సారస్వత క్షేత్రంలో విరిసిన తెలుగు మహిళారత్నాలు

రాధికాసూరి

భాషా వికాసానికి సాహిత్యం ఒక వేదిక లాంటిది . మానవునిలోని సృజనాత్మకతను, కవితా శక్తిని సమర్థవంతంగా వెలికి తీసే ఒక గొప్ప సాధనం . భాషాభివృద్ధి సంస్కృతి – సంప్రదాయాల పరిరక్షణ కవిత్వంతోనే సాధ్యమవుతుందనేది నిర్వివాదాంశం . భావవ్యక్తీకరణకు కవిత్వం ఒక దర్పణంలాంటిది . ప్రతి దేశ చరిత్రలో సాహిత్య ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది . ఆయా దేశకాల పరిస్థితులను ప్రతిబింబించేటట్టుగా సమాజ శ్రేయస్సులో కవి పోషించిన పాత్ర అవగతం అవుతూనే ఉంటుంది .
మన దేశం కళలు , సాహిత్యాల కాణాచి . 11వ శతాబ్దికి ముందునుండే ఎంతో మంది సాహితీప్రియులైన రాజులు , చక్రవర్తులు సాహితీఅభినివేశులై కవులను , కళాకారులను ప్రోత్సహించి , ఆదరించిన నిదర్శనాలు కోకొల్లలు . (ఇతర దేశాలలో 18వ శతాబ్దికి ముందు వరకు ఇలాంటి సంస్కృతి మనకు ఎక్కడా కనిపించదు ) తెలుగు భాష 2000 ల సంవత్సరానికి ముందునుండే వాడుకలో ఉందనడానికి లభించిన సాక్ష్యం’ గాధా సప్తశతి ‘ . తొలి తెలుగు కావ్య ప్రక్రియ రాసిన నన్నయకు ముందు నుండే తెలుగు సాహిత్యం ఉందనడానికి ప్రధాన ఆధారం ,
క్రీస్తు శకము .1000 నాటి విరియాల కామసాని ‘గూడూరు శాసనం’. ఇందులో మూడు చంపకమాల రెండు ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి . ప్రాచీన సాహిత్యం భక్తిరస ప్రధానమని పేర్కొనవచ్చును. తమ రచనలతో వెలుగొందిన కొందరు ప్రముఖ రచయిత్రులు :-
కుప్పాంబిక : తొలి తెలుగు కవయిత్రి గా భావించవచ్చు. 13వ శతాబ్దికి చెందినవారు . వనజా తాంబకుడేయు సా యకములన్ వర్ణింపగారాదు నూ … ఈపద్యం ఆమె తన ‘బూదపుర’ శాసనం లో వేయించారు. ఈ పద్యం అయ్యల రాజు తన ‘సంకలన గ్రంథం’లో ప్రస్తావించారు . ఇంతకు మించిన ఆధారాలు అలభ్యం.
తాళ్లపాక తిమ్మక్క :15వ శతాబ్దికి చెందినవారు .అన్నమయ్య భార్య అయిన వీరు ‘సుభద్రా కళ్యాణం ‘ , ‘ ద్విపద ‘ లో రచించారు.
ఆతుకూరి మొల్ల : ‘ మొల్ల రామాయణం ‘ రచించారు . కవయిత్రి మొల్లగా ప్రసిద్ధులు, 16వ శతాబ్దికి చెందినవారు.
రంగాజమ్మ : 17వ శతాబ్దికి చెందినవారు . ‘ మన్నారు దాస విలాసం ‘ ప్రబంధం రచించారు.
తరిగొండ వెంగమాంబ : 19వ శతాబ్దం వారు . ‘ వేంకటాచల మహాత్మ్యం ‘ రచించారు.
ఈ నారీమణులు తమ రచనలతో ప్రాచీన సాహిత్యాన్ని సుసంపన్నం చేసి చరిత్రలో తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారు.
ఇక ఆధునిక సాహిత్య ప్రస్థానం విభిన్న రీతులతో వేగాన్ని పెంచుకుని వివిధ రూపాలుగా విస్తరించింది . ముఖ్యంగా వచన కవితలు ఊపందుకున్నాయి . ఛందోబద్ధం కాని పదాడంబరత లేని వచన కవిత్వాన్ని ఆధునిక సమాజం ఆదరిస్తోంది . సామాజిక చైతన్యమే కవిత్వం ప్రధాన లక్షణం . అలతి పదాలతో అందంగా విస్పష్టంగా చెప్పడం ‘ ఓ గొప్ప కళ ‘ . కవిత్వం ‘ అనుభూతి పరిమళాల ‘ను వెదజల్లాలి . ఆధునిక సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వెలువడ్డాయి. తెలుగులో సాహితీమణులు ఎందరో తమ తమ రచనలతో సమాజ పురోగతిలో కీలకపాత్ర పోషించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసి కీర్తి గడించారు. వారిలో కొందరి ముఖ్యరచనలు కొన్ని :-
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ‘ కిరీటం’ గా దాల్చిన నలుగురు మహిళా మణులు :-
1. ఇల్లిందల సరస్వతీదేవి : వీరు తమ రచనలతో ఎంతో ప్రభావితం చేశారు . ‘ కృష్ణా ‘ పత్రిక లో వీరి ‘ఇయం గేహే లక్ష్మి’ శీర్షిక ఎంతో ఆదరణ పొందింది . ‘ స్వర్ణ కమలాలు’ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు . ఈ అవార్డు పొందిన తొలి తెలుగు మహిళ కావడం విశేషం .
2. మాలతి చందూర్ : ఆంధ్రప్రభ లో వీరి ‘ ప్రమదావనం ‘ శీర్షిక విశ్వవిఖ్యాతినొంది’ గిన్నిస్ రికార్డు’ సాధించింది . ఎన్నో రచనలు చేసిన వీరికి ‘హృదయనేత్రి’ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
3. అబ్బూరి ఛాయదేవి : స్త్రీవాద రచయిత్రి . పిల్లల పెంపకంలోని లింగ వివక్ష పై వీరు రాసిన కథ ‘బోన్సాయి బతుకు’ అత్యంత ఆదరణ పొందింది. ‘ తన మార్గం ‘ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
4. కాత్యాయనీ విద్మహే: అభ్యుదయ స్త్రీవాద రచయిత్రి . ‘ సాహిత్యా కాశంలో సగం ‘వ్యాస సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు .
ఇంకా సాహిత్యాకాశంలో మెరిసిన ధృవ తారలు వారి మేటి రచనలు కొన్ని :
బసవరాజు రాజ్యలక్ష్మి : ‘సౌదామిని ‘ కలం పేరుతో కవితలు అల్లారు.’ అప్పారావు గారు – నేను’ ఆత్మకథ రచించారు.
సత్యవాడ సోదరీమణులు : సత్యవాడ రఘునాథమ్మ , సత్యవాడ సూర్యకుమారి. సంగీత సాహిత్యాలలో అభినివే శమున్న వీరు’ సరస్వతీ నమస్తుభ్యం’ ,’హరిప్రియ’రచించారు.
జొన్నవాడ రాఘవమ్మ : ‘భావతరంగాలు’ ‘ రాధికా గీతాలు’ రాశారు.
భానుమతి రామకృష్ణ : సినీ నటి , రచయిత్రి ‘అత్తగారి కథ లు ‘ వీరు రచించిన వాటిలో ముఖ్యమైనవి.
మల్లు స్వరాజ్యం : సాయుధ పోరాటంలో వీరిది క్రియాశీల పాత్ర . జానపద బాణీల్లో రాసి , పాడి గిరిజనులకు స్ఫూర్తి కలిగించారు . సిపిఐ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు.
ముప్పాళ్ళ రంగనాయకమ్మ : సమాజంలోని అసమానతలపై కలం ఝలిపించి ఎన్నోరచనలు చేశారు. ‘ స్వీట్ హోమ్.’ ‘రామాయణ విషవృక్షం’ వీరి ముఖ్య రచనలు .
వాసిరెడ్డి సీతాదేవి : ‘వైతరిణి ‘, ‘మట్టి మనిషి’ నవలలు ముఖ్యమైనవి . మట్టి మనిషి నవల 14 భాషల్లోకి అనువదించబడింది .
డి కామేశ్వరి : మానవీయ దృక్పథం వీరి రచనాశైలి . ‘ఆకలి ‘ , ‘ కొత్తనీరు’ ముఖ్యరచనలు.
వింజమూరి సోదరీమణులు : వింజమూరి అనసూయ , వింజమూరి సీతాదేవి . వీరు జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేసి ప్రాచుర్యం పొందారు. అనసూయ గారు ‘భావ గీతాలు,’ ‘ జానపద గేయం’ రచించారు . సీతాదేవి గారు ‘ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ‘ రచించారు.
పాకాల యశోద : ప్రముఖ రచయిత్రి ‘ఉగాదికి ఉయ్యాల’ , ‘ భావిక ‘ సంకలనాలు వెలువరించారు.
ముదిగంటి సుజాత రెడ్డి : ప్రముఖ రచయిత్రి. ‘తెలంగాణ తొలి తరం కథలు ‘ చాలా ప్రా చుర్యం పొందింది.
డాక్టర్ మృణాళిని : ప్రముఖ రచయిత్రి . అధిక్షేపహాస్యం వీరి ప్రియమైన శైలి . ‘ కోమలి గాంధారం , ‘తాంబూలం’ వీరి ముఖ్య రచనలు.
డాక్టర్. పి. లక్ష్మి: కవయిత్రి , విమర్శకురాలు. ‘శిలాలోలిత’ కలం పేరుతో రచనలు చేస్తారు. ‘పంజరాన్ని నేనే – పక్షిని నేనే’ వీరి ముఖ్య రచన.
లలిత కుమారి : స్త్రీవాద రచయిత్రి . ‘ ఓల్గా’ కలం పేరుతో రచనలు చేస్తారు . వీరి ముఖ్య రచన ‘ స్వేచ్ఛ’ నవల. ఇది వివిధ భాషల్లోకి అనువదించబడింది.
మల్లంపల్లి జలంధర : ప్రముఖ రచయిత్రి అయిన ఈమె రచనలలో ‘ఆటోగ్రాఫ్’ , ‘పున్నాగ పూలు’ ముఖ్యమైనవి.
కొండేపూడి నిర్మల : వీరు ప్రముఖ రచయిత్రి , కవయిత్రి , జర్నలిస్టు . వీరి ‘ లేబర్ రూమ్ ‘ కవిత అత్యంత ప్రాచుర్యం పొందింది.
పాటిబండ్ల రజని : ‘అబార్షన్ స్టేట్మెంట్ ‘ కవిత అత్యంత ఆదరణ పొందింది.
సమాజ హితవు కోరి స్ఫూర్తి ప్రదాతలై భావావేశపు ‘సిరా చుక్కల ఉలి’తో అక్షర శిల్పాలను అందంగా మలచి ‘జీవకళ ‘ నిచ్చిన సాహితీస్ర ష్టలైన మహిళా మణులు ఎందరో ! సమయాభావంతో పేర్కొనని తేజోవిరాజమానులైన ‘మహిళా మణులు ‘ ఇంకెందరో కదా ! అందరికీ అక్షరాభివాదములు .

….రాధికాసూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎర్రరంగు బురద

ఎంతలా ఎదిగిందో..!!