమయంలోనే మనల్ని , ఈ సాహిత్య లోకాన్ని విడిచి 21 మార్చి 2021 నాడు మరో లోకం వెళ్ళిపోయారు.

వారి బతుకమ్మ పాటల్లో మేలిమి బంగారం వంటి పాట కవయిత్రి మొల్ల జీవిత గాథను తెలిపే బతుకమ్మ పాట. ఆ పాటను ఇక్కడ పొందు పరుస్తున్నాము:

   

కవయిత్రి మొల్ల బతుకమ్మ పాట – కస్తూరి రమాదేవి
_________
రాయలేలిన సీమ ఉయ్యాలో
రాయలసీమలో ఉయ్యాలో
ఆతుకూరు అను ఊరులో ఉయ్యాలో
ఆ పడతి పుట్టింది ఉయ్యాలో
శివ భక్తుడైనట్టి ఉయ్యాలో
కేసన్న శెట్టికీ ఉయ్యాలో
మొల్ల జన్మించింది ఉయ్యాలో
మల్లెపువ్వు వోలే ఉయ్యాలో
బసవేశ్వరదేవునికి ఉయ్యాలో
పరమ భక్తీపరుడు ఉయ్యాలో
మంచి మనసు గల ఉయ్యాలో
మణిపూస అతడు ఉయ్యాలో
తండ్రి తోవలోనే ఉయ్యాలో
తాను నడిచింది ఉయ్యాలో
బసవ భక్తురాలిగాను ఉయ్యాలో
బ్రహ్మచారిని గాను ఉయ్యాలో
బ్రతుకంత గడిపింది ఉయ్యాలో
బహుదొడ్డ మానిని ఉయ్యాలో
శివునకు వైష్ణవునకు ఉయ్యాలో
అభేదభావమును ఉయ్యాలో
మనసు నందిడుకొని ఉయ్యాలో
మొల్ల యోచించింది ఉయ్యాలో
రామాయణ గ్రంథము ఉయ్యాలో
రచియింప పూనింది ఉయ్యాలో
మొల్ల రామాయణము ఉయ్యాలో
రాసి చూపింది ఉయ్యాలో
రాజుల నేలపై ఉయ్యాలో
నర పాలకులకు ఉయ్యాలో
ధన మదాంధులకు ఉయ్యాలో
అంకితమివ్వకుండా ఉయ్యాలో
అజరామరుడైనట్టి ఉయ్యాలో
ఆ పోతన మాత్యుని ఉయ్యాలో
ఆదర్శంగా నిలుపుకోని ఉయ్యాలో
రామాయణ రచనను ఉయ్యాలో
రమణీయంగా సాగించే ఉయ్యాలో
తేట తెలుగు తేనె ఉయ్యాలో
ప్రతి పదమూలోన ఉయ్యాలో
ఒలికించి రాసింది ఉయ్యాలో
శబ్దాలు కూర్చింది ఉయ్యాలో
ఒక్కొక్క పదాన ఉయ్యాలో
నవరసాలు నింపింది ఉయ్యాలో
పద్యాలు కూర్చింది ఉయ్యాలో
రత్నాల పద్యాలు ఉయ్యాలో
రాసి పోసింది ఉయ్యాలో
రామాయణం రాసింది ఉయ్యాలో
రామచంద్రునికేను ఉయ్యాలో
అంకితమ్ము చేసింది ఉయ్యాలో
మొల్ల రామాయణం ఉయ్యాలో
ఆంధ్ర సాహిత్యాన ఉయ్యాలో
మొగిలి పువ్వులోలె ఉయ్యాలో
అవధి లేని కీర్తి ఉయ్యాలో
అవనిలో నా బడసె ఉయ్యాలో
అంతులేని పేరు ఉయ్యాలో
కవయిత్రి మొల్లగా ఉయ్యాలో
కలకాలం నిలిచింది ఉయ్యాలో
మహిళా లోకాన ఉయ్యాలో
మణిపూస అయింది ఉయ్యాలో
__***__

మొల్ల రామాయణాన్ని, మొల్ల జీవిత విశేషాలని, మొల్ల వ్యక్తిత్వాన్నీ, ఆదర్శ భావజాలాన్ని, మొల్ల పాండిత్యాన్ని వివరిస్తూ బతుకమ్మ పాటగా రాశారు కస్తూరి రమాదేవి గారు. తెలంగాణలో చేసే బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ పాటను పాడి మొల్ల రామాయణానికి , మొల్ల కు పాట రూపంలో శాశ్వతత్వాన్ని చేకూర్చారు రమాదేవి గారు. రమాదేవి గారి కవితలలోనూ కీర్తనలలోనూ హరిహర అభీరతత్వము స్త్రీల ఉన్నత్యము స్వాభిమానము వంటివి మనము చదువుతాము. ఇవన్నీ కవయిత్రి రమాదేవి గారు నమ్మిన ఆశయాలుగా వారు నమ్మిన సిద్ధాంతాలు గా , వారు ఆచరణలో చూపిన విషయాలుగా తెలుస్తున్నాయి.

రమాదేవి గారు కొన్ని రచనలను రచనలకు కలం పేర్లు కూడా పెట్టుకున్నారు. కే బి దేవి అని ఒక కలం పేరు, శారద జ్యోతి అనే మరో కలం పేరుతోనూ రమాదేవి గారు రచనలు చేశారు. కస్తూరి మీరు అత్తగారి ఇంటి పేరు, ఈటూరి వీరి తల్లి గారి ఇంటి పేరు. వీరి కథల పుస్తకము త్వరలో ముద్రణ రూపం లోకి వస్తుంది.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎంతలా ఎదిగిందో..!!

గుండె కిటికీ తెరవాలిక!