సరళ శతకం

కవిత

చంద్రకళ. దీకొండ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.

నీ హృదయ స్పందనకు కారణమై
నీ గుండె లయతాళాలే జీవనగానమై
నవమాసాలు నిను గర్భాన మోయు
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

శారీరక మానసిక ఒత్తిడులెన్నో అనుభవించి
రోయక ఎన్నో సేవలొనర్చి
పెంచి పెద్ద చేసి విద్యాబుద్దులెన్నో నేర్పు
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

ఆమె హృదయమొక మమతల కోవెల
క్షమ ప్రేమలే ఆమె గుండె లబ్ డబ్ లు
ప్రేమ త్యాగాల ప్రతిరూపమైన
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

చెప్పకుండానే నీ ఆకలి తెలుసుకుంటుంది
అడగకుండానే అవసరాలు తీరుస్తుంది
పెదవి విప్పకుండానే నీ మనసు తెలుసుకునే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

నీ బాధకు తాను తల్లడిల్లుతుంది
నీవే లోకంగా భావిస్తుంది
ఎల్లవేళలా నీ క్షేమాన్నే కాంక్షించు
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

విసుక్కున్నా సహిస్తుంది
ఎదురుతిరిగినా భరిస్తుంది
నీవు ఒడి చేరితే అమితంగా మురిసే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

నీ ఆశలకు తాను పల్లకై
నీ ఆనందాలకు వారధై
నీ ఆలోచనలకు సారథి అయిన
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

చెడు పనులను వారిస్తుంది
నీతులను ప్రథమగురువై బోధిస్తుంది
నీ పొరపాట్లను వెనకేసుకొచ్చే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

ఎవరు నిన్ను తూలనాడినా తాళలేదు
విమర్శలతో గేలిచేస్తే ఊరుకోదు
ప్రపంచాన నీవే మిన్న ఎన్ని
లోపాలు నీకున్నా అనే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!

ఎవరికీ ఏ లోటూ రానీయక
ఇంటిలోని వారందరి
శ్రేయస్సుకై పాటుపడుతూ
తన గురించి తాను ఆలోచించుకునే
అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వివేక వాసంతం

ఎంతెంత దూరం..కోడిగుడ్డు దూరం.